సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Feb 07, 2020 , 23:02:14

మోదీ కుతర్కం

మోదీ కుతర్కం

బీజేపీ ఒక ఓటు రెండు రాష్ర్టాలు అంటూ అనేక సందర్భాలలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఒక ఎన్నికల అంశంగా చూసిందే తప్ప, అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే మోదీ ప్రభుత్వం తెలంగాణ ఆకాంక్షలను గుర్తించాలె. విభజన చట్టంలోని సమస్యలను పరిష్కరించాలె. విభజన చట్టంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దాలె. కానీ ఆరేండ్లయినా తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దే చర్యలను చేపట్టనే లేదు. ప్రధాని మోదీ ఇంతగా మన తెలంగాణను అవమాన పరుస్తుంటే, మన రాష్ర్టానికి చెందిన బీజేపీ నాయకులు మౌనంగా ఉండకూడదు.

ప్రధాని మోదీ గురువారం రాజ్యసభలో కశ్మీర్‌ అంశంపై మాట్లాడుతూ మోకాలికి, బోడిగుండుకు ముడిపెట్టినట్టు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యా న్ని సూచిస్తున్నాయి. ప్రధాని పదవిలో ఉన్న నాయకుడు ఇంత అర్థరహితంగా మాట్లాడకపోవలసింది. ఒక రాష్ట్రం పట్ల, ఒక జాతి ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా అవమానకర వ్యాఖ్యలు చేయడం పరిపాలకుడి లక్షణం కాదు. జమ్ముకశ్మీర్‌ అంశంపై తమ నిర్ణయం ప్రజాస్వామ్యబద్ధమే అయితే అదే విషయాన్ని సాకల్యంగా వివరించి ఉండవచ్చు. కానీ చర్చతో సంబంధం లేకుండా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించి ఇక్కడి ప్రజలను అవమానించడం రాజనీతిజ్ఞత అనిపించుకోదు. ప్రధాని గతంలో ఒకసారి లోక్‌సభలో- తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వ్యాఖ్యానించారు. 


తెలంగాణ రాష్ట్ర ఉద్యమం గురించి, రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన సుదీర్ఘ చర్చల ప్రక్రియ గురించి మోదీకి అవగాహన లేకపోతే తమ పార్టీ సీనియర్‌ సభ్యులను ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. వాస్తవాలు తెలుసుకోవాలన్న ఆసక్తే ఉంటే, తెలంగాణ నాయకులే వివరించేవారు. కానీ విషయ పరిజ్ఞానం లేకుండా ఆంధ్రా లాబీ చేసిన ఆరోపణలనే ఉటంకించకపోవలసింది. తెలంగాణ ఏర్పాటును సమర్థించిన అనేక పార్టీలలో బీజేపీ కూడా ఒకటి. రాజకీయ లబ్ధి కోసమే అయినా బీజేపీ అనేక సందర్భాలలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చింది. ఇందుకనుగుణంగా ఆ పార్టీ జాతీయ కార్యవర్గం తీర్మానం చేసింది. పార్లమెంటులో కూడా బీజేపీ మద్దతుతోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందనేది కూడా మోదీకి తెలువదా? తెలిసి మాట్లాడినా తెలువక మాట్లాడినా, మోదీ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవి. 


తెలంగాణ బిల్లు ఆమోదం సందర్భంగా పార్లమెంటులో తలుపులు మూసి, టీవీ ప్రసారాలను నిలిపివేసిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. కానీ ఇటువంటి అసాధారణ చర్య ఎందుకు తీసుకోవలసి వచ్చిందనే కనీస అవగాహన ప్రధానికి లేదా? పెప్పెర్‌ స్ప్రే ఉదంతం ఆయనకు తెలువదా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై జరిగినంత చర్చ ఏ అంశంపైనా జరుగలేదు. దశాబ్దాల తరబడి ఉద్యమాలు జరిగాయి. బీజేపీ సహా దేశంలోని ప్రధాన రాజకీయపక్షాలన్నీ తెలంగాణ ఏర్పాటును సమర్థించాయి. అయినప్పటికీ కొద్ది మంది ఎంపీలు రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి పార్లమెంటులో దౌర్జన్యానికి దిగారు. వీరి కుచేష్టల వల్ల దేశం పరువు పోకూడదనే ఉద్దేశంతోనే ప్రసారాలను నిలిపివేశారు. ఇదంతా జరుగుతున్నప్పుడు తెలంగాణ ఏర్పాటు బిల్లుకు బీజేపీ నాయకత్వం మద్దతు తెలిపింది.


ఈ వాస్తవాలను గుర్తించ నిరాకరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే తెలంగాణ ఏర్పాటు ఏదో అక్రమంగా జరిగినట్టు మాట్లాడటం దారుణం. అధికార ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌, బీజేపీలు రెండూ తెలంగాణ ఏర్పాటు బిల్లుకు మద్దతు ఇచ్చిన తరువాత ఇక సభలో అమోదం పొందదనే ప్రస క్తే లేదు. కేసీఆర్‌ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన నేపథ్యంలో- అన్నిపక్షాలతో చర్చలు జరిపిన అనంతరం నాటి హోం మంత్రి చిదంబరం పార్లమెంటులో ప్రకటన చేస్తే, అర్ధరాత్రి చేశారంటూ కుతర్కాన్ని ముందు తెచ్చిన ఘనత ఆంధ్రా నాయకులది. మళ్లా శ్రీకృష్ణ కమిటీ వేయడం చర్చలు సాగించడం గమనిస్తే, సంప్రతింపుల ప్రక్రియ ఏ మాత్రం హడావుడి లేకుండా నిమ్మళంగా సాగిందనీ, అందరిని కలుపుకపోయారని తెలిసిపోతుంది. విభజన చట్టాన్ని పరిశీలించినా, దానిని ఆంధ్రా నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని రూపొందించారని తెలిసిపోతుంది. అయినా ప్రధాని స్థాయి నాయకుడు ఆంధ్రా నాయకుల ప్రచారాన్ని వల్లెవేయడం కాదు, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలె. 


వాజపేయి ప్రభుత్వం మూడు కొత్త రాష్ర్టాలను ఏర్పాటు చేయలేదా అని మోదీ చెప్పుకోవడం మరీ వింతగా ఉన్నది. మూడు రాష్ర్టాలను ఏర్పాటు చేశారు కానీ, తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయలేదు కదా! అప్పటికే ఎంతోకాలంగా బలమైన డిమాండ్‌ ఉన్నప్పటికీ ఆంధ్రా లాబీ ఒత్తిడికి లొంగిపోయి బీజేపీ కనీసం ఈ అంశాన్ని చేపట్టలేదు. బీజేపీ ఒక ఓటు రెండు రాష్ర్టాలు అంటూ అనేక సందర్భాలలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఒక ఎన్నికల అంశంగా చూసిందే తప్ప, అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే మోదీ ప్రభుత్వం తెలంగాణ ఆకాంక్షలను గుర్తించాలె. 


విభజన చట్టంలోని సమస్యలను పరిష్కరించాలె. విభజన చట్టంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దాలె. కానీ ఆరేండ్లయినా తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దే చర్యలను చేపట్టనే లేదు. ప్రధాని మోదీ ఇంతగా మన తెలంగాణను అవమానపరుస్తుంటే, మన రాష్ర్టానికి చెందిన బీజేపీ నాయకులు మౌనంగా ఉండకూడదు. పార్లమెంటులో, బయటా తమ నిరసనను వ్యక్తం చేయాలె. తమ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పుడైనా మోదీ మరోసారి ఇటువంటి కుతర్కాన్ని ముందు కు తేరు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై అవగాహన ఏర్పడుతుంది. 


logo