శనివారం 28 మార్చి 2020
Editorial - Feb 07, 2020 , 23:01:06

చైనా రోగం

చైనా రోగం

రెండేండ్ల కిందట చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత ప్రధాని మోదీజీని వుహాన్‌ నగరం గులాబి తోటలలో విహరింపజేసారు. అప్పటికి కరోనా వైరస్‌ జాడలు లేవు. కరోనా వైరస్‌ కంటే క్లిష్టమైన జబ్బులతో, వైరస్‌లతో భారత ప్రజలు ఆరేండ్ల నుంచి బాధపడుతున్న సంగతి ప్రస్తుతం కేవలం ఈ దేశం అంతర్గత సమస్యగా మిగిలి లేదు. భారత ప్రజలు ఎదుర్కొంటున్న సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీ వ్యాధుల గురించి ఈరోజు అంతర్జాతీయరంగంలో, అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలలో అక్కడి మీడియాలో అక్కడి చట్ట సభలలో కూలంకష చర్చ జరుగుతున్నది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో, లౌకిక, మతాతీత రాజ్యాంగం ఛత్రం కింద భారత ప్రజలు ఇటువంటి అమానుష, అతి భయంకర, అనారోగ్యకర వ్యాధులకు ఎందుకు గురి అయ్యారు? ఈ వ్యాధుల విషవలయంలో ఎందుకు చిక్కుకున్నారు అన్న విశ్లేషణ ఆ దేశాలలో విస్తారంగా జరుగుతున్నది. ఒక వంక ఈ సమస్యల రుగ్మత పీడిస్తుండగా భారత ప్రజలు కరోనా వైరస్‌ రోగం కోరల్లో చిక్కుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాధి నియంత్రణ మోదీజీ ప్రభుత్వ సమర్థతకు ఒక పరీక్ష వంటిది.

యాదగిరి ముఖంలో ఇంత ఆందోళనను ఎన్నడూ చూడలేదు-మూడేండ్ల కిందట నోట్లరద్దు జరిగినప్పుడు, కశ్మీరు ఒక ఖైదీఖానాగా మారినప్పుడు, గాడ్సే దేశభక్తుడని, ఆయన పేరిట గుడులు కట్టుతామని కొందరు కొంపలెక్కి ప్రకటించినప్పుడు,మతం ప్రాతిపదికగా దేశాన్ని ముక్కలు చేసే కుట్రలు జరుగుతున్నప్పుడు, భిన్నత్వంలోని ఏకత్వానికి విఘాతం కల్గించే విషపూరి త వ్యాఖ్యలు విన్పిస్తున్నప్పుడు యాదగిరి ఆవేశంతో ఊగిపోయాడు గాని ఆందోళనకు గురికాలేదు. ఈమధ్య యాదగిరి మనుమడు నాలుగేండ్ల అఖిలేశ్‌కు సర్ది (సోదరుల భాషలో రొంప వగైరా) అయి, ముక్కుకారుతూ, కొద్దిగా జ్వరం వచ్చి దగ్గుతున్నప్పుడు యాదగిరి అమిత ఆం దోళనకు గురైనాడు. మనుమడికి సర్ది కావడం ఇది మొదటిసారి కాదు. సర్దికి ఎప్పుడైనా ఏదో తిలస్మాత్‌ రుద్దే వాళ్లు.


 ‘పాలల్లో గింత పసుపేసి, లేక గిన్ని మిరియాలు వేసి తాగించే పిల్లా’ అని నాయనమ్మ అఖిలేశ్‌ తల్లి కి సలహా ఇచ్చేది. సర్ది, జ్వరం, దగ్గు, ముక్కుకారుడు తగ్గిపోయేవి. ఇప్ప టి సంగతి వేరు. పొద్దున్నే పత్రిక చూడగానే, టీవీ ఆన్‌ చేయగానె ‘కరోనా వైరస్‌' భయంకర వార్తలు కన్పిస్తున్నాయి, విన్పిస్తున్నాయి. చైనాలోని వుహాన్‌ నగరం నుంచి 2020 నూతన సంవత్సర ప్రారంభంలో జనవరిలోనే అక్కడికి దిగుమతి అయిన ఓ కొత్త రోగం కరోనా వైరస్‌. ఈ వ్యాధి లక్షణాలు సర్ది, దగ్గు, స్వల్ప జ్వరం అని వార్తలలో వివరించడం తో, ఈ భయంకర వ్యాధికి మందులేవీ లేవని చెప్పడంతో సకల భారతావనిలో జడుసుకోనివారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ఈ వేదభూమిలో, అడుగడుగున ఉపనిషన్మధువులొలికే ఈ చల్లని నేల పై, ఎటు చూసినా ఎవరో ఒక స్వామీజీ లేక బాబాజీ విశాల ఆశ్రమాలు కన్పించే ఈ పుణ్యపుడమిపై అంబానీలు, అదానీల నుంచి అత్యంత సామాన్యుల వరకు (మోదీజీ, షహన్షాజీ సంగతి వేరు, వారిద్దరు మహానుభావులు అన్నిటికి అతీతులు) నూటా ముప్పయి కోట్ల మందిలో ఏడాదిలో ఏదో ఒకరోజు, కనీసం ఒకపూటైనా, సర్ది చంకనబడనివారు ఎవరూ ఉండరంటే అత్యుక్తి కాదు. 


కాశీనాథుని నాగేశ్వరరావు గారిని ‘దేశోద్ధారక’ పంతులు అని ఊరకే అనలేదు. ఆయన ఆంధ్రపత్రిక దినపత్రిక, భారతి మాసపత్రికతో పాటు సర్ది (జలుబు) నివారణకు ఒక అంజనాన్ని గూడ తెలుగు ప్రజలకే కాదు, దేశానికి, మొత్తం ప్రపంచానికి ఇచ్చివెళ్లారు. హైదరాబాద్‌ నుంచి వెనుక టే (కరోనా వైరస్‌ వ్యాధి గురించి ఎవరూ ఊహించని రోజుల్లోనే) ఒక యునానీ తిలస్మాత్‌ వచ్చింది సర్దికి విరుగుడుగా. సర్దితో చెడుగుడు ఆడి ఓడించే ఈ అంజనం, తిలస్మాత్‌ సర్వరోగ నివారిణులని గూడ అనే వారున్నారు. యాదగిరికి పత్రికా వార్తలు, టీవీ ప్రసారాలు చెమట పట్టిస్తున్నాయి. నాయనమ్మ మాత్రం లోపలికి వెళ్లి ముడుపులు కట్టి వచ్చి ధైర్యంతో కన్పించింది.150ఏండ్ల పరాయి పాలనలో ఈ దేశంలో పేదరికం, దారిద్య్రం, అజ్ఞానం, అనారోగ్యం, పోషకాహారం లేమి, వాతావరణ కాలుష్యం విపరీతంగా విస్తరించి, హెచ్చి దేశప్రజల, విశేషించి పేదప్రజల రోగనిరోధకశక్తి బాగా తగ్గింది. పప్పు తింటే పైత్యం, ఉప్పు తింటే ఉష్ణం అన్న పరిస్థితి ఏర్పడింది.


బ్రిటిష్‌ పాలన నుంచి విముక్తి పొంది ఈ దేశ ప్రజలకు  స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, స్వయంపాలన మహదవకా శం లభించి 72 ఏండ్లయినా దేశంలోని కోట్లాది ప్రజల ఆరోగ్యస్థాయి, ప్రమాణాలు, రోగనిరోధకశక్తి పెరుగలేదు. పొరుగున ఉన్న రష్యాలో అణుశక్తి కేంద్రం బద్దలైనా, వుహాన్‌ నుంచి విషపు గాలులు ప్రసరించినా ఈ దేశ ప్రజలు భయాందోళనలతో తల్లడిల్లే ఘోర పరిస్థితి ఉత్పన్నమైంది. ఆరేండ్ల కిందట హంగామాతో పట్టాభిషేకం జరిగిన మోదీజీ ప్రభుత్వం ఏటా ఆరోగ్య-వైద్య రంగాలకు నిధుల కేటాయింపును తగ్గిస్తున్నది. అమ్మాజీ వారంరోజుల కిందట ప్రవేశపెట్టిన 2020-21 కేంద్ర బడ్జెటులో ఆరోగ్య, వైద్యరంగాలకు నిధులు తగ్గాయిగాని పెరుగలేదు. (ఈ బడ్జెట్‌లో దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగం, ఆర్థికవ్యవస్థ తిరోగమనం, వార్షిక అభివృద్ధి తగ్గుదల, సామాన్యప్రజల సగటు ఆదాయాల క్షీణత తదితర సమస్యలను స్పృశించనేలేదు). రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అపూర్వ చర్యలు చేపట్టిన తెలంగాణ కేసీఆర్‌ ప్రభుత్వానికి మోదీజీ ప్రభుత్వం ఇవ్వవలసిన మొత్తాలు ఇవ్వకుండా నిధుల కొరత సృష్టించడం శోచనీయం. లక్షలాది భక్తులతో అతి సామాన్యులే అధిక సంఖ్యాకులుగా ఆధ్యాత్మిక సంద్రంగా మారిన మేడారం సమ్మక్క-సారల ‚క్క జాతరలో ఆరోగ్య పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రశంసనీయం, ఆదర్శప్రాయం.


చైనా నుంచి హఠాత్తుగా సోకిన కరోనావైరస్‌ రోగం ఈ దేశంలో విస్తరించకుండా నిరోధించడం, ఈ వ్యాధి సోకిన వారికి ఎటువంటి ప్రమాదం లేకుండా తగిన చికిత్స సదుపాయం కల్పించడం, దేశ ప్రజలు ఆందోళనకు గురి కాకుండా నివారించడం ఇక్కడి ప్రభుత్వాల కనీస బాధ్యత. ముఖ్యంగా కేంద్రప్రభుత్వ గురుతర బాధ్యత. ఈ ప్రపంచం ఒక గ్లోబల్‌ విలేజ్‌ గనుక, ఒక మానవ కుటుంబం గనుక చైనాను నిందించడం వల్ల ప్రయోజనం లేదు. వుహాన్‌ అందమైన నగరం. చైనా రాచరికవ్యవస్థకు సమాధి కట్టిన చరిత్రాత్మక నగరం. రెండేండ్ల కిందట చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత ప్రధాని మోదీజీని వుహాన్‌ నగరం గులాబి తోటలలో విహరింపజేసారు. అప్పటికి కరోనా వైరస్‌ జాడలు లేవు. కరోనా వైరస్‌ కంటే క్లిష్టమైన జబ్బులతో, వైరస్‌లతో భారత ప్రజలు ఆరేండ్ల నుంచి బాధపడుతున్న సంగతి ప్రస్తుతం కేవలం ఈ దేశం అంతర్గత సమస్యగా మిగిలి లేదు. 


భారత ప్రజలు ఎదుర్కొంటున్న సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌ సీ వ్యాధుల గురించి ఈరోజు అంతర్జాతీయరంగంలో, అమెరికా, బ్రిట న్‌ తదితర దేశాలలో అక్కడి మీడియాలో అక్కడి చట్ట సభలలో కూలంకష చర్చ జరుగుతున్నది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో, లౌకిక, మతాతీత రాజ్యాంగం ఛత్రం కింద భారత ప్రజలు ఇటువంటి అమానుష, అతి భయంకర, అనారోగ్యకర వ్యాధులకు ఎందుకు గురి అయ్యారు? ఈ వ్యాధుల విషవలయంలో ఎందుకు చిక్కుకున్నారు అన్న విశ్లేషణ ఆ దేశాలలో విస్తారంగా జరుగుతున్నది. ఒక వంక ఈ సమస్యల రుగ్మత పీడిస్తుండగా భారత ప్రజలు కరోనా వైరస్‌ రోగం కోరల్లో చిక్కుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాధి నియంత్రణ మోదీజీ ప్రభుత్వ సమర్థతకు ఒక పరీక్ష వంటిది. కలుషిత భారతదేశంలో పసిబిడ్డలకు ఏడు భయంకర వ్యాధు లు సోకకుండా నివారించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నడో వ్యాధినిరోధక చర్యల కార్యక్రమాన్ని నిర్దేశించింది. 


ఈ ఏడు భయంకర వ్యాధులలో ఒకటి మెదడువాపు రోగం. ఏడు వ్యాధులకు గురికాకుండా పసి బిడ్డలను రక్షించాలని ప్రపంచఆరోగ్య సంస్థ భావించింది. కాని, ఈరోజు ఈ దేశంలో ఎందరో పెద్దలు మెదడువాపు వ్యాధికి గురి అవుతున్న లక్షణాలు కన్పిస్తున్నాయి. ఇటీవలి చరిత్రకే వక్రభాష్యాలు చెప్పడం, తెలియని పాత చరిత్రను,పురాణాలను ఘనంగా చూపడం, విపరీత ధోరణులతో వ్యాఖ్యానించడం, ఈ దేశం భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని గుర్తించకపోవడం, మూర్ఖత్వం. చెప్పేది ఒకటి చేసేది మరొకటి. దేశభక్తిపై తమకే గుత్తాధిపత్యం ఉందనుకోవడం, హింసాత్మక చర్యలకు పాల్పడుతూ అహింసను ఆరాధిస్తున్నట్లు నటించడం మెదడువాపు లక్షణాలలో కొన్ని మాత్రమే. మెదడువాపు వ్యాధితో, దాని వల్ల సంభవించే విషమ పరిణామాలతో పోల్చినప్పుడు కరోనా వైరస్‌ తీవ్రత తక్కువే. అయినా, ఏదైనా వ్యాధి వ్యాధే.. రుగ్మతే.


ఒకవంక చైనా అధినేత జిన్‌పింగ్‌ భారతదేశానికి వ్యతిరేకంగా ఆసియా లో, విశేషించి దక్షిణాసియాలో రాజకీయ ప్రాబల్యం సంపాదిస్తున్న సమయంలో కరోనా వైరస్‌ ప్రమాదం ముంచుకొచ్చింది. భారతదేశం, చైనా బంధం, అనుబంధం ఈనాటివి కావు. రెండు అతి ప్రాచీనదేశాలు. కొన్ని వేల కిలోమీటర్ల సరిహద్దులున్న పొరుగు దేశాలు. క్రీస్తుకు పూర్వం 500 ఏండ్ల కిందటనే రెండు దేశాల సంబంధాలకు అంకురార్పణ జరిగింది. ఇది దాదాపుగా 2500 సంవత్సరాల అనుబంధాల చరిత్ర. చైనా, భారతదేశం మధ్య సంబంధాల విస్తరణలో, సాన్నిహిత్యం ఏర్పడటంలో, క్రీస్తుకు పూర్వం నుంచే బౌద్ధమతం ప్రముఖపాత్ర నిర్వహించింది. 


భారతదేశం పండితులు,స్కాలర్లు అనేకులు చైనా వెళ్లి చైనీ భాష నేర్చుకుని విలువైన సంస్కృత గ్రంథాలను చైనీ భాషలోనికి అనువదించారు. ఒక భారత పండితుడు ఆచార్య నాగార్జునుని చరిత్రను చైనీ భాషలోకి అనువదించారు. చైనా పండితులు హిమాలయ పర్వతాలను దాటి భారతదేశం వచ్చి సంస్కృతం నేర్చుకున్నారు, పాండిత్యం సంపాదించారు. సమకాలిక భారతదేశం సామాజిక చరిత్రను గ్రంథాలుగ రచించిన ప్రముఖ చైనా యాత్రికులు ఫాహియాన్‌ (క్రీ.శ.5వ శతాబ్దంలో), హ్యుయన్‌సాంగ్‌ (క్రీ.శ.7వ శతాబ్దంలో)భారత్‌లో పర్యటించారు. ఫాహియాన్‌ పాటలీపుత్ర విశ్వవిద్యాలయం విద్యార్థి. హ్యుయన్‌సాంగ్‌ నలం దా విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా చేరి అక్కడే ఉపకులపతి స్థాయికి రావడం విశేషం. మావో నాయకత్వాన కమ్యూనిస్టు రాజ్యం ఏర్పడిన తర్వాత మన రెండు దేశాల సంబంధాలలో అనూహ్య పరిణామాలు సంభవించడం మరో విశేషం.


logo