గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Feb 07, 2020 , 22:55:20

పసుపుబోర్డుపై ఇంకా అబద్ధాలా?

పసుపుబోర్డుపై ఇంకా అబద్ధాలా?

రాజకీయాలు వాస్తవాల మీద నడవాలి. అప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. తప్పుడు సమాచారాన్ని భుజాల మీద మోయడం ఈ వ్యవస్థ నిర్మాణానికి ప్రమాదం. అరవింద్‌ పసుపు బోర్డులో ఇకనైనా అబద్ధాలు మాని, బోర్డును తీసుకొచ్చేందుకు బీజేపీ నాయకులను ఒప్పిస్తే మంచిది.

ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చా లె. చేతకాకపోతే చేతులు ఎత్తేయాలె. అంతేకాని, మసిపూసి మారేడుకాయ చేయొద్దు. ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టాలని చూస్తే కాలం కచ్చితమైన గుణపాఠం చెబుతుం ది. ఇదంతా ఎందుకంటే.. ప్రజలు ఎన్నుకున్న నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ వాలకం చూసిన తర్వాత చెప్పాలనిపించింది. ఆరు నూరైనా జిల్లా లో పసుపు బోర్డును తీసుకొచ్చి తీరుతానని బాండ్‌ పేపర్లు రాసిచ్చి మరీ ఓట్లను సంపాదించిన ఆయన, ఇప్పుడు అదంతా మరిచిపోయి, అంతా థూచ్‌ అంటుంటే విడ్డూరంగా ఉంది. 


‘పసుపు బోర్డు కాదు, మసాలా బోర్డు తెచ్చిన. దీంతోనే రైతులు సర్దుకోవాలె..’ అని అంటుంటే.. విడ్డూరంగా ఉన్నది. ఇంతకీ అరవింద్‌ తెచ్చింది ఏంటి? మసాలా బోర్డు! అది కూడా ముఖ్య కార్యాలయం కాదు, కేవలం ప్రాంతీయ బోర్డు! దానికున్న పరిమితులేంటి? రైతులు కోరిన పసుపు బోర్డును ఎందుకు పక్కన పెట్టినట్టు? అరవింద్‌ చెబుతున్న స్పైస్‌ బోర్డుకు తెలంగాణ రైతాంగం పండిస్తున్న పసు పు మద్దతు ధర ఇచ్చే సత్తా ఉందా? అరవింద్‌ అబద్ధాలను ఒక సెక్షన్‌ మీడియాతో పాటు సోషల్‌ మీడియాలోని తెలిసీతెలియని కొంతమంది ఎందుకు మోస్తున్నట్టు? 


దేశంలోనే పసుపును అధికంగా పండించే రాష్ట్రం తెలంగాణ. దేశంలోని మూడో వంతు పసుపు ఇక్కడే పండుతున్నది. దేశం మొత్తంమీద 13 లక్ష ల టన్నుల పసుపు పండితే తెలంగాణలో 3.4 లక్షల టన్నులు పండుతుం ది. ఇక్కడి రైతుకు నాణ్యతతో కూడిన పసుపును సాగుచేసే సత్తువ ఉం ది. ప్రపంచంతో పోటీ పడి దిగుబడి తీస్తున్నడు. అందుకే ఇక్కడి రైతులు పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉండాలని డిమాండు చేస్తున్నరు.


దేశంలో ఒక పంట దిగుబడి ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉంటే అక్క డే సంబంధిత పంటల బోర్డును ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. పరిశోధన, ప్రోత్సాహం, ప్రచారం వంటి వాటికి ఇది సాయపడుతుంది. కొబ్బరి ఎక్కువగా ఉత్పత్తయ్యే కేరళలో కోకోనట్‌, కోయిర్‌ బోర్డు లు ఉన్నాయి. రబ్బరు కూడా ఆ రాష్ట్రంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది కనుక రబ్బరు బోర్డు కూడా అక్కడే ఉంది. పశ్చిమబెంగాల్‌, అసోం ప్రాం తాల్లో తేయాకు తోటలు ఎక్కువ కనుక టీ-బోర్డు అక్కడే ఉంది. కాఫీ బోర్డు కర్ణాటకలో, స్పైసిస్‌ బోర్డు కేరళలో, పొగాకు బోర్డు గుంటూరులో ఏర్పాటు చేయడం వెనుక స్థానికఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వడమే కారణం.


దేశంలో ఉత్పత్తయ్యే పసుపులో మూడో వంతు తెలంగాణ నుంచే ఉత్పత్తి అవుతున్నది. కాబట్టి నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలనడం అత్యంత న్యాయమైనది. మరి పసుపు బోర్డుతో కాకుండా అరవింద్‌ చెబుతున్న స్పైస్‌ బోర్డుతో ఇక్కడి రైతాంగానికి కొత్తగా పంటల పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రైతుకు కేంద్రం ఇవ్వాల్సిం ది జ్ఞానం కాదు, పసుపు పంటకు గిట్టుబాటు ధర. అది ఈ స్పైస్‌ బోర్డు బ్రాంచితో సాధ్యం అవుతుందా? ముమ్మాటికీ కాదు.


నిజామాబాద్‌ జిల్లాలో స్థాపించబోతున్న స్పైస్‌ బోర్డు కార్యాలయం అంతా ఉత్తదే. ఇలాంటి స్పైస్‌ బోర్డు కార్యాలయాన్నే వరంగల్‌ జిల్లాలో స్థాపించారు. అక్కడి రైతులను అడిగితే దీనితో ఒరిగిన లాభాలేంటో చెబుతారు. ఇద్దరు కార్యాలయ సిబ్బంది మాత్రమే ఉండే స్పైస్‌ బోర్డు ఆఫీస్‌ ఇప్పుడు నిజామాబాద్‌లో కూడా కొలువుదీరుతుంది.

‘మనకు బ్రహ్మాండమైన పవర్‌ ఫుల్‌ సెటప్‌ వస్తున్నది. పసుపుకు మద్ద తు ధర విషయంలో దిగులు పడాల్సిన అవసరం లేదు’ అని మునిసిపల్‌ ఎన్నికల సందర్భంగా అరవింద్‌ ఇచ్చిన మాట. మరి ఆయన అన్నట్లు స్పైసెస్‌ బోర్డుకు అంత సీన్‌ ఉందా? సుంగంధద్రవ్యాల బోర్డు పరిమితి చాలా పెద్దది. దానికి పసుపు పంటకు మద్దతు ధర విషయంలో ఆలోచించాల్సినంత  టైం ఉండదు. ఇది ఆచరణలో తెలిసిన విషయం.


1987 ఫిబ్రవరి 26న ఈ సుగంధ ద్రవ్యాల బోర్డు ఏర్పడ్డది. ఇది పం ట దిగుబడి, ఉత్పత్తి,  సర్టిఫికేషన్‌,  దిగుమతి, ఎగుమతులపై దృష్టి కేంద్రీకరించి పని చేస్తుంది. కానీ, ఎక్కడా మద్దతు ధర పట్టించుకోదు. రాష్ర్టాల తో సంప్రదింపులు కూడా జరిపేస్థాయి లేదు. పంజాబ్‌ అంటే గోధుమ లు, పాలు అంటే గుజరాత్‌ అని భావిస్తుంటాయి. అందుకే నిజామాబాద్‌ పసుపు బోర్డు విషయంలో కేంద్రస్థాయి అధికారులు చాలా కొర్రీలు పెట్టా రు. తమ రాష్ట్రంలోనూ పసుపు దిగుబడులు భారీగా ఉన్నా, వాటి మద్ద తు ధర విషయంలోగానీ, బోర్డు విషయంలోగానీ స్పందించడం లేదని కర్ణాటకనేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. 


పంటలు, ఉత్తరాది-దక్షిణాది వివక్ష రాజకీయాలు మతి ఉన్న నేతలందరికీ తెలిసినవే. ఇప్పటివరకు సాగిన 17వ లోక్‌సభ సమావేశాల్లో ఏడు చేపల కథలాగా అరవింద్‌ కేవలం ఏడు ప్రశ్నలు మాత్రమే అడిగిండు. అందులో పసుపు బోర్డుకు సంబంధించిన ఒక్క ప్రశ్న కూడా లేదు. మరి పసుపు బోర్డు కోసం ఆయన ఎక్కడ ప్రయత్నించినట్టు? తమిళనాడు లోని చిదంబరం నియోజకవర్గానికి చెందిన చంద్రకాసి అనే ఎంపీ పసుపు బోర్డు విషయమై 2015 నవంబర్‌ 30న లోక్‌సభలో ప్రశ్నను లేవనెత్తాడు. నాడు కూడా మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్‌.. దేశంలో ఎక్కడా పసుపు బోర్డును ఏర్పాటు చేసేది లేదన్నారు. బీజేపీ ప్రభుత్వానికి పసుపు బోర్డు ఏరార్పాటు మీద ఇంత స్పష్టత ఉన్నా ఆయన మాత్రం దర్జాగా రైతులకు బాండ్‌ పేపర్‌ రాసిచ్చాడు! ఇంత బహిరంగంగా రైతులను మోసం చేస్తున్నారంటే ఇది రాజ్యాంగాన్ని కించపరచడమే.  

  

కానీ 16వ లోక్‌సభలో పసుపు బోర్డు విషయమై తెలంగాణ  ఎంపీలు పదే పదే కేంద్రాన్ని నిలదీశారు. బండారు దత్తాత్రేయతో పాటు అజ్మీర్‌ సీతారాం నాయక్‌, బీబీ పాటిల్‌, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, బాల్క సుమన్‌ ప్రశ్నలను సంధించారు. దీనితో పాటు నిజామాబాద్‌ ఎంపీగా ఉన్న కవిత బిల్లు నంబర్‌ 50/2017ను లోక్‌సభ ప్రవేశపెట్టారు. అది పసుపు బోర్డుకు సంబంధించినది. దాన్ని బీజేపీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ బిల్లుకు మద్దతుగా వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు కూడా ఆమోదా న్ని తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి  2015ఆగస్టు 25న పసుపు బోర్డుకు మద్దతును ఇవ్వాలని కోరగా.. ఆయన ప్రధాని మోదీకి సిఫార్సు చేసిండు. అసోం ముఖ్యమంత్రి కూడా 2017జూలై 17న మోదీకి లేఖ రాశారు. అయినా కేంద్రానికి పసుపు బోర్డు ఏర్పాటుపై మనసు రాలేదు. రాజకీయాలు వాస్తవాల మీద నడవాలి. అప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. తప్పుడు సమాచారాన్ని భుజాల మీద మోయడం ఈ వ్యవస్థ నిర్మాణానికి ప్రమాదం. అరవింద్‌ పసుపు బోర్డులో ఇకనైనా అబద్ధాలు మాని, బోర్డును తీసుకొచ్చేందుకు బీజేపీ నాయకులను ఒప్పిస్తే మంచిది. 


logo