సోమవారం 30 మార్చి 2020
Editorial - Feb 06, 2020 , 23:21:47

ట్రంప్‌పై పోరు

ట్రంప్‌పై పోరు

రెండవ ప్రపంచయుద్ధంలో పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణ కోరుకున్న శ్వేతజాతి మధ్యతరగతివర్గం పిల్లలు కూడా ఉద్వేగంతో యుద్ధానికి వెళ్ళారు. కానీ అక్కడి పరిస్థితులు చూసిన తరువాత వారి అభిప్రాయం మారింది. క్రమంగా యుద్ధం పట్ల వ్యతిరేకత అన్ని వర్గాలలో పెరుగుతూ పోయింది. ప్రభుత్వం మాత్రం అబద్ధాల మీద అబద్ధాలు వల్లిస్తూ ఏండ్ల కొద్ది యుద్ధాన్ని పొడిగిస్తూ పోయి అభాసుపాలయింది. ఇప్పుడు కూడా ట్రంప్‌ విధానాల పట్ల అటువంటి వ్యతిరేకత ప్రబలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అమెరికా ఎగువసభ సెనేట్‌లో రిపబ్లికన్‌ పార్టీకి ఉన్న బలం మూలంగా అధ్యక్షుడు ట్రంప్‌ ఊహించినట్టుగానే అభిశంసనను విజయవంతంగా ఎదుర్కొని బయటపడ్డారు. ప్రతినిధుల సభ లో మెజారిటీ ఉన్న డెమొక్రాటిక్‌పార్టీ సభ్యులు ట్రంప్‌ను కొద్దికాలం పాటు ఇరకాటంలో పెట్టాల ని భావించారే తప్ప, ఆయనను పదవీచ్యుతుడిని చేయడం అంత సులభం కాదని వారికీ తెలుసు. ప్రతినిధుల సభకు నేరారోపణ చేసే అవకాశం మాత్రమే ఉన్నది. విచారణ జరిపి తీర్పు ఇవ్వవలసిన సెనేట్‌లో రిపబ్లికన్‌పార్టీకి స్వల్ప మెజారిటీ ఉన్నది. పైగా అధ్యక్షుడిని తొలిగించాలంటే మూడింట రెండు వంతుల మంది సభ్యుల మద్దతు అవసరం. 


ఈ లెక్కన దాదాపు ఇరువైమంది రిపబ్లికన్‌పార్టీకి చెందిన సభ్యులు ట్రంప్‌కు వ్యతిరేకంగా మారితే తప్ప ఫలితం ఉండదు. అది జరుగదనేదీ తెలిసిందే. సెనేట్‌లోని రిపబ్లికన్‌లు ఎంత కఠినంగా వ్యవహరించారంటే ట్రంప్‌కు వ్యతిరేకంగా కనీసం సాక్షులను కూడా అనుమతించలేదు. నిజానికి ట్రంప్‌నకు వ్యతిరేకంగా సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. సెనేట్‌ తీర్పు ఏ విధంగా ఉన్నా, సాక్షులు నోరు విప్పితే ఆ ప్రభావం అమెరి కా రాజకీయాలపై పడేదేమో. కానీ ఆ అవకాశం రిపబ్లికన్‌లు ఇవ్వలేదు. ట్రంప్‌ తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొనడం ఇది మొదటిసారి కాదు. మొదటిసారి ఎన్నికల గోదాలో దిగినప్పుడే వివాదాస్పదుడయ్యారు. ఒక దశలో రిపబ్లికన్‌పార్టీ అభిమానులు కూడా ట్రంప్‌ను వదిలేసి ప్రత్యామ్నాయ మార్గం వెదుకుదామని ఆలోచించవలసి వచ్చింది. ఆశ్చర్యకరమైనరీతిలో ఎన్నికలలో గెలిచిన తరువాత కూడా ఆయనపై వచ్చిన ఆరోపణలు సాధారణమైనవి కావు. ఇప్పుడు మళ్లా రెండవ పర్యాయం ఎన్నికలను ఎదుర్కొంటున్న దశలోనూ వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవే. 


ట్రంప్‌ పదవీచ్యుతి గండం నుంచి బయటపడి ఉండవచ్చు. కానీ అసలు పరీక్ష వచ్చే నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలు. ప్రత్యర్థులు అభిశంసనకు పూనుకున్నది కూడా ఆయనను తొలిగించగలమని భావించి కాదు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయనలోని అసలు మనిషిని బయటపెట్టాలని భావించారు. ట్రంప్‌ నైతికత మొదటి నుంచి ప్రశ్నార్థకమే. ఫక్తు వ్యాపారి అయిన ట్రంప్‌ విలువలకు కట్టుబడి ఉండే వ్యక్తిగా ఎప్పుడూ కనిపించడు. ఆయనకు మహిళల పట్ల ఎంత చులకన భావం ఉందో ఎన్నికల ముందు బయటపడిన సంభాషణల్లో వెల్లడైంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా రష్యాతో కుమ్మక్కయ్యారనే ఆరోపణ కూడా తీవ్రమైనదే. దీని పై దర్యాప్తు కూడా సాగింది. ఈ దర్యాప్తులో ఆయన విముక్తి కాలేదు. కానీ అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తిపై విచారణ జరుపకూడదని నిలిపివేశారు. 


ఈ అరోపణ ఆయన దేశాధ్యక్ష పదవిలో ఉండటానికి అర్హుడా అనే సందేహానికి తావిచ్చింది. ఇప్పుడు ఉక్రేన్‌ విషయంలోనూ ఆయన వ్యవహరించిన తీరు అధికారాన్ని దుర్వినియోగం చేయడమే. వచ్చే ఎన్నికలలో డెమొక్రాటిక్‌ పార్టీ తరఫున తనకు ప్రత్యర్థిగా నిలబడుతారని భావిస్తున్న వ్యక్తిపై బురద జల్లడం కోసం ఉక్రేన్‌ అధ్యక్షుడితో మంతనాలు జరుపడం సాధారణ విషయం కాదు. ఆ దేశానికి ఇవ్వవలసిన ఆర్థిక సహాయాన్ని తొక్కిపెట్టి తమ ప్రత్యర్థిపై దర్యాప్తు జరిపితేనే నిధులు విడుదల చేస్తానని చెప్పడాన్ని ప్రజలు అంగీకరించరు. అందుకే సెనేట్‌ విచారణ సందర్భంగా సాక్షులను పిలువకుండా రిపబ్లికన్‌పార్టీ అడ్డుకున్నది. ఈ విచారణ సందర్భంగా ట్రంప్‌నకు తమ పార్టీలో తిరుగులేని విధేయత ఉన్నదనేది స్పష్టమైంది. అయితే ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలను ప్రజలు నమ్మతున్నారా అనేది అంతకన్నా ప్రాముఖ్యం గల అంశం. తాజా సర్వే ప్రకారం- అమెరికా ప్రజల్లో సగం మంది ట్రంప్‌ను పదవీచ్యుతుడిని చేయాలని కోరుకుంటున్నారు. 


అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇంకా తొమ్మిది నెలలకు నవంబర్‌లో జరుగుతాయి. అధ్యక్షుడు ట్రంప్‌కే కాదు, అమెరికా ప్రజాస్వామ్యానికే ఇది అగ్ని పరీక్ష. ట్రంప్‌ అభిశంసన సాగుతున్న సందర్భంగా అమెరికా సమాజమంతా రెండు వర్గాలుగా చీలిపోయింది. వియెత్నాం యుద్ధం తరువాత సమాజం ఇంతగా చీలిపోవడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. వియెత్నాంలో అమెరికా తలదూర్చి యుద్ధం చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకింది. యుద్ధాన్ని సమర్థించినవారిలో జాత్యహంకారులు మాత్రమే కాదు. రెండవ ప్రపంచయుద్ధంలో పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణ కోరుకున్న శ్వేతజాతి మధ్యతరగతివర్గం పిల్లలు కూడా ఉద్వేగంతో యుద్ధానికి వెళ్ళారు. కానీ అక్కడి పరిస్థితులు చూసిన తరువాత వారి అభిప్రాయం మారింది. 


క్రమంగా యుద్ధం పట్ల వ్యతిరేకత అన్ని వర్గాలలో పెరుగుతూ పోయింది. ప్రభుత్వం మాత్రం అబద్ధాల మీద అబద్ధాలు వల్లిస్తూ ఏండ్ల కొద్ది యుద్ధాన్ని పొడిగిస్తూ పోయి అభాసుపాలయింది. ఇప్పుడు కూడా ట్రంప్‌ విధానాల పట్ల అటువంటి వ్యతిరేకత ప్రబలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాలోనే కాదు, ఇతర దేశాలలో కూడా ట్రంప్‌ వంటి నాయకులు ప్రజల సమస్యలను పరిష్కరించకుండా, ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ అధికారం నెరుపుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలు డెమొక్రాటిక్‌, రిపబ్లికన్‌ పార్టీల మధ్య సాగే సాధారణ ప్రచారంగా కాకుండా సైద్ధాంతిక పోరుగా మారవచ్చు. 


logo