గురువారం 09 ఏప్రిల్ 2020
Editorial - Feb 06, 2020 , 23:17:05

మేడారం ఒక ఆధ్యాత్మిక సాంత్వన

మేడారం ఒక ఆధ్యాత్మిక సాంత్వన

ఈ ఆధ్యాత్మిక భావనాపరంపర అనేది పన్నేండ్లకోసారి కుంభమేళా పేరున వచ్చినా, యాదగిరి లక్ష్మినర్సింహస్వామి, వేములాడ రాజన్న, తిరుపతి వెంకన్న లెక్క మున్నూటిరవై రోజులు అందుబాటులో ఉన్నా పల్లెల్లో ఉప్పలమ్మై మైసమ్మై ప్రకృతి దేవతలైనా లేదా సమ్మక్క సారక్కలై రొండేండ్లకోసారి అడవిలోకి వచ్చి గద్దెల మీద దర్శనమిచ్చి కోట్లాది మనసులకు అలౌకిక సాంత్వననిచ్చినా దాని సారం ఒక్కటే. మనిషికి మాత్రమే ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సహజాతాన్ని తీర్చడం. భౌతిక ప్రపంచానికి ఒక భావనాత్మక రీచార్జ్‌.

ప్రతి జీవికి సహజాతాలుంటాయి. సహజాతాలంటే.. సృష్టికార్యంలో జీవిని భాగస్వామ్యం చేయడానికి, వాటి జీవికను కొనసాగించడానికి తప్పనిసరిగా ఆచరించాల్సిన కార్యాలు. ప్రకృతిలో భాగమైన మనిషికి మాత్రం సర్వజీవరాసులకు మించిన ఒక ప్రత్యేకత వున్నది. అది గమ్మతైనది. అంతు దొరకనిది. ఈ విశ్వంలో అన్నీ జీవరాసులకు భౌతిక సహజాతం వుంటది. కానీ మనిషికి మాత్రమే ఆధ్యాత్మిక సహజాతం ఉంటది. తీర్చుకోలేని, మనసును నిత్యం వేధించే ఓ అంతుబట్టని ఆవేదన.. నిత్య జీవన మర్మాన్ని పట్టాలనే తీవ్ర కోరిక.. జీవం గురించిన తన్లాటేదో మనిషిని వెంటాడుతుంటది. ఈ గుంజులాటపు జంజాటం.. ‘వన్‌ ప్లస్‌ టు ఇజ్‌ ఈక్వల్‌ టు త్రీ’ అనే సాంకేతిక సమాధానాలతో సంతృప్తి చెందదు. సాంకేతికానికి మించిన లౌకికానికి మించిన సమాధానాలు ఏమిటో ఈ ఆత్మకు కావాలె. అలౌకిక ఆధి భౌతిక ప్రశ్నలు వెంటాడుతున్న జీవికి ఎక్కడుంది సమాధానం? ఎవరిస్తరు అలౌకిక జీవరహస్య సామాజిక జీవన గుంజులాటలో ఇమిడివున్న దు:ఖానికి సాంత్వన? అందుకే దేవత. అందుకే దేవుడు. అందుకే మతం. అందుకే ఓ ఆధ్యాత్మిక ఆత్మానందపు వేట. అందులోంచి వచ్చేదే ఆధ్యాత్మిక శిగం తద్వారా ఈ జీవి పొందే సాంత్వన.


  మనిషి తన భావనాత్మక, భౌతికాత్మక గుంజులాటను మరిచిపోవాలె కాసేపు. అట్లా రీచార్జీ కావడంలోనే దొరుకుతుంది సమాధానం. సామూహిక జీవనం కోసం ఏర్పాటు చేసుకున్న సామాజిక విలువలు కట్టుబాట్ల ను తెంచుకుని కాసేపు లేదా కొన్నిరోజులు ఒంటరివారు కావడంలోనే ఉంది సమాధానం. ఆ ఒంటరితనం అంటే భౌతికం కాదు. అది తనను తానే మరిచిపోయేది. ఆది భౌతిక స్థితికోసం తన్లాట. అణిచివేయబడిన మనసు శివాలెత్తి శిగమూగి తన దాహాన్ని తీర్చుకుంటది. అట్లా మనసుకు తీరిన అలసట మరికొద్ది కాలం మనిషిని దైహిక జీవనంలో శారీరక ఉత్సా హం సంతరించుకుంటది. అందికే దైవం పేరున సాగే ఆధ్యాత్మిక జన జాత ర ఓ సెల్ఫ్‌ రీచార్జ్‌.

ఈ కోణంలోంచే సమ్మక్క సారలమ్మ మేడారం జాతర సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. మాతృస్వామిక ఆదిమ సంస్కృతికి.. నాగరీకరణ చెందిన ఆధిపత్య విలువల బ్రాహ్మణీయ ఆధ్యాత్మిక సంస్కృతికి.. ఉండే తేడా ఒక టి వుంది. అక్కడ ప్రకృతి సెంటర్‌గా ఉంటే, ఇక్కడ రాజ్యం సెంటర్‌గా ఉంటది. ఇది అర్థం చేసుకుంటే మేడారం జాతరలోని మాతృస్వామిక ప్రాకృతిక ఆధ్యాత్మికత అర్థమైతది.


ఈ దేశంలోని  మూలవాసీ ఆదివాసీ నిజహిందూ సంస్కృతి అర్థమైతది. హిందుత్వం పేరుతో మత ఆధ్యాత్మిక విశ్వాసాలను రాజకీయంచేసి ప్రజ ల భావనాత్మక ఉద్రేకాన్ని రాజకీయానికి కుదించి సెంటిమెంట్లను విశ్వాసాలను ఓట్లకు కుదించే విధానం అర్థమైతది. దేవున్ని రాజ్యానికి ముడిపెట్టి అలౌకిక లౌకిక విశ్వాసాలను భ్రష్టుపట్టించే జాతీయపార్టీల రాజకీ య స్వార్థాన్ని కూడా మనం అర్థం చేసుకునే వీలుంటది. మతాన్ని దైవ విశ్వాసాలను మనిషికి మాత్రమే ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావ ప్రపంచం తాలూకు తన్లాట గురించి సామాజిక శాస్త్రవేత్త మార్క్స్‌ అద్భుతంగా వివరించారు. ఆ మాట కొస్తే ఈ భూ ప్రపంచం మీద ఆధ్యాత్మికత గురించి ఏ ఆధ్యాత్మిక వాది చెప్పనంత స్పష్టంగా చెప్పిన కొన్ని అంశాలను రాజకీ య కోణంలోంచి కాకుండా ఆధ్యాత్మిక భావనల కోణంలోంచి అర్థం చేసుకుందాం.


కారల్‌ మార్స్క్‌ ఏమంటాడంటే.. ‘మతమన్నది తనను తాను జయించలేని లేదా తనను తాను మరొకసారి కోల్పోయిన మనిషి యొక్క ఆత్మ-చేతన (self-consciousness)’ అంటారు. దీన్నీ రాజకీయకోణంలోంచి ఆయన చెప్పినా.. కేవలం సామాజిక రాజకీయకోణాల్లోంచే కాకుం డా మనిషి తన ఆత్మచేతనను కోల్పోయే పరిస్థితి అనేది అలౌకిక పరిస్థితిల్లోంచే ఉద్భవిస్తది. కావట్టి మార్క్స్‌ చెప్పిన ఆత్మగౌరవాన్ని కోల్పోవడం అనే రాజకీయకోణం ఇక్కడ అప్రస్తుతం. ఇక్కడ మతాన్ని రాజకీయ కోణంలో కాకుండా ఆధ్యాత్మిక కోణంలోనే తీసుకుందాం. మనిషి తనను తాను గెలువడం అనేది ఒక రాజ్యరహిత కోణంలోనే కానక్కర్లేదు. మనం ముందే చెప్పుకున్నట్టు మనిషి తనమీద తాను గెలవడం అనేది అలౌకిక ఆధ్యాత్మిక భావనాత్మకత సామర్థ్యానికి సూచిక.


ఇంకా మార్క్స్‌.. మతం అనబడే ఓ ఆధ్యాత్మిక ప్రపంచం గురించిన గొప్ప విశ్లేషణ ఏమిస్తాడంటే.. (మనం ఇక్కడ మతం అని వినబడగానే మానవ అలౌకిక తాత్వికత ఆధ్యాత్మికత అని అర్థం చేసుకుందాం.. చదువుకుం దాం) .‘మతం, ఈ ప్రపంచం యొక్క సాధారణ సిద్ధాంతం. మతం, ప్రపంచ విజ్ఞాన సర్వస్వం యొక్క సారం. మతం, ప్రపంచపు ప్రజాదర ణ పొందిన రూపంలోని తర్కం. మతం, ప్రపంచపు ఆధ్యాత్మిక గౌరవాన్ని సమున్నతపరిచే అంశం. మతం ప్రపంచం యొక్క ఉత్సుకత, నైతిక నియ మం, వైదిక అనుబంధితం (solemn complement), మరియు ప్రపంచపు ఊరటకూ, ఔచిత్యానికీ సార్వజనీన ప్రాతిపదిక..’ అంటారు.ఇదీ మతం లేదా ఆధ్యాత్మికతలో దాగివున్న  అసలు సంగతి. అది మతంలోని సంగతి మాత్రమే కాదు మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టు  సకల జీవరాసుల్లో లేని ఓ  తన్లాటకు, మనిషికే ప్రత్యేకమైన ఓ  ఆత్మచింతనకు సమాధానం. మతం పేర నడిచే ఆధ్యాత్మిక ప్రయాణం.


  ఈ ఆధ్యాత్మిక భావనాపరంపర అనేది పన్నేండ్లకోసారి కుంభమేళా పేరున వచ్చినా,  యాదగిరి లక్ష్మినర్సింహస్వామి, వేములాడ రాజ న్న, తిరుపతి వెంకన్న లెక్క మున్నూటిరవై రోజులు అందుబాటులో ఉన్నా   పల్లెల్లో ఉప్పలమ్మై మైసమ్మై ప్రకృతి దేవతలైనా లేదా సమ్మక్క సారక్కలై రొండేండ్లకోసారి అడవిలోకి వచ్చి గద్దెల మీద దర్శనమిచ్చి కోట్లాది మనసులకు అలౌకిక  సాంత్వననిచ్చినా దాని సారం ఒక్కటే. మనిషికి మాత్రమే ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సహజాతాన్ని తీర్చడం. భౌతిక ప్రపంచానికి ఒక భావనాత్మక రీచార్జ్‌.


మార్క్స్‌ చెప్పిన ఆధ్యాత్మికత దాని ఆవశ్యకత వాస్తవికతను రాజ్య స్వభావ దృష్టిలోంచి అర్థం చేసుకోవాలని చెప్పిండు. కానీ మనిషి బుర్రకు వాస్తవికత అనేది అంతుదొరకని సమాధానమే. ట్రూత్‌ ఈజ్‌ నాట్‌ అబ్సల్యూట్‌. అది కాలమాన పరిస్థితులనుబట్టి రూపాంతరం చెందుతుంటది. అసలీ జీవానికి వాస్తవ ఆధారం ఎక్కడుంది అని అడిగితే మార్క్సిజం డార్వినిజమే కాదు ఏ సైన్సు దగ్గరా సమాధానం లేదు, దొరకకపోవచ్చు కూడా. దానికి ఒకే సమాధానం సాంత్వనే. భావనాత్మక ప్రపంచలో భౌతికమయ్యే ఆధ్యాత్మికతే. అందుకే మార్క్స్‌ చెప్పినట్టు.. ‘మానవ సారం ఏ విధంగానూ నిజమైన వాస్తవికతను సంతరించుకోని పరిస్ధితుల్లో అది మానవసారం యొక్క అద్భుతమైన సాక్షాత్కారం. మతపరమైన దుఃఖం అన్నది, ఒకే సమయంలో, వాస్తవ బాధల వ్యక్తీకరణే కాక ఆ వాస్తవ బాధలకి వ్యతిరేకంగా తనమీద తాను వ్యక్తపరుచుకునే విలువలు కట్టుబాట్లమీద  వ్యక్తమయ్యే స్వీయ సామాజిక  నిరసన కూడా..’ అని అర్థం చేసుకోవాల్సి వుంటది.


నేడు సమ్మక్క సారక్క మేడారం జనజాతర నుంచి మనం మార్క్స్‌ కోణం లో అర్థం చేసుకోవాల్సింది ఏందంటే.. సమ్మక్క సారలమ్మ జాతర..‘ జీవ రహస్యానికి దొరకని సమాధానాలతో నిత్యం ఆధ్యాత్మిక అలౌకిక  ఒత్తిడి కి గురవుతున్న ఒక సగటు జీవి విడిచే నిట్టూర్పు.  హృదయరహిత ప్రపంచానికి హృదయం, ఆత్మరహిత పరిస్థితులకు ఆత్మ. అది ప్రజలకు సాంత్వననిచ్చే ఆధ్యాత్మిక అలౌకిక మత్తు మందు..’ అని అర్థం చేసుకోవాల్సి వుంటది.


logo