బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Feb 05, 2020 , 23:07:10

గాంధీ మార్గం

గాంధీ మార్గం

గాంధీ అనుసరించిన మతం కొత్తదేమీ కాదు. కోట్లాది భారతీయులు వేలాది ఏండ్లుగా అచరిస్తున్నదే. దానినే గాంధీ అనుసరించారు. అందుకనే ప్రజలు మహాత్ముడిలో తమను చూసుకున్నారు, ఆయనను అనుసరించారు. గాంధీని విమర్శిస్తే ఈ దేశ ప్రజలు మూకదాడులు చేయరు. పిస్తోలు పట్టుకొని బెదిరించరు. కానీ గాంధీని విమర్శించిన వారే తమ మాటలను వెనుకకు తీసుకుంటారు, సంజాయిషీ ఇచ్చుకుంటారు. ఇదే గాంధీకి, ఈ దేశ ప్రజలకున్న నైతిక బలం- అహింసాయుధం, సత్యాగ్రహం.

కర్ణాటకలోని బీజేపీ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు, అనంత్‌కుమార్‌ హెగ్డేకు రక్తం మరుగుతున్నది! గాంధీ మహాత్ముడెట్లా అవుతాడనేది ఆయన ఆగ్రహం. బ్రిటిష్‌వారు గాంధీ సత్యాగ్రహానికి భయపడి వెళ్లిపోలేదు, విరక్తి పుట్టి విడిచి వెళ్ళారనేది ఆయన చెబుతున్న చరిత్ర. హెగ్డే దృష్టి లో గాంధీ నడిపింది స్వాతంత్య్ర పోరాటమే కాదు. బ్రిటిష్‌వారితో కలిసి ఆడిన నాటకమది. ఈ కాలపు పిల్లల భాషలో చెప్పాలంటే అదొక ‘ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌'! వక్రీకరించిన చరిత్రనే ఇప్పు డు మనం చదువుతున్నామనేది ఆయన బాధ. ఈయన మాటలకు దేశమంతా గగ్గోలు పుట్టడంతో ఆయన సంజాయిషీ ఇచ్చుకున్నారు. 


తాను గాంధీ పేరే వాడలేదని అంటున్నారు. నిజమే గాంధీ పేరు వాడకపోవచ్చు. కానీ ఆయన మాటలన్నీ వింటే గాంధీని, మహాత్ముడి సారథ్యంలో ఈ దేశ ప్రజలు సాగించిన అహింసాయుత స్వాతంత్య్ర పోరాటాన్ని కించపరిచారనేది స్పష్టంగా తెలుస్తూ నే ఉన్నది. ఆమరణ ఉపవాస దీక్షలను, సత్యాగ్రహాన్ని అపహాస్యం చేస్తూ తాను గాంధీని అనలేదనడం అర్థం లేని వాదన. హెగ్డే తమ ప్రసంగంలో చెప్పినట్టు- స్వాతంత్య్ర పోరాటం జరిపిన వారిలో భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌ వంటి విప్లవకారులు ఉన్నమాట వాస్తవం. వీరు సాయు ధ మార్గాన్ని నమ్మారు. వారి త్యాగనిరతిని ఎవరూ తప్పుపట్టడం లేదు. హరిహర, బుక్కారాయలకు మార్గనిర్దేశనం చేసిన విద్యారణ్యుడి వంటివారిని కూడా హెగ్డే రెండవ రకం దేశభక్తులుగా పేర్కొన్నారు. చరిత్రలో ఎవరి స్థానం వారిది. ఎవరి పోరాట పంథా వారిది. ఒకరిని ప్రశంసించ డం కోసం మిగతావారిని తూలనాడవలసిన అవసరం లేదు. స్వాతంత్య్రోద్యమకారులు ఒక్క లాఠీ దెబ్బను తినలేదని, గాంధీ అహింసాయుత పోరాటాన్ని బ్రిటిష్‌వారితో లాలూచీ పడి నడిపారని చెప్పడమే అభ్యంతరకరం.


హెగ్డే మాటలపై దుమారం చెలరేగడంతో బీజేపీ పెద్దలు ఈ వ్యాఖ్యలను ఖండించేపనిలో పడ్డారు. ఆరెస్సెస్‌ మహాత్మాగాంధీని గౌరవంగా చూస్తుందని, ఇటువంటి చౌకబారు వ్యాఖ్యలను ఆమోదించదని కర్ణాటక బీజేపీ అధికార ప్రతిని ధి అన్నారు. హెగ్డేకు తాఖీదు ఇచ్చినట్టు కూడా కేంద్ర నాయకులు చెబుతున్నారు. కానీ బీజేపీ నాయకుడు హెగ్డే నోటివెంట మహాత్మా గాంధీ ని, స్వాతంత్య్ర పోరాటాన్ని అవహేళన చేసే మాటలు రావడం యాదృచ్ఛికం కాదు. సంఘపరివార్‌ ఆలోచనా విధానమే వారి నోటి వెంట ఇటువంటి మాటలను పలికిస్తున్నదనే ఆనుమా నం కలుగుతున్నది. ఇదే హెగ్డే మూడేండ్ల కింద-  రాజ్యాంగాన్ని సవరించి ‘లౌకికత్వం’ అనే పదా న్ని తొలిగిస్తామని అన్నారు. బీజేపీ నాయకులు తరచు గాడ్సేను కీర్తిస్తూ, రాజ్యాంగ విలువలను తృణీకరిస్తూ మాట్లాడుతూనే ఉన్నారు. 


గతంలో భోపాల్‌ ఎంపీ, ప్రజ్ఞాసింగ్‌ఠాకూర్‌ గాడ్సేను ప్రశంసిస్తూ మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌కు చెంది న బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ కూడా గాడ్సేను దేశభక్తునిగా అభివర్ణించారు. హర్యానాకు చెందిన ఒక మంత్రి అనిల్‌ విజ్‌ కరెన్సీ నోట్లపై గాంధీ చిత్రాన్ని తొలిగించి మోదీ బొమ్మ పెడుతామన్నారు. హర్యానాలోని ఒక ప్రభుత్వశాఖ ఖాదీని ప్రచారం చేసే సందర్భంలో గాంధీ స్థానంలో మోదీ బొమ్మను ఇప్పటికే పెట్టింది. ఉప్పు సత్యాగ్ర హం, క్విట్‌ ఇండియా వంటి పలు ఉద్యమ ఘట్టాలలో ప్రజలతో పాటు పాల్గొనకుండా బ్రిటిష్‌ పక్షం వహించిన వారే స్వాంత్య్రపోరాటాన్ని తప్పుపట్టడం ఆశ్చర్యకరం. గాంధీ నాయకత్వంలో దేశ ప్రజలు ఉద్యమిస్తున్నప్పుడు, బ్రిటిష్‌ వారి ‘విభజించి పాలించు’ విధానంలో పాచికగా మారి ముస్లింలీగ్‌తో చేతులు కలిపిన ఈ మతవాదుల వారసులే ఇప్పుడు గాంధీని, స్వాతంత్య్ర పోరాటాన్ని  తప్పుపడుతున్నారు.


భిన్న మతభావనలు, సిద్ధాంతాలు గలవారు నిర్భయంగా వ్యక్తపరిచే, జీవించే  లౌకిక ప్రజాస్వామ్యాన్ని నిర్మించాలనే నాటి స్వాతంత్య్రోద్యమకారులు కోరుకున్నారు. మతవాదులు కూడా తమ సిద్ధాంతాలను చెప్పుకునే అవకాశాన్ని ఈ ప్రజాస్వామ్య దేశం కల్పించింది. కానీ వాస్తవాలను వక్రీకరించడమే అభ్యంతరకరం. గాంధీకి రహస్య అజెండాలు లేవు. తాను నమ్మినదే బోధించా రు. తాను చెప్పినదే ఆచరించారు. ఆచరించినదే చెప్పారు. గాంధీ తనను ఏనాడూ పరిపూర్ణుడిగా భావించుకోలేదు. తాను నమ్మినదే పరమ సత్యమని చెప్పలేదు. ఆయన ఆత్మకథలో చెప్పిన అనుభవాలను, కార్యాచరణను సత్యంతో ప్రయోగాలుగా అభివర్ణించుకున్నారు. అనేకసార్లు ఆత్మవిమర్శ చేసుకునేవారు. గాంధీ అహింసను బోధించారు. కానీ ఏనాడు అధికారానికి తలవంచలేదు. 


హింసను ఎదుర్కొనే సాహసాన్ని ఆయన బోధించారు. గాంధీ తన దైవభక్తిని ఏనాడూ దాచుకోలేదు. అట్లాగని మత రాజకీయాలను ఏనాడూ ఆమోదించలేదు. గాంధీ అనుసరించిన మతం కొత్తదేమీ కాదు. కోట్లాది భారతీయులు వేలాది ఏండ్లుగా అచరిస్తున్నదే. దానినే గాంధీ అనుసరించారు. అందుకనే ప్రజలు మహాత్ముడిలో తమను చూసుకున్నారు, ఆయనను అనుసరించారు. గాంధీని విమర్శిస్తే ఈ దేశ ప్రజలు మూకదాడులు చేయరు. పిస్తోలు పట్టుకొని బెదిరించరు. కానీ గాంధీని విమర్శించిన వారే తమ మాటలను వెనుకకు తీసుకుంటారు, సంజాయిషీ ఇచ్చుకుంటారు. ఇదే గాంధీకి, ఈ దేశ ప్రజలకున్న నైతిక బలం- అహింసాయుధం, సత్యాగ్రహం.


logo