బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Feb 05, 2020 , 23:00:03

ఆదివాసీల ఆత్మగౌరవ పండుగ

ఆదివాసీల ఆత్మగౌరవ పండుగ

యుద్ధంలో కాకలుదీరిన కాకతీయుల సైన్యాన్ని సమ్మక్క ముప్పుతిప్పలు పెట్టింది. వీరోచితంగా పోరాడింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలుకలగుట్ట వైపు వెళ్తూ అదృశ్యమైంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించింది. ఆ పసుపు, కుంకుమల భరిణెనే సమ్మక్కగా భావించి, అప్పటినుంచి ఏటా మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

మేడారం సమ్మక్క-సారలమ్మ వన దేవతల జనజాతర ఆదివాసీలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొనే అడవి పండు గ. గిరిజనుల సంస్కృతి-సంప్రదాయాలకు, జీవన విధానానికి, వీరత్వానికి, కట్టుబాట్లకు, ఆత్మగౌరవానికి ప్రతీకలుగా వీరవనితలై నిలిచిన సమ్మక్క-సారలమ్మ చరిత్రను నేటికీ గిరిజను లు తమ మదిలో సజీవంగా నిలుపుకొని స్మరించుకుంటున్నారు. కాలక్రమేణా ఇది సకలజనుల పండుగగా మారింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతర. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. అందుకే దీన్ని తెలంగాణ కుంభమేళా అంటారు. నాలుగురోజుల్లోనే దేశం నలుమూలల నుంచి కోటిన్నర మంది హాజరయ్యే అద్భుత అభయారణ్యంలో జరిగే జనజాతర ఇది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నది. మేడారం పూర్వపు వరంగల్‌ జిల్లా, నేటి ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం అనే గ్రామంలో జరుగుతున్నది.


మేడారం జాతరపై అనేక కథనాలున్నాయి. కానీ ఆదివాసి గిరిజన పూజారుల మౌఖికాధారాల ప్రకారం అధిక ప్రాచుర్యంలో ఉన్న కథ.. క్రీ.శ.-1158 నుంచి 1195 వరకు ఓరుగల్లు కేంద్రంగా కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు పాలించినట్టు చరిత్ర చెబుతున్నది. అప్పటి కాకతీయ సామ్రాజ్యంలో నేటి కరీంనగర్‌ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు, తన ఏకైక కుమార్తె సమ్మక్కను, అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి వివాహం చేశా డు. సమ్మక్క-పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంప న్న అనే ముగ్గురు సంతానం కలిగారు. 


రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆ దాడిని తట్టుకోలేక మేడరాజు, మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. అయితే, మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉన్నాడు. కరువు కాటకాల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడమేగాక, మేడరాజుకు ఆశ్రయం కల్పించ డం కాకతీయ రాజుకు కన్నెర్ర అయ్యింది. సార్వభౌమునికి వ్యతిరేకంగా కోయల్లో తిరుగుబాటు భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ప్రతాపరుద్రుడికి కోపమొచ్చింది. పగిడిద్దరాజును అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తాడు.


సామంతుడైన పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుంచి ఆదివాసీ సంప్రదాయ ఆయుధాలతో వీరోచితంగా పోరాటం చేస్తారు. కానీ, సుశిక్షితులైన కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగుల మ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. ఓటమి వార్త విన్న జం పన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడుతాడు. అప్పటినుంచి సంపెంగవాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి చెం దింది.

వీరోచిత పోరాటం-సమ్మక్క అదృశ్యం: యుద్ధంలో కాకలుదీరిన కాకతీయుల సైన్యాన్ని సమ్మక్క ముప్పుతిప్పలు పెట్టింది. వీరోచితంగా పోరాడింది. 


గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలుకలగుట్ట వైపు వెళ్తూ అదృశ్యమైంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించింది. ఆ పసుపు, కుంకుమల భరిణెనే సమ్మక్కగా భావించి, అప్పటి నుంచి ఏటా మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. అత్యంత మహిమాన్వితంగా నిలిచిన వనదేవతల జాతరకు ఏటా భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. ఈ ఏడాది మేడా రం సమ్మక్క-సారలమ్మ జాతర ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు జరుగుతుంది.


రెండేండ్లకోసారి జరిగే వనదేవతల జాతర భక్తుల సందడితో నేల నలుచెరుగులా ఎటుచూసినా జనసంద్రమైపోతుంది. 1940 వరకు చిలుకల గుట్టపైనే గిరిజనులు మాత్రమే జాతరను జరిపేవారు. 1946 నుంచి జాతరను మేడారంలో నిర్వహించడం మొదలైంది. ఆ తర్వాత 1962 సంవత్సరంలో సారలమ్మను  కీకారణ్యంలోని మేడారం గద్దెలపై ప్రతిష్ఠించారు. 1968లో జాతర దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చింది. 1998లో ఈ జాతరను ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. గిరిజన సంస్కృ తి ప్రతిబింబమైన మేడారం జాతరను స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నది.


గిరిజనుల మహా కుంభమేళా సమ్మక్క సారలమ్మ జాతరకు  ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను చేసింది. సమైక్య పాలనలో జాతరకు రూ.10 నుంచి 20 కోట్లు కేటాయిస్తే, గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర పండుగైన మేడారం జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారీగా నిధులను కేటాయించారు. 2016లో తెలంగాణ లో తొలిసారిగా జరిగిన జాతరకు రూ.170 కోట్లకు పైగా నిధులను మంజూరు చేశారు. 2018లో రూ.80 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ.75 కోట్లు కేటాయించారు. గతేడాది జాతరకు కోటి 30 లక్షల మంది భక్తులు రాగా, ఈ ఏడాది కోటి 40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా.


మేడారం జాతరకు వచ్చే  భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు గత ఆరేండ్లుగా దశలవారీగా శాశ్వత ప్రాతిపదికన పనులు పూర్తిచేశారు.  భూపాలపల్లి, పస్రా, తాడ్వాయి నుంచి మేడారం వచ్చే మూడు ప్రధాన రహదారులను డబుల్‌ లైన్‌ రోడ్లుగా మార్చారు. టాయిలెట్లు, బట్టలు మార్చుకునే గదులను శాశ్వత ప్రాతిపదికన నిర్మించారు. కొత్తగా హరిత హోటల్‌ను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. సమ్మక్క-సారలమ్మ జాతరతోపాటు ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించేలా మ్యూజియం ఏర్పా టుచేశారు. ఆధునిక గుడారాలు, 24 గంటలు విద్యుత్తు, తాగునీరు ఇలా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. పారిశుద్ధ్య పనులకు 3,450 మంది మం ది కార్మికులను నియమించారు. వివిధ ప్రాంతాల నుంచి జాతరకు వచ్చే భక్తుల సంఖ్యకు సరిపోను 4000 ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉం చారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా పోలీసు అధికారులు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు.


తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నది. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ పండుగగా గుర్తిస్తుందని ఆశిద్దాం. అయి తే, ఈసారి మేడారం జాతరలో ప్లాస్టిక్‌ను నిషేధించారు. ప్లాస్టిక్‌ రహిత జాతరగా నిర్వహించాలని నిర్ణయించారు. ప్లాస్టిక్‌ రహిత సమాజ నిర్మాణంలో భాగంగా పచ్చని అడవితల్లిని కాపాడుదాం. పర్యావరణాన్ని పరి రక్షించుకొని వన జాతరను సంరక్షించుకుందాం.


logo