గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Feb 04, 2020 , 22:58:05

మహాజాతర

మహాజాతర

ఏటా పెరుగుతున్న భక్తుల రద్దీతో పర్యావరణ సమస్య తలెత్తే ప్రమాదాన్ని గుర్తించి ఈ సారి ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించి గొప్ప సానుకూల నిర్ణయాన్ని చేసింది. మేడారం జాతర దట్టమైన అడవి మధ్యలో ఏజెన్సీ ప్రాంతంలో నిర్వహించబడుతున్న కారణంగా అక్కడ భక్తుల సౌకర్యాల పేర శాశ్వత నిర్మాణాలు చేపట్టడం కుదరదు. అలాంటి నిర్మాణాలేవైనా పర్యావరణానికీ, అడవుల పరిరక్షణకు హానికరం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం సకల చర్యలూ తీసుకోవటం ఆహ్వానించదగినది.

ఆదివాసీ కుంభమేళా మేడారం జాతర ప్రారంభ వేడుకలకు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు నుంచి ఎనిమిదో తేదీ వరకు సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు మేడారం సకల సౌకర్యాలతో ముస్తాబైంది. వనదేవతల వారంగా భావించే బుధవారం రోజున మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలో వనదేవతల పూజా కార్యక్రమాలు నిర్వహించటంతో జాతర మొదలవుతుంది. గిరిజనుల ఆరాధ్యదైవం పగిడిద్దరాజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండ లంలోని యాపలగడ్డ నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారానికి సోమవారం బయల్దే రాడు. పగిడిద్దరాజు మూడురోజుల పాటు ప్రయాణించి, మేడారానికి ఈ రోజు రాత్రి 9 గంటల లోపు మేడారం గద్దెలకు చేరుకోవటంతో, జాతర లాంఛనంగా ప్రారంభమవుతుంది. 


యాపలగడ్డ గ్రామానికి చెందిన ఆరెం వంశీయులైన గిరిజనులు పగిడిద్దరాజును గుడి నుంచి గద్దెపైకి చేర్చి పూజలు చేస్తారు. నేడు సారలమ్మ, రేపు సమ్మక్క మేడారం చేరుకొని గద్దెలపై ఆసీనులవుతారు. గద్దెలపై ఆసీనులైన సమ్మక్క, సారలమ్మ మూడోరోజు (ఏడో తేదీన) భక్తులకు దర్శనమిస్తారు. జం పన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆదివాసీ దేవతలను దర్శించుకుంటారు. వన దేవతలను తమ ఆడపడుచులుగా భావిస్తూ పసుపు కుంకుమలు, చీరె సారెలు కానుకలుగా పెడుతారు. కోరిన కోర్కెలు తీర్చిన వన దేవతలకు భక్తులు తమ (తూకం) ఎత్తు బంగారాన్ని (బెల్లం) సమర్పించుకుంటారు. దేశంలో అలహాబాద్‌ కుంభమేళా తర్వాత అంతస్థాయిలో లక్షలాది జనసందోహంతో జరిగే మేడారం జాతర దేశంలోనే విశిష్టమైనది.


ఆదివాసుల మేడారం జాతరకు సుదీర్ఘ చరిత్ర ఉన్నది. కాకతీయుల కాలంలో అధికపన్ను, దోపిడీ హింసల నేపథ్యంలో సమ్మక్క, సారలమ్మ, జంపన్న అసువులు బాసారని చరిత్ర కథనం చెబుతున్నా, అంతకుముందునుంచే ఈ జాతర ఉన్నదన్న వాదన కూడా ఉన్నది. 1889కి ముం దునుంచే మేడారం జాతరను నిర్వహించినట్లు ఆధారాలున్నాయి. నిజాం ప్రభుత్వం కూడా సమ్మక్క, సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తున్నది. ఆధునిక చరిత్రలోకి వస్తే 1944లో మేడారం జాతర ఘనంగా నిర్వహించిన దాఖలాలున్నా యి. మొదటిసారి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 19 58లో మేడారం జాతరను రెవెన్యూ పరిధిలోకి తెచ్చి నిర్వహణాకార్యక్రమాలను చేపట్టింది. 


1967లో దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చి తగిన ఏర్పాట్లు చేయటం ప్రారంభించింది. ఆధునికాభివృద్ధి నేపథ్యంలో అడవుల నరికివేత లు, అడవితల్లి బిడ్డలుగా నివాసాలను కోల్పోతు న్న పరిస్థితుల్లోంచి ఆదివాసీ పోరాటాలు ఉధృ తం కావటం, ఇంద్రవెల్లి ఘటనలు నేపథ్యంగా కావచ్చు, ఏదేమైనా 1986లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించటం గమనార్హం. నానాటికీ పెరుగుతున్న భక్తుల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్న ప్రభు త్వం 1990 నుంచి మేడారంలో వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇక తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రజల సాంస్కృతిక జీవనంలో భాగంగా ఉన్న పండుగలకు పెద్దపీట వేసింది రాష్ట్ర ప్రభుత్వం. బతుకమ్మ లాంటి పండుగను రాష్ట్రప్రభుత్వమే నిర్వహిస్తూ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తున్నది. మేడారం జాతర ను కూడా జాతీయ పండుగగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తూనే సకల సౌకర్యాలను కల్పిస్తున్నది.


చరిత్రలో చూస్తే ‘రహదారులన్నీ రోమ్‌కే’ అన్న నానుడి కనిపిస్తుంది. అదేమో కానీ ఇవ్వాళ సరిహద్దు రాష్ర్టాల నుంచి అన్ని రహదారులు మేడారానికి దారితీస్తున్నాయి. రెండేండ్లకోసారి జరిగే ఈ జాతరకు తెలంగాణ నలుమూల నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఏపీ రాష్ర్టాల నుంచి లక్షలాదిగా ఆదివాసులు తండోపతండాలుగా రోజుల తరబడి నడిచి మేడారం చేరుకుంటారు. ఎడ్లబండ్లు, కాలినడకన  బారులుతీరి అడవి బాటలు, రహదారులన్నీ మేడారానికి జనప్రవాహమవుతాయి. కోటి నలభై లక్షలకుపైగా వస్తారనేది అంచనా. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 75 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మా ణం చేయటంతో పాటు స్నానఘట్టాలు, సకల వసతులకు ఏర్పాట్లు చేసింది. 


రాష్ట్రం నలుమూలల నుంచీ బస్సులు, ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. హైదరాబాద్‌, వరంగల్‌ నుంచి హెలికాప్టర్‌ సౌకర్యాన్ని కల్పించి మేడారం జాతర ప్రాముఖ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం చాటిచెప్పింది. అలాగే ఏటా పెరుగుతున్న భక్తుల రద్దీతో పర్యావరణ సమస్య తలెత్తే ప్రమాదాన్ని గుర్తించి ఈ సారి ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించి గొప్ప సానుకూల నిర్ణయాన్ని చేసింది. మేడారం జాతర దట్టమైన అడవి మధ్యలో ఏజెన్సీ ప్రాంతంలో నిర్వహించబడుతున్న కారణంగా అక్కడ భక్తుల సౌకర్యాల పేర శాశ్వత నిర్మాణాలు చేపట్టడం కుదరదు. అలాంటి నిర్మాణాలేవైనా పర్యావరణానికీ, అడవుల పరిరక్షణకు హానికరం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం సకల చర్యలూ తీసుకోవటం ఆహ్వానించదగినది.


logo
>>>>>>