సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Feb 04, 2020 , 22:39:28

కంకవనంలో కుంభమేళా

కంకవనంలో కుంభమేళా

మాఘశుద్ధ పౌర్ణమి శుభ ఘడియలు

దారులన్నీ మేడారం వైపు జోరుగా పరుగులు

కంకవనం తెరదీసే ఆదివాసీల కుంభమేళ

జంపన్న వాగులో పుణ్యతానాల మునకలు

అడవి పల్లె ఆసాంతం భక్తి నురగల పొంగులు

కోటి మొక్కులు, పోటెత్తే భక్తి పారవశ్యాలు

గెరిళ్లా యుద్ధయోధులే వనదేవతల రూపాలు

కోర్కెలు తీర్చుటకే కొలువుదీరిన వేళలు! 

తల్లి రాకకే తండ్లాడే తన్మయత్వపు తనువులు

చిలుకలగట్టుకేసి తదేక చూపుల పూజలు

జంతు బలులు, ఎదురుకోళ్ల స్వాగతాలు

పసుపుకుంకుమల భరణి గద్దెకు చేరటాలు

నిలువెత్తు బంగారం, సారెచీరల చదివింపులు

కానుకలు చెల్లించి కరుణించమని విన్నపాలు

సమ్మక్క సారలమ్మల దీవెనలు సంపదగా గైకొని

తన్మయత్వంలో తడిసి మురిసిన మనసులు!

తల్లుల వన ప్రవేశంతో జాతరకు తలుపు మూసి

జనారణ్యమె కరిగి, తరిగి తృప్తితో వెనుదిరిగి

పోయొస్తాం సమ్మక్క సారలమ్మంటు దీవెనలడిగి

రెండేండ్లకు మళ్లొస్తామని అనుమతులు కోరి

అశేష జనమంతా దివ్య ఆశీస్సులు నింపుకొని

కంకవన కమనీయతల్ని గుండెల్లో నిలుపుకొని

మేడారం గద్దెను మదిగదిన భద్రపరచుకొని

జనమంతా వెనుదిరిగె మూటముల్లె సర్దుకొని!

- డాక్టర్‌ బుర్ర మధుసూదన్‌రెడ్డి, 99497 00037

(మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా కవితాక్షరసుమాల సమర్పణ)


logo