మంగళవారం 31 మార్చి 2020
Editorial - Feb 03, 2020 , 23:26:26

అవాస్తవిక అంచనాలు

అవాస్తవిక అంచనాలు

దశాబ్దాల పరాయి పాలనలో చితికిపోయిన సమాజాన్ని అత్యల్ప కాలంలో పునరుజ్జీవింప చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. అట్లాగని వ్యవసాయ, పారిశ్రామిక రంగాలనూ నిర్లక్ష్యం చేయకుండా సమగ్రాభివృద్ధికి పునాదులు నిర్మిస్తున్నది. గ్రామీణ సమాజాన్ని సంపద్వంతం చేయడానికి, వృత్తి నైపుణ్యాలను ఉత్పాదకరంగా మార్చడానికి అనేక వినూత్న, సృజన్మాతక చర్యలను చేపట్టింది. కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నమూనాను స్వీకరించకపోగా, ఇక్కడ సాగుతున్న సమగ్ర ఆర్థిక పురోభివృద్ధి ప్రయోగాలను బడ్జెట్‌ ప్రతిపాదనల ద్వారా ప్రోత్సహించకపోవడం దారుణం.

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆశావహమైనది, అభివృద్ధికాముకమైనది, ఆలంబనతో కూడినదని చెప్పుకున్నప్పటికీ ఆచరణలో అందుకు దిశానిర్దేశం చేయలేకపోయారు. బడ్జెట్‌లో చెప్పిన అంచనాలు వాస్తవికతకు దూరంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి చోటుచేసుకొని దేశంలోనూ మందగమనం సాగుతున్న దశలో అందుకు విరుగుడుగా నిర్ణయాత్మకంగా వ్యవహరించాలె. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ స్థాయిలో దార్శనికతను ప్రదర్శించలేకపోయింది. దీంతో అవే నిరాశపూరిత విధానాలు చోటుచేసుకున్నాయి. బడ్జెట్‌ రూపకల్పన పరివర్తనను ఇచ్చేదిగా ఉండాలంటే, మొదట దేశ ఆర్థికపరిస్థితి మీద, భవిష్యత్‌ గమనం మీద స్పష్టత అవసరం. దేశంలో ఆర్థిక మందగమనం ఉన్నదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వంలో ని పెద్ద మనుషులు అంగీకరించడానికే తటపటాయిస్తున్నారు.


 రోగ కారణం ఏమిటో తెలిస్తే చికిత్స అనేది మొదలుపెట్టవచ్చు. ఎన్డీయే ప్రభుత్వం మొదటి పర్యాయం పాలనలో అనుసరించిన విధానాల పర్యవసానమే ఈ ఆర్థిక దుస్థితి అని గమనిస్తే ఏ విధానాల ద్వారా చక్కదిద్దుకోవచ్చో ఆలోచించవచ్చు. కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక దుస్థితి కనుక కారణమైతే అందుకు ఆయా దేశాల నేపథ్యాలను గ్రహించి, మన పరిధిలో తీసుకోవలసిన చర్యలేమిటో చర్చించుకోవచ్చు. కనీసం ఈ విధమైన చర్యలేమైనా బడ్జెట్‌ రూపకల్పనలో తీసుకున్న సూచనలు మచ్చుకైనా కనిపించకపోవడం ఆశ్చర్యకరం. జీడీపీ వృద్ధిరేటు పదిశాతం ఉంటుందనీ, పన్నుల ద్వారా ఆదాయాభివృద్ధి దాదాపు పన్నెండు శాతం ఉంటుందనీ, పబ్లిక్‌రంగ సం స్థల అమ్మకాల ద్వారా రెండు లక్షల కోట్లకు పైగా ఆదాయం లభిస్తుందని ఊరికే బడ్జెట్‌లో చెప్పుకొని సంతృప్తిపడటం వల్ల ఫలితం ఏముంటుంది!


వినియోగదారుడి కొనుగోలుశక్తి దెబ్బతింటే, మొత్తం ఆర్థికవ్యవస్థనే కుప్పకూలిపోతుందని 1930 దశకం మహామాంద్యం నాటికి ప్రపంచానికి మరింత స్పష్టంగా తెలిసివచ్చింది. ఈ నేపథ్యంలో సంక్షేమరాజ్య భావన బలపడ్డది కూడా. 1980 దశకం నుంచి పాలకులు ఈ చారిత్రక పరిణామాన్ని వెనుకకు తిప్పడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పొదుపు చర్యల పేరి ట సంక్షేమ కార్యక్రమాలను రద్దుచేస్తూ పోవడం వల్లనే ఇవాళ యురోపియన్‌ దేశాలన్నీ అతలాకుతలమవుతున్నాయి. ఆ దేశాలలో ప్రజలు భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. 


బ్రెగ్జి ట్‌ పరిణామం కూడా ఈ క్రమంలో చోటుచేసుకున్నదే. మరి మోదీ ప్రభుత్వం ప్రపంచ ఆర్థిక పరిణామల ఫలితమే మన దేశ ఆర్థిక అనిశ్చితి అని భావిస్తే అందుకు చికిత్సగా ఆర్థిక విధానాల లో మార్పు కనిపించాలె. 1960-70 దశకాల కల్లోల పరిస్థితుల నేపథ్యంలో ఇందిరాగాంధీ ప్రభు త్వం నిర్ణయాత్మకంగా వ్యవహించడం వల్లనే దేశం నిలదొక్కుకోగలిగింది. ఇరువై సూత్రాల ఆర్థిక పథకం వంటి విధానాలు దేశ గతిని మార్చివేశాయి. మన దేశ నాయకత్వం ఆ స్థాయిలో వ్యవహరించినప్పుడే దేశం ఆర్థికదుస్థితి నుంచి బయటపడుతుంది. యురోపియన్‌ దేశాలలో నెలకొన్న అనిశ్చిత పోకడలు ఇక్కడ ప్రవేశించవు. మన దేశంలో ఆర్థిక మందగమానానికి మూలాలు ఎక్కడున్నా కేంద్రప్రభుత్వం తన విధానాల ద్వారా ఎదుర్కొనవలసిందే. దేశం ఆర్థికంగా పుంజుకోవాలంటే సమాజంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవాలె. పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలకే పరిమితమైతే ఫలితం ఉండదు. విద్య, ఆరోగ్యం, ఉపాధి, సామాజిక భద్రత, పోషకాహారం వంటి అనేక రంగాలలో ప్రభుత్వం ఆలంబనగా నిలిచినప్పుడే కదా సగటు కుటుంబం కొనుగోలు శక్తి పెరిగేది. కానీ కేంద్ర బడ్జెట్‌లో సామాజిక సంక్షేమానికి కేటాయింపులు ఆశించినమేర లేవు.


కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా దేశ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నదనేది దేశ ప్రజలకు అనుభవంలోకి వచ్చిన వాస్తవం. ఇంతకాలం కేంద్ర పాలకులు కార్పొరేట్‌ పన్నుల ను ఎంతగా తగ్గించుకుంటూ పోవాలే, మధ్యతరగతిలో పన్నుల పరిధిని ఎట్లా విస్తరించాలే, పరిశ్రమలకు ఎట్లా ఎర్ర తివాచీ పరువాలే అనేది ఆలోచించారు తప్ప సమాజం సంపన్నం చేయడం ద్వారానే వ్యాపారం పెరుగుతుందనీ, తద్వారానే బొక్కసం నిండుతుందని గ్రహించలేకపోయారు. కండ్లముందే ఉన్న తెలంగాణ నమూనాను స్వీకరిస్తే సరిపోయేది. దశాబ్దాల పరాయి పాలనలో చితికిపోయిన సమాజాన్ని అత్యల్ప కాలంలో పునరుజ్జీవింప చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. అట్లాగని వ్యవసాయ, పారిశ్రామిక రంగాలనూ నిర్లక్ష్యం చేయకుండా సమగ్రాభివృద్ధికి పునాదులు నిర్మిస్తున్నది. గ్రామీణ సమాజాన్ని సంపద్వంతం చేయడానికి, వృత్తి నైపుణ్యాలను ఉత్పాదకరంగా మార్చడానికి అనేక వినూత్న, సృజన్మాతక చర్యలను చేపట్టింది. కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నమూనాను స్వీకరించకపోగా, ఇక్కడ సాగుతున్న సమగ్ర ఆర్థిక పురోభివృద్ధి ప్రయోగాలను బడ్జెట్‌ ప్రతిపాదనల ద్వారా ప్రోత్సహించకపోవడం దారుణం. దశాబ్దాల తెలంగాణ వెనుకబాటుకు కారణం ఇక్కడి ఆకాంక్షలను తీర్చకపోవడమే. ఈ బాధ్యతను గుర్తించైనా కేంద్రం తెలంగాణకు తగినమేర నిధులను కేటాయించాల్సింది.


logo
>>>>>>