గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Feb 03, 2020 , 23:15:23

పోరాటయోధునికి అశ్రునివాళి

పోరాటయోధునికి అశ్రునివాళి

తెలంగాణను ఆంధ్రతో కలుపాలని నాయకులకు నచ్చచెప్పడానికి వచ్చిన తెన్నేటి విశ్వనాథంకు బేగంపేట విమానాశ్రయంలో నిరసన తెలిపి అరెస్టయిన విద్యార్థులను నారాయణరెడ్డి బెయిల్‌పై విడిపించారు. ‘అమాయకపు ఆడపిల్లకు తుంటరి కుర్రవాడికి జరుగుతున్న పెళ్లి వంటి ఈ కలయిక విఫలమైతే విడాకులు తీసుకున్నట్లే రెండు ప్రాంతాలు విడిపోవచ్చున’ని అప్పటి ప్రధాని నెహ్రూ నిజామాబాద్‌ ఖలీల్‌వాడి మైదానంలో చేసిన ప్రసంగానికి ప్రత్యక్ష సాక్షిగా నారాయణరెడ్డి నిలిచారు. ఈ విషయాన్ని ఉద్యమకాలంలో ప్రజల ముందుకుతెచ్చిందీ ఆయనే.

ఫిబ్రవరి 2న నిజామాబాద్‌లో కన్నుమూసిన పండిట్‌ ఎం.నారాయణరెడ్డి 1952 ముల్కీ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుదాకా తనదైన విలక్షణ వ్యక్తిత్వంతో పోరాడారు. అరు వై ఏండ్లకు పైగా అలుపెరుగక ప్రత్యేక రాష్ట్రం కోసం, తెలంగాణ వనరుల పరిరక్షణ కోసం నిస్వార్థంగా కృషిచేశారు. 2009, డిసెంబర్‌ 9న కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించి, ఆ తర్వాత ఆ ప్రకటన నుంచి తప్పుకోవడానికి వేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని రహస్య 8వ చాప్టర్‌ను (హైకోర్టులో రిట్‌ దాఖలు చేసి) ప్రజల ముందుకుతెచ్చిన వ్యక్తిగా పండిట్‌ నారాయణరెడ్డిని నేటి ఉద్యమకారులు ఎంతో అభిమానిస్తారు.


నారాయణరెడ్డి 1931, సెప్టెంబర్‌ 10న నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలంలోని సుంకేట్‌ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించా రు. 1955లో న్యాయవాద వృత్తిని స్వీకరించారు. 1955, డిసెంబర్‌లో తెలంగాణను ఆంధ్రతో కలుపాలని నాయకులకు నచ్చచెప్పడానికి వచ్చిన తెన్నేటి విశ్వనాథంకు బేగంపేట విమానాశ్రయంలో నిరసన తెలిపి అరెస్టయిన విద్యార్థులను నారాయణరెడ్డి బెయిల్‌పై విడిపించారు. ‘అమాయకపు ఆడపిల్లకు తుంటరి కుర్రవాడికి జరుగుతున్న పెళ్లి వంటి ఈ కలయిక విఫలమైతే విడాకులు తీసుకున్నట్లే రెండు ప్రాంతాలు విడిపోవచ్చున’ని అప్పటి ప్రధాని నెహ్రూ నిజామాబాద్‌ ఖలీల్‌వాడి మైదానంలో చేసిన ప్రసంగానికి ప్రత్యక్ష సాక్షిగా నారాయణరెడ్డి నిలిచారు. ఈ విషయాన్ని ఉద్యమకాలంలో ప్రజల ముందుకుతెచ్చిందీ ఆయనే.


నిజామాబాద్‌ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వేలాది కేసుల్లో ఆయన వాదించారు. పోచంపాడు (నేటి శ్రీరాంసాగర్‌) ముంపు బాధితుల పక్షాన సుదీర్ఘ పోరాటం చేసి ఎక్కువ పరిహారాన్ని ఇప్పించిన లాయర్‌గా నందిపేట, ఆర్మూర్‌, నిర్మల్‌, దహెగాం, పిప్రీ మండలాల్లోని సుమారు 70 గ్రామాల ప్రజలు నారాయణరెడ్డిని ఎప్పుడూ మరువరు. 1965లో తెలంగాణలో తొలి మహిళా కళాశాలను నిజామాబాద్‌లో ఆయన స్థాపించారు.1952 నుంచి నిజామాబాద్‌ ఎంపీగా హైదరాబాద్‌ నివాసి హరిశ్చంద్ర హెడా (కాంగ్రెస్‌) మూడు పర్యాయాలు విజయం పొందడం గమనించి ‘ఎంపీకి స్థానికులు ఎవరూ పనికిరారా?’ అంటూ కాంగ్రెస్‌ పార్టీని నిలదీశారు. 1967 ఎన్నికల్లో తానే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసి అత్యధిక మెజారిటీతో లోక్‌సభకు ఎన్నికయ్యారు. నెహ్రూ-ఇందిగాంధీ కాలం లో ఎంతో శక్తిమంతమైన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ అభ్యర్థిని స్వతంత్ర అభ్యర్థిగా నారాయణరెడ్డి ఓడించడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.


ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో 1969, మార్చి 28న ముల్కీ నిబంధనలను సుప్రీంకోర్టు ఫుల్‌బెంచ్‌ తోసిపుచ్చడంపై లోక్‌సభలో చర్చించాలని నారాయణరెడ్డి ఎంత పట్టుబట్టినా, సభాపతి స్థానంలో ఉన్న నీలం సంజీవరెడ్డి చర్చకు అనుమతించలేదు. పట్టువీడని నారాయణరెడ్డి మిగిలిన తెలంగాణ ఎంపీలకు నచ్చజెప్పి తన వెంటబెట్టుకొని మరోసారి చర్చ కు పట్టుబట్టి ఏప్రిల్‌ 1న నాలుగు గంటల పాటు తొలిసారిగా లోక్‌సభలో చర్చించేలా చేశారు. పెద్ద మనుషుల ఒప్పంద నిబంధనల ఉల్లంఘనలపై, ముల్కీ నిబంధనల చట్టబద్ధతపై సుమారు గంటకు పైగా అనర్గళంగా నారాయణరెడ్డి ప్రసంగించి దేశ ప్రజల దృష్టికి తెలంగాణ సమస్యను తీసుకువచ్చారు. ‘తాను సంతకం చేసిన పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు అమలు జరుగలేదు. అందువల్ల ఈ విషయాలు ప్రస్తావించడానికి తాను సంకోచించాన’ని సభాపతి నీలం సంజీవరెడ్డి చివరికి అంగీకరించాల్సి వచ్చింది. లోక్‌సభలో జరిగిన చర్చలో పార్లమెంటరీ సంఘాన్ని తెలంగాణకు పంపాలని పలువురు ఎంపీలు పట్టుబట్టగా దేశీయాంగ మంత్రి విముఖత వ్యక్తపరిచాడు.


 మరుసటిరోజు ఏపీ సీఎం బ్రహ్మానందరెడ్డి ఈ ప్రతిపాదనను ‘రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే’నని అనడంతో నారాయణరెడ్డి చొరవతో ప్రజా సోషలిస్టు పార్టీ జాతీయ నేత, ఎంపీ మధులిమాయే లోక్‌సభలో 1969, ఏప్రిల్‌ 7న సభాహక్కుల తీర్మానం ప్రతిపాదించారు. 25 మంది లోక్‌సభ సభ్యులు తీర్మానానికి అనుకూలంగా లేచి నిలబడటంతో మరోసారి సుదీర్ఘ చర్చ జరిగింది. ‘తెలంగాణ ప్రజల శ్రేయస్సు పరిరక్షణకు ఏర్పాటైన ప్రాంతీయ సంఘం సూచనలను ఏపీ ప్రభుత్వం పెక్కుసార్లు తిరస్కరించింద’ని మధులిమాయే అన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై జనసంఘం నేత వాజపేయి స్పందిస్తూ బ్రహ్మానందరెడ్డి వైఖరిని తప్పుబట్టారు. మార్క్సిస్టు ఎంపీ ఇ.కె.నాయనార్‌ ‘తెలంగాణ ప్రాంతంలో వ్యక్తమవుతున్న అసంతృప్తిని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరిని సభవారు పరిగణనలోకి తీసుకోవడం అవసర’మన్నారు. తెలంగాణను వ్యతిరేకించే సీపీఐ నేత శ్రీపాద అమృతడాంగే కూడా సభలో మాట్లాడు తూ ‘తెలంగాణ సమస్యపై పార్లమెంటరీ సంఘాన్ని నియమించడం సమంజస’మని అనడం వెనుక నారాయణరెడ్డి కృషి ఎంతో ఉన్నది. ఈ చర్చ పర్యవసానంగానే నాటి ప్రధాని ఇందిరాగాంధీ అఖిలపక్ష సమావేశాన్ని, తెలంగాణ ప్రజాప్రతినిధులతో ఢిల్లీలో సమావేశాన్ని జరిపి ‘అష్ట సూత్ర’ పథకాన్ని ప్రవేశపెట్టారు.


1969, జూన్‌ 24న లోక్‌సభలో ‘21 మంది పార్లమెంటు సభ్యులతో పార్లమెంటరీ కమిటీని నియమించాల’ని నారాయణరెడ్డి 40 మంది ఎం పీల సంతకాలతో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వీరిలో ఇతర రాష్ర్టాల ఎంపీలతో పాటు వాజపేయి కూడా ఉన్నారు. మరుసటిరోజు జూన్‌ 25న ‘తెలంగాణ భవిష్యత్తుపై ఆ ప్రాంత ప్రజల అభిమతం తెలుసుకొనడానికి జనవాక్య సేకరణ జరుపాలని కోరుతూ ఒక ప్రైవేట్‌ బిల్లును లోక్‌సభలో ప్రతిపాదించారు. ఆ సందర్భంగా తెలంగాణ వాణిని సభలో వినిపించిన వాడు నారాయణరెడ్డి.నారాయణరెడ్డి ప్రతిపాదించిన తీర్మానం, ప్రైవేట్‌ బిల్లుపై లోక్‌సభ ఆగ స్టు 21న చర్చించింది. పార్లమెం టరీ సంఘం ఏర్పాటును కేం ద్రం మరోసారి తిరస్కరించడం తో నారాయణరెడ్డితో పాటు 8 మంది ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. మరుసటిరోజు రాజమండ్రి జైలు నుంచి సుప్రీంకోర్టుకు తీసుకువచ్చిన చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌ తదితర నేతలను ఢిల్లీలో విడుదల చేయగానే నారాయణరెడ్డి వారితో ఎంపీల సమావేశాన్ని నిర్వహించారు. 


ఎప్పటికప్పుడు నారాయణరెడ్డి కదలికలను, ఆలోచనలను, పనితీరును గమనిస్తూ వచ్చిన ప్రధాని ఇందిరాగాంధీ నారాయణరెడ్డికి కేంద్రమంత్రి పదవి ఇస్తానని, కాంగ్రెస్‌లోకి రావాలని పీసీసి అధ్యక్షులు పి.నరసారెడ్డిని దూతగా పంపారు. తాను తెలంగాణవాదానికే కట్టుబడి ఉంటానని ప్రధాని ప్రతిపాదనను నారాయణరెడ్డి తిరస్కరించారు.1972లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బోధన్‌ శాసనసభా స్థానం నుంచి నారాయణరెడ్డి గెలుపొంది ఆంధ్రప్రదేశ్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌ అయ్యారు. అప్పటికే ఆయన రాష్ట్ర చెరుకు రైతు సంఘానికి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిజాంసాగర్‌ డ్యాం ఎత్తుపెంచడానికి, ఫలితంగా ఆయకట్టుకు సాగునీటి వసతి కల్పించడానికి పండిట్‌ ఎం.నారాయణరెడ్డి ఎంతో కృషిచేశారు.


2000 సంవత్సరం చివరల్లో 41 మంది తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభ్యుల విజ్ఞప్తిపై సోనియాగాంధీ ప్రణబ్‌ ముఖర్జీ, మన్మోహన్‌సింగ్‌, మరొకరితో త్రిసభ్య కమిటీని నియమించారు. నారాయణరెడ్డి ఢిల్లీలో రెండు గంటలకు పైగా ఆ కమిటీ ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వివరించారు. 2001లో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ ఏర్పా టుచేశారు. అప్పుడు నారాయణరెడ్డి ఆయన వెంట ఉంటూ అనేక అంశాలపై చర్చించేవారు. పార్టీ తొలి కమిటీలో నారాయణరెడ్డి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఆ తర్వాతి కాలంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయినా తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచారు. పార్లమెంట్‌, శాసనసభల్లో తెలంగాణ అంశం చర్చకు వచ్చిన ప్రతిసారి ఆయన సభ్యులను ఎడ్యుకేట్‌ చేస్తూ వచ్చారు. పండిట్‌ ఎం.నారాయణరెడ్డి లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిది. తెలంగాణ ఉద్యమ తొలితరం మేధావికి అశ్రునివాళి.

(వ్యాసకర్త: తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌)


వి.ప్రకాశ్‌logo
>>>>>>