మంగళవారం 31 మార్చి 2020
Editorial - Feb 03, 2020 , T00:30

అతని కథలు ఆర్ద్ర సంస్పందనలు

అతని కథలు ఆర్ద్ర సంస్పందనలు

వెల్దండి శ్రీధర్ కథలు చదువుతుంటే ఎన్నో పాత్రలు మన కండ్లముందు నిలుస్తాయి. అమెరికా వెళ్లి స్థిరపడలేని పాత్రలు, ఊరు మీద మమకారం వదులుకోలేని వ్యక్తిత్వాలు, మస్కట్, దుబాయి నుంచి శవాలయి వస్తున్న బతుకులు, అయినా దుబాయి వెళ్లాలనే దయనీయ ఆరాటాలు, బీడీలు చుడుతూ సంసారం నడుపుతున్నస్త్రీలు, భూమితో సంబంధం తెంచుకోలేక పేగుబంధం తెంచుకునే రైతులు, జీవితంలో నిలదొక్కుకోవటానికి దినదినం తండ్లాడే మనస్తత్వాలు కథల పొడుగునా తారసపడుతుంటాయి.

మనిషికీ భూమికీ ఉన్న సంబంధం గ్రామంలో వ్యక్తమైనంత స్పష్టంగా పట్టణాల్లో వ్యక్తం కాదు. ఏ భాషా సాహిత్యాన్ని పరిశీలించినా గ్రామీణ జీవన నేపథ్యం నుంచి వచ్చిన రచయితలే ఎక్కువ. ఎరుక ఏర్పడినప్పటి నుంచి ప్రకృతితో, భూమితో ప్రత్యక్ష సంబం ధం వల్ల కలిగే ఇష్టం, వాటితో దూరం సంభవించినప్పుడు పడే క్షోభ, వాటి గురించిన ఆరాటం ప్రతి మనిషిలో భావోద్వేగాలు కలిగిస్తాయి. అటువంటి తీవ్ర ప్రకంపనల నుంచే రచయిత ఆవిర్భవిస్తా డు. బహుశా పట్టణ రచయిత కంటే గ్రామీణ రచయితలు పొందే ఘర్షణ ఎక్కువ కావచ్చు. ప్రకృతి, కాలాలు, ఋతువులు ఎంత సహజమైనవో, సున్నితమైనవో అంతే సహజ సున్నితత్వంతో స్పందించే స్వభావం కలవాడే రచయితవుతాడు.మనిషిలోని వివిధ సంఘర్షణలను సజీవంగా చిత్రించగల శక్తి మిగతా ప్రక్రియల కంటే కథకే ఎక్కువ. కవిత్వం అనుభూతి ప్రధా నం కాగా, కథ సంఘర్షణ ప్రధానం. సన్నివేశం, సంఘర్షణ, సంభాషణ కథలో ఒదిగినంత బలంగా మరోప్రక్రియలో సాధ్యం కావు. నవల ఉన్నా దాని పద్ధతి విస్తృతి. ఎదుటి వ్యక్తిలో ఆసక్తి రేకెత్తించడంలో, ఆకట్టుకోవడంలో కథ పదునైంది, ప్రబలమైంది.వర్తమాన గ్రామీణ జీవన సంఘర్షణలను పదునైన కథలుగా మలిచి అందిస్తున్న ప్రతిభావంతుడైన రచయిత డాక్టర్ వెల్దండి శ్రీధర్. సున్నిత హృదయాల లోపొరల్ని అతలాకుతలం చేసే పన్నెండు కథల సంపుటి పుంజీతం. కథలన్నీ గ్రామీణ నేపథ్యంతో చిత్రించినవే. ఛిద్రమవుతున్న జీవన కల్లోలాలకు అద్దం పట్టినవే. చదవటం మొదలు పెట్టిన తర్వాత కథలు మనల్ని విడిచిపెట్టవు.చెయ్యిపట్టుకొని గ్రామాలకు తీసుకెళ్లుతాయి. విధ్వంసమవుతున్న విపరీత దృశ్యాలను చూపెట్టి ఆర్ద్రపరుస్తాయి, ఆలోచింపజేస్తాయి.గ్రామమంటే వ్యవసాయం. భూమి, రైతు. యుగాల ఎడతెగని జీవనబంధం. ఎన్నో ఒడిదొడుకుల్ని, వ్యవస్థలను తట్టుకుని నిలబడిన బంధం. ప్రపంచీకరణలో ఆ సంబంధం తారుమారై విచ్ఛిన్నమవుతున్న తీరు కన్నీరు మిగులుస్తుంది. పొక్కిలి, సజీవదహ నం, పుంజీతం కథల్లో రచయిత చిత్రించిన జీవన సంఘర్షణలన్నీ వర్తమాన విషాదాలే. రైతు చెమటోడ్చి పండించిన పంటకు మార్కెట్ లేదు. భూమికి మార్కెట్ ఏర్పడి ధర పలుకుతుంది. ట్రాక్టర్ పనికి కుదిరి క్వారీలో పనిచేసి స్టోన్ క్రషింగ్ డస్టుతో ఊపిరితిత్తులు చెడిపోయిన కుటుంబం అగాథమై కూలికెళ్లలేక కూలిపోయిన దేవయ్య కథ పొక్కిలి. వరి గొలుసు పెట్టే దశలో నీరులేక, కరెంటు లేక పంట ఎండిపోతే, ఎండిన చేను కాలబెట్టి గడ్డివాము మంటల్లో దూకి బూడిదైన అయిల య్య, పొలం బూడిదై బతుకు బూడిదైన బూదవ్వల సంసారం సజీ వ దహనం. నగర వ్యాపారుల స్వార్థానికి ఊరు ఊరే సెజ్‌గా, ఫావ్‌ుగా,  విరాగి వెంచర్‌గా మారిన విపరీ తం పుంజీతం. ఏ కథ చదివినా ఏదో విషాదం వెంటాడుతూ ఉంటుంది.

శ్రీధర్ కథలు, పాత్రలు, సన్నివేశాలు, సంఘర్షణలు అన్నీ వర్తమాన జీవన సంక్షోభం నుంచి రూపుదిద్దుకున్నవే. హృదయమున్న ఏ రచయితా ఇప్పటి విచ్ఛిన్న కాలసందర్భం నుంచి తప్పించుకోలే డు. ఎంత భావుక ఏకాంత ప్రపంచం సృష్టించుకున్నా, కన్నుగానని కాల్పనికతలో తలమునకైనా ఏ పార్శ్వంలోంచో వాస్తవికత చొరబడక తప్పదు. వర్తమానాన్ని వదిలేసిన ఏ రచయిత అక్షరాలలో ప్రాణం తొణికిసలాడదు. శ్రీధర్ అట్లా కాదు. గ్రామం నుంచి వచ్చిన రచయిత. వర్తమాన పరిణామాలను అందుకున్న రచయిత. మారుతున్న పరిస్థితుల పట్ల, మానవ సంబంధాల పట్ల, మనస్తత్వాల పట్ల పట్టింపు ఉన్న రచయిత. బాధ్యత ఎరిగిన రచయిత. అందువల్లే ఈ కథల్లోని పాత్రలన్నీ సజీవంగా సాక్షాత్కరిస్తాయి. సంపుటిలోని మొదటి కథ అమృత వర్షిణి చివరి కథ లోలోపలి విధ్వంసం రెండూ నగర జీవితాల్లోని యాంత్రికతను ప్రతిబింబిస్తాయి. అమృతవర్షిణిలో స్త్రీ, పురుష సంబంధాల్లో ప్రవేశించిన యాంత్రికత అవసరం వాటి పర్యవసానాలు ఎయిడ్స్‌గా చిత్రించినా పరిష్కారంగా ఎయిడ్స్ కేర్ హోంను చూపించి రచయిత బాధ్యతాయుత వైఖరిని ప్రదర్శించటం శ్రీధర్ ప్రత్యేకత. లోలోపలి విధ్వంసంలో సాంకేతిక విప్లవం కంటే మానవీయ సంస్కృతి ఔన్నత్యాన్ని, ప్రకృతి ధర్మాన్ని వివరించాడు.నాలుగు కోట్ల పిడికిళ్లు, మరణమృదంగం రెండు కథల్లో తెలంగాణ బతుకుల్లో నెలకొన్న దైన్యాన్ని చిత్రించినప్పటికీ శిల్పరీత్యా ఈ కథలు భిన్నమైనవి. రెండింటిలో కొత్త శిల్పాన్ని తీర్చిదిద్దాడు. నాలు గు కోట్ల పిడికిళ్లు కథ పది దృశ్యాలుగా రూపొందింది. ఆదిలాబాద్ (అడవి మీద అధికారం), మెదక్ (నీళ్లు కోల్పోయిన భూమి), నల్లగొండ (ఫ్లోరోసిస్  అంగవైకల్యం), పాలమూరు (వలస కూలి  బోరుబావిలో పాప), ఖమ్మం (గొర్లువ్యాధి), రంగారెడ్డి (సెజ్ బాధితులు), హైద్రాబాద్ (నిరుద్యోగ ఉస్మానియా), కరీంనగర్ (దుబా యి శవాలు), నిజమాబాద్ (ముస్లిం పేదరికం), వరంగల్ (నీళ్లు లేని చెరువులు) ఇట్లా పది సన్నివేశాలు  వాటి నుంచి ఉద్భవించిన తెలంగాణ రాష్ర్ట నినాదం  విశేష కథన శిల్పం తీర్చిన కథ. మరో కథ మరణమృదంగంలో మూడు దృశ్యాలు శాంతినగర్, రాజీవ్‌నగర్, గాంధీసెంటర్. మూడు కేంద్రాల్లో ఒకే రోజు ముగ్గురు పద్మశాలీ పవర్‌లూం కార్మికుల ఆత్మహత్యలను చిత్రించాడు రచయిత. ఒకే కథలో మూడు ఉపశీర్షికలతో మూడు కథలు చిత్రించడం విషాదాతి విషాద శిల్పం. శ్రీధర్ ప్రయోగ శీలతకు ఇవి ఉదాహరణలు.

శ్రీధర్ సన్నివేశ కల్పనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుంది. నాట్లేసే సన్నివేశం, కల్లుమండువా, పంచాయితీ చెప్పే దృశ్యం, ఊరు వెంచర్ అయిన సన్నివేశం, ధ్యాన శిక్షణ దృశ్యాలు కళ్లకు కట్టి మనసు మీద చెరగని ముద్రవేసే విధంగా వర్ణించటం కథా నైపుణ్య ప్రత్యేకతలు. అక్కడక్కడ రచయిత కథనంలో చేసిన కవితాత్మక వ్యాఖ్యానాలు ఆకట్టు కుంటాయి. బురద పాదాలకంటంగనే బంగారాన్ని తాకినట్టనిపించింది (పొక్కిలి), ఖాళీ జేబు నీళ్లులేని బావిలాగా వెక్కిరించింది (మరణమృదంగం), కాలం ఇనుప బూట్లు తొడుక్కొని వాళ్ల గుండెలపై కర్కశంగా నడచి వెళ్తోంది (పేగుబంధం)  ఇట్లా రచయితలోని కవి తొంగి చూస్తుంటాడు.వెల్దండి శ్రీధర్ కథలు చదువుతుంటే ఎన్నో పాత్రలు మన కండ్లముందు నిలుస్తాయి. అమెరికా వెళ్లి స్థిరపడలేని పాత్రలు, ఊరు మీద మమకారం వదులుకోలేని వ్యక్తిత్వాలు, మస్కట్, దుబాయి నుంచి శవాలయి వస్తున్న బతుకులు, అయినా దుబాయి వెళ్లాలనే దయనీయ ఆరాటాలు, బీడీలు చుడుతూ సంసారం నడుపుతున్న స్త్రీలు, భూమితో సంబంధం తెంచుకోలేక పేగుబంధం తెంచుకునే రైతులు, జీవితంలో నిలదొక్కుకోవటానికి దినదినం తండ్లాడే మనస్తత్వాలు కథల పొడుగునా తారసపడుతుంటాయి.ఊరు చూడాలంటే శ్రీధర్ కథలు చదివితే చాలు. ఊరి ఉద్వేగాలు స్పర్శిస్తాయి. ఊరు దర్శనమిస్తుంది. యాంత్రిక స్వభావాలను మానవీయంగా మలచటానికి ఈ కథలు ఎంతగానో దోహదపడుతాయి. అడుగున పడిపోతున్న ఆర్ద్ర సంస్పందనలను పైకి తీసి నిలబెడుతాయి.తెలంగాణలో జీవన వైవిధ్యానికి కొదువలేదు. సమస్యలకు, సం ఘర్షణలకు కొదువలేదు. సాహసాలకూ కొదువలేదు.కథకులకే కొదు వ. తెలంగాణ కథా సమయానికి ఎదిగి వచ్చిన కథకుడు వెల్దండి శ్రీధర్. రచయిత కోరుకున్నట్టు ఊరు నిలబడాలె. మనిషి నిలబడాలె. తెలంగాణ గర్వించదగ్గ కథకుడిగా శ్రీధర్ నిలదొక్కుకోవాలె.

- నందిని సిధారెడ్డి


logo
>>>>>>