బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Feb 02, 2020 , 22:56:49

పద్యకంఠీరవుడు వేముగంటి

పద్యకంఠీరవుడు వేముగంటి

వేముగంటి వారు బెజవాడ గోపాలరెడ్డి, బోయిభీమన్న, దాశరథి, దేవులపల్లి రామానుజరావు, సినారె, పేర్వారం జగన్నాథం, గడియారం రామకృష్ణ వంటి ప్రముఖుల సహచర్యంతో సాహిత్యసేవలోకృతకృత్యులయ్యారు. వీరి రచనలనెన్నింటినో వివిధ విశ్వవిద్యాలయాలు పాఠ్యాంశాలుగా ఎంచుకున్నాయి. వేముగంటివారి తిక్కన కావ్యాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆంధ్రవిష్ణువు చారిత్రక కావ్యాన్ని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, ప్రాచ్య పరీక్షల విభాగం వారు ప్రియదర్శిని కావ్యాన్ని రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు డిగ్రీ స్థాయిలో పాఠ్యాంశంగా పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యలో 8వ తరగతికి మంజీరానాదాలులోని మంజీర గేయఖండికను పాఠ్యాంశంగా, కాంతి వైజయంతి కావ్యా న్ని కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా విశ్వవిద్యాలయం డిగ్రీ ద్వితీయ సంవత్సరానికి పాఠ్యాంశంగాను స్వీకరించారు. వేముగంటివారి బహుముఖీనమైన ప్రజ్ఞ వారికి జాతీయస్థాయిలో గుర్తింపును తెచ్చింది.

సాహితీ సంస్కృతులకు పుట్టినిల్లు తెలంగాణ. తెలుగు సాహిత్యంలో పలు ప్రక్రియలకు పురుడుపోసిన నేల తెలంగాణ. నాటి నిజాం పాలనా ప్రభావంతో తెలంగాణలోని కవి పండితులెందరో కనుమరుగైపోయారు. కావున నేటి తరుణంలో అలాంటి విస్మృత కవుల జీవిత చరిత్రలను వెలుగులోకి తీసుకురావటం అత్యంతావశ్యకమైనది. దానిలో భాగంగా తెలంగాణ తొలితరం పద్యకవుల్లో ఎన్నదగినవారైన వేముగంటి నరసింహాచార్యుల జీవన రేఖల్ని స్పృశించే ప్రయత్నమే ఈ వ్యాసం.ప్రాచీన కవులైన తిక్కన రచనాశైలిని, పోతన తెలుగు నుడికారాన్ని పుణికిపుచ్చుకోవటంతో పాటు,ఆధునిక కవులైన జాషు వా, విశ్వనాథలకు సమస్థాయిలో రచనా వైదుష్యాన్ని ఒంటపట్టించుకొన్న మెతుకుసీమ ముద్దుబిడ్డ వేముగంటి నరసింహాచార్యులు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో చైతన్యశీలిగా జనజాగృతమొనరించాడు. అదేవిధంగా స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ ఉద్యమాలలో సైతం కలం యోధునిగా వివిధ సాహితీ ప్రక్రియలను చేపట్టి తనదైన శైలిని సాహితీలోకంలో సుస్థిరపరిచాడు. ఆయన చేపట్టిన ప్రక్రియ ఏదైనా మానవతావాదం, సామాజిక దృక్కోణం, విశ్వజనీనత, జాతీయతావాదం ఆయన రచనల్లో నిబిడీకృతమవుతాయి.వేముగంటి నరసింహాచార్యులు 1930 జూన్ 30వ తేదీన మెదక్ జిల్లా సిద్దిపేటలో రంగాచార్యులు-రామక్క దంపతులకు జన్మించారు. వీరిది శ్రీవైష్ణవ కుటుంబం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లుగా వీరు సుమారు 16 ఏండ్ల వయస్సులోనే కలం చేతబట్టి దాదాపు యాభై ఏండ్లు రచనా వ్యాసంగంలో నిరంతర కృషివలునిగా సాహితీసేద్యం చేసి అమృత ఫలాలనందించారు. సనాతన సంప్రదాయ కుటుంబానికి చెందిన వీరు పూర్వాచార పరాయణులుగా వారసత్వాన్ని గౌరవిస్తూనే ఆధునిక భావజాలంతో అభ్యుదయవాదిగా వ్యవహరించారు.

బాల్యం నుంచే వీరు ఇంటివద్దనే సంస్కృతాంధ్ర భాషలను అభ్యసించారు. వ్యాకరణ శాస్త్ర గ్రంథాలను, పురాణేతిహాసాల ను పఠించారు. తర్వాత వీరు వరంగల్లులోని విశ్వేశ్వర సంస్కృతాంధ్ర పాఠశాలలో విశారద పట్టా పుచ్చుకున్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఓయల్ పట్టా అందుకున్నారు. వీరు ప్రథమ శ్రేణి తెలుగు పండితునిగా ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి ఉన్నతపాఠశాల ఇబ్రహీంపట్నంలో అడుగిడినారు. 1988లో పదవీ విరమణ పొందేవరకు సిద్దిపేట పరిసర ప్రాం తాల్లో విశేషమైన సేవలందించారు. ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థిగా ఉండాలనే మాటను త్రికరణశుద్ధిగా ఆచరించి చూపి న ఆచార్యుడు వేముగంటి. ఈయనను స్నేహితులు నడిచే కావ్యంగా వ్యవహరించేవారు.1930 నాటికి తెలంగాణ జనజీవనం అస్తవ్యస్తంగా ఉంది. మాతృభాషలో చదువలేని, రాయలేని, మాట్లాడలేని దుస్థితికి కారణమైన నిజాం నిరంకుశత్వ ధోరణితో అట్టుడికిపోతున్న సమయంలో వేముగంటిపై నాటి పరిస్థితులు వారి జీవితంపై ప్రభా వం చూపాయి. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ వేముగంటి తన జీవితాన్ని సాహితీవనంలా శోభిల్లచేశారు. వీరికి చిన్నప్పటినుంచి పద్యంపై మక్కువ ఎక్కువ. పద్యాలు రాస్తూ పెద్దల సహకారంతో ఎప్పటికప్పుడు పద్య రచనలో మెళకువలు నేర్చుకున్న వీరు పద్యరచనలో అందె వేసిన చేయిగా ప్రసిద్ధి పొందా రు. తెలంగాణలో ప్రముఖ పద్యకవిగా పేరొందినవీరు ప్రాచీన, ఆధునిక సాహితీ మార్గాలను సమన్వయపరిచిన సాహిత్యశీలి. గ్రంథాలయోద్యమం పట్ల ఆకర్షితులైన వేముగంటి 194 6లో సిద్ధిపటలో సంస్కృతాంధ్ర గ్రంథాలయాన్ని స్థాపించారు.

వేముగంటి రచనల్లో ఆధ్యాత్మికతతో పాటు ఆత్మీయత, అదేస్థాయిలో సామాజిక రుగ్మతల పట్ల ఆవేశం ద్యోతకమౌతాయి. వేముగంటి వారు 1945 నుంచే కవిత్వం రాశారు. వీరి కవిత తొలిసారిగా మీజాన్ పత్రికలో ప్రచురితమైంది. అలాగే 1948 లో కాకతీయ పత్రికలో కృషీవలా అనే శీర్షిక కింద వీరిపద్యాలు ప్రచురితమయ్యాయి. నాటి నుంచి క్రమంగా గోలకొండ, కృష్ణ పత్రిక, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, స్రవంతి, భారతి, ఆంధ్రభూమి వంటి పత్రికల్లో వీరు రాసి న పద్య, గేయ, వచన రచనలు, పుస్తక సమీక్షలు ప్రచురితమై పలువురి మన్ననలందాయి.  1954లో భారతీయ కవిత అనే ప్రభుత్వ ప్రచురణ కవితా సంకలనంలో నేలతల్లి శీర్షికన రాసి న పద్యాలు హిందీ, గుజరాతి వంటి భాషల్లోకి అనువదించబడి ప్రచురితమయ్యాయి. వేముగంటి వారిని జాతీయకవిగా నిలిపాయి. వీరి రచనా శైలిలో నాణానికి రెండు వైపులన్నట్లు ఒకవైపు భావావేశం మరోవైపు శాంతి సందేశం సమపాళ్ళలో ప్రదర్శితమౌతాయి. 1954 నుంచే వీరి రేడియో ప్రసంగాలు ప్రసారమయ్యాయి.పద్యం, గేయం, గద్యం మూడు ప్రక్రియలో సిద్ధహస్తుడైన వేముగంటి వారికి పద్యమంటే ప్రాణం. ఇదే విషయాన్ని వేముగంటి వారు పసిడిమువ్వలులో అందించిన పసిడి పలుకుల్లో చూద్దాం. నేను పద్య కవిని, పద్యం నాకు ప్రాణం. అయితే ఈనాడు కొందరు పద్యకవితకు కాలం చెల్లిందని అనుచితంగా మాట్లాడుతున్నారు. పద్య కవితపై ద్వేషం చూపిస్తున్నారు. ఇది వారి అజ్ఞానాన్ని తెలుపుతుంది. ఇవ్వాళ్ళ తెలుగు కవితా వాహి ని పద్య గేయ వచన ప్రక్రియా రూపంలో మూడు పాయలుగా ప్రవహిస్తూ ఉన్నది. దూషించవలసిన అవసరం అంతకన్నా లేదు. ఉదాత్త భావ బంధురమైన ప్రతి కవితా ప్రక్రియనూ ఆదరించవలసినదే. ఇది నా నిశ్చితాభిప్రాయం.. అంటూ కుండబద్దలు కొట్టినట్లుగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన తీరు సాహితీ ప్రక్రియల పట్ల గల ఉదాత్త భావనను తెలుపుతుంది.

తెలుగు ప్రాంతాల్లోని ఆధునిక కవులలో పద్యాన్ని హృద్యం గా, రసఝరిలా అందించగలిగిన కవి వరేణ్యులు వేముగంటివారు. వీరు అభ్యుదయ కావ్యాలు, దేశభక్తి రచనలు, చారిత్రక కావ్యాలు, ఖండకావ్యాలు, గేయ కావ్యాలు, పద్యకృతులు, వ్యాస సంకలనం, బాలగేయాలు, వచన కవిత్వం, అష్టకాలు, ప్రబోధాలు, స్తుతి కావ్యాలు, ఏకపాత్రాభినయాలు వంటి వాటి ని విరివిగా అందించిన సాహితీమూర్తి. వివిధ సాహితీ సంస్థల స్థాపకునిగా, సారథిగా వీరందించిన సేవలు మరువలేనివి. సిద్దిపేట ప్రాంతంలో సాహితీచైతన్యాన్ని పాదుగొలిపే సదాశయంతో 1960లో వీరు సాహితీ వికాస మండలి స్థాపించి సిద్దిపేటకు సాహితీక్షేత్రంలో పెద్దపీట వేశారు. ఈ సంస్థ ద్వారా వీరు 50 పుస్తకాల దాకా అచ్చువేశారు. సాహితీ సమావేశాల నిర్వహణ లో ఆయన చొరవ మార్గదర్శకమైనది. 1964లో మెదక్ జిల్లా రచయితల సంఘానికి అధ్యక్షులై వివిధ రకాల సాహిత్య కార్యక్రమాల నిర్వహణలో సవ్యసాచిగా సేవలందించారు. యువ కవులెందరికో ప్రోత్సాహాన్నందించారు. వేముగంటి ఆంధ్ర సారస్వత పరిషత్ సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగా కొనసాగుతున్న సమయంలో మాతృభాషాభిమానిగా వీరు అనన్యమైన భాషా సేవ చేశారు. మెదక్ ప్రాంత కవులెందరికో పుస్తక ముద్రణకై సహకారమందించారు.ఇదే సమయంలో వేముగంటి వారు బెజవాడ గోపాలరెడ్డి, బోయిభీమన్న, దాశరథి, దేవులపల్లి రామానుజరావు, సినారె, పేర్వారం జగన్నాథం, గడియారం రామకృష్ణ వంటి ప్రముఖుల సహచర్యంతో సాహిత్యసేవలో కృతకృత్యులయ్యారు. వీరి రచనలనెన్నింటినో వివిధ విశ్వవిద్యాలయాలు పాఠ్యాంశాలుగా ఎంచుకున్నాయి. వేముగంటివారి తిక్కన కావ్యాన్ని ఉస్మాని యా విశ్వవిద్యాలయం, ఆంధ్రవిష్ణువు చారిత్రక కావ్యాన్ని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, ప్రాచ్య పరీక్షల విభాగం వారు ప్రియదర్శిని కావ్యాన్ని రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు డిగ్రీ స్థాయిలో పాఠ్యాంశంగా పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యలో 8వ తరగతికి మంజీరానాదాలులోని మంజీర గేయఖండికను పాఠ్యాంశంగా, కాంతి వైజయంతి కావ్యా న్ని కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా విశ్వవిద్యాలయం డిగ్రీ ద్వితీ య సంవత్సరానికి పాఠ్యాంశంగాను స్వీకరించారు. వేముగంటివారి బహుముఖీనమైన ప్రజ్ఞ వారికి జాతీయస్థాయిలో గుర్తింపును తెచ్చింది.అంతేకాకుండా వేముగంటి నరసింహాచార్యుల జీవితం రచనలు అనే అంశంపై పరిశోధనకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ పట్టాను, అలాగే కాకతీయ విశ్వవిద్యాలయం వేమగంటి వారి కావ్యాలు అనే అంశంపై పరిశోధనకు ఎం.ఫిల్ పట్టాను ప్రదానం చేశాయి. అయితే వీరి కావ్యాలను విభిన్న కోణాలలో పరిశోధించడం ద్వారా మరెన్నో పరిశోధనా వ్యాసాలు వెలువరించవచ్చు. పరిశోధకులకు వీరి రచనలు పట్టుగొమ్మలు.వేముగంటి వారి కృతులను గురించి ఈ వ్యాసంలో చెప్పడం కొండ అద్దమందు అన్న చందమే అవుతుంది. వీరు రాసిన శ్రీ వెంకటేశ్వర విమత, కవితా కాహళి, బాల గేయాలు, కవితాసింధూరం, శ్రీనివాస సరస్వతీ వైభవం, తెలుగుబాల నీతి, స్తుతి రత్నావళి, నవమాలిక, కిరణ తోరణం, తెలుగు తెలివిడి వంటి రచనలన్నీ వారి వైదుష్యానికి ప్రతిబింబాలుగా నిలిచా యి. వేముగంటివారు 2005 అక్టోబర్ 29న స్వర్గస్థులైనారు.వేముగంటి ప్రాచీన అర్వాచీనాలకు వారధి. ఆయన రచనలపై జాతీయోద్యమ ప్రభావం, దేశభక్తి, స్మృతి కావ్యాలు, ఆధ్యాత్మిక రచనలన్నింటిలో ప్రాచీన, ఆధునిక కవుల ప్రభావం సమపాళ్ళలలో ఉన్నది. సాహితీ సేవయే జీవిత లక్ష్యంగా భావించి వృత్తి ప్రవృత్తుల సమన్వయంతో ఆధునిక తెలుగు సరస్వతిని  సుసంపన్నం చేశారు ఆయన. సాహిత్యంలో సత్యాన్వేషణ చేయగలిగిన శీలసంపన్నుడు వేముగంటివారు. తెలంగాణ వైతాళికుల్లో ఒకరైన వేముగంటి నర్సింహాచార్యుల వారు మన కు పద్యకంఠీరవుడు వేముగంటిగా ప్రసిద్ధిపొందారు.

- డాక్టర్ నమిలికొండ సునీత, 99084 68171


logo