గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Feb 03, 2020 , T00:10

కత్తెర

కత్తెర

సగం ఉడికిన అన్నంగిన్నె కింద పెట్టిన

మంట ముసురుతుంటె

వెంట వెంట వెటకారాలు కసిరినట్టు

ఆకలి కడుపునకు గిద్దెడు నూకలు కథల్లా

కర్త, కర్మ, క్రియలు సిరిధమనుల

పరుగుపందేరపు ఛాయన పేద ధనిక తారతమ్యాల

నడుమనో, మంచి చెడుల మధ్యన్నో

కత్తెరపాలైన ఒకానొక వ్యథాభావన..!

కత్తెర గురించి ఏమి చెబుతుంది కథగా

కత్తెరక్కూడా కొన్ని పీఠాలుంటాయి

కత్తెరక్కూడా కొన్ని వర్గాలుంటాయి

కత్తెరక్కూడా కొన్ని కోతలుంటాయి

మాటను నడవనీయక మాటు వేసే కత్తెరలు

విద్వేషాలను కత్తిరించలేని కత్తెరలు

కత్తెర కత్తెరకూ చిరునామాలూ, చిత్తరువులూ, ఛిద్రిత రూపులు!!

బతుకు జీవులు కొందరికి కత్తెర జీవులాట

అంగిలాగులటువంటి ఆహార్యాలు గుట్టే తిండి దేవులాట

బొడ్డుబోసి పిల్లను దీయాలన్నా, బొక్కల నతికించాలన్నా

కత్తెరలేనిదే పని జరగదన్నది చాకచక్యపు చక్రగతి

ఋతురాగాల అతివేడికి కత్తెరకార్తెగానూ పేరుబడ్డది

పెండ్లి ముహూర్తాలకూ కత్తెర్లుగా అడ్డుపడునట

ఆరేండ్ల బుడతలకూ ఆర్ట్ క్లాస్ టూల్, అల్గారిథమ్‌టూల్

కత్తెర చిక్కుల ప్రపంచం నీడన దాగిన కలికాలపు పనిముట్టు

కలాలనూ, కులాలనూ విడగొట్ట కొత్త అవతారమెత్తె

ఎత్తుకు ఎగదోయ, పల్లానికి పడదోయ అవసరమున్నంత!

ఆమోదపత్రాల్లో మొదటి అక్షరం తనది చేసుకొనే ఎడిటింగ్!

చలన చిత్రవిచాత్రాలకు ఏ సర్టిఫికెట్ మాయాజాలం!

ఇహ పరాల మాటలెందుకు గాని, అశ్లీల అసత్య అసహ్య

దృశ్యాలకు తెరదీసే కత్తెర-ఏవో ఖరిదైన వజ్రాలు పొదిగిందేమో!

దీని  పేరు చెప్తూ చేసే ఆకార, నిరాకార చర్యల కోసం

మాటవరుసకు మాటమాటకు మరోరూపు కత్తెర-కత్తెరే!

- కొండపల్లి నీహారిణి, 98663 60082


logo