గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Feb 01, 2020 , 23:14:26

లౌకికశక్తులు ఏకం కావాలె

లౌకికశక్తులు ఏకం కావాలె

ఒక వ్యక్తి ప్రేరణతో గాడ్సే ద్వేషం పెంచుకొని గాంధీని చంపాడు. ఇప్పుడు లక్షలాది గాడ్సేలు తయారయ్యారు. స్కూల్లో చదువుకోవలసిన గోపాల్‌ అనే 17 ఏండ్ల విద్యార్థి తుపాకి పట్టుకొని ఢిల్లీలో ప్రదర్శనకారులపై కాల్పులు జరిపాడు. హిందూ మతం ప్రమాదం లో పడింది అనే భయాన్ని దేశవ్యాప్తంగా కలిగించి అమాయక యువకులను హింసకు ప్రేరేపిస్తున్నారు. గో రక్షకదళాలు మతం పేరిట సాటి మనుషులను చంపుతుంటే విలేఖరులు వార్తలు రాయడానికి, పోలీసులు కేసులు పెట్టడానికి భయపడుతున్నారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ భారత ప్రభు త్వం కశ్మీర్‌లో అమలు చేస్తు న్న నిర్బంధకాండను ప్రశ్నిస్తూ చార్లెస్‌ డికె న్స్‌ రాసిన ‘ఎ టేల్‌ ఆఫ్‌ టు సిటీస్‌' గ్రం థాన్ని ఉటంకిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. న్యాయమూర్తి సూచనలను సలహాలను గౌరవించే మర్యాద మోదీ ప్రభుత్వానికి లేదన్నాడు. ఆ గ్రంథంలో పేర్కొన్నట్లు 17వ శతాబ్దంలో ఫ్రాన్స్‌ దేశంలో మతవాదుల ఆధిపత్యాన్ని ప్రస్తుత భారతదేశ పరిస్థితి గుర్తుకుతెస్తున్నది. 


1775లో క్రైస్తవ మత ప్రచారకులు అడవిగుండా వర్షంలో పోతున్నప్పుడు 60 అడుగుల దూరంలో ఉన్న ఒక యువకుడు నేలంతా బురదగా ఉన్న కారణంగా మోకాళ్ళపై వంగి వారికి గౌరవంగా నమస్కరించలేదు. అందుకు కోపగించిన మత ప్రచారకులు అతని రెండు చేతులను నరికి, నాలుకను చీల్చి సజీవదహనం చేశారు. క్రైస్తవ మత ప్రచారకుల ప్రభావం నుంచి బయటపడి లౌకిక ప్రజాస్వామ్యదేశంగా పరిణామం చెందడానికి ఫ్రాన్స్‌ సుదీర్ఘ ప్రయాణం చేసింది. మధ్యయుగాల మతవాద ఆధిపత్యంలోకి పోయే అవకాశం లేని వ్యవస్థలు, పరిస్థితులు ఫ్రాన్స్‌లో నెలకొన్నాయి. 


ఇందుకు విరుద్ధంగా భౌగోళికంగా కీలక ప్రాంతంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌ శాంతికాముక దేశం నుంచి ఉగ్రవాదదేశంగా పరిణామం చెందింది. క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలో ప్రపంచంలోని బౌద్ధమత బోధకులు, శాస్త్రవేత్తలు వివిధ శాస్ర్తాలు చర్చించుకునే విజ్ఞానకేంద్రంగా ఆఫ్ఘనిస్థాన్‌ ఉండేది. అమెరికా జోక్యంతో తాలిబాన్‌ పరిపాలనలోకి వెళ్లి శ్మశాన వాటికగా మారింది. ఫ్రాన్స్‌ మతవాదుల ప్రాబల్యం నుంచి బయటపడి అద్భుతమైన ప్రగతి సాధిస్తే, మతవాదుల కౌగిలిలోకి వెళ్ళిన అఫ్ఘనిస్థాన్‌ పేదరికంలోకి నెట్టివేయబడి అంతర్యుద్ధంలో చిక్కుకున్నది. 


ఈ రెండు దేశాలు ప్రపంచానికి విరుద్ధమైన అనుభవాలను ఇచ్చాయి. నాగరిక ప్రభుత్వాలు ఫ్రాన్స్‌ దారిలో అనాగరిక ప్రభుత్వాలు ఆఫ్ఘనిస్థాన్‌ దారిలో వెళ్తాయి. అద్వాని, మన్మోహన్‌సింగ్‌, ఐ.కె.గుజ్రాల్‌ పాకిస్థాన్‌ నుంచి వచ్చినప్పుడు పౌరసత్వం ఇచ్చిన చట్టాల్లో లోపం ఉంటే సవరించుకోవచ్చు. పౌరసత్వ కాలపరిమితిని పన్నేండ్ల నుంచి ఐదేండ్లకు తగ్గించడం వల్ల ఎవరికీ అభ్యంతరం ఉండదు. పొరుగు దేశాలలో మైనారిటీ ప్రజలు హింసకు గురవుతున్నారని భారత ప్రభుత్వం భావిస్తే మత ప్రస్తావన లేని ప్రస్తుత చట్టం ద్వారా కూడా ఇత ర దేశాల్లో వలె మైనారిటీ ప్రజలను ఆదుకోవచ్చు. 


ప్రత్యేకంగా హిందూ, సిక్కు, క్రైస్తవ, జైన మతాలని పేర్కొనవలసిన అవసరం లేదు. పౌరసత్వం ఇచ్చే న్యాయస్థానాలు కూడా సరైన మత వివక్షను నిరూపించే పత్రాల ఆధారంగానే పౌరసత్వం ఇస్తాయి. ప్రత్యేకంగా ఒక మతాన్ని వేరుచేసి చూపించే ప్రయ త్నం రాజకీయ ప్రయోజనాల కోసం మతాల మధ్య ఘర్షణ సృష్టించే ఎత్తుగడగా కనిపిస్తున్నది. నిబద్ధతగా కాందిశీకులకు ప్రయోజనం కలిగించాలని ఉంటే విద్య, ఉద్యోగ, గృహవసతి అవకాశాలను కల్పించి త్వరితగతిన పౌరసత్వం ఇచ్చే ఏర్పాటు చేయవచ్చు. కానీ వారి అసౌకర్యాలను ఉపయోగించుకునే క్షుద్ర రాజకీయమే అభ్యంతరకరం.


పౌరసత్వ చట్టం వల్ల భారతీయ ముస్లింలకు ఎలాంటి హాని కలుగదు కాబట్టి ఆందోళన చెందవలసిన అవసరం లేదని మోదీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. అంకెలను విభజించినట్లుగా సమాజాన్ని విభజించ వీలుకాదనే సత్యాన్ని ఇంకా మోదీ, షాలు గ్రహించినట్టుగా లేదు. ముస్లిమేతరులు ప్రయోజనం పొందుతున్నారు కాబట్టి మతాల వారీగా అందరి మద్దతు లభిస్తుందని ఆశించిన ప్రభుత్వానికి ప్రజల నిరసనలను చూసిన తర్వాత దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. క్రైస్తవులు సిక్కులు మద్దతు ఇస్తారని ఆశించిన ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది. పంజాబ్‌ అసెంబ్లీ ఈ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసింది.


ఒక మతస్తులను హింసకు గురిచేయడం ఆ దేశ అంతర్గత వ్యవహారం కాదు, తప్పనిసరిగా అంతర్జాతీయ సమాజం ప్రతిస్పందిస్తుంది. పౌరసత్వ చట్టం వచ్చిన తర్వాత భారతీయులు విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికాలోని భారతీయులు లాటిన్‌ అమెరికా లేదా యూరప్‌ వెళ్లి నప్పుడు ఆ దేశ ప్రజలు ట్రంప్‌ లాంటి వ్యక్తిని మీరు ఎలా అధ్యక్షునిగా ఎన్నుకున్నారని ప్రశ్నిం చేవారు. ఈ చట్టం పుణ్యమాని మోదీ ట్రంప్‌ గురించి ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు హిట్లర్‌ ఉపయోగించిన స్వస్తిక్‌ గుర్తుకు భారతీయ మూలాల గురించి ప్రశ్నిస్తున్నారు. మోదీ పెట్టిన చిచ్చు ప్రవాస భారతీయులకు ఇబ్బందిగా మారింది.


ప్రజలు మతపరమైన ఆంక్షలను ప్రభుత్వం నుంచి ఎదుర్కొన్నప్పుడు ప్రజాస్వామ్య దేశాలు ఆశ్రయం ఇస్తాయి. ఉగాండా లో ఈది అమీన్‌ నుంచి హింస ఎదుర్కొన్నప్పుడు క్రైస్తవ దేశాలైన అమెరికా, యూరప్‌ దేశాలు భారతీయులను మతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఆశ్రయం ఇచ్చాయి. సిరియాలో సం క్షోభం వచ్చినప్పుడు 16 లక్షల ముస్లిం మతస్తులకు జర్మనీ ఆశ్ర యం ఇచ్చింది. భారతదేశ క్రైస్తవులే గాక క్రైస్తవ దేశాలు కూడా భారతదేశ చట్టం పట్ల తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. 453 బిలియన్‌ డాలర్ల నిధి కలిగిన లెగ్‌ మేసన్‌ కంపెనీ భారతదేశం పెట్టుబడికి సరైన ప్రదేశం కాదని పెట్టుబడిని చైనా మలేషియా దేశాలకు తరలిస్తున్నది. 


ప్రముఖ దాత, ఒబామాను అధ్యక్షునిగా చేయడంలో ప్రధాన పాత్ర వహించిన జార్జ్‌ సోర్స్‌ మోదీ ప్రభుత్వం భారతదేశాన్ని మతమౌఢ్యం వైపు తీసుకెళ్తుందని విమర్శించాడు. పెద్ద కంపెనీలకు వివిధ దేశాల ఆర్థిక సమాజిక పరిస్థితులను అధ్యయనం చేసే సంస్థలుంటాయి. ఆ సంస్థ లు ఇటీవల మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ భారతదేశా న్ని అస్థిరతకు గురిచేసే అవకాశాలున్నాయనే అభిప్రాయానికి వస్తున్నాయి. డెమొక్రాటిక్‌ పార్టీ అగ్రనాయకత్వం అంతర్గత సమావేశాల్లో ట్రంప్‌ను విమర్శించిన ప్రతిసారి మోదీ పేరు ప్రస్తావిస్తున్నారు. ఈ ఆరేండ్లలో దేశానికి జరిగిన ఏకైక మేలు ఏమిటంటే మోదీపై ఉన్న అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలను సడలించడం మాత్రమే.


మోదీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం భారతదేశాన్ని ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌ దేశాల దారిలో మతవాదం వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నది. ఉర్దూ కవి మగ్దూం మొయినొద్దీన్‌ రజాకార్ల చర్యలను నిరసిస్తూ ‘తలల్లోన మతమౌఢ్యపు దాస్యం నర్తించెనే’ అని ఆవేదన చెందాడు. ప్రభుత్వ చర్యలు హిందూ రజాకార్లను తయారుచేస్తున్నాయి. ఒక వ్యక్తి ప్రేరణతో గాడ్సే ద్వేషం పెంచుకొని గాంధీని చంపాడు. ఇప్పుడు లక్షలాది గాడ్సేలు తయారయ్యారు. స్కూల్లో చదువుకోవలసిన గోపాల్‌ అనే 17 ఏండ్ల విద్యార్థి తుపాకి పట్టుకొని ఢిల్లీలో ప్రదర్శనకారులపై కాల్పులు జరిపాడు. హిందూమతం ప్రమాదంలో పడింది అనే భయాన్ని దేశవ్యాప్తంగా కలిగించి అమాయక యువకులను హింసకు ప్రేరేపిస్తున్నారు.


గో రక్షకదళాలు మతం పేరిట సాటి మనుషులను చంపుతుంటే విలేకరులు వార్తలు రాయడానికి, పోలీసులు కేసులు పెట్టడానికి భయపడుతున్నారు. దేశం ముందున్న ప్రధాన సమస్య ఏమిటంటే మధ్యయుగాల నాటి మతవాద వ్యవస్థ కావాలా లేక ఆధునిక ప్రజాస్వామ్య లౌకిక వ్యవస్థ కావాలా? ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీని ఓడించడంలో విజయం సాధిస్తున్న కేసీఆర్‌ భారతదేశ సమైక్యతకు, సహన శీలతకు, లౌకిక సంస్కృతి పరిరక్షణకు తీసుకుంటున్న చొరవ అభినందనీయం. దేశవ్యాప్తంగా అసంఘటితమైన లౌకికశక్తు లు ఒక వేదికపైకి రావలసిన ఆవశ్యకత ఉన్నది. దేశాన్ని మత ప్రాతిపదికన ముక్కలు చేసి అయినా అధికారం చెలాయించాలని ప్రయత్నించే వారిని నిలువరించాలి.


(వ్యాసకర్త: సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు, వాషింగ్టన్‌ డీసీ)


logo