మంగళవారం 31 మార్చి 2020
Editorial - Feb 01, 2020 , 00:24:08

ప్రమాదకర పథకం

ప్రమాదకర పథకం

ఆస్ట్రేలియా మొదలుకొని యూరప్‌ వరకు అన్ని ప్రాంతాలలోని మిత్రదేశాలు ట్రంప్‌ విధానాల పట్ల అసహనం ప్రదర్శిస్తున్నాయి. ఇక తన ప్రత్యర్థిని ఇరుకునపెట్టేందుకు ఉక్రేన్‌ అధ్యక్షుడితో జరిపిన సంభాషణ ఆయనను నైతికంగా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో తాను పాలస్తీనా సమస్య పరిష్కారానికి పూనుకున్నట్టు కనిపించాలని ఈ పథకాన్ని ముందుకుతెచ్చారు. మరోవైపు ఇజ్రాయెల్‌ ప్రధాని నేతాన్యహు గత రెండు ఎన్నికలలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన బలం సాధించలేకపోయారు. దీనికితోడు అవినీతి ఆరోపణల్లో పీకల్లోతు కూరుకుపోయారు.

పశ్చిమాసియా శాంతి పథకం పేరిట అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రతిపాదన పాలస్తీనాకు న్యాయం చేయకపోగా, ఇజ్రాయెల్‌ దురాక్రమణను మరింత స్థిరపరిచేదిగా ఉండటం ఆశ్చర్యకరం. దీనిని శాంతి పథకం అనే కంటే ఇజ్రాయెల్‌కు మద్దతు పథకం అనడం సబబుగా ఉంటుంది. పాలస్తీనా సమస్య ఎంతో కాలంగా రగులుతున్నది. ఇజ్రాయెల్‌, పాలస్తీనా వర్గాలకు ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్‌ వాదనలన్నిటికీ మద్దతు ఇస్తూ పాలస్తీనా వారు అంగీకరించాలని కోరడం బెదిరింపులకు పాల్పడటమే అవుతుంది. అమెరికా- ఇజ్రాయెల్‌ సంఘటన బలమైనది కావడం, పాలస్తీనా పోరాటానికి మద్దతు ఇచ్చే దేశాలు బలమైనవి లేకపోవడం వల్ల ఇరు పక్షాల మధ్య అసమపోరు సాగుతున్నది. 


పాలస్తీనా బలహీనపక్షం అయినంత మాత్రాన తమ ఆధిపత్యాన్ని ఏకపక్షంగా రుద్దడం అంతర్జాతీయ సూత్రాలకు విరుద్ధం, నీతి బాహ్యం. ట్రంప్‌ శాంతి పథకాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆయన పక్కనే ఇజ్రాయెల్‌ ప్రధాని నేతాన్యహు కూడా ఉన్నారు. ఈ పథకాన్ని ప్రకటించే ముందు పాలస్తీనా వర్గాల ఆమోదం కూడా పొందలేదు. ట్రంప్‌ ఇటీవల జెరూసలేంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తించినప్పుడే పాలస్తీనా వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అమెరికా మధ్యవర్తిత్వం నెరిపే పరిస్థితి లేకుండాపోయింది. అందువల్ల పాలస్తీనా వర్గాలు అమెరికా చర్చల్లో పాల్గొనే సూచనలు కూడా లేవు. ఈ నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్‌ నాయకులు శాంతి పథకం పేర తమ అనుకూల పథకాన్ని ప్రకటించడం వల్ల ఫలితం ఏమీ ఉండదు. దీనివల్ల పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలున్నాయి.


ప్రపంచంలోని మూడు ప్రధాన మతాలకు అత్యంత పవిత్రమైనదిగా గుర్తింపు పొందిన జెరూసలేంపై వివాదం జటిలమైనది. పాలస్తీనా వాదనను పక్కకు పెట్టి ఈ నగరాన్ని ఇజ్రాయెల్‌కు ఇవ్వాలనేది ట్రంప్‌ పథకంలో ప్రధానాంశం. అంతర్జాతీయ నియమాలకు విరుద్ధంగా ఇజ్రాయెల్‌ ఎంతో కాలంగా వెస్ట్‌బ్యాంక్‌లో యూదులను స్థిరపరుస్తున్నది. ఇప్పటివరకు అరువై వేల మంది యూదులను అక్కడ స్థిరపరిచిందని అంచనా. ఈ యూదు ఆవాసాలకు అంతర్జాతీయ ఆమో దం లేదు. ట్రంప్‌ పథకం ప్రకారం ఈ స్థిరపరిచి న ప్రాంతాలు ఇజ్రాయెల్‌ సార్వభౌమత్వంలోకి పోతాయి. 


వెస్ట్‌బ్యాంక్‌లోని దాదాపు మూడోవం తు ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌కు అప్పగించినట్టవుతుంది. జోర్డాన్‌ లోయ ప్రాంతం కూడా అధికారికంగా ఇజ్రాయెల్‌కు దత్తమవుతుంది. కాందీశీకులుగా ఉన్న పాలస్తీనా వారు తిరిగిరావడానికి అవకాశం లేదు. ట్రంప్‌ పథకం ఇజ్రాయెల్‌కు వాదనలను ఆమోదించడంతో పాటు, పాలస్తీనా వారిపై అవమానకర షరతులు విధిస్తున్నది. ఇక ముందు అంతర్జాతీయ వేదికలపై ఇజ్రాయెల్‌ ఆక్రమణలను లేవనెత్తవద్దు. ఇజ్రాయెల్‌పై పోరా టం సాగిస్తున్న హమాస్‌ వంటి మిలిటెంట్‌ సంస్థలను అణిచివేసే బాధ్యత పాలస్తీనా నాయకత్వంపైనే ఉంటుంది. ట్రంప్‌ పథకం మూలంగా రెం డుపక్షాలూ కనీసం చర్చించే స్థాయి కూడా లేకుండాపోయింది. అరబ్బుల పక్షం బలహీనంగా ఉన్నంతమాత్రాన ఇంత అవమానకర షరతులు పెట్టడం ప్రమాదకరమని చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుంది. మొదటి ప్రపంచయుద్ధంలో ఓడిపోయిన తర్వాత జర్మనీ పై పెట్టిన షరతులు వారిని తీవ్ర అవమానానికి గురిచేయడం వల్ల హిట్లర్‌ అవతరణకు దారితీసింది. పశ్చిమాసియా ఇప్పటికే అనేక పోరాటాలతో అట్టుడికిపోతున్నది. అమెరికా పెద్దరికం వహించదలిస్తే శాంతి స్థాపించే మార్గాలను అన్వేషించాలే కానీ, ఇటువంటి అవమానకర ప్రతిపాదనలు ముందుకు తేవడం తగదు.


ఈ శాంతి పథకం కొత్తగా సాధించేది ఏమీ లేనప్పుడు దీనిని ఎందుకు ముందుకుతెచ్చారనేది ఆసక్తిదాయకం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని నేతాన్యహు ఇరువురూ రాజకీయంగా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ట్రంప్‌ అభిశంసనపై సాగుతున్న విచారణ మూలంగా ఆయన ప్రతిష్ఠ పూర్తిగా దిగజారిపోయింది. దేశీయంగా, అంతర్జాతీయంగా ఆయన విధానాలు వ్యతిరేక ఫలితాలను ఇచ్చాయి. చైనాతో వాణిజ్య కలహం తనకు గట్టి నాయకుడిగా పేరు తెచ్చిపెడుతుందని ఆయన భావించారు. కానీ ఈ కలహం ముదిరితే రెండు దేశాలకూ నష్టదాయకమనే అభిప్రాయం వ్యాపారవర్గాలలో వ్యక్తమవుతున్నది. ఆఫ్ఘనిస్థాన్‌, ఉత్తరకొరియా వంటి ఏ సమస్యనూ పరిష్కరించలేకపోయారు. దీంతోపాటు ఆస్ట్రేలియా మొదలుకొని యూరప్‌ వరకు అన్ని ప్రాంతాలలోని మిత్రదేశాలు ట్రంప్‌ విధానాల పట్ల అసహనం ప్రదర్శిస్తున్నాయి. 


ఇక తన ప్రత్యర్థిని ఇరుకునపెట్టేందుకు ఉక్రేన్‌ అధ్యక్షుడితో జరిపిన సంభాషణ ఆయనను నైతికంగా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో తాను పాలస్తీనా సమస్య పరిష్కారానికి పూనుకున్నట్టు కనిపించాలని ఈ పథకాన్ని ముందుకుతెచ్చారు. మరోవైపు ఇజ్రాయెల్‌ ప్రధాని నేతాన్యహు గత రెండు ఎన్నికలలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన బలం సాధించలేకపోయారు. దీనికితోడు అవినీతి ఆరోపణల్లో పీకల్లోతు కూరుకుపోయారు. దీంతో ఇజ్రాయెల్‌లోని జాత్యహంకార వర్గానికి తాను ఏదో సాధించినట్టు కనిపించాలని తాపత్రయపడుతున్నారు. ఈ ప్రయత్నాల ద్వారా వీరు తమ దేశాల్లోని అతివాద వర్గాలను కొంత సంతృప్తిపరుచవచ్చు. కానీ పాలస్తీనా సమస్య పరిష్కారమూ కాదు. సామా న్య జనాన్ని మెప్పించడం కూడా అనుమానమే. 


logo
>>>>>>