ఆదివారం 29 మార్చి 2020
Editorial - Feb 01, 2020 , 00:24:18

ఇది గాంధీ శకం

ఇది గాంధీ శకం

వివేకానందుడు ఆధ్యాత్మిక, హైందవధర్మ ప్రచార రంగాలలో మహోన్నత శిఖరాలు అధిరోహించినప్పటికీ మానవ సేవలో మాధవుని దర్శించారు. గాంధీజీ ఆధ్యాత్మిక జ్ఞానసంపదను ఆర్జించినప్పటికీ సామాజిక, రాజకీయరంగాలపై దృష్టిని, నిష్టను కేంద్రీకరించి మతాలకు, కులాలకు, ఇతర సంకుచిత వైరుధ్యాలకు అతీతంగా మానవాళి విముక్తి కోసం, మానవ హక్కుల కోసం అపూర్వ, శాంతియుత, అహింసా ఉద్యమాలను,సత్యాగ్రహ సమరాన్ని నిర్వహించి తరతరాలకు మార్గదర్శలైనారు.

యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత! అభ్యుద్ధానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌, పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతామ్‌ ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే!... గీతాచార్యుని ఈ పలుకులు, ప్రకటన అక్షరాల నిజమై, మహిమాన్విత ఆకృతి ధరించి ధర్మ సంస్థాపనకు, అధర్మాన్ని అంతం చేయడానికి భారత భూమిపై ఒకరు కాదు, ఇద్దరు మహనీయులు దాదాపుగా ఒకే సమయాన జన్మించడం విశేషం. ఇద్దరిలో ఒకరు తూర్పున ఉదయించిన సూర్యుడు-వివేకానందుడు. మరొకరు పశ్చిమాన పరిమళించిన చంద్రుడు-గాంధీ మహాత్ము డు. 


ఒకే సమయాన ఇద్దరు మహా పురుషులు ధర్మ సంస్థాపనార్థం పుణ్యభూమి భారతావనిలో అవతరించారంటే ఈ దేశం, ఈ ప్రపంచం పాపా ల పెంటకుప్పలై, అధర్మం విషపు కోరల నుంచి భారత ప్రజలకు, సకల మానవాళికి విముక్తి ప్రసాదించి ధర్మ రక్షణ చేయవలసిన సత్వర అవస రం ఏర్పడిందనుకోవాలె. ఇద్దరూ మనిషికి మనిషికి మధ్య వైషమ్యాల ను తొలిగించి, మతం పేరుతో సృష్టిస్తున్న విభేదాలను, మాలిన్యాన్ని దూరం చేసి సకల మానవాళి శ్రేయస్సు కోసం కంకణధారణ చేసిన విశ్వమానవులు, సకల మానవ శ్రేయోభిలాషులు. ఆధునిక ప్రపంచానికి అం కురార్పణ జరుగుతున్న కీలక దశలో, 19వ శతాబ్దం చివరి భాగంలో, ఒకే దశాబ్దంలో ఇద్దరు సంభవించారు. వివేకానందుడు 1863 జనవరి 12 మకర సంక్రాంతి శుభవేళ కలకత్తాలో ఒక సంప్రదాయ కుటుంబం లో జన్మించారు; గాంధీజీ-మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ ఆరేండ్ల అనంతరం 1869, అక్టోబర్‌ 2న పోర్‌బందర్‌లో (కథియావార్‌-గుజరాత్‌) జన్మించారు.


ఈ ఇద్దరు మహానుభావుల మార్గాలు వేరైనా లక్ష్యం, పరమావధి ఒక్కటే. ఇద్దరు సకల మానవాళి సంక్షేమం, వికాసం, తారతమ్యాలు లేని సమానత్వం కోసం పరితపించిన, ప్రబోధించిన, తమ అమూల్య జీవితాలను, సర్వశక్తులను అంకితం కావించి కఠోర తపస్సు జరిపిన మహర్షులు. వివేకానందుడు ఆధ్యాత్మిక, హైందవధర్మ ప్రచార రంగాల లో మహోన్నత శిఖరాలు అధిరోహించినప్పటికీ మానవ సేవలో మాధవుని దర్శించారు. గాంధీజీ ఆధ్యాత్మిక జ్ఞానసంపదను ఆర్జించినప్పటికీ సామాజిక, రాజకీయరంగాలపై దృష్టిని, నిష్టను కేంద్రీకరించి మతాలకు, కులాలకు, ఇతర సంకుచిత వైరుధ్యాలకు అతీతంగా మానవాళి విముక్తి కోసం, మానవ హక్కుల కోసం అపూర్వ, శాంతియుత, అహింసా ఉద్యమాలను, సత్యాగ్రహ సమరాన్ని నిర్వహించి తరతరాలకు మార్గదర్శలై నారు. గాంధీజీ అస్పృశ్యతను అది ఏ రూపంలో ఉన్నప్పటికీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవ్వాళ్టి మతపరమైన అస్పృశ్యతను కూడా ఆయన వ్యతిరేకించారు. 


సకల మత ధర్మ సమానత్వాన్ని, వైశిష్ట్యాన్ని చాటడాని కి 1893లో వివేకానందుడు అమెరికా (యూఎస్‌ఏ)లో మొదట (షికా గో నగరంలో సకల మత సమ్మేళనంలో అద్భుతంగా ప్రసంగించిన పిద ప), తర్వాత ఇతర దేశాల్లో చరిత్రాత్మక పర్యటనలు జరిపారు; అది ఆయన అధ్యాత్మిక జైత్రయాత్ర అని చెప్పవచ్చు. మతాలు, ఇతర కృత్రి మ విభేదాలకు అతీతంగా మానవులందరు ఒక్కటే అన్న ఉత్కృష్ట భావనతో మానవహక్కులు, మానవుల ప్రాథమిక హక్కులు, పౌరహక్కుల కోసం దృఢంగా నిలిచి అపూర్వరీతిలో సత్యాగ్రహ పోరాటాలు జరుపడానికి 1893లోనే గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్లారన్పిస్తుంది. దక్షిణాఫ్రికాలోని బ్రిటిష్‌ పాలకులు అక్కడి నల్లజాతి ప్రజల, అక్కడికి వెళ్లి స్థిరపడిన భారతీయుల పౌర హక్కులను, మానవ హక్కులను హరించడానికి చేసి న చట్టాలను, శాసనాలను, జారీచేసిన ఆదేశాలను గాంధీజీ తీవ్రంగా ప్రతిఘటించారు. 


1893 జూన్‌లో దక్షిణాఫ్రికాకు అబ్దుల్లా కంపెనీ పక్షాన ఒక న్యాయవాదిగా వెళ్లిన (రాజకీయ ఉద్యమాల్లో ఎటువంటి ఆసక్తి లేకుండా) గాంధీజీ దర్బాన్‌ నుంచి ప్రెటోరియా వెళ్తూ జాతి వివక్షకు, విపరీత విద్వేషానికి, అమానుష హింసాకృత్యానికి, అసమానతా అక్రమాలకు గురై ఒక చలిరాత్రి,  మానవహక్కుల కోసం ఉద్యమించడానికి కంకణధారణ చేశారు. దక్షిణాఫ్రికాలో గాంధీజీ ప్రారంభించిన సత్యాగ్ర హ ఉద్యమం 1918లో (చంపారన్‌ రైతుల హక్కుల పోరాటంతో) భారతదేశానికి విస్తరించి భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్య్రాలకు దోహదపడింది. వివేకానందుడు, గాంధీ మహాత్ముడు సంకుచిత ధోరణులకు భిన్నంగా, సకల మానవాళి ఒక కుటుంబం అన్న విశాల, ఉదాత్త దృష్టితో నాడు కావించిన బోధనలు నేటి సంక్షుభిత భారతదేశంలో ప్రాధాన్యం వహిస్తున్నాయి. వివేకానందుని, గాంధీ మహాత్ముని ఆలోచనలకు, సదాశయాలకు, సంకల్పాలకు, బోధనలకు భిన్నంగా సమకాలిక స్వతంత్ర భారతం ముక్క చెక్కలయ్యే ప్రమాదం కన్పిస్తున్నది. ఈ ప్రమాదాన్ని ఎన్నడైనా నివారించి, విచ్ఛిన్నకరశక్తుల విజృంభణను అరికట్టి, దేశానికి సరైన మార్గం చూపించగలిగినవి గాంధీజీ బోధనలే-ఆయన ఆశయా లు, ఆదర్శాలే.


గాంధేయ మార్గమే భారతదేశం తిరిగి తన గౌరవ ప్రతిష్టలను, విశ్వసనీయతను పొందడానికి దోహదపడగలుగుతుంది. గాంధేయమార్గానికి, గాంధీజీ సిద్ధాంతాలకు, విధానాలకు ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌, మార్టిన్‌ లూథర్‌కింగ్‌ (జూనియర్‌), దలైలామా, ఆంగ్‌సాంగ్‌సూకీ, బరాక్‌ హుసేన్‌ ఒబామా ప్రతినిధులుగా నిలిచి, ప్రతీకలై గాంధేయత సజీవమైనదని చాటగలిగినారు. ఈరోజు తిరిగి విదేశీయులే గాంధేయతకు ప్రతినిధులుగా నిలిచితే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. 


విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగోర్‌ నాడే గాంధీజీని ‘మహాత్ముడు’ అని సంబోధించారు. విశ్వవిఖ్యాత విదుషీమణి, కవయిత్రి, స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజనీనాయుడు ఆనాడే గాంధీజీని ‘జాతిపిత’ అని గౌరవించారు. జాతిపిత, మహాత్ముడు గాంధీజీ ప్రాణాన్ని బలిగొన్న దుష్టశక్తులు ఆయన సిద్ధాంతాలను, బోధనలను అంతమొందించలేవని ఇటీవలి దేశచరిత్ర, ఇటీవలి పరిణామాలు స్పష్టం చేశాయి. 72 ఏండ్ల కింద ట మొన్నటిరోజున (జనవరి 30న) గాంధీ మహాత్ముడి అమూల్య ప్రాణా న్ని పిస్టల్‌ పేల్చి హరించిన హంతకుడిని ఆరాధిస్తున్న అసాంఘిక, అమానుష, అరాచకశక్తులు విశృంఖలంగా విహరించగలుగుతున్న రోజులివి. 72 ఏండ్ల కిందట గాంధీజీ హత్య వార్త తెలిసినప్పుడు నిజామాబాద్‌ జైలులో నిర్బంధం అనుభవిస్తున్న తెలంగాణ మహాకవి దాశరథి అశ్రుభరిత వాక్యాలివి-‘హిమగిరి శిఖాముఖాన వెల్గించినావు దివ్యదీపాంకురము... నలుబది కోట్ల భారత జనమ్ముల వందల యేండ్ల బంధనమ్ము లు సడలించినావు... 


మతముల గుద్దులాటలను మాన్పు ప్రతిజ్ఞలతో ప్రజా సమేతుకమై ప్రాణమొడ్డిన మహాత్ముడవీవు... చేతులారగ నీవు పెంచిన స్వతంత్ర నాగవల్లికయే విషనాగమె్యు, నీ గళము చుట్టి ప్రాణా లు లాగివేసె, భారతీయుల గౌరవ ప్రతిభమాసె...’ గాంధీ మహాత్ముని హత్యతో ఆయన సిద్ధాంతాలకు కూడా కాలం చెల్లిందని గంతులేస్తున్న మతోన్మాదశక్తుల భ్రమలు పటాపంచలయ్యే పరిణామాలు ఇటీవల దేశమంతటా సంభవించి ప్రజాస్వామ్య, మతాతీతశక్తులకు నూతన ఉత్సా హం కలిగించాయి. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త, మహామేధావి ఐన్‌స్టీన్‌ 72 ఏండ్ల కిందట గాంధీజీ హత్య వార్త విన్నప్పుడు అన్న మాటలివి.. Generations to come may scarce believe that such a one as this in flesh and blood walked upon this earth... గాంధీజీ వంటి ఒక మహాత్ముడు ఈ ధరిత్రిపై నడిచాడని రానున్నతరాల వారు విశ్వసించలేరని ఐన్‌స్టీన్‌ అన్నాడు. 


కానీ, అనంతర తరాలవారు, భవిష్యత్‌ తరాల వారు, ఈనాటి తరం వారు, నేటి యువతీయువకులు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు, విద్యార్థినులు దేశమంతటా ప్రభుత్వ బల ప్రయోగాన్ని, ఆంక్షలను, నిర్బంధాలను తట్టుకుంటూ, శాంతియుతంగా, అహింసాయుతంగా కొనసాగిస్తున్న చరిత్రాత్మక ఉద్యమాల్లో, నేటితరం శాంతియుత ప్రతిఘటనలో, వారి నిగ్రహశక్తిలో గాంధేయత స్పష్టంగా కనిపిస్తున్నది-తెలంగాణ రాష్ట్ర సాధన చివరి ఉద్యమాల్లో గాంధీజీ అడుగుజాడలు గోచరించాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాల్లో గాంధీజీ సిద్ధాంతాల మార్గదర్శకత్వం ప్రస్ఫుటమవుతున్నది. స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశపు భిన్నత్వంలోని ఏకత్వాన్ని, ఇక్కడి జీవనవైవిధ్యాన్ని పరిరక్షించ డంలో భారత యువతకు గాంధేయత ఆలంబనమవుతుందని, ఇది నిజంగా గాంధీ శకమని నిక్కచ్చిగా చెప్పవచ్చు. 


అంతర్జాతీయరంగంలో నిన్నమొన్నటి వరకు స్వతంత్ర భారతదేశాన్ని ఇది గాంధీ దేశమని గౌరవించారు. ఇక్కడి ప్రజాస్వామ్యానికి గాంధీయతే పెట్టని కోట అని విదే శీయులు విశ్వసించారు. ఈ రోజు అంతర్జాతీయరంగంలో, విశేషించి అమెరికా (యూఎస్‌ఏ) ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఐక్యరాజ్యసమితిలో, యురోపియన్‌ యూనియన్‌లో, దాదాపు అరువై ముస్లిం దేశాల్లో భారతదేశం గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లుతున్నది. గాంధేయ మార్గమే భారతదేశం తిరిగి తన గౌరవప్రతిష్టలను, విశ్వసనీయతను పొందడాని కి దోహదపడగలుగుతుంది. గాంధేయ మార్గానికి, గాంధీజీ సిద్ధాంతాల కు, విధానాలకు ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌, మార్టిన్‌ లూథర్‌కింగ్‌ (జూనియర్‌), దలైలామా, ఆంగ్‌సాంగ్‌సూకీ, బరాక్‌ హుసేన్‌ ఒబామా ప్రతినిధులుగా నిలిచి, ప్రతీకలై గాంధేయత సజీవమైనదని చాటగలిగినారు. ఈ రోజు తిరిగి విదేశీయులే గాంధేయతకు ప్రతినిధులుగా నిలిచితే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. 


logo