ఆదివారం 29 మార్చి 2020
Editorial - Feb 01, 2020 , 00:15:26

బడ్జెట్‌లో పేదలెక్కడ?

బడ్జెట్‌లో పేదలెక్కడ?

ప్రభుత్వరంగం రోజురోజుకూ క్షీణిస్తున్న పరిస్థితిలో, దేశంలోని 95 కోట్ల మంది పేదరికంలో మగ్గిపోతుంటే, దేశంలోని కోటీశ్వరులు మాత్రం రోజు 1710 కోట్లు ఆర్జిస్తున్నారు. ప్రభుత్వాలు మాత్రం నిధుల కొరతతో సంక్షేమ పథకాలకు, విద్యకు కూడా చాలినన్ని నిధులు కేటాయించలేని దుస్థితి ఉన్నది. దేశంలోని కుబేరుల రెండురోజుల్లో కూడబెట్టే సంపదతో మన విద్యావిధాన అభివృద్ధికి ఎంతో చేయవచ్చు.

దేశ ఆర్థికవ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ దేశంలోని కుబేరుల సంపద మాత్రం అంతకంతకూ పెరిగింది. ఒక శాతంగా అత్యంత ధనవంతుల సంపద 95.3 కోట్లమంది పేదల సంపదకన్నా నాలుగింతలు ఎక్కువ. దేశంలో ఉన్న 63 మంది కోటీశ్వరుల వద్ద ఉన్న సపంద మన దేశ బడ్జెట్‌ 2018-19 కన్నా ఎక్కువగా ఉన్నది. మరోవైపు ఆర్థికవ్యవస్థ స్థితిగతుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మాత్రం దేశ ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగానే, మందగమనంలో ఉన్నదని తెలుస్తున్నది. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చిన మన ఆర్థికమంత్రులంతా దేశ ఉత్పాదకతను పెం చుతూ ఉద్యోగ కల్పనకు గాను కార్పొరేట్‌ పన్నులను తగ్గిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ వారు చెప్పినట్లు ఏదీ వాస్తవరూపం దాల్చలేదు. 


ఇదిలా ఉంటే దేశంలో సులభ వాణిజ్యానికి సంబంధించిన పరిస్థితులు ఆశించిన మేర లేక పరిశ్రమల స్థాపన, అభివృద్ధి ఆశించిన మేర జరుగలేదు. పారి శ్రామిక, కార్మిక సంబంధాలు, పర్యావరణ పరిరక్షణ చర్యలు బలహీనపడినాయి. ఫలితంగా ప్రభుత్వాలు చెప్పినవిధంగా వృద్ధిరేటు నమోదు కాలే దు. నీతి ఆయోగ్‌ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచి ప్రకారం.. దేశంలో పేదరికం, ఆకలి దారిద్య్రాలు పెరిగిపోయాయి. అంతకుముందు ఈ పేదరికం 22 రాష్ర్టాల్లోఉంటే ఇప్పుడది 24 రాష్ర్టాలకు చేరింది. ఈ జాబితాలో కేం ద్రపాలిత ప్రాంతాలు కూడా చేరటం ఆందోళన కలిగించే విషయం. దేశ ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి పరిస్థితులు ఇలా ఉంటే, మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి రావలసిన రెవెన్యూ ఆదాయం తగ్గిపోవటం మూలంగా బడ్జెట్‌లో రెండు లక్షల కోట్లను ముందస్తుగానే కోత విధించారు.


ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థికవ్యవస్థ కోలుకోకపోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. కీన్స్‌ ఆర్థిక సిద్ధాంతం ప్రకారం.. వస్తూత్పత్తికి కొనుగోలు శక్తి లేక డిమాండ్‌ పడిపోవటం, నిరుద్యోగం పెరుగటం, ఆర్థికవ్యవస్థ క్షీణించిపోవటం లాంటివి పరిష్కారం కావాలంటే ప్రభుత్వం పెట్టుబడులను పెంచాలి. ఎక్కువసంఖ్యలో కార్మికులకు పనికల్పించేటటువంటి పనులు, ప్రాజెక్టులు చేపట్టాలి. ఇలా చేసినప్పుడు మాత్రమే ఆర్థికవ్యవస్థలో చలనం వస్తుంది. ఫలితంగా ఎక్కువమందికి ఉద్యోగాలు దొరికి నిరుద్యోగం తగ్గుముఖం పడుతుంది.


కార్పొరేట్‌ పన్నులు తక్కువ చేయటం ద్వారా వినియోగదారుల శక్తి పెరిగి ఉత్పత్తికి డిమాండ్‌ పెరుగుతుంది. తత్ఫలితంగా పరిశ్రమల్లో పెట్టుబడులు పెరిగి ఆర్థికవ్యవ స్థ ముందుకు నడిపిస్తాయని చెబుతారు. ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు కంపెనీలు కార్మికులకు ఇన్సెంటివ్‌లు ఇవ్వవు. ఇదిలా ఉంటే చాలా కంపెనీలు అత్యధిక శాతం లాభాలు గడిస్తున్నా అది ప్రజల కు చేరదు, చెందదు. ఈ కారణంగానే అసమానతలు పెరుగుతున్నాయి కానీ, ఆర్థికాభివృద్ధి జరుగటం లేదు. ఈ పరిస్థితుల్లో దేశం బడ్జెట్‌లో చాలినన్ని నిధుల కోసం ఆర్థిక కాఠిన్యత పాటించక తప్పదని అంటున్నారు. కానీ వ్యవస్థాగతంగా ఉన్న బలహీనతలను పాలకులు కావాలనే మర్చి పోతున్నారు. మౌలిక వసతుల లేమి, చాలినన్ని నాణ్యమైన మానవ వనరులు అందుబాటులో లేకపోవటం, పారిశ్రామిక విధానాల్లో శాస్త్రీయత, హేతుబద్ధత లేకపోవటం లాంటి ఆర్థికవృద్ధిని ఆటంకపరుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పన్నుల వ్యవస్థలో ఉన్న లొసుగులను తొలిగించాల్సిన ఆవశ్యకత ఉన్నది. పన్నుల ఎగవేతలను నివారించి జీఎస్టీ రాబడిని పెంచాల్సిన అవసరం ఉన్నది. ఇలా జరిగితేనే ఆర్థికాభివృద్ధి గాడినపడుతుంది.


ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశం చైనా నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. దీర్ఘకాలిక పారిశ్రామికాభివృద్ధి విధానంతో చైనా ప్రభుత్వరంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులతో పారిశ్రామిక అభివృద్ధిని సాధించింది. అలాగే విద్యాభివృద్ధికి నిధులు పెంచి నాణ్యమైన మానవ వనరులతో అభివృద్ధివేగాన్ని పెంచింది. ప్రభుత్వరంగంలో పెట్టుబడులు పెట్టి వాటిని బలోపే తం చేసేబదులు భారతదేశం పెట్టుబడుల ఉపసంహరణ విధానాలను అనుసరిస్తున్నది. ఫలితంగా రెవెన్యూ రాబడులు మరింత తగ్గిపోతున్నా యి. సామాజిక అవసరాలకు వెచ్చించే నిధుల్లో కూడా కోతలు విధిస్తున్నారు. ఈ క్రమంలోనే పాఠశాల విద్యలో మూడు వేల కోట్ల రూపాయ ల కోత విధించారని తెలుస్తున్నది.


ప్రభుత్వరంగం రోజురోజుకూ క్షీణిస్తున్న పరిస్థితిలో, దేశంలోని 95 కోట్లమంది పేదరికంలో మగ్గిపోతుంటే, దేశంలోని కోటీశ్వరులు మాత్రం రోజు 1710 కోట్లు ఆర్జిస్తున్నారు. ప్రభుత్వాలు మాత్రం నిధుల కొరతతో సంక్షేమ పథకాలకు, విద్యకు కూడా చాలినన్ని నిధులు కేటాయించలేని దుస్థితి ఉన్నది. దేశంలోని కుబేరుల రెండురోజుల్లో కూడబెట్టే సంపదతో మన విద్యావిధాన అభివృద్ధికి ఎంతో చేయవచ్చు. దేశలో ఇప్పటికీ 31 కోట్లకు పైగా వయోజనులు నిరక్షరాస్యులుగా ఉంటే దేశం ఆర్థికశక్తిగా ఎలా ఎదుగుతుంది.


దేశంలో ఈ స్థాయిలో ఉన్న ఆర్థిక అసమానతలే దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయనటంలో సందేహం లేదు. 20 15లో ఐఎంఎఫ్‌ ప్రపంచ ఆర్థిక అసమానతల సూచి ప్రకారం చూస్తే, దేశంలోని 20 శాతం ఉన్న ధనవంతుల సంపద గణనీయంగా పెరిగింది. కానీ దేశ స్థూల జాతీయోత్పత్తి మాత్రం తగ్గిపోయింది. దేశ ఆర్థికాభివృద్ధి ఎప్పుడు సాధ్యమంటే నిరుపేదలుగా ఉన్న 20 శాతం పేదల్లో కొనుగోలు శక్తి పెరుగాలి. పేద, మధ్య తరగతివర్గాల అభివృద్ధితోనే ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందుతుంది. సామాజిక, ఆర్థికరంగాల్లో స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇది పరస్పర ఆధారితం. ఇప్పటికైనా గుర్తించాల్సిందేమంటే.. దేశంలో పన్ను చెల్లింపుదారులు సక్రమంగా పన్నులు చెల్లించేలా చూడాలి. ఆ క్రమంలోనే సంపద పన్ను, వారసత్వ సంపద పన్ను, ఆస్తిపన్ను లాంటివి  తిరిగి పునరుద్ధరించి ధనవంతుల నుంచి పన్నులు వసూలు అయ్యేలా చూడాలి. ఇదే ఆర్థికవ్యవస్థ కు దన్నుగా, కందెనగా పనిచేస్తుంది.


ప్రభుత్వం లాభంపై కూడా పన్ను ఉండేలా చర్యలు తీసుకోవాలి. దీనికి తగినవిధంగా పన్ను విధానం రూపొందించి అమలయ్యేలా చూడాలి. ఇలా చేసినప్పుడే పాలకులు చెబుతున్న ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సుసాధ్యమవుతుంది. తద్వారా ఆర్థికవ్యవస్థలో చైనాను అధిగమిం చగలుగుతాం. ఒక శాతంగా ఉన్న ధనవంతులకే మేలు చేసే ఆర్థికవిధానాలతో దేశంలోని కోట్లాదిమంది జీవితాల్లో మార్పు రాదు. పేదరికం, ఆకలి ఉన్నచోట అభివృద్ధికి అర్థం ఉండదు. ఈ సంవత్సరం బడ్జెట్‌లోనైనా పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా విధానాలు రూపొందిచబడి నిధులు కేటాయించాలి. అప్పుడే ప్రతి భారతీయుడు ఆర్థికంగా బలోపేతమవుతాడు. అదే పరిపూర్ణ అర్థంలో దేశాభివృద్ధికి సూచిక.

(వ్యాసకర్త: ‘ఆక్స్‌ఫామ్‌ ఇండియా’లో అసమానతల వ్యతిరేక ప్రచార నాయకురాలు)


logo