గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Jan 30, 2020 , 23:16:59

కరోనావైరస్ కలవరం

కరోనావైరస్ కలవరం

చైనా జంతు మార్కెట్ నుంచి వైరస్ విస్తరించినందు వల్ల మాంసం అమ్మే దేశవాళీ మార్కెట్లన్నీ మూసివేయాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. దీనివల్ల కార్పొరేట్ సంస్థలు నడిపే భారీ కబేళాలు, గొలుసు ఆహార అమ్మక వ్యవస్థలు మాత్రమే మిగులుతాయి. కానీ కార్పొరేట్ సంస్థలు నిర్వహించే భారీ కబేలాలు కూడా వైరస్‌కు పుట్టినిళ్ళనేది గతంలోనే ధ్రువపడ్డది. మెక్సికోలోని పందుల వధశాల దగ్గర భారీగా పడేసిన వ్యర్థ పదర్థాల దగ్గరికి పక్షులు చేరుతున్న క్రమంలోనే కొత్త వైరస్ పుట్టుకొచ్చిన ఉదంతాలున్నాయి.

చైనాలో పెద్ద ఎత్తున ప్రాణాలను బలిగొంటున్న కరోనావైరస్ మన దేశంలో కూడా అడుగు పెట్టడంతో అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైనాలోని వూహాన్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థికి ఈ వైరస్ సోకినట్టు కేరళలోని దవాఖానలో ధ్రువీకరించారు. కేరళలోని మరో ఏడుగురిని కూడా ఏకాంతంలో పెట్టి గమనిస్తున్నారు. మరికొందరిపై దృష్టి నిలిపినట్టు తెలుస్తున్నది. విమానాశ్రయాల నుంచి వచ్చేవారిపై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో మన  దేశంలో జాగ్రత్తగా వ్యవహరించవలసిందే. ఈ రోగుల లక్షణాలు, చికిత్స విధానాలపై ఇతర దేశాలతో చర్చిస్తూ అవగాహన పెంచుకోవాలె. కరోనావైరస్ మూలంగా చైనాలో 170 మంది మరణించారంటే సాధారణ విషయం కాదు. ఏడు వేల ఏడువందలకు పైగా కేసులు నమోదయ్యాయి. టిబెట్‌లో కరోనావైరస్ సోకిన రోగి కనిపించ డంతో ఈ వైరస్ చైనాలోని అన్ని ప్రాంతాలకు విస్తరించిందని ధ్రువపడ్డది. తూర్పు, ఆగ్నేయాసియా దేశాలలో ప్రబలుతున్నది. దాదాపు పదిహేను దేశాలలో డెబ్బయి మందికి సోకినట్టు తెలుస్తున్నది. సుదూర అమెరికాలో కూడా ఐదుగురికి ఈ వైరస్ సోకినట్టు వెల్లడైంది. చైనాతో ఉన్న 2, 600 మైళ్ళ పొడవైన సరిహద్దును మూసివేయాలని, వీసాలను తగ్గించాలని రష్యా ఆలోచిస్తున్నది. ఈ వ్యాధి సోకిన వారిని ఒక దీవిలోకి పంపించాలని ఆస్ట్రేలియా భావిస్తున్నది. కరోనావైరస్ ఒక చైనాకే పరిమితమైంది కాకుండా ప్రపంచవ్యాప్త సమస్యగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో దీనిని ప్రపంచ మహమ్మారిగా ప్రకటించాలా అనే విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్చిస్తున్నది. వైరస్ ఎప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది కనుక చికిత్సా విధానం కష్టం. ఇప్పటి వరకు ఈ వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనలేదు. 

ఈ వైరస్ చైనాలోని మాంసాహార మార్కెట్ నుంచి విస్తరించింది నిజమే అయినప్పటికీ, అక్కడి నుంచి మొదలైంది కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. మరోచోటి నుంచి అక్కడికి వ్యాపించిందని తెలుస్తున్నది. అయితే ఈ వైరస్ మొదట ఎక్కడ మొదలైందీ ఇంకా చెప్పలేని పరిస్థితి ఉన్నది. గబ్బిలం నుంచి జంతువులకు వచ్చి ఉంటుందనేది ఒక అభిప్రాయం. ఈ వైరస్ పుట్టుక గురించి ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి ఉందని, దానిని పట్టుకోవడం అంత సుల భం కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒకప్పు డు మనుషులు జంతువులు కలిసి బతికిన రోజు లు లేవా? ఇంటికి సమీపంలోనే కోళ్ళు పశువులను పెంచుకునేవారు. పెంపుడు జంతువులు కాళ్ళలో పడి తిరిగాడేవి. పశు పక్ష్యాదులతో దగ్గరగా ఉండటం వల్లనే రోగాలు వ్యాపించవు. ఇట్లా భయానకమైన వైరస్‌లు కొత్తరకాలవి రూపొందుతూ ప్రాణాంతకం కావడానికి ఇతర కారణాలేమిటో పరిశోధించాలె. చైనా జంతు మార్కెట్ నుంచి వైరస్ విస్తరించినందు వల్ల మాంసం అమ్మే దేశవాళీ మార్కెట్లన్నీ మూసివేయాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. దీనివల్ల కార్పొరేట్ సంస్థలు నడిపే భారీ కబేళాలు, గొలుసు ఆహార అమ్మక వ్యవస్థలు మాత్రమే మిగులుతాయి. కానీ కార్పొరేట్ సంస్థలు నిర్వహించే భారీ కబేలాలు కూడా వైరస్‌కు పుట్టినిళ్ళనేది గతంలోనే ధ్రువపడ్డది. మెక్సికోలోని పందుల వధశాల దగ్గర భారీగా పడేసిన వ్యర్థ పదర్థాల దగ్గరికి పక్షులు చేరుతున్న క్రమంలోనే కొత్త వైరస్ పుట్టుకొచ్చిన ఉదంతాలున్నాయి. దేశవాళీ, సంప్రదాయ అంగళ్ళయినా, భారీ కబేళాలైనా పరిశుభ్రతను పాటించినప్పుడు ఏ వైరస్‌లు సంక్రమించవు. భారీ కబేళాల కన్నా స్థానిక ఆహార వ్యవస్థలను ప్రోత్సహించడమే సరైన పద్ధతి. అయితే పరిశుభ్రతా విధానాలను మాత్రం కచ్చితంగా అమలు చేయాలె. 

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్ గురించి తీవ్రంగా చర్చించుకుంటున్న సందర్భంలోనైనా వివిధ దేశాలలో నెలకొన్న ఆరోగ్య పరిస్థితులపై దృష్టి సారిస్తే బాగుంటుంది. మహమ్మారి ఏదైనా వ్యాపించినప్పుడు తక్షణం స్పందించడం మంచి విధానమే. కానీ ఇదే శ్రద్ధ సాధారణ పరిస్థితుల్లో ఆరోగ్య పరిరక్షణపై పెడితే ప్రపంచం కొంత ఆనందమయంగా ఉంటుంది. సంచలన వార్తలకే స్పందించే కాలమిది. బస్సు ప్రమాదంలో ఒకే రోజు పది మంది మరణిస్తే అది సంచలన వార్త అవుతుంది. వంద రోజులు రోజుకొకరు మరణిస్తే పట్టించుకోరు. ఈ వంద ప్రమాదాలు జరగడానికి కారణాల గురించి ఎవరూ ఆలోచించరు. కరోనా వైరస్ కన్నా ప్రపంచవ్యాప్తంగా ప్రజల ప్రాణాలు తీస్తున్న వ్యాధులు అనేకం ఉన్నాయి. ఎయిడ్స్ గురించి కలిగి ఆందోళన క్షయ వ్యాధి గురించి కలుగదు. కానీ క్షయ వ్యాధికి ఎక్కువ మంది బలవుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల వైరస్ మూలంగా ఫ్లూ ఆరున్నర లక్షల మంది ప్రాణాలను హరిస్తున్నది. ఫ్లూ వల్ల అమెరికాలోనే ఏటా సగటున రెండు లక్షల మంది దవాఖానల పాలవుతున్నారనీ, ముప్ఫై ఆరు వేల మంది మరణిస్తున్నారని వెల్లడైంది. ఇక ఇతర వ్యాధుల వల్ల మరణాలకు లెక్కే లేదు. వర్ధమాన, పేద దేశాలలో వ్యాధులు, మరణాలకు సంబంధించిన గణాంకాలు అంత కచ్చితంగా ఉండవు. చాలా దేశాలలో మంచినీళ్ళు లభించడమే కష్టంగా ఉన్నది. నగరాలలో చెత్తకుప్పలు ఎప్పుడు ఏ మహమ్మారిని పుట్టిస్తాయో చెప్పలేని పరిస్థితి. కరోనా వైరస్ గురించి అప్రమత్తం అవుతూనే, రోగాలు లేని ఒక ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించుకునే దిశగా ప్రపంచ దేశాలు ముందడుగు వేయాలె. ప్రభుత్వాలు అనుసరించే విధానాలపైనే ఆరోగ్య పరిరక్షణ ఆధారపడి ఉంటుందని గుర్తించాలె.


logo
>>>>>>