బుధవారం 01 ఏప్రిల్ 2020
Editorial - Jan 29, 2020 , 23:18:15

కేసీఆర్‌ స్పష్టత, సంకల్పం

కేసీఆర్‌ స్పష్టత, సంకల్పం

తెలంగాణ మున్సిపల్‌ ఫలితాల గురించి చెప్పుకోవలసింది ఒక ఎత్తయితే, అంతే ముఖ్యమైనది ఆ ఫలితాలు వెలువడిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పౌరసత్వ చట్టం గురించి, ఫెడరలిజం గురించి అన్న మాటలు. వీటిపై ఆయన చేసిన వివరమైన వ్యాఖ్యలు, మాట్లాడిన తీరు ఆ విషయమై తనకు గల స్పష్టతను, సీరియస్‌నెస్‌ను చూపుతున్నాయి. దీని వాస్తవ కార్యాచరణ పరిస్థితులపై, వివిధశక్తుల సహకారంపై ఆధారపడి ఉండవచ్చుగాక, కానీ దేశంలోని ఒక బలమైన నాయకునికి అటువంటి దృఢ సంకల్పం ఉండటమన్నది గమనార్హం.

ముందుగా మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుకోవాలంటే, టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించగలదని మొదటి నుంచీ ఊహించిందే. అధికారపక్షం సరేసరి కాగా సాధారణ ప్రజలకు, చివరకు ప్రతిపక్షాలకు కూడా ఇవే ఊహలు ఉండటాన్ని బట్టి ఫలితాలు అందరికీ ముందుగానే తెలిసిన రహస్యమైంది. ఆ విధంగా ఎందుకు అయిందనేది ప్రశ్న. ఫలితాల తర్వాత మాట్లాడిన కేసీఆర్‌ రెండు కీలకమైన విషయాలు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి తమ విజయానికి కారణాలన్నది వాటిలో ఒకటి. తమకు ఈస్థాయిలో ప్రజల మద్దతు ఒక నిరంతర వెల్లువ(consistent wave)గా ఉంటున్నదనేది రెండు. ఇవి ఎవరైనా అంగీకరించకతప్పని మాటలు. 2014 అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికల దాకా.. అన్నింటి ఫలితాలు ఒకటే. సీట్లు, ఓట్ల శాతాలు కూడా. 


పరిశీలకులు సీట్ల కన్న ఓట్ల శాతాలకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తుంటారు. బీజేపీ, కాంగ్రెస్‌ వంటివి గొప్ప విజయాలు సీట్ల సంఖ్యలో సాధించినప్పటికీ ఓట్ల శాతం 33 నుంచి 38 ప్రాంతంలోనే ఆగిపోవటం అందు కు కారణం. టీఆర్‌ఎస్‌ పరిస్థితి అది కాదు. 2014లో అదేవిధంగా ఉండి నా, తర్వాత పైకి ఎగబాకుతూ 45 నుంచి 50కి పైగా ఉంటున్నది. ప్రజల మద్దతుకు సంబంధించి ఇది ఒక నిరంతర వెల్లువ వంటిది. టీఆర్‌ఎస్‌కు ఇది గత ఆరు సంవత్సరాల కాలంగా కన్పించటం ఒక విశేషమైతే, ఒక అధికారపార్టీకి ఇటువంటి మద్దతు రావటం 1952 నాటి మొదటి ఎన్నికల నుంచి ఇప్పటి వరకు గల 68 ఏండ్ల కాలంలో దేశంలో మరే పార్టీకి కూడా ఇంత నిరంతరంగా, ప్రతి ఎన్నికలో ఓట్ల శాతాలు ఈ స్థాయిలో లభించలేదు. చివరకు నెహ్రూకు గాని, పశ్చిమబెంగాల్‌లో వామపక్షాలకు గాని, తమిళనాడులో ద్రవిడ పార్టీలకు గాని, గుజరాత్‌లో నరేంద్ర మోదీకి గానీ ఈ విధంగా ఓట్ల శాతం పెరుగలేదు. ఇది అసాధారణమైన, అనితరమైన రికార్డు.  


ఇందుకు గల రహస్యం కూడా కేసీఆర్‌ చెప్పిందే ఉన్నది. అది సంక్షేమం, అభివృద్ధి. వాస్తవానికి ఇది రహస్యం కానక్కరలేని విషయం. భారత ప్రజలు మధ్యయుగాల ఫ్యూడల్‌ కాలంలో తిరుగుబాట్లు చేసినా, వలస పాలనా దశలో స్వాతంత్య్రం కోసం పోరాడినా, స్వాతంత్య్రానంతరం దేశం ప్రగతిశీలమైన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారు. దాని అమలులో పాలకుల వైఫల్యాల కారణంగా ఎన్నికలలో ప్రజలు పాలకులను ఓడించినా, బయట సామాజిక పోరాటాలు చేసినా అన్నీ కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని కోరే చేశారు. మన పాలకులకు ఇది గ్రహించలేని విషయం కాదు. కాని వారికి తమ చదువులు, అనుభవాలకన్న స్వార్థ ప్రయోజనాలు ముఖ్యమయ్యాయి. కాని పక్షంలో ప్రజల మద్దతు ఇపు డు టీఆర్‌ఎస్‌కు కనిపిస్తున్న తరహాలో వారికి కూడా ఒక నిరంతర వెల్లు వ అయిఉండేది. ఈ విషయంలో సోషలిస్టు మూలాలు గల వివిధపార్టీలు, చివరకు వామపక్షాలు కూడా దారుణంగా విఫలమయ్యాయం టే ఇండియా వంటి ఒక వర్ధమాన సమాజపు ప్రజలు ఇక ఇతరుల నుంచి ఆశించగలదేమిటి.       


ఫెడరలిజంపై టీఆర్‌ఎస్‌ అధ్యక్షుని వైఖరి మొదటి నుంచి తెలిసిందే. బలమైన రాష్ర్టాలు, బలమైన కేంద్రంతో రాజ్యాంగం నిర్దేశించిన తరహా సహకార ఫెడరలిజమే దేశానికి రక్ష అని, అందుకు తాను కట్టుబడి ఉన్నానని కేసీఆర్‌ ఈ సందర్భంగా మరొక సారి ప్రకటించారు. ఫెడరలిజానికి గత ప్రయోగాలలో వలె ఒక స్వరూపం(form) మాత్రమే చాలదని, సంక్షేమం-అభివృద్ధి అనే అజెండాతో కూడిన స్వభావం(content) కూడా ఉండాలని, అపుడే అది అర్థవంతం, సుస్థిరమై దేశానికి మేలు చేస్తూ గుణాత్మక మార్పు తేగలదన్నది ఆయన గట్టి నమ్మకం.


తెలంగాణ విషయానికి వస్తే, లోగడ ప్రతి ఎన్నిక తర్వాత అంటూ వచ్చిన ఒక మాటను కేసీఆర్‌ ఈసారి కూడా చెప్పటం గమనించదగ్గది. ఎన్నికల విజయంతో అహంకరించరాదని, అది తమపై బాధ్యతను మరింత పెం చిందని ఆయన తమ పార్టీ శ్రేణులకు మరొక మారు చెప్పారు. అంతే ముఖ్యంగా, ప్రతిపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలని, అందులోనే వారి మేలు ఉందని హితవు పలికారు. ఇందులో రెండవది జాగ్రత్తగా గమనించదగ్గది. తెలంగాణలో ప్రతిపక్షాలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో తెలిసిందే. వారి మాటలు, చేతలు ఏవీ ప్రజల గౌరవాన్ని, విశ్వాసాన్ని పొందే విధంగా ఉండటంలేదు. ఆరేండ్లుగా ఇదే పరిస్థితి. అందువల్లనే, టీఆర్‌ఎస్‌కు ప్రజల మద్దతు ఒక నిరంతర వెల్లువ కాగా, ప్రతిపక్షాలకు ప్రజల వ్యతిరేకత నిరంతర ఎదురుగాలిగా మారింది. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నప్పటికీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ప్రజలు గౌరవించి విశ్వాసం చూపుతారు. ఆ స్థితి ఎన్నికల విషయంలో ఒకసారి కాకపోతే మరొకసారి కలిసివస్తుంది. ఈ చిన్నపాటి ఇంగితం మన ప్రతిపక్షాలలో ఏ ఒక్కదానికీ లేకపోయింది. తమలోని ఇతర లోపాల వల్ల కలుగుతున్న నష్టాలకు ఇది అదనపు నష్టమవుతున్నది.  


ఎన్నికల ఫలితాలకు వస్తే, ఇటీవలి పంచాయతీ ఎన్నికల రూపంలో గ్రామీణుల నుంచి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రూపంలో పట్టణవాసుల నుంచి, అన్నివర్గాల నుంచి, అన్నిప్రాంతాల నుంచి ఒకే విధమైన ఆదరణ పొందటం అధికారపక్షానికి పూర్తి సంతృప్తి కలిగించే విషయం. అనేక దశాబ్దాల పాటు వరుస ఉద్యమాలతో కల్లోలితమైన తెలంగాణకు రాజకీయ సుస్థిరత, పాలనా సుస్థిరత, ఆర్థిక సుస్థిరత ఒక తప్పనిసరి అవసరమని మొదటి నుంచి అనుకుంటున్నదే. అది ఒక ఎన్నిక నుంచి ఒక ఎన్నికకు స్థిరపడుతూ వస్తుండగా, ఈ మున్సిపల్‌ ఫలితాలతో మరింత స్థిరమవుతున్నది. ఆ విధంగా ఇది టీఆర్‌ఎస్‌కు మాత్రమే గాక తెలంగాణకు సైతం నిరంతర సానుకూల వెల్లువ అవుతున్నది. దీన్ని అదృష్టం అనదలుచుకుం టే, కొత్తగా ఏర్పడిన అనేక రాష్ర్టాలలో దేనికీ ఇటువంటి అదృష్టం లభించటం లేదు. రాష్ట్ర ప్రజలు సంతోషించదగిన విషయమిది.


పౌరసత్వ చట్టం, ఫెడరలిజం అంశాలకు వస్తే.. వీటిలో మొదటిది దేశవ్యాప్తంగా కల్లోల స్థితిని సృష్టించటమేగాక, దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా నష్టపరుస్తున్నది. ఈ దృష్ట్యా కేసీఆర్‌ దాని గురించి చాలాసేపు మాట్లాడారు. సీఏఏ ‘నూటికి నూరు శాతం’ తప్పుడు చట్టం అంటూ, ఇప్పటికే ఆ బిల్లుకు పార్లమెంటులో వ్యతిరేకంగా ఓటు వేసిన తాము అదే మేరకు రాష్ట్ర శాసనసభలోనూ తీర్మానించగలమని ప్రకటించారు. మరికొన్ని తదనంతర చర్యలను కూడా సూచించారు. తను వ్యక్తిగతంగా హిందువునని, అయితే మతానికి లౌకిక వ్యవహారాలతో సంబంధం ఉండరాదు. మన రాజ్యాంగం కూడా అదే చెప్తున్నది గనుక, తను ప్రజల మధ్య మత వివక్షను, ఈ చట్టం తరహా చర్యలను ఎంత మాత్రం ఆమోదించబోనని, టీఆర్‌ఎస్‌ ఎల్లప్పుడూ నిజమైన సెక్యులర్‌ పార్టీయేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలో గెలుపుఓటములకు సైతం వెరవబోమని ప్రకటించారు. వాస్తవానికి పార్లమెంటులో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన మీదట, ఆ తర్వాత రోజులలో కేటీఆర్‌ సహా పార్టీ ప్రముఖులు పదే పదే అదే వైఖరితో మాట్లాడుతున్నప్పుడు, ఈ విషయమై ఎవరికీ సందేహాలు ఉండనక్కరలేదు. కాని ప్రతిపక్షాలు, కొందరు సినికల్‌ మేధావులు సందేహాలను సృష్టించేందుకు ప్రయత్నించటం తెలిసిందే.  


ఈ క్రమంలో కేసీఆర్‌ జార్జ్‌ సోరోస్‌ వ్యాఖ్యలను ఉదహరించారు. నిజానికి ఈ పరిణామాల వల్ల భారతదేశం అంతర్జాతీయంగా చాలా అప్రతిష్టపాలైంది. ఎమర్జెన్సీకి మించిన అప్రతిష్ట ఇది. అప్పటిది ప్రజాస్వామ్యానికి సంబంధించినది, పౌరహక్కుల పరమైనది కాగా ఇప్పటిది ప్రజాస్వామికతతో పాటు, లౌకికత, సామాజికపరమైనది. ప్రజాస్వామ్య అంతర్జాతీయ సూచీలో ఇండియా స్థానం ఇదే వారంలో పది స్థానాలు పడిపోయింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎకానమిస్ట్‌ మేగజైన్‌ తన ముఖపత్రకథనంలో ‘అసహన భారతం’(Intolerant India) అంటూ రాసింది. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యాన్ని మోదీ ప్రమాదంలో పడవేస్తున్నారని హెచ్చరించింది. ఈ పరిణామాలపై యురోపియన్‌ యూనియన్‌ సైతం త్వరలో చర్చించనున్నది. ఇటువంటి స్పందనలు అంతర్జాతీయంగా నిరంతరం వస్తున్నాయి. దేశంలో సరేసరి. ఎన్నడూ బయటకు రానివారు, యువకులు, విద్యార్థులు, మహిళలు సహా రోడ్లపై కి వచ్చి.. ప్రభుత్వ చర్యలు రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, సామాజిక ఐక్యతకు, భారతదేశ విలువలకు ప్రమాదకరమంటూ గొంతువిప్పుతున్నారు.


ఫెడరలిజంపై టీఆర్‌ఎస్‌ అధ్యక్షుని వైఖరి మొదటి నుంచి తెలిసిందే. బలమైన రాష్ర్టాలు, బలమైన కేంద్రంతో రాజ్యాంగం నిర్దేశించిన తరహా సహకార ఫెడరలిజమే దేశానికి రక్ష అని, అందుకు తాను కట్టుబడి ఉన్నానని కేసీఆర్‌ ఈ సందర్భంగా మరొక సారి ప్రకటించారు. ఫెడరలిజానికి గత ప్రయోగాలలో వలె ఒక స్వరూపం(form) మాత్రమే చాలదని, సంక్షేమం-అభివృద్ధి అనే అజెండాతో కూడిన స్వభావం(content) కూడా ఉండాలని, అపుడే అది అర్థవంతం, సుస్థిరమై దేశానికి మేలు చేస్తూ గుణాత్మక మార్పు తేగలదన్నది ఆయన గట్టి నమ్మకం. దేశంలోని వివివిధ శక్తులు, పరిస్థితులు క్రమంగా అందుకు సానుకూలంగా మారగలవని ఆశిద్దాం.


logo
>>>>>>