సోమవారం 30 మార్చి 2020
Editorial - Jan 28, 2020 , 23:40:43

సముచిత నిర్ణయం

సముచిత నిర్ణయం

అధికారపార్టీ విధానాలను నిరసిస్తూ శాంతియుత ఆందోళన చేసినా ప్రతిపక్ష నేతలపై తీవ్రమైన నేరారోపణలతో కేసులు పెట్టిన ఉదంతాలున్నాయి. కాబట్టి నేరమయ రాజకీయాలు, ధన ప్రభావం ఎన్నికలపై ప్రభావం చూపని విధంగా ఎన్నికల నిర్వహణ ఎట్లా అనేది అందరూ ఆలోచించాలి. అలాగే అక్రమార్జన పరులు, నేరస్థులు ప్రజాస్వామ్య రాజకీయాలకు ప్రమాదమనే విషయాన్ని అందరూ గ్రహించాలి. ఆ దిశగా ప్రజలను చైతన్యపర్చి అక్రమార్కులను రాజకీయాల నుంచి వెలివేయాలి.

నేరచరిత్ర కలిగిన వారిని ఎన్నికలకు దూరంగా ఉంచాలని రాజకీయపార్టీలను ఆదేశించాలన్న కేంద్ర ఎన్నికల కమిషన్‌ విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు సానుకూల నిర్ణయం తీసుకోవటం ఆహ్వానించదగ్గ పరిణామం. కొంతకాలంగా నేరమయ రాజకీయాల పట్ల పౌరసమాజంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. నేరస్థుల నుంచి రాజకీయాలను కాపాడాల్సిన అవసరాన్ని ఎన్నికల కమిషన్‌కు ప్రజాస్వామిక ప్రియులు విన్నవిస్తూనే ఉన్నారు. ఎన్నికల సందర్భం వచ్చినప్పుడల్లా ఏదో రూపం లో ఇలాంటి విన్నపాలు కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌కు సాధారణమయ్యాయి. 


ఈ విషయంలో నేషన ల్‌ ఎలక్షన్‌ వాచ్‌, అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) అనే స్వచ్ఛంద సంస్థల పాత్ర గణనీయమైనది. నేరస్థ రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూనే ఎన్నికలను నేరస్థ రాజకీయాల నుంచి విముక్తి చేయాలని అవి పోరాడుతున్నాయి. అలుపెరుగని ఈ పోరాటాల ఫలితంగానే ఎన్నికల కమిషన్‌ కూడా అనేక సంస్కరణలు చేపట్టింది. ప్రచార విధానంలోనూ, ఎన్నికల వ్యయం విషయంలోనూ పలు ఆచరణాత్మక చర్యలు చేపట్టి ప్రజాస్వామ్యప్రియుల మన్ననలు పొందింది. అలాగే మౌలిక విషయాలపై విధానాల మార్పుకోసం సుప్రీంకోర్టుకు కూడా విన్నవించిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయపార్టీల తీరుతెన్నులపై ఎన్నికల కమిషన్‌ విన్నపం, సుప్రీంకోర్టు తాజా నిర్ణయాన్ని చూడాల్సిన అవసరం ఉన్నది.


రాజకీయాలు, నేరాలు కలెగలిసిపోయి ప్రజాస్వామ్యమే పరిహాసంగా మారిపోయిన దుస్థితి ఏర్పడింది. తాజా అధ్యయనం ప్రకారం, ప్రస్తుత లోక్‌సభలో 46 శాతం మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. అందులో 29 శాతం మంది ప్రజాప్రతినిధులపై తీవ్ర నేరారోపణలున్నాయి. 2014 నుంచి ఇప్పటిదాకా ఎంపీలు, ఎమ్మెల్యేల పరిస్థి తి చూస్తే నేరమయ రాజకీయాల వికృతరూపం కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 4,80 7 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 1,460 మంది క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు. వీరిలో 688 మంది లైంగికదాడి, హత్య, హత్యాయ త్నం, అపహరణ, దోపిడీ, బలవంతపు వసూళ్లు వంటి తీవ్రమైన కేసులు తమపై ఉన్నాయని ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లలో ప్రకటించుకున్నారు. 


ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమై ఉన్న పరిస్థితి కాదు. అన్నిపార్టీలు గెలు పు గుర్రాల పేరిట ధనబలానికి, కండబలానికి ప్రాధాన్యమిస్తున్నందున ఈ పరిస్థితి దాపురించింది. నేర రాజకీయాల గురించి సామాన్యుల నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం దాకా ఆం దోళన చెందే పరిస్థితి ఏర్పడింది. కొన్నాళ్ల కింద ట ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తరఫున చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా తీర్పునిస్తూ, నేర రాజకీయాలు దేశ ప్రజాస్వా మ్య వెన్ను విరుస్తున్నాయని ఆందోళన ప్రకటించారు. చట్టబద్ధ పాలనకు, ప్రజాస్వామ్యానికి తీవ్ర ప్రమాదం ఏర్పడిందని తెలిపారు. అలాగే ప్రజాప్రతినిధ్య చట్టం మాటున నేతలు రక్షణ పొందటాన్ని తీవ్రంగా గర్హించారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8(4) ప్రకారం కింది కోర్టులో దోషులుగా నిర్ధారితులైన ప్రజాప్రతినిధులను మూడు నెలల వరకూ అనర్హులుగా ప్రకటించరాదు. ఈ మూడునెలల్లో వారు పై కోర్టులో అప్పీలు చేసుకుంటే, అది పరిష్కారమయ్యేవరకూ వారిని అనర్హులుగా చేయరాదు. దీని ఆసరాతో ఎంతోమంది నేతలు అనర్హత నుంచి తప్పించుకుంటున్న ఉదంతాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఈ చట్టాన్ని కొట్టివేస్తూ ఏ కేసులోనైనా సరే దోషిగా నిర్ధారితమైన రోజు నుంచే సదరు ప్రజాప్రతినిధి అనర్హులవుతారని దీపక్‌ మిశ్రా ప్రకటించటం గమనార్హం.


నేరమయ రాజకీయాలను ప్రక్షాళన చేయటంలో ప్రజల పాత్ర ఎలా ఉన్నా, మన న్యాయవ్యవస్థ నిర్వహించిన పాత్ర గొప్పది. సందర్భానుసారంగా పౌర, స్వచ్ఛంద సంస్థల ఫిర్యాదులకు స్పందనగా ప్రజాకాంక్షలను సుప్రీంకోర్టు తీర్పులు ప్రతిబింబించాయి. 2013లో తీర్పునిస్తూ నేరం రుజువై శిక్షపడితే, అట్టి ప్రజాప్రతినిధి అనర్హుడని ప్రకటించింది. నేతలపై నత్తనడకన నడుస్తున్న కేసుల విచారణ విషయంపై  ఏడాదిలోగా విచారణ పూర్తిచేయాలని 2014లో స్పష్టం చేసింది. జాప్యానికి విరుగుడుగా ప్రత్యేక కోర్టుల్లో విచారణ చేయాలని 2017లో తీర్పునిచ్చింది. అలాగే ఎన్నికల నామినేషన్‌ సందర్భంలో అభ్యర్థులు తమపై విచారణలో ఉన్న నేరాల చిట్టా వారే తమ అఫిడవిట్లలో ప్రకటించాలని 2018లో ఆదేశించింది. 


అయితే క్రిమినల్‌ కేసులను ప్రాతిపదికగా తీసుకొని రాజకీయనేతలను పోటీకి అనర్హులుగా చేయటం అనేక సమస్యలకు తావిచ్చే ప్రమాదమున్నది. ఈ విధానం అధికారపక్షాల చేతిలో ఆయుధంగా మారి ప్రతిపక్షపార్టీలకు శాపంగా మారే స్థితి ఏర్పడుతుంది. అధికారపార్టీ విధానాలను నిరసిస్తూ శాంతియుత ఆందోళన చేసినా ప్రతిపక్షనేతలపై తీవ్రమైన నేరారోపణలతో కేసులు పెట్టిన ఉదంతాలున్నాయి. కాబట్టి నేరమయ రాజకీయాలు, ధన ప్రభావం ఎన్నికలపై ప్రభావం చూపని విధంగా ఎన్నికల నిర్వహణ ఎట్లా అనేది అందరూ ఆలోచించాలి. అలాగే అక్రమార్జన పరులు, నేరస్థులు ప్రజాస్వామ్య రాజకీయాలకు ప్రమాదమనే విషయాన్ని అందరూ గ్రహించాలి. ఆ దిశగా ప్రజలను చైతన్యపర్చి అక్రమార్కుల ను రాజకీయాల నుంచి వెలివేయాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవటం ప్రజాచైతన్యంతోనే ఆచరణ సాధ్యం. 


logo