శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Editorial - Jan 28, 2020 , 23:35:08

జలసేద్యానికి జీవనాడి

జలసేద్యానికి జీవనాడి

రాష్ట్రంలోని అన్ని ప్రధాన జలాశయాల్లోనూ ఈ ‘కేజ్‌ కల్చర్‌' విధానంలో ఆక్వాకల్చర్‌ను భారీ ఎత్తున నిర్వహించేందుకు అవకాశాలున్నాయి. పర్యవసానంగా వేలాది మందికి కొత్తగా ఈ రంగంలో ఉపాధిని, ఉద్యోగావకాశాలను కల్పించడంతో పాటుగా ఇప్పుడున్న చేపల ఉత్పత్తిని మరో మూడింతలు పెంచుకునేందుకు అవకాశాలు మెరుగుపడుతాయి.

గోదావరి ప్రాణహిత, కృష్ణా నదులు, వాటికి సంబంధించిన ఉపనదుల మీద నిర్మాణంలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులు, వాటికి అనుబంధంగా నిర్మిస్తున్న జలాశయాలు, వీటిపై ఆధారపడిన పెద్ద చెరువులు, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం వ్యవసాయరంగానికి సంబంధించిన సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు, రాష్ట్ర ప్రజలకు తాగునీటిని అందించడం, పారిశ్రామిక అవసరాలకు అవసరమైన నీటిని సరఫరా చేయడం అయినప్పటికీ ఉపాంత ప్రయోజనకారిగా మత్స్యరంగం అభివృద్ధికి కూడా ఇతోధికంగా తోడ్పాటును అందించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తన భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఫలితంగా ఆధునిక పద్ధతుల్లో నిర్వహించే ఆక్వాకల్చర్‌ రంగాన్ని ప్రోత్సహించడం, సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహిస్తున్న మత్స్యరంగాన్ని స్థిరీకరించుకోవ డం, తద్వారా రాష్ట్రంలో చేపల ఉత్పత్తిని గరిష్ఠస్థాయికి పెంచుకోవడంతోపాటుగా ఈ రంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం కూడా సాధ్యపడుతుంది! తెంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కలలుగన్న ‘చేపల ఎగుమతి’ స్థాయికి రాష్ట్ర మత్స్యపారిశ్రామిక రంగం చేరుకుంటుందనడంలో ఎలాంటి సందేహానికి తావులేదు!


సంప్రదాయ జలవనరులైన చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, నదీ ప్రవాహాల్లో మాత్రమే చేపల పెంపకానికి ఇంతకాలంగా పరిమితమైన తెలంగాణ మత్స్య పారిశ్రామికరంగం కేవలం సంప్రదాయ మత్స్యకారు లు నిర్వహించే చేపల ఉత్పత్తి మీదనే ఆధారపడుతూ వస్తున్నది. ఆధునిక చేపల పెంపకానికి అనుకూలమైన ఆక్వాకల్చర్‌ మత్స్యపారిశ్రామిక విధానాలు మన రాష్ట్రంలో ఇంతకాలంగా అందుబాటులోకి రాలేదు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి  కేసీఆర్‌ సారథ్యంలో నిర్మిస్తున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టుల ఫలితంగా రాష్ట్రంలో కొత్తగా ఆక్వాకల్చర్‌ రంగానికి అవసరమైన పూర్వరంగం ఆవిష్కారమైంది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిబంధనల ప్రకారం భారీ నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించిన నీటి వనరుల్లో కేవలం ఒక శాతం నీటి విస్తీర్ణాన్ని మాత్రమే మత్స్యసంప ద అభివృద్ధికి, పర్యాటకరంగానికి కలిసి ఉపయోగించుకునేందుకు అవకాశాలున్నాయి.


అయితే రిజర్వాయర్‌కు సంబంధించిన మొత్తం నీటి విస్తీర్ణాన్ని సంప్రదాయ పద్ధతుల్లో చేపలను పెంచుకునే విషయంలో మాత్రం ఎలాంటి పరిమితులు అమల్లో లేవు. అందువల్ల ఒకవైపు సంప్రదాయ పద్ధతుల్లో రిజర్వాయర్లలో రొయ్యలు, చేపల పెంపకాన్ని కొనసాగిస్తూనే, అదనంగా నీటి విస్తీర్ణంలోని ఒక శాతం నీటి పరిమాణాన్ని ఆధునిక ఆక్వాకల్చర్‌ పద్ధతుల్లో చేపల పెంపకాన్ని నిర్వహించుకునేందుకు అవకాశాలున్నాయి. ఇందుకు అనుగుణంగా రిజర్వాయర్‌లలో చేపల పెంపకానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధివిధానాలకు సంబంధించిన ఆచరణాత్మక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను మన రాష్ట్రంలో రూపొందించుకొని అమలుపరుచాల్సిన ఆవశ్యకత, అవకాశం ఉన్నది.


రెండు తెలుగు రాష్ర్టాల ఉమ్మడి ప్రయోజనాల కోసం పనిచేస్తున్న నాగార్జునసాగర్‌, శ్రీశైలం, జూరాల తదితర భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన నీటి వినియోగంపై ఇప్పటికే జాతీయస్థాయిలో చర్చోపచర్చలు జరుగుతుండగా, ఈ జలవనరుల్లో చేపల పెంపకానికి సంబంధించి స్పష్టమైన విధివిధానాలు ఇంకా రూపుదిద్దుకోలేదు. ఈ భారీనీటి ప్రాజెక్టుల్లో మన రాష్ర్టానికి సంబంధించిన మత్స్యశాఖ గడిచిన నాలుగేండ్లుగా వరుసగా ఉచిత చేపపిల్లలను లక్షలసంఖ్యలో వదులుతుండగా, ఇరు రాష్ర్టాలకు సంబంధించిన మత్స్యకారులు తద్వారా ప్రయోజనం పొందుతున్నారు. 


ఇటీవలికాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన జాలర్లు ఈ భారీ జలాశయాల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున చేపల వేటను కొనసాగిస్తున్న సంఘటనలు వివాదాస్పదంగా మారుతున్నాయి. మత్స్యశాఖ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఈ ప్రాజెక్టుల్లో ఉచితంగా వదులుతున్న చేపపిల్లలు పూర్తిస్థాయిలో ఎదుగకముందే ఆంధ్రా ప్రాంతం నుంచి అక్రమంగా చొరబడుతున్న మత్స్యకారులు, సముద్రజలాలలో చేపలు పట్టడంలో ఆరితేరిన వందలాదిమంది జాలర్లు రాత్రివేళల్లో చేపల వేటను నిర్వహిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని, తమ జీవనోపాధికి విఘాతం కల్పిస్తున్నారని ఈ ప్రాజెక్టుల్లో చేపలు పట్టుకునే సంప్రదా య స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరు రాష్ర్టాల ఉమ్మడి నిర్వహణలో కొనసాగుతున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టుల్లో చేప ల పెంపకానికి, చేపల వేటకు సంబంధించి విధివిధానాలతో ఇరు రాష్ర్టాల వాటాలపై ఒక స్పష్టమైన ప్రాతిపదికను రూపొందించుకోవాల్సిన ఆవశ్యకతను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలుమార్లు ఉటంకించిన సందర్భాలను గుర్తుకు చేసుకోవాల్సి ఉన్నది.


సంప్రదాయ చేపల పెంపకానికి ముఖ్య వనరులుగా ఉపయోగపడుతున్న చెరువులు, కుంటలు, చిన్న నీటి వనరులు ప్రధానంగా సాగునీటి వినియోగానికి ఉద్దేశించినవి కావడం వల్ల ఈ నీటి వనరుల్లో నీటి లభ్యత, నీటి నిల్వ పరిమాణం, నీటి నిల్వ కాలం తదితర అంశాలు సాగునీటి వ్యవసాయ వినియోగం మీద ఆధారపడి ఉంటాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం పలు విడతల్లో నిర్వహించిన మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా చెరువుల్లో నీటిని నిం పడం లాంటి చర్యల ఫలితంగా రాష్ట్రంలోని సంప్రదాయ జలవనరుల్లో భవిష్యత్తులో చేపల పెంపకానికి అనుకూలమైన పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మత్స్యశాఖ ద్వారా గడిచిన మూడేండ్ల కాలంలో వరుసగా పంపిణీ చేసిన ఉచిత చేపవిత్తనాల పర్యవసానంగా రాష్ట్రంలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు నమోదైన రెండున్నర లక్షల టన్నుల వార్షిక చేపల ఉత్పత్తి, ఈ సంవత్సరానికి మూడు లక్షల టన్నులకు చేరుకోవడం రాష్ట్రంలో మత్స్యరంగం అభివృద్ధికి బలమైన పునాదులు పడినట్లుగా భావించవలసి ఉన్నది. 


రాష్ట్రంలోని గోదావరి, కృష్ణా నదులపై శరవేగంగా పూర్తవుతున్న కాళేశ్వరం, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన భారీ, మధ్యతర హా నీటి పారుదల ప్రాజెక్టులు, వాటికి అనుబంధంగా కొత్తగా ఉనికిలోకి వస్తున్న జలాశయాలు కలుపుకొని మొత్తం వందకు పైగా భారీ జలవనరులు చేపల ఉత్పత్తికి అందుబాటులోకి రానున్నాయి. గోదావరి నదీగర్భాన్ని ఎల్లకాలం నీటితో నింపి ఉంచే ‘రివర్స్‌ పంపింగ్‌' ఆలోచన, గోదావరి నదిలో కలిసేవరకూ నిండుకుండలా నీటితో తొణికిసలాడనున్న మానేరు ఉప నదీ పరీవాహకం, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి మధ్యమానేరు డ్యాం వరకు ఎల్లప్పుడూ నీటితో నిండి ఉండే గోదావరి వరదకాలువ, ఇంకా అనేకరకాలైన కొత్తకొత్త నీటివనరులు రాష్ట్రంలో చేపల ఉత్పత్తిని సుసంపన్నం చేయనున్నాయి. 


రాష్ట్ర మత్స్యశాఖ ఇప్పటికే మన రాష్ట్రంలోని శ్రీరాంసాగర్‌, కడెం రిజర్వాయర్‌, లోయర్‌ మానేర్‌ డ్యాం, ఎల్లంపల్లి రిజర్వాయర్‌, సింగూరు జలాశయం, ఇందిరాసాగర్‌, అలీసాగర్‌, మూసీ రిజర్వాయర్‌, పాలేరు, వైరా తదితర జలాశయాలు, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులలో ‘కేజ్‌ కల్చర్‌' ఆధునిక పద్ధతిలో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న చేపల పెంపకం ప్రోత్సాహకరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన జలాశయాల్లోనూ ఈ ‘కేజ్‌ కల్చర్‌' విధానంలో ఆక్వాకల్చర్‌ను భారీ ఎత్తున నిర్వహించేందుకు అవకాశాలున్నాయి. పర్యవసానంగా వేలాది మందికి కొత్తగా ఈ రంగంలో ఉపాధిని, ఉద్యోగావకాశాలను కల్పించడంతో పాటుగా ఇప్పుడున్న చేపల ఉత్పత్తిని మరో మూడింతలు పెంచుకునేందుకు అవకాశాలు మెరుగుపడుతాయి. 


రిజర్వాయర్లలో చేపల ఉత్పత్తి ప్రక్రియను ఆధునిక పద్ధతుల్లో నిర్వహించడం వల్ల దీనికి అనుబంధంగా చేపల విత్తనాల ఉత్పత్తి, చేపల దాణాతయారీ, చేపల ప్యాకింగ్‌, రవాణా, ఐస్‌ ఫాక్టరీల ఏర్పాటు, చేపల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన మందుల తయారీ, వలలు, మర పడవల తయారీ, ఫిష్‌ ప్రాసెసింగ్‌, తదితర అనేక అంశాల్లో కొత్తగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలోని భారీ జలాశయాలు జలసేద్యానికి జీవనాడిగా మారి, సాగునీటి ప్రాజెక్టుల పరీవాహక ప్రాంతాలు చేపల సందడితో కళకళలాడుతాయి!

(వ్యాసకర్త: ‘తెలంగాణ ఫిషరీస్‌ సొసైటీ’ వ్యవస్థాపకులు)


logo