శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Jan 28, 2020 , 00:19:05

‘కొనుగోలు’ పెరిగితేనే కోలుకుంటాం

‘కొనుగోలు’ పెరిగితేనే కోలుకుంటాం

దేశంలో 20 శాతంగా ఉన్న అతి పేద వర్గాలకు నెలకు ఆరు వేల రూపాయలు నేరుగా అందజేయటం ద్వారా వారి కొనుగోలుశక్తిని పెంచాలి. తద్వారా వస్తు కొనుగోలులో డిమాండ్‌ను పెంచటం ద్వారా ఆర్థికవ్యవస్థను ఉద్దీపింపజేయాలి. ఈ విధంగా ఆర్థికవ్యవస్థలో వచ్చిన చలనం కారణంగా ప్రైవేట్‌ వ్యవస్థల్లో పెట్టుబడులు పెరిగి ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుంది.

భారత ఆర్థికవ్యవస్థ అనిశ్చితిపై ప్రతి ఒక్కరూ కలత చెందుతున్నారు. గత 45 ఏండ్లలో మునుపెన్నడూ లేనివిధంగా జీడీపీ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. గతంలో మోదీ ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారుడిగా పనిచేసిన ఒక ఆర్థికవేత్త చెబుతున్న మాట ఇది. మరోవైపు జీడీపీ గురించి భయపడాల్సిందేమీ లేదని నేతలు చెబుతున్నా ఆర్థిక మందగమన పరిస్థితులు మాత్రం అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరో మాటలో చెప్పాలంటే.. మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. దీన్ని రక్షించేందుకు, గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు అంతుచిక్కకుండా ఉన్న స్థితి ఉన్నది.

అయితే అనేకమంది ఆర్థిక నిపుణులు, ఆర్థిక మంత్రులు, నోబెల్‌ గ్రహీతలు చెబుతున్నదేమంటే.. ప్రస్తుతం ఉన్న సంక్షోభ పరిస్థితి కుదు టపడాలంటే కొనుగోలుదారుల్లో ఉద్దీపనలతో డిమాండ్‌ను పెంచి ఆర్థిక వ్యవస్థను చైతన్యపర్చటమే పరిష్కారం. ఈ నేపథ్యంలోనే నోబెల్‌ గ్రహీ త ఎస్తేర్‌ డఫ్లో ‘టీయూపీ’ విధానంతో ప్రస్తుత మందగమనం నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. ఆమె చెబుతున్న టీయూపీ విధానం ప్రకారం.. దేశంలోని పేదలందరికీ నేరుగా డబ్బును అందించటం ద్వారా వస్తు కొనుగోళ్లు పెరిగేట్లు చేయాలి. బెంగాల్‌ ఆర్థికమంత్రి అమిత్‌ మిత్రా కూడా దేశంలోని పేద వర్గాలందరికీ నేరుగా డబ్బు మార్పిడి ద్వారా వారి కొనుగోలు శక్తిని పెరిగేలా చేయాలి. మరో నోబెల్‌ గ్రహీత అభిజిత్‌ బెనర్జీ ప్రకారం.. మందగమనంలో ఉన్న ఆర్థికవ్యవస్థలో కదలిక తెచ్చేందుకు ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీల ద్వారా డబ్బు అందించి కొనుగోలు శక్తి పెంచాలి. దేశంలోని దాదాపు అన్ని దినపత్రికలు కూడా తమ సంపాదకీయాల్లో కొనుగోలుశక్తిని పెంచటం ద్వారా ఆర్థికవ్యవస్థను ఉద్దీపింపజేయాలని రాశా యి. గతంలో ఎన్నడు లేనివిధంగా దేశ ఆర్థిక పరిస్థితి గురించి అందరూ ఒకేవిధమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు.

భారత ఆర్థికవ్యవస్థకు సంబంధించి ఇలాంటి ఆలోచన కొత్తదేమీ కాదు. ఇలాంటి సూచనలు ఈ మధ్యకాలంలో కూడా చాలామంది సూచించారు. ఈ అభిప్రాయం ప్రకారం.. దేశంలో 20 శాతంగా ఉన్న అతి పేద వర్గాలకు నెలకు ఆరు వేల రూపాయలు నేరుగా అందజేయటం ద్వారా వారి కొనుగోలుశక్తిని పెంచాలి. తద్వారా వస్తు కొనుగోలులో డిమాండ్‌ను పెంచటం ద్వారా ఆర్థికవ్యవస్థను ఉద్దీపింపజేయాలి. ఈ విధంగా ఆర్థికవ్యవస్థలో వచ్చిన చలనం కారణంగా ప్రైవేట్‌ వ్యవస్థల్లో పెట్టుబడులు పెరిగి ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుంది. ఇలాంటి ఆలోచనే కాంగ్రెస్‌ పార్టీ గత 2019 ఎన్నికల సందర్భంలో తన ప్రణాళికలో కూడా పెట్టింది. దాన్ని వారు  ‘న్యాయ్‌' అనే పేరుతో పిలిచారు. కాంగ్రెస్‌ పార్టీ నిపుణులైన ఆర్థికవేత్తల తో దేశ ఆర్థికవ్యవస్థ తీరు తెన్నుల గురించి అధ్యయనం చేయించింది. ఆర్థికవ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి గట్టెక్కటానికి అనుసరించాల్సిన విధానాలను మదింపు చేసింది. ఆ క్రమంలోనే కాంగ్రెస్‌ ‘న్యాయ్‌' విధానాన్ని విశ్వసించి దాన్ని అనుసరించాలని భావించింది. అందుకే తన ఎన్నికల మ్యానిఫెస్టోలో న్యాయ్‌ విధానాన్ని ప్రకటించి, ప్రచారం చేసింది. కానీ తదనంతర పరిణామాల్లో దానిపై కాంగ్రెస్‌ పార్టీ అంతగా పట్టించుకున్న పరిస్థితులు కనిపించటం లేదు. బహుశా కాంగ్రెస్‌ ఆ నినాదంతో ఓటర్లను నమ్మించలేకపోయింది. ఆ న్యాయ్‌ నినాదం దేశంలోని పేద ప్రజల కు దగ్గరకు చేర్చటంలో విఫలమైందని చెప్పవ చ్చు. కానీ 9 నెలల్లోనే తిరిగే అదే నినాదం ముందుకువస్తున్నది. అం దరూ అదే విధానంతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టవచ్చని చెప్పటం గమనార్హం.


వాస్తవానికి ఇవ్వాళ దేశంలో ప్రజాస్వామికంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వ నేతగా ఓ ముఖ్యమంత్రి రాష్ట్ర నిధులు పెంచుకోవటం కోసం పన్నులు పెంచే అధికారం లేదు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల నిర్ణయాధికారమంతా కేంద్రం చేతిలోనే ఉన్నది. ప్రతీది జీఎస్టీ కౌన్సిల్‌ పరిధిలోనే ఉంటుంది. కాబట్టి న్యాయ్‌ లాంటి ఓ ప్రయోజనకరమైన పథకాన్ని రాష్ట్రం దానికదిగా కొనసాగించే పరిస్థితి లేదు. ఇది ఒకరకంగా చెప్పాలంటే జీఎస్టీ సమాఖ్యస్ఫూర్తికి విఘాతమైనదే. ప్రస్తుత ఆర్థికసంక్షోభ పరిస్థితికి పరిష్కారం కేంద్ర ప్రభుత్వ చేతిలోనే ఉన్నది. అది దేశంలోని పేదలందరికీ నేరుగా డబ్బును అందచేయటమే. దీనితోనే దేశంలోని పేదలందరి కొనుగోలుశక్తి పెరిగి ఆర్థికవ్యవస్థలోని స్తబ్ధత తొలిగి చలనం వస్తుంది. ఇలాం టి పరిస్థితిలో ప్రధాని మాత్రమే నిర్ణాయత్మకశక్తిగా వ్యవహరించాలి. ప్రజలు, దేశ ఆర్థికవ్యవస్థ నూతన శక్తితో జవసత్వాలు సాధించాలంటే న్యాయ్‌ లాంటి పథకాన్ని అమలు చేయాలి.


పేదల కొనుగోలు శక్తి పెంచేందుకు నేరుగా డబ్బును వారికి అందచేయాలని అనేకమంది ఆర్థికవేత్తలతో కాంగ్రెస్‌ కూడా అంటున్నది. ఈఈ సూచనను మోదీ ప్రభుత్వం కూడా కొట్టిపారేసే పరిస్థితి లేదు. క్షీణతలో కూరుకుపోయిన ఆర్థికవ్యవస్థను తిరిగి పునరుజ్జీవింపజేసేందు కు మరో మార్గం కూడా ప్రభుత్వం దగ్గర లేకపోవటం కూడా గమనించదగినది. ‘సర్వశిక్ష అభియాన్‌' కార్యక్రమాన్ని వాజపేయి ప్రభుత్వ హయాంలో ప్రకటించారు. దాన్ని ఆ తర్వాత అన్ని ప్రభుత్వాలు అనుసరించాయి, అమలుచేశాయి. అలాగే ఆధార్‌ నెంబర్‌ను కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ముందుకువచ్చినా, దాన్ని మోదీ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఇలా ఎన్నో విధానాలను చెప్పుకొవచ్చు. ఒక పార్టీ అధికా రంలో ఉన్నప్పు డు ప్రవేశపెట్టిన దాన్ని, మరో పార్టీ ప్రభుత్వం అనుసరించిన దాఖలాలు చాలానే ఉన్నాయి. న్యాయ్‌ కూడా అలాగే మరో రూపంలోనో, మరో పేరుతోనో కొనసాగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.


పరిస్థితి ఇలా ఉంటే మోదీ ప్రభుత్వం మాత్రం ఆర్థిక మందగమనం, సంక్షోభం విషయంలో మాత్రం చిత్రంగా వ్యవహరిస్తున్నది. మందగమన పరిష్కారాల విషయంలోనూ వింత వాదనలు చేస్తున్నది. దీపపు కాంతితో జింకలను పట్టుకుంటానని చెబుతున్నది. ఆ మధ్యకాలంలో మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సందర్భంలో.. ఆర్థికమంత్రి ఉన్నప ళంగా కార్పొరేట్‌ కంపెనీల పన్నుల్లో పెద్ద ఎత్తున తగ్గింపులు ప్రకటించా రు. తద్వారా మన ఆర్థికవ్యవస్థ కు 1.5లక్షల కోట్ల మేర లాభం జరిగి కోలుకుంటుందని చెప్పుకొచ్చారు. కానీ కార్పొరేట్‌ కంపెనీలు తగ్గించిన పన్నులను తిరిగి పెట్టుబడులుగా పెట్టి, ఉద్యోగ కల్పనకు తోడ్పడి కొనుగోలు శక్తి పెరిగేలా చేస్తారనుకున్నది వట్టిదే అయ్యింది. పన్నుల తగ్గింపు ద్వారా ఆశించిన ఫలితమేమీ రాలేదు.


ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీలకు ఇచ్చిన ధనాన్ని దేశంలోని ఐదు కోట్ల పేదలకు నెలకు ఐదు వేల చొప్పున ఆరు నెలలు ఇస్తే పరిస్థితి మరోలా ఉండేది. ప్రజల్లో కొనుగోలుశక్తి పెరిగి వస్తు డిమాండ్‌ ఏర్పడేది. అంతిమంగా అన్నిరంగాల్లో పెట్టుబడులు పెరిగి ఆర్థిక వ్యవస్థలో చలనం వచ్చేది. కానీ అలాంటి పరిస్థితి ఏర్పడలేదు. కార్పొరేట్‌ కంపెనీల పన్ను లు తగ్గించటం ద్వారా ఆశించిన ఫలితాలేవీ రాలేదని ఆ నిర్ణయాన్ని ప్రకటించిన నాలుగు నెలల తర్వాత ఇప్పుడు తెలిసివస్తున్నది. కార్పొరేట్‌ పన్నులు తగ్గించటమనేది ఓ అనవసర, నిరుపయోగ చర్యగా మిగిలిపోయింది.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న  రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ లాంటి రాష్ర్టాలైనా న్యాయ్‌ను ఎందుకు అమలుచేయటం లేదనేదే చర్చనీయాంశం. అందరూ న్యాయ్‌ గురించి ఓ మంచి పథకంగా ఒప్పుకుంటున్నప్పుడు దాన్ని అమలుచేయటంలో సమస్యలేమిటి? అయితే దాన్ని అమలుచేయాలంటే ఆర్థికశక్తి అత్యవసరం. జీఎస్టీ కన్నా ముందు రాష్ర్టాల దగ్గర కొన్ని ఆర్థిక వనరులుండేవి. ఇప్పుడు ఆవనరులన్నీ కేం ద్రం అధీనంలోకి వెళ్లిన స్థితిలో న్యాయ్‌ అమలుకు నోచుకోవటం లేదు.


వాస్తవానికి ఇవ్వాళ దేశంలో ప్రజాస్వామికంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభు త్వ నేతగా ఓ ముఖ్యమంత్రి రాష్ట్ర నిధులు పెంచుకోవటం కోసం పన్ను లు పెంచే అధికారం లేదు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల నిర్ణయాధికారమంతా కేంద్రం చేతిలోనే ఉన్నది. ప్రతీది జీఎస్టీ కౌన్సిల్‌ పరిధిలోనే ఉంటుంది. కాబట్టి న్యాయ్‌ లాంటి ఓ ప్రయోజనకరమైన పథకాన్ని రాష్ట్రం దానికదిగా కొనసాగించే పరిస్థితి లేదు. ఇది ఒకరకంగా చెప్పాలంటే జీఎస్టీ సమాఖ్యస్ఫూర్తికి విఘాతమైనదే. ప్రస్తుత ఆర్థికసంక్షోభ పరిస్థితికి పరిష్కారం కేంద్ర ప్రభుత్వ చేతిలోనే ఉన్నది. అది దేశంలోని పేదలందరికీ నేరుగా డబ్బును అందచేయటమే. దీనితోనే దేశంలోని పేదలందరి కొనుగోలుశక్తి పెరిగి ఆర్థికవ్యవస్థలోని స్తబ్ధత తొలిగి చలనం వస్తుంది. ఇలాం టి పరిస్థితిలో ప్రధాని మాత్రమే నిర్ణాయత్మక శక్తిగా వ్యవహరించాలి. ప్రజలు, దేశ ఆర్థిక వ్యవస్థ నూతన శక్తితో జవసత్వాలు సాధించాలంటే న్యాయ్‌ లాంటి పథకాన్ని అమలు చేయాలి.

(వ్యాసకర్త: ప్రవీణ్‌ చక్రవర్తి - సామాజిక ఆర్థికవేత్త) ‘ది వైర్‌' సౌజన్యంతో...


logo