శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Jan 27, 2020 , 23:26:58

మరో బోడో ఒప్పందం

మరో బోడో ఒప్పందం

మన రాజ్యాంగ పరిధిలోనే సమస్యలను పరిష్కరించే వెసులు బాటు ఉన్నప్పుడు హింసాయుత ఆందోళనలకు తావు ఉండదు. విజ్ఞాపనలు, ప్రకటనల స్థాయిలోనే ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుం టే దేశవ్యాప్తంగా ఇంతగా ఆందోళనలు చెలరేగేవి కావు. ఇప్పటికైనా బోడోలకు ఇచ్చిన రక్షణలు కచ్చితంగా అమలుచేస్తే, ఇక ముందు కేంద్ర పాలిత ప్రాంతం లేదా రాష్ట్రం కావాలనే డిమాండ్‌ రాదు. దేశవ్యాప్తంగా సాగుతున్న ఇతర ఆందోళనలపైనా కేంద్రం దృష్టిసారించి చర్చల ద్వారా పరిష్కరించాలె.

బోడోలాండ్‌ ప్రాదేశిక మండలిని ఏర్పాటుచేస్తూ కేంద్రం, అస్సాం ప్రభుత్వం, బోడో పోరాట సంస్థలకు మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదరడంతో ఇకనైనా ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుందనే ఆశాభావం వ్యక్తమవుతున్నది. ఈ ఒప్పందంపై సంతకం చేసిన బోడో సంస్థలలో కరడుగట్టి న నేషనల్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ బోడోలాండ్‌ (ఎన్‌డీఎఫ్‌బీ) కూడా ఉండటం విశేషం. బోడో లు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని లేదా కేంద్రపాలిత ప్రాంతమైన ఏర్పాటుచేయాలని దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఈ పోరాటంలో వందలాది మంది మరణించడంతో పాటు భారీస్థాయి విధ్వంసాలు సాగాయి. తాజా ఒప్పందం మూలంగా అస్సాం ప్రాదేశిక సమగ్రతకు భంగం వాటిల్లదని కేంద్రం అంటున్నది. అయితే బోడో ప్రాదేశిక మండలికి శాసన, కార్యనిర్వాహక, పరిపాల న, ఆర్థిక అధికారాలు సంక్రమిస్తున్నాయి. బోడో ప్రాంతానికి ప్రత్యేకంగా డీఐజీ ఉంటాడు. బోడో ప్రాంత అభివృద్ధి కోసం మూడేండ్ల పాటు బోడో ప్రాదేశిక మండలికి పదిహేనువందల కోట్ల రూపాయలను విడుదల చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. సాయుధ పోరాటం సాగిస్తున్న బోడో తీవ్రవాదులకు పునరావాసం కల్పిస్తారు. బోడో ప్రాంతంలో గిరిజనులకు భూమి హక్కు ఉంటుంది. ‘ఈ ఒప్పందం అస్సాంకు, బోడో ప్రజలకు బంగారు భవిష్యత్తును ఇస్తుంది. బోడోల భాషా సం స్కృతుల పరిరక్షణతో పాటు వారి రాజకీయ, ఆర్థిక డిమాండ్లు కూడా తీరుతాయి’ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అస్సాం ప్రాదేశిక సమగ్రతకు భంగం వాటిల్లకుండానే బోడో ప్రాంతానికి వీలైనంత స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలనేది కేంద్రం లక్ష్యం గా కనిపిస్తున్నది. ఆచరణలో బోడో ప్రాంతం దాదాపుగా విడిపోయినట్టుగానే ఉంటుంది కను క అస్సాంలో నిరసనలు వ్యక్తం కావడం సహ జం.

బ్రిటిష్‌ పాలనలో సైమన్‌ కమిషన్‌ వచ్చినప్పుడు కూడా బోడోలు తమకు రక్షణలు కావాలని విజ్ఞాపన పత్రం అందించారంటే వారి అస్తి త్వ పరిరక్షణ కాంక్ష ఏనాటిదో అర్థం చేసుకోవ చ్చు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత అస్సాంతో పాటు ఈశాన్య ప్రాంతమంతా బెంగాలీల వలస సాగుతున్నప్పుడు కేంద్రం ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల అనేక జటిల సమస్యలు తయారయ్యాయి. బోడోలాండ్‌ రాష్ట్ర సాధన కోసం క్రమంగా తీవ్రవాద సంస్థలు పుట్టుకవచ్చాయి. బోడోల పోరాటాన్ని విరమింపచేసేందుకు ఒప్పందం కుదరడం ఇది మూడవ సారి. ఆల్‌ బోడో స్టూడెంట్స్‌ యూనియన్‌తో 1993లో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రాతిపదికగా కేంద్రం బోడోలాండ్‌ స్వయంపాలక మండలి (బీటీసీ)ని ఏర్పాటయింది. ఈ మండలికి కొద్ది పాటి రాజకీయ అధికారాలు అప్పగించారు. కానీ ఆచరణలో బోడోల ఆకాంక్షలేవీ నెరవేరలేదు. దీంతో బోడో లిబరేషన్‌ టైగర్స్‌ (బీఎల్‌టీ) అనే మిలిటెంట్‌ సంస్థ ఆధ్వర్యంలో ఉద్యమం చెలరేగింది. 2003లో రెండవ కేంద్రం, అస్సాం ప్రభుత్వం, బీఎల్‌టీ మధ్య రెండవ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం- బోడోలాండ్‌ ప్రాంతీయ మండలి ఏర్పాటయింది. అస్సాంలోని నాలుగు జిల్లాలు ఇందులో భాగమయ్యాయి. విద్య, అడవులు మొదలైన ముప్ఫై అంశాలపై అధికారాలను ఈ ప్రాంతీయ మండలికి అప్పగిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. రెవెన్యూ, పోలీసు, సాధారణ పరిపాలన అస్సాం ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. ఈ ఒప్పందం కూడా ఫలితమివ్వకపోవడంతో సాయుధ పోరాటం సాగింది.

ఈశాన్యంలో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇంకా అనేక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు సాగుతున్నాయి. అనేక తెగలు, జాతులు తమ అస్తిత్వ పరిరక్షణ కోసం తపన పడుతున్నాయి. స్వాతం త్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా భిన్నవర్గాల అస్తిత్వ పరిరక్షణకు భరోసా ఇవ్వలేకపోవడం కేంద్ర పాలకుల వైఫల్యమే. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ దేశ సమైక్యతకు భంగకరమైందేమీ కాదు. మన దేశంలోనే ఇతర ప్రాంతాల పెత్తనం నుంచి విముక్తి పొంది సొంతంగా అభివృద్ధి చెందాలనుకునే ఆకాంక్షలివి. వందలాది మంది బలవుతూ దశాబ్దాల తరబడి పోరాటాలు సాగుతూ ఉంటే కేంద్రం వాటి ని అణిచివేస్తూ పోవడం దారుణం. ఉద్యమాలు తీవ్రతరమైనప్పుడు కంటి తుడుపుగా కొన్ని హామీ లు ఇవ్వడం ఆ తరువాత వాటిని ఉల్లంఘించడం కూడా పరిపాటి. ఉద్యమం చల్లార్చడం వరకే తమ పని అన్నట్టుగా కేంద్ర పాలకులు వ్యవహరిస్తారు. దీంతో ఉద్యమాలు మరింత ఉధృతంగా వస్తుంటాయి. ఈ పరిస్థితి రాకూడదనుకుంటే, భిన్న భాషా సంస్కృతులు గల ప్రతి ప్రాంతానికి తగు రక్షణలు ఉండాలె. వనరులపై స్థానికులకు హక్కు లేకుండా చేయడం వల్ల కూడా ఆందోళన లు తలెత్తుతాయి. ఇందుకు జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని రూపొందించుకోవాలె. మన రాజ్యాంగ పరిధిలోనే సమస్యలను  పరిష్కరించే వెసులు బాటు ఉన్నప్పుడు హింసాయుత ఆందోళనలకు తావు ఉండదు. విజ్ఞాపనలు, ప్రకటనల స్థాయిలోనే ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుం టే దేశవ్యాప్తంగా ఇంతగా ఆందోళనలు చెలరేగేవి కావు. ఇప్పటికైనా బోడోలకు ఇచ్చిన రక్షణలు కచ్చితంగా అమలుచేస్తే, ఇక ముందు కేంద్ర పాలిత ప్రాంతం లేదా రాష్ట్రం కావాలనే డిమాండ్‌ రాదు. దేశవ్యాప్తంగా సాగుతున్న ఇతర ఆందోళనలపైనా కేంద్రం దృష్టిసారించి చర్చల ద్వారా పరిష్కరించాలె.logo