శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Editorial - Jan 27, 2020 ,

భాషాప్రయోగ నైపుణ్యం అవసరం

భాషాప్రయోగ నైపుణ్యం అవసరం

‘భాష పాల వంటిది. పాలు ఎంత బలవర్థకమైనవైనా పచ్చిపాలను అలాగే అందరూ తాగలేరు, అది ప్రజల భాష. పాలను కాస్తే మీగడ వస్తుంది, అది సారస్వత భాష. తోడుపెడితే పెరుగు అవుతుంది, అది వ్యవహారిక భాష. పెరుగును చిలికితే వెన్న వస్తుంది, మజ్జిగ వస్తుంది. వెన్న సృజనాత్మక భాష. మజ్జిగ పత్రిక భాష. వెన్నను కాస్తే నెయ్యి అవుతుంది. అది సైద్ధాంతిక భాష. ‘పాలు’ అనే మూల భాష అంటే.. మాతృభాష నుంచి మీగడ, పెరుగు, వెన్న, మజ్జిగ, నెయ్యి అనే పదార్థాలు వచ్చినట్లు.. ఇంత వైవిధ్యభరితంగా రచనలను రూపొందించవచ్చు. భాషా ప్రయోగ నైపుణ్యం అంటే అదే.

డిసెంబర్‌ 16, 2019 ‘చెలిమె’ పేజీలో ‘కవిత్వానికి ఉదాత్తతే ప్రాణం’ శీర్షికన రామాచంద్రమౌళి అఫ్సర్‌ కవిత్వాన్ని గురించి రాసిన వ్యాసాన్ని, ‘రైతు కవి రాజిరెడ్డి’ శీర్షికన దాసరాజు రామారావు రాసిన వ్యాసాన్ని చదివిన తర్వాత నాలో కలిగిన సందేహాలను మీ ముందు ఉంచుతున్నాను. ఈ మధ్యకాలంలో చాలామంది విమర్శకులు సమీక్షకు, కవిత్వానికి, వ్యాసానికి తేడా లేకుండా రాస్తున్నారు. సమీక్ష, వ్యాసం అనేవి వచన ప్రక్రియకు చెందినవి. కవిత్వం సృజనాత్మక ప్రక్రియ. ‘కప్పి చెప్పేది కవిత్వం. విప్పి చెప్పేది విమర్శ’ అన్నారు సినారె. ఈ వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, మనకు తెలిసిన భాషలోని పదాలను వాడుకోవాలి. కానీ వచనాన్ని రాసి కవిత్వమని, కవిత్వాన్ని రాసి వచనమని బుకాయిస్తున్నారు.


‘భాష పాల వంటిది. పాలు ఎంత బలవర్థకమైనవైనా పచ్చిపాలను అలాగే అందరూ తాగలేరు, అది ప్రజల భాష. పాల ను కాస్తే మీగడ వస్తుంది, అది సారస్వత భాష. తోడుపెడితే పెరుగు అవుతుంది, అది వ్యవహారిక భాష. పెరుగును చిలికితే వెన్నవస్తుంది, మజ్జిగ వస్తుంది. వెన్న సృజనాత్మక భాష. మజ్జిగ పత్రిక భాష. వెన్నను కాస్తే నెయ్యి అవుతుంది. అది సైద్ధాంతిక భాష. ‘పాలు’ అనే మూల భాష అంటే.. మాతృభాష నుంచి మీగడ, పెరుగు, వెన్న, మజ్జిగ, నెయ్యి అనే పదార్థాలు వచ్చినట్లు.. ఇంత వైవిధ్యభరితంగా రచనలను రూపొందించవచ్చు. భాషా ప్రయోగ నైపుణ్యం అంటే అదే. రచయితలకు, కవులకు ఈ నైపుణ్యం లేకపోతే రాస్తున్నదానికి ఇచ్చినం త ప్రాముఖ్యం ఏమి రాయాలి? ఎలా రాయాలి? అనే అంశాలకు ఇవ్వరు. అందుకు మచ్చుతునకలు ప్రారంభంలో నేను పేర్కొన్న రెండు వ్యాసాలు. 


ముందుగా.. ‘కవిత్వానికి ఉదాత్తతే ప్రాణం’ శీర్షికన రాసిన రామాచంద్రమౌళి వ్యాసాన్ని పరిశీలిద్దాం.

‘ఆధునిక తెలుగు వచన కవిత్వరంగంపై ఒక విలక్షణమైన ముద్ర అఫ్సర్‌'. ఇది మొదటి వాక్యం. ఒకరకంగా ఇది అఫ్సర్‌కు ఇచ్చిన కితాబు (స్టేట్‌మెంట్‌). వాక్యపరంగా ఆలోచించినప్పుడు ఇందులో అస్పష్టత ఉంది. ఎందుకంటే ఈ వాక్యా న్ని చదువగానే విమర్శకుడు అఫ్సర్‌ గురించి చెబుతున్నాడని మనం భావిస్తాం. కానీ ఆయన కవిత్వాన్ని గురించి చెప్పాడు. అది కూడా అణువంతే. అంటే స్పష్టత లేదన్నమాట. ఇందు లో పెద్దగా తేడా ఏముంది అనే సందేహం కలుగవచ్చు.

తేడా ఉంది. ఆయన కవిత్వం భూమికగా అఫ్సర్‌ వ్యక్తిత్వా న్ని అంచనా వేయాలంటే కర్మప్రధాన వాక్యాలను వాడాలి. అఫ్సర్‌ జీవించిన సామాజిక నేపథ్యంలో కవిత్వాన్ని పరిశీలించినప్పుడు కర్త ప్రాధాన్యం వాక్యాల్లో చెప్పాలి. ఈ రెండూ జరుగలేదు. 


తెలుగులో వస్తున్న అన్ని పత్రికల్లోని సాహిత్య పేజీలన్నీ ఇలాగే ఉంటున్నాయి. సోషల్‌ మీడియా సంగతి చెప్పనవసరం లేదు. ‘త్వంశుంఠ అంటే త్వంశుంఠ’ అని పొగడ్తల పోస్టింగ్‌లు. మాటలు పేరిస్తే కవిత్వం కాదు. వాక్యాలు కూరిస్తే వ్యాసం, కథ, నవల, నాటకం కాదు. రాసేవారిలో ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసాలు ఉన్నప్పుడే వాళ్లు ఏది రాయాలనుకున్నారో అదే ప్రక్రియ రూపుదాలుస్తుంది. లేకుంటే ఏనుగు బొమ్మను గీయబోతే.. కోతి బొమ్మ తయారవుతుంది.


కాబట్టి ఆ వాక్యం అస్పష్టంగా ఉంది. ఇకపోతే వాక్యాలు ప్రధానంగా మూడు రకాలు. అవి- సరళ వాక్యాలు, సంశ్లిష్ట వ్యాకాలు, సంయుక్త వాక్యాలు. రామాచంద్రమౌళి రాసిన రెండో పేరా చూడండి.. ‘Variety is the spice of..’ అని వేగుంట మోహన్‌ ప్రసాద్‌ అంటే, ‘Verse must be musical..’ అని ఆధునిక వచన కవితకు ఆద్యుడైన ఫ్రెం చ్‌ కవి చార్లెస్‌ బోదిలేర్‌ (1857) తన ఇతర ముగ్గురు కవి మిత్రులు వెర్లాయిన్‌, మాల్లార్మే, రెంబోలతో కలిసి నినదించిన ఫ్రెంచ్‌ సింబాలిస్ట్‌ చతుష్టయంలో నుంచి వెర్లాయిన్‌ అన్నారు. ఇది ఏ రకమైన వాక్య నిర్మాణమో ఎవరికైనా అర్థం అవుతుం దా? ఈ వాక్యం ద్వారా ఎవరు ఏమి చెప్పారో..  ఈ విమర్శకుడు ఏమి చెప్పదలుచుకున్నాడో కూడా అర్థం కాదు.


మరో వాక్యం.. ‘అక్షరాలు కవిత్వ పరిమళాన్ని నింపుకొని ఉదాత్తమౌతున్నప్పుడు వాటికవే రాగాత్మకమూ, లయాత్మక మూ కూడా అవుతాయి..’. ఈ కవితా భాష వ్యాసంలో అవసరమా? అలంకారికుల ప్రకారం ‘శబ్దానికి’ నాదగుణం, అర్ధగుణం ఉంటాయి. నాదగుణంలోనే శృతిలయ కలిసి ఉంటా యి. అదే రాగం కదా! మరి భావం ముచ్చటేంది. కవిత్వ పరిమళాన్నే భావం అని సరిపెట్టుకున్న ప్రాచీన కవులు చెప్పినట్లు ‘ఇంపారెడు పలుకులు సరిదండు కూర్చినట్లు’ (తిక్కన) శిరీషకుశమపేశల సుధామయోక్తులు (పెద్దన)-పదాలు కదా ఆ పని చేసేది. పోనీ నన్నయ అన్నట్లు.. అక్షర రమ్యతతో సరిపెట్టుకుందామంటే ఆయన అంతటితో ఆగలేదు కదా. ‘నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం’ అనికూడా అన్నాడు. 


ఇకపోతే వాక్యాల్లో సమన్వయం కుదరని, పొదగని పదాలను కొన్నింటిని పరిశీలిద్దాం. ‘నిశ్శబ్ద రాగాత్మకత’ పంక్తులు, పాదాలు, ‘మనిషి బహిర్ముఖతతో ఆత్మాంతరలోకాల్లోకి అభిక్రమిస్తున్నప్పుడు’, శిల్పీకరణ నైపుణ్యం- ఇత్యాది పదబంధా లు పానకంలో పుడకలా వాక్యాల్లో కోకొల్లలుగా కనిపిస్తాయి. అదేవిధంగా ‘మహా యువకవి’ వంటి అతిశయోక్తులు! 


అఫ్సర్‌ కవిత్వాన్ని గురించి రామాచంద్రమౌళి ఇచ్చిన కితాబులు వ్యతిరేకార్థాన్ని స్ఫురింపజేస్తున్నాయి. ఈ వాక్యం చూడండి. ‘నిజానికి అఫ్సర్‌ స్వతహాగా భావోద్రేకి, ఉద్వేగీ ఐన కవి కాడు’. ‘కవికి భావావేశం ఉండాలన్నాడు’ కట్టమంచి. ‘కవిత్వం రాయాలంటే ఆవేశం రావాలి’ అన్నాడు దాశరథి. భావోద్రేకం, ఉద్వేగం లేకుండా కవులు ఎలా అవుతారో రామాచంద్ర మౌళికే తెలియాలి. అఫ్సర్‌ కవిత్వంలో అన్వ యం పొందని కితాబులు, వ్యర్థపదాల వాక్యాలు ఎన్నో కనిపిస్తాయి. రాగం, లయ  రసం వంటి పునరుక్తులు అడుగడుగున దర్శనమిస్తాయి. వచనంలో (గద్యం) కూడా కవితా పరిమళాల పదగుంఫనం చేయడం అందరికి సాధ్యం కాదు. అది చలానికి, కృష్ణశాస్త్రికి, రావిశాస్త్రికి మాత్రమే సాధ్యం. 


రెండో వ్యాసం ‘రైతు కవి రాజిరెడ్డి’ రచయిత దాసరాజు రామారావు. దీంట్లో కూర ఎక్కువ అన్నం తక్కువ అన్నట్లుం ది. కవి రాజిరెడ్డి కవిత్వాన్ని గురించి విశ్లేషించింది తక్కువ, నేపథ్యం ఎక్కువ. ‘అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట..’ అన్న ఉల్లేఖనం కాళోజీ ‘వ్యత్యాసాలు’ కవితలోని ది. ఈ ఉల్లేఖనాన్ని తన వ్యాసంలో ఉపయోగించుకున్న దాసరాజు కాళోజీ పేరు చెప్పకపోవడం శోచనీయం. పైగా ఆకలి మంటలు అని రాయకుండా చెమటరాసులొక చోట అని రాసి కాళోజీకి ద్రోహం చేశాడు.


మొదటికాలమ్‌లో.. ‘నాగరికత కన్నా అనాగరికత మేలు’ అని విమర్శకుడు అన్నాడు. కునాగిరికత అయితే అది జడల దయ్యమే అని వెంటనే అంటాడు. నాకు తెలిసిన నాగరికత-అనాగరికత అనే రెండే పదాలు వ్యవహారంలో ఉన్నాయి. సం స్కారం-కుసంస్కారం దృష్టితో విమర్శకుడు కునాగరికత ప్రయోగించి ఉండవచ్చు. కానీ రాజిరెడ్డి కవిత్వానికి వీటికి సం బంధం ఏముంది? ఊర్కే విచ్చలవిడిగా పదబంధాలను ప్రయోగించడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? ఈ వ్యాసాన్ని చదువుతుంటే అది శాఖ సంక్రమణమో, సమన్వయమో అర్థం గాక అయోమయంలో పడిపోతాం. దాదాపు రెండున్నర కాలమ్స్‌లో విమర్శకుడు ఉటంకించిన కవితలు అవి పప్పు రాజిరెడ్డివా? లేక ఇతర కవులవా? అర్థం కాదు. 


‘తెలంగాణ వీరభూమి, త్యాగభూమి, అమరత్వాల తడిసి న భూమి. ఈ నేల మాళిగలో వేషం లేదు, రోషం వుంది. మోసం లేదు, అమాయకం వుంది. కుట్ర లేదు, అలైబలై వుం ది. వ్యూహం లేదు, కుల్లం కుల్లం వుంది. అందుకే కవులకిది కావ్యవిడిది అయింది అంటూ.. ‘పల్లె అమరత్వాన్ని పాడిం ది/ నేల కొరిగిన వీరుల త్యాగం మరో దసన్నను వాగ్దానం చేసింది’ అనే కవితాపాదాలను ఉటంకించాడు. ఎక్కడా పప్పు రాజిరెడ్డి ప్రస్తావనను తేకుండా వీటిని ఉటంకించడం వల్ల ఇవి ఎవరి కవితా పాదాలు అనుకోవాలి? రైతు కవిగా రాజిరెడ్డికి కితాబిచ్చినప్పుడు కవి రైతుకు సంబంధించి రాసిన నాలుగైదు కవితలను ఉటంకించి విశ్లేషించి సమర్థించుకోవాలి. కానీ రామాయణంలో పిడుకల వేటలా అసందర్భ వర్ణనలు, సమన్వయం కుదరని కవితా పాదాల ఉటంకనలు ఇచ్చి గందరగోళ పరచడం భావ్యం కాదు కదా!


చివరి కాలమ్‌లోని రెండో పారా నుంచి రాజిరెడ్డి వ్యక్తిగత జీవితాన్ని మనకు పరిచయం చేయడానికి ప్రయత్నించాడు దాసరాజు. దీన్నిబట్టి మాత్రమే విమర్శకుడు రాసిన వ్యాసం ‘రైతు కవి రాజిరెడ్డి’ పప్పు రాజిరెడ్డి గురించే రాశాడని మనం భావించుకోవాలి. నేల మాళిగలో వేషం అంటే అర్థమేంటో, అక్కడ ఆ పద ప్రయోగం వల్లా ప్రయోజనం ఏంటో నాకు అర్థం కాలేదు. నాకు తెలిసి నేల మాళిగలు అంటే ఎవ్వరికి తెలియకుండా నేలలో రూపొందించే గరిచెలు. దీన్లో ధాన్యాన్ని దాస్తారు. ఇంకా ఇలాంటి పదప్రయోగాలు ఈ వ్యాసంలో ఎన్నో ఉన్నాయి. భాషా ప్రయోగ నైపుణ్యాలు కవుల్లో రచయితల్లో లేనప్పుడు ఇలాంటి దోషాలు దొర్లుతుంటాయి. దాదాపుగా తెలుగులో వస్తున్న అన్ని పత్రికల్లోని సాహిత్య పేజీలన్నీ ఇలాగే ఉంటున్నాయి. సోషల్‌ మీడియా సంగతి చెప్పనవసరం లేదు. ‘త్వంశుంఠ అంటే త్వంశుంఠ’ అని పొగ డ్తల పోస్టింగ్‌లు. 


మాటలు పేరిస్తే కవిత్వం కాదు. వాక్యాలు కూరిస్తే వ్యాసం, కథ, నవల, నాటకం కాదు. రాసే వారిలో ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసాలు ఉన్నప్పుడే వాళ్లు ఏది రాయా లనుకున్నారో అదే ప్రక్రియ రూపుదాలుస్తుంది. లేకుంటే ఏను గు బొమ్మను గీయబోతే.. కోతి బొమ్మ తయారవుతుంది.వివిధ పత్రికల్లో వ్యాసాలు, సమీక్షలు రాస్తున్న సాహితీ మిత్రులందరిని క్షమాపణ కోరుతూ.. మీ దండ, ఉద్ధండ పాం డిత్య ప్రకర్షకు, భాషా పటుత్వానికి నమస్కరిస్తూ, తెలుగు భాషపై ఉన్న ప్రేమ మూలంగా కందుకూరి వారి ‘సరస్వతి నారద సంవాదం’ ఖండ కావ్యాన్ని మనస్సులో ఉంచుకొని ఈ మాటలు రాశాను. మరొకసారి క్షంతవ్యుణ్ని.

- డాక్టర్‌ వి.వీరాచారి, 99636 10842


logo