గురువారం 09 ఏప్రిల్ 2020
Editorial - Jan 27, 2020 ,

బహుజన కవితా భాస్వరం

బహుజన కవితా భాస్వరం

వాగ్గేయకారుడు మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కారాన్ని (2019) నల్గొండకు చెందిన బెల్లి యాదయ్యకు అందిస్తున్నట్టు తెలంగాణ వికాస సమితి, చేతనా సాహితి ప్రకటించింది. మంచిర్యాలలో ఫిబ్రవరి రెండవ తేదీన జరిగే అవార్డు ప్రదాన సభకు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌ రావు, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్‌, రచయిత పి.చంద్‌ హాజరవుతారు.

‘నా పాద స్పర్శ ప్రసరించిన నేలలో

అడవి పొలం జమిలిగా పలకరిస్తాయి

నేను గొర్రెల్ని కాస్తుంటాను

మంద నా గురుకులం

తాత తండ్రులు నా ఉపాధ్యాయులు

కొండ కోన నా తరగతి గది

తడి దుక్కి  నా ముద్దుపలక

దుడ్డుకొన నా సుద్దముక్క

అనుదినం ఒక అధ్యాయం

బోడు బీడు నా ఆటస్థలం..’ అని ప్రకటించి, ఆ గతం నుంచే గొంతెత్తి, ఆ గతాన్నే తన అధ్యయనాంశంగా స్వీకరించి, నడక పొడుగూతా ఆ నేపథ్య పరిమళాన్ని పంచిన అక్షరం డాక్టర్‌ బెల్లి యాదయ్య. మట్టిలో పుట్టి మట్టిలో పెరిగిన ఆర్తి యాదయ్య. సారవంతమైన జీవన తాత్వికతను ఆవాహన చేసుకొని ఉదాత్తంగా ‘ఈ మట్టి వారసత్వాన్ని నేను’ అని ప్రకటించుకున్నకవి ఆయన.


భిన్నస్థలాల్లో భిన్న సందర్భాలలో అట్టడుగు, సగటు మనుషులు, మోస్తున్న పరివేదనలను రోదనలను సమర్థంగా తన కవిత్వంలో ఆవిష్కరించాడు. వస్తురూపాల పరంగా నిర్దిష్టమైన అభిప్రాయాలు కలిగిన కవిగా తన కవితల్లో భావాన్ని సులభ గ్రాహ్యంగా అందించి వస్తు నిర్వహణలో గమనంలో ఎక్కడా మార్మికతకు తావివ్వకుండా కవితను వినిపించడం యాదయ్య ప్రత్యేకత. అతని సమగ్రదృష్టి,నిజాయితీ, నిమగ్నత, నిబద్ధత ప్రతి కవితా పాదంలో పాఠకుడి గుండెని చుట్టు కుంటాయి. బెల్లి యాదయ్య కవి త్వ పాదాలు ఊట నీటి తీపిని, చెట్టు చేమల గాలిని వెంటబెట్టుకొని చదువరులను అల్లుకు పోతాయి. అతని కవి త్వం వర్తమానం ఎలా ఉందని మాత్రమే గాక, ఎలా ఉండాలన్న ఆదర్శాన్ని కూడా అంతర్లీనంగా ధ్వనింపజేస్తుంది. ఉత్పత్తికి మూలమైన వర్గాల ప్రగాఢ సంవేదనలని ఉద్విగ్నంగా వ్యక్తీకరిస్తూ..

‘ఆ గుడారం కింద /నిప్పుల తలగడ ఎప్పటికీ చల్లార దు /ఆ గువ్వల జంట పొగచూరిన కలల తోటల్లోకి గబ్బిలాలే తప్ప సీతాకోక చిలుకలు ఎప్పటికీ రావు’ అంటాడు. 


వీధి పక్క గుడారాల కింద పనిముట్లు పదును పెట్టే కొలిమి మనుషుల జీవనసమరాన్ని బొమ్మ కడతాడు.                                                                    ప్రపంచీకరణ వ్యాపారీకరణల నేపథ్యంలో తలకిందులైన జీవన విలువలు ఎంత అతలాకుతలం అవుతున్నాయో తెలుపుతూ.. ‘నిన్న సమస్య కానిది నేడు సమస్య అవుతుం ది/నిన్న బరువుగానిది విపరీతమైన బరువు అవుతుంది..’ అంటాడు.

ఛిద్రమౌతున్న రైతు హరిత స్వప్నం గురించి చెబు తూ.. ‘గట్లు నేనెక్కే మెట్లు /గాయం నా అనుభవం / నీడ నా సంభాషణ/ఆకాశం నా గొడుగు/పనిముట్లు నా ఆభరణాలు/నారుమడి నా పుణ్యక్షేత్రం/మట్టి నా స్పందన / ఏటి ఊట నా పాట..’ అంటూ రైతు జీవన ఘర్షణే అతని చిరునామాగా చెపుతాడు.  చివరలో.. ‘విచిత్రమల్లా / నా చేతుల్లో ముస్తాబైన బస్తా/ బస్తీ కెళ్ళి నా గొంతునే కత్తిరించడం.. విదారకమైన స్థితి..’ అని మన ఆలోచనల ముం దు వ్యవస్థ దుర్మార్గాన్ని నిలబెడతాడు

తెలంగాణ ఉద్యమ సందర్భంలో పదునైన తన ఆలోచనలను ఎక్కుపెట్టి నిర్లక్ష్యం నీడలోని నిర్వాకాలను ‘విభాజకం’ అనే దీర్ఘ కవితలో ఎండగట్టి ఉద్యమ ఆవేశాన్ని రగిలించాడు. మానవీయ విలువలకు ప్రతినిధిగా, బాధ్యత గల తండ్రిగా, సమాజానికి మార్గనిర్దేశం చేయగల వ్యక్తిత్వమూ కలగలిసిన తన తండ్రి సాయిలు  స్మృతిలో ‘తర్జు మా’ దీర్ఘ కవితను వెలువరించాడు.


యాదయ్య పద్యరచనలోనూ  తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ ‘విబుధ వరుల లొల్లి వినర బెల్లి’ మకుటం తో ఛాందసవాద భావాలపై  ఆటవెలది శతకాన్ని రచించాడు. ‘కలలోన కనిపించి /తాత విలపించిండు / మనవడా మన ఊరి జాడ ఏదంటూ / పాటలు కట్టి కదిలించిండు’ అంటూ.. దళిత బహుజన తెలంగాణ ఉద్యమాల లో పద్యం, పాట, వచన కవిత మూడు రూపాలలో ఒకటిన్నర దశాబ్దం పాటు పోరాట చైతన్యానికి ఊతమిచ్చిన ఉద్యమ కవి బెల్లి యాదయ్య.

యాదయ్య కవిత్వ సంస్కృతి మట్టి మనుషుల సంస్కృతి. స్వభావం మూగజీవాల కడుపు నింపే కన్నపేగు స్వభావం. అతని వాక్యాలు పల్లెకు పట్టణాని కి మధ్య రక్త వాహకాలు.


తన ఇరవై ఏళ్ల సాహిత్య ప్రయాణం సాక్షిగా ‘నేను గొర్రెలు కాస్తుంటాను’, ‘బోధి వృక్షం’ కవితా సంపుటాలను, ‘విభాజకం’ అనే  దీర్ఘ కవితను అందించాడు. 

‘అడవుల కవచాన్ని విప్పి / అణుధార్మికతను తొడుక్కో లేను / సిల్వర్‌ మెనూ మ్యూజిక్‌లో పడి / సిర్రా సిటికెన పుల్లల్ని కాల్చేయలేను..’ అంటూ ప్రపంచీకరణ పెత్తనాన్ని తిరస్కరించాడు. మనుషుల పట్ల అమితమైన ప్రేమతో త్యాగాల తీరాల దాకా సాగి రాగల భావుకుడుగా స్వేచ్ఛ కోసం పరితపిస్తూ ఉద్యమ బోధివృక్షం కింద తన ఆలోచనలను కవితల సైన్యంగా సమీకరించాడు. ‘లోహ నదులను త్రవ్వే రుజుమార్గంలో దుఃఖమే చివరిదాకా వెంట వచ్చే సహచరి..’ అంటాడు యాదయ్య.


బెల్లి యాదయ్య ‘మా ఊరు అట్లాలేదు’ కవితా సంపుటిలో కవిగా ప్రత్యేకంగా ఏదో ఉద్బోధిస్తున్నట్టుగా గాక కవితలన్నిటిలో తానే స్పష్టంగా, స్వచ్ఛంగా కనబడటం మనం గమనిస్తాం. తన అక్షరాలతో ఓ కాలిబాటను తవ్వుకుంటూ ముందుకు సాగడం, తన కవితలు వెదజల్లే మట్టి పరిమళాన్ని హృదయాలలో నింపడం అనుభూతిస్తాం. చెప్పే అంశాన్ని చరణాలు చరణాలుగా స్పష్టపరుచుకుం టూ, వివరణను పెంచుతూ ఓ పరిపూర్ణ లక్ష్యానికి చేర్చ టం ఆయన ప్రత్యేక శైలి.

లోకంతీరును ఎండగట్టే రీతిలో రాసిన ‘పాంచజన్యం’ కవిత ఆయన పలవరింత.


‘యుద్ధ్భూతం/రక్తాన్ని జుర్రుకు తాగాక సంధి గురిం చి/ శోంచాయిస్తున్నాడొక శాంతిదూత..’ అంటాడు.

విగ్రహానికి ఉన్న గొప్పతనాన్ని ఇదువరకు ఏ కవీ స్ప శించలేదు. ‘విగ్రహం అంటే/ఏ కదలికాలేని/లాన్లో మొలచిన రాతి చెట్టుకాదు/ దిక్కులేని వాళ్లకు దిక్కుగా/నిలిచిన జ్ఞాన నేత్రం/సామాన్యుడే/విగ్రహాలకు నిజమైన పూజా రి..’ విగ్రహాల పట్ల గౌరవాన్ని పెంచే పదాలివి.

మనసు చుట్టూ ఒక కమ్మటి మట్టి వాసన అద్దడమే కాదు, కవిత్వం కవులకు ఆరో ఇంద్రియం అంటాడు కవి బెల్లి యాదయ్య. యాదయ్య కవిత్వంలో వైశాల్యం వుం ది. భావ శబలత ఉంది. ఊహాబలం వుంది. నిర్ధిష్టమైన లక్ష్యంవుంది. కవిత్వం నిండా పల్లె జీవిత నేపథ్యం, పరిణామం, తెగని తలపోత, వెనకడుగు వేయని సాహసం అల్లుకుపోయి కనిపిస్తాయి.


దార్శనికుడు అయిన కవిగా  ‘ఇప్పుడిక మనం మనం గా బతకడం నేర్పే / బడి ఎక్కడన్నా ఉంటే చేరిపోవాలి / మంచితనం పలక మీద /మనిషిని పెట్టివ్వగల గురువెక్కడన్నా ఉంటే/సాగిలపడి శిష్యరికం చేయాలి ..’ అంటాడు.

అజంతా ‘స్వప్నలిపి’,‘నగ్నముని’ పై విశేష పరిశోధన చేసి స్వర్ణపతకాలను గెలుచుకున్న బెల్లి యాదయ్య తన లక్ష్యాన్ని కవితా లక్ష్యాన్ని వివరిస్తూ ‘రాజీ పడటానికో పారిపోవటానికో మనం ఇక్కడికి రాలేదు/ పోరాడటానికే వచ్చాం/ఈ చీకటి శతాబ్దాన్ని సూర్యుడి వైపు తిప్పి/ రేపటి తరం దోసిట్లో పెడదాం..’ అంటూ కాంతి వలయాల దారుల నుంచి స్వచ్ఛ స్పటికంలా వెలుగుల్ని వెదజల్లు కుంటూ కవిగా కదిలి పోతున్నాడు.

బహుముఖీన సాహితీ వ్యక్తిత్వం, బహుజన కవితా భాస్వరం, ఉత్పత్తి సృష్టికర్తల స్వరం డాక్టర్‌ బెల్లి యాదయ్య. 

- వఝల శివకుమార్‌, 94418 83210 

 

(డాక్టర్‌ బెల్లి యాదయ్యకు ‘ గాయాల గోదారి పాట’ 

మల్లోజ్జల సదాశివుడు 12వ స్మారక పురస్కారం 

ఇస్తున్న సందర్భంగా.. )


logo