శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Editorial - Jan 26, 2020 , 22:50:59

వినంగనే

వినంగనే

దాగిన కాంక్షల మీద ఫ్లడ్‌లైట్‌ పడాలె

హాయిగ ప్రాణవాయువు లంగ్స్‌లకెళ్లాలె

సచ్చిన కట్టెల సూర్యుడో చంద్రుడో నర్తించాలె

కళ్ల వెనుక రసాయనిక చర్య పోటెత్తాలె

ఫ్రేములన్నీ వ్యతిరేక దిశల ప్రసరించాలె

పెదిమెలల్ల ఇసుక తుఫాన్‌ చెలరేగాలె

రక్తనాళాలల్ల పేరుకున్నది కాస్తయినా కరగాలె

దుర్వాసనకు ముక్కులు మూతపడాలె

అజ్ఞాత ఆగ్రహం అగ్నిపర్వతమై పగలాలె

పురుగు సీతాకోక చిలుకై విరజిల్లాలె

రెక్కలు తెగిన పక్షి విహాయసంల విజృంభించాలె

దగ్ధమవుతున్న కంటిల వానచినుకు పడాలె

భృకుటి మీసంతో తలపడాలె

ఉష్ట్రపక్షి ఉశికను తన్నేసి కక్ష్యలో ప్రవేశించాలె

నొసటిల నదుల కరకట్టలు తెగాలె

శరీర ఏ గ్రంధినుంచైనా ఒక చుక్క రాలిపడాలె

మునిగినట్లో తేలినట్లో

అడుగు తాకినట్లో తాకనట్లో

తీరం దొరికినట్లో దొరకనట్లో

తల్లడంమల్లడం కావాలె

కవిత వినంగనే

- సుంకిరెడ్డి నారాయణరెడ్డి,  99089 95645


logo