గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Jan 25, 2020 ,

దావోస్‌లో తెలంగాణ

దావోస్‌లో తెలంగాణ

విశ్వవ్యాప్త పోకడలను గమనిస్తూ, మౌలిక వసతులు కల్పిస్తూ, పారిశ్రామికవర్గాలను ఆకర్షిస్తూ, మరోవైపు తెలంగాణ సమాజాన్ని అందుకనుగుణంగా సమాయత్తం చేయడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. హైదరాబాద్‌తోపాటు జిల్లాలను కలుపుకొని మొత్తం తెలంగాణనే సాంకేతిక ఆవిష్కరణల ఊయలగా మార్చాలన్న కృషి సాగుతున్నది. ఈ విప్లవాత్మక మార్పులలో తెలంగాణ భాగస్వామ్యం ఎంతనేది ప్రభుత్వం దారులు వేయడంపైనే కాదు, ప్రజలు అందిపుచ్చుకోవడంపై కూడా ఆధారపడి ఉంటుంది.

ప్రపంచ ఆర్థిక వేదిక యాభయ్యవ వార్షిక సదస్సు సందర్భంగా దావోస్‌లో తెలంగాణ ప్రభ మిలమిలలాడటం గర్వించదగిన విషయం. ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతికరంగాల్లో సాగుతున్న ఆవిష్కరణలు, పారిశ్రామిక పోకడల పట్ల సంపూర్ణ అవగాహన గల యువ మంత్రి కేటీఆర్ దావోస్ వేదికను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్న తీరు అభినందనీయం. విషయ పరిజ్ఞానం, చతురత గల కేటీఆర్ నాలుగురోజుల పాటు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపి ప్రధాన ఆకర్షణ గా నిలిచారు. తెలంగాణ పెవిలియన్ కూడా ప్రత్యేకమైందిగా నిలిచింది. ఆయన తెలంగాణకే పరిమితం కాకుండా భారత్ తరఫున వకాల్తా పుచ్చుకొని ఇక్కడ పెట్టుబడులకు గల మెరుగైన అవకాశాలను వివరించడం విశేషం. ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ నేషన్ అనే అంశంపై జరిగిన ప్యానెల్ డిస్కషన్‌లో మాట్లాడుతూ ఇరువై నుంచి నలభై సంవత్సరాల వయసున్న యువతను కలిగి ఉండటం భారత్ అనుకూలాంశమని వివరించారు. ఇదేరీతిలో ఉత్పత్తి వ్యయం తక్కువగా, నాణ్యత ఎక్కువగా ఉండేవిధంగా తెలంగాణలో నెలకొన్న పారిశ్రామిక ఆవరణాన్ని కళ్ళకు కట్టారు.  కృత్రిమ మేధ ఆవిష్కరణల్లో అగ్రస్థానం కోసం తెలంగాణ సాధిస్తున్న కృషిని వెల్లడించా రు. దావోస్‌లో వివిధ వేదికలపై మాట్లాడుతూ నేను 2020 గురించే కాదు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా అంటూ వివిధ రంగాలలో ఆవిష్కరణలను, తదనుగుణమైన ప్రోత్సాహాన్ని వివరించిన తీరు పారిశ్రామిక దిగ్గజాలను ఆకట్టుకున్నది. ఈ సదస్సుకు వచ్చిన ప్రముఖులు తెలంగాణ విధానాలను ప్రస్తావించడం గమనార్హం. మన గురించి మనం చెప్పుకోవడం కాదు, ఇతరులు ప్రశంసించే స్థాయికి తెలంగాణ ఎదిగింది!

దావోస్‌లో తెలంగాణ పేరు మారుమోగిందీ అంటే ఆ ప్రతిష్ఠ ఒక్క నాటితో వచ్చింది కాదు. ఏదో మీడియా మేనేజ్‌మెంట్ ద్వారా సాగించిన స్వీయ ప్రశంస అంతకన్నా కాదు. కేసీఆర్ పరిణ త నాయకత్వంలో ఆరేండ్లుగా తెలంగాణ సాధించిన సర్వతోముఖాభివృద్ధి తెలిసిందే. ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తూనే, గ్రామీణ, వ్యవసాయరంగాలకు ప్రాధాన్యం ఇస్తూనే, సులభ వాణిజ్యానికి దారులు ఏర్పాటుచేయడం అసాధారణం. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి రాష్ర్టాన్ని ప్రపంచ పారిశ్రామిక పటంపై నిలబెట్టడంతో కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దేశ విదేశాల్లోని పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఇక్కడి సౌకర్యాలను, అనుకూలాంశాలను వారికి వివరిస్తున్నారు. పారిశ్రామికవేత్తల ఆంతరంగా న్ని గుర్తించి తదనుగుణమైన రీతిలో విధానపరమైన మార్పులను చేపట్టారు. ప్రపంచంలో ఏయే సాంకేతిక రంగాలలో మార్పులు వస్తున్నా యో పసిగట్టి వాటికి ఇక్కడ పునాదులు వేస్తున్నా రు. ప్రపంచం నాలుగవ పారిశ్రామిక విప్లవం దిశగా సాగుతున్నది. మనదేశం మొదటి మూడు విప్లవాలను అందుకోలేకపోయింది. ఈసారి డిజిటల్ విప్లవాన్ని కోల్పోకూడదు అంటూ పట్టుదలగా చెబుతుంటారాయన. కొత్త ఆవిష్కరణల్లో మనం ఇప్పటికే అందె వేసిన చేయిగా నిరూపించుకున్నామని కేటీఆర్ ఒక సందర్భంలో ధీమాగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఔషధరంగం మొదలుకొని భిన్నరంగాల స్టార్టప్‌ల వరకు అన్నిరంగాల్లో హైదరాబాద్ కేంద్ర స్థానంగా మారిన వాస్తవాన్నే ఆయన దావోస్ వేదికగా ప్రపంచానికి చాటగలిగారు. ఒకప్పుడు తెలంగాణ ఏర్పడితే ఎట్లా ఉంటుంది, హైదరాబాద్ భవితవ్యం ఎట్లా మారుతుందంటూ అనుమానాలు సృష్టించిన వారు తలదించుకునేవిధంగా మన రాష్ట్రం అభివృద్ధిపథంలో పురోగమించడం గర్వదాయకం.

ప్రతి సాంకేతిక విప్లవానికి తెలంగాణ వేదిక కావాలనే స్వప్నం సాకారమయ్యే దిశలో రాష్ట్ర ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలు అబ్బురపరుస్తున్నాయి. దాదాపు వెయ్యి కోట్లతో తలపెట్టిన ఇమేజ్ (ఇన్నోవేషన్ ఇన్ మల్టీమీడియా, యానిమేషన్, గేమింగ్ అండ్ ఎంటెర్టయిన్‌మెంట్) టవర్స్ దృశ్య మాయాజాలంలో ప్రపంచానికి మణిమకుటం కాబోతున్నది. దీనిని ఒకటి రెండేండ్లలో పూర్తిచే యాలనే దృఢ సంకల్పంతో ఉన్నట్టు కేటీఆర్ వెల్లడించారు. టీవీ వీక్షణంలో వచ్చిన (ఓటీటీ) వచ్చిన విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో హైదరాబాద్‌లో సాగుతున్న కృషి విశేష ప్రాధాన్యం సంతరించుకోనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో వేలాదిమంది నిపుణులు ఈ రంగంలో నిమగ్నమై ఉన్నారు. కృత్రిమ మేధ అన్నిరంగాలను శాసించబోతున్న మరో అద్భుత ఆవిష్కరణ. ఇందులోనూ మనం వెనుకబడకూడదంటూ తెలంగాణ ప్రభుత్వం 2020-30ని కృత్రిమ మేధ దశాబ్దంగా ప్రకటించింది. బ్లాక్‌చైన్ టెక్నాలజీని కూడా విస్మరించకుండా ఈ రంగంలో ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. వాస్తవానికి సాంకేతికరంగంలో అత్యంతవేగంగా వస్తున్న మార్పులు అసాధారణమైనవి. కొత్త ఆర్థి కవ్యవస్థలో వ్యాపారరంగం కూడా విప్లవాత్మక మార్పులకు గురికాబోతున్నది. విశ్వవ్యాప్త పోకడలను గమనిస్తూ, మౌలిక వసతులు కల్పిస్తూ, పారిశ్రామికవర్గాలను ఆకర్షిస్తూ, మరోవైపు తెలంగా ణ సమాజాన్ని అందుకనుగుణంగా సమాయత్తం చేయడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. హైదరాబాద్‌తోపాటు జిల్లాలను కలుపుకొని మొత్తం తెలంగాణనే సాంకేతిక ఆవిష్కరణల ఊయలగా మార్చాలన్న కృషి సాగుతున్నది. ఈ విప్లవాత్మక మార్పులలో తెలంగాణ భాగస్వామ్యం ఎంతనేది ప్రభుత్వం దారులు వేయడంపైనే కాదు, ప్రజలు అందిపుచ్చుకోవడంపై కూడా ఆధారపడి ఉంటుంది. 


logo