శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Jan 25, 2020 ,

పబ్లిక్‌లో రిపబ్లిక్

పబ్లిక్‌లో రిపబ్లిక్

భారతదేశానికి బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా డొమినియన్ స్థాయిని కోరుతూ మోతీలాల్ నెహ్రూ కమిటీ చేసిన ప్రతిపాదనను 1929లో కలకత్తా కాంగ్రెస్ మహాసభ ఆమోదించింది. అయినప్పటికీ, యువనేతలు జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ పట్టువదలక లాహోర్ కాంగ్రెస్ మహాసభలో సంపూర్ణ స్వాతంత్య్ర సాధన లక్ష్యానికి అనుకూలంగా తీర్మానం చేయించారు. తత్ఫలితంగా డొమినియన్ స్థాయి ప్రతిపాదన, ఆలోచన శాశ్వతంగా మూలనపడ్డాయి.

సీఏఏ, ఎన్‌పీఆర్ వెనుక ఏదో బూచీ ఉన్నదన్న అనుమానంతోనే దేశమంతటా లక్షలాది విద్యార్థులు, యువతీయువకులు, అధ్యాపకులు,ఆచార్యులు, విద్యావేత్తలు, మేధావులు, వివిధవర్గాల వారు స్వచ్ఛందంగా ప్రతిఘటన ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. స్వతంత్ర భారతంలో ఇది ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాజ్యాంగరక్షణకు అపూర్వ పరిణామం. ఈ ఉద్యమాల్లో యువశక్తి అగ్రగామిగా నిలువడం, అహింసా విధానాల పట్ల యువశక్తి విశ్వాసం ప్రకటించడం విశేషం.

ఆత్రగాడికి బుద్ధి తక్కువ.. అంటారు. అది నూటికి నూరుపాళ్లు నిజమని దేశంలో కొన్నాళ్ల నుంచి సంభవిస్తున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. హిందీ భక్త కవుల్లో అగ్రగణ్యుడు కబీర్‌దాస్ కాల్ కరైసో ఆజ్‌కర్, ఆజ్ కరైసో అబ్ కర్, పల్ మే ప్రలయ్ హోయగి అని చెప్పిన మాట, చేసిన ఉద్బోధ నిజమే. మం చి పనులు త్వరగా జరుగాలన్న ఉద్దేశంతో, ఏదో సాకుతో వాయిదా పడరాదన్న అభిప్రాయంతో కబీర్ ఈ హిత వాక్యాలు పలికి ఉంటారు. నష్ట, కష్టదాయకమైన చెడు పనులకు, దుష్ట చేష్టలకు కబీర్ ఉద్బోధ వర్తించదనుకోవాలె. మా బడి హెడ్ మాస్టర్ కుల్‌కర్ణీజీ ప్రతిరోజు ఉదయం పది గంటలకు ఉపనిషత్ శ్లోకంతో విద్యార్థుల ప్రార్థన ముగియగానే ఏదో ఒక అంశం మీద గంభీరంగా హిందీలో ప్రసంగించేవాడు. ఆయన గొప్ప వక్త. ఆయన దైనిక ప్రసంగాలు విజ్ఞానదాయకమైనవి, విద్యార్థులలో విజ్ఞాన పిపాసను రేకెత్తించి ఉత్తేజపరిచేవి. పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం లోని మరఠ్వాడా ప్రాంతంలో కుల్‌కర్ణీజీ ప్రముఖ స్వాతంత్య్రయోధుడు. భారత స్వాతంత్య్ర, జాతీయ ఉద్యమాలపై, స్వాతంత్య్ర యోధులపై కుల్‌కర్ణీజీ హిందీలో ఉత్తమ గ్రంథాలు రచించారు. కుల్‌కర్ణీజీ ప్రధాన ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు తెలుగులో గణితం పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు శాస్త్రిగారు తర్వాత చరిత్ర పరిశోధన రంగంలో ప్రవేశించి, డిగ్రీలు పొంది కాకతీయ చరిత్ర ఉద్గ్రంథం రచించారు-మారేమండ, మల్లంపల్లి, కొమర్రాజు, పుట్టపర్తి, ప్రభృత చరిత్రకారుల శ్రేణిలో ప్రసిద్ధి పొందారు శాస్త్రిగారు. కుల్‌కర్ణీజీ విద్యార్థుల ప్రార్థనానంతర ప్రసంగాల్లో కేవలం కబీర్ కే దోహె అంశంపై మూడురోజులు ప్రసంగించి ముగ్ధపరిచారు. పల్‌మె ప్రలయ్ హోయగీ (తృటిలో ప్రళయం వస్తుంది!) అన్నంత వేగిరపాటుతో గత ఆరేండ్ల నుంచి దేశ పరిపాలనారంగంలో విపరీత పరిణామాలు సంభవిస్తున్నాయి. అధికారం ఉన్నప్పుడే అనుకున్నవన్నీ చేయాలను కుంటున్నారేమో! దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకున్న ట్లు! అధికారం అతిచంచల; తిరిగి దరికి వస్తుందో లేదో అన్న ఆదుర్దా. 2016 నవంబర్‌లో హఠాత్తుగా ప్రకటితమైన నోట్లరద్దు కొంప ముంచుతుందని హెచ్చరించినవాళ్లు అవహేళనకు గురైనారు. అప్పటికే తిరోగమిస్తున్న దేశ ఆర్థికవ్యవస్థ నోట్లరద్దుతో మరింత దిగజారుతుందని విశ్లేషిం చి విమర్శించిన వారి మాటలు అక్షరాల నిజమవుతున్నాయి. భారత ఆర్థికవ్యవస్థ అన్నిరంగాల్లో-వ్యావసాయక, పారిశ్రామిక, ఉద్యోగకల్పన, ఎగుమతులు, దిగుమతులు-కృంగి కృషిస్తున్నదన్న మాటలు నగ్నసత్యాలని భారత ప్రభుత్వం ప్రకటిస్తున్న అంకెలు వెల్లడిస్తున్నాయి. 

భారత ఆర్థికవ్యవస్థ వార్షిక వృద్ధిరేటు 4.8 శాతానికి దిగజారిందని అంతర్జాతీ య ద్రవ్యనిధి సంస్థ నిన్నగాక మొన్న ప్రకటించి నిజమైన దేశభక్తులకు దిగ్భ్రాంతి కలిగించింది. నిజానికి, వార్షిక వృద్ధిరేటు ఇంతకన్నా తక్కువ గా ఉంటుందంటున్న వారున్నారు. నానాటికీ తీసికట్టు నాగంభొట్టు అన్నట్లుగా ఉన్నది దేశ ఆర్థిక పరిస్థితి. నాయనా, నువు వెనుకకు నడుస్తున్నావు అని శ్రేయోభిలాషులు హెచ్చరిస్తున్నా లేదు, నేను ముందుకే వెళ్లుతున్నాను అని గోతిలో పడేవాడు, ఆత్మవంచన చేసుకునేవాడు మూర్ఖు డు. 130 కోట్ల మంది భారతీయులకు మతం మందుతో మత్తెక్కించి, కైపులో ఉన్నవాళ్లను కాటిలోకి నెట్టేవాళ్లు మూర్ఖ శిఖామణులు. మా హెడ్‌మాస్టర్ తన ఒక ప్రసంగంలో కె.ఎమ్.మున్షీకి (కనయ్య లాల్ మానిక్‌లాల్ మున్షీ) హైదరాబాద్ సంస్థానంలో రాచరికవ్యవస్థ పతనంతో గల కీలక సంబంధం గురించి వివరించారు. మున్షీ భారత జాతీయ నాయకుల్లో ఒకరు. గాంధీజీకి, అంతకన్నా ముఖ్యంగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు సన్నిహితుడు. మహామేధావి, న్యాయశాస్త్ర నిష్ణాతుడు మున్షీజీ గ్రంథ రచయిత, చరిత్ర పరిశోధకుడు, భారతీయ విద్యాభవన్ స్థాపకుడు-కొంతకాలం మున్షీజీ జవహర్‌లాల్ ప్రభుత్వంలో క్యాబినెట్ హోదా మంత్రి. అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పాటైన స్వతంత్ర భారత రాజ్యాంగ రచన కమిటీలో మున్షీజీ సభ్యుడు. విదేశీ ఆక్రమణదారులు విధ్వంసం చేసిన సోమనాథ్ దేవాలయాన్ని (గుజరాత్) పునరుద్ధరించాలన్న మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ కోరికను సమర్థవంతంగా పూర్తిచేసిన హైందవ ధర్మ-ఆధ్యాత్మిక భావసంపన్నుడు మున్షీ ఈ దేశంలోని విభిన్న మతాల విశిష్ట సంస్కృతికి, వైవిధ్యానికి ఇచ్చిన ప్రాధాన్యం సాటిలేనిది. ఆయన మాటల్లోనే 

...We cannot reject the art, the manners, the institutions, which Hindu-Muslim adjustmen -ts have given birth to. We cannot even throw off  the west ern influence and institutions which have grown into our li -fe... Indian culture is a living force. It absorbs alien elem -ents when necessary...

మున్షీజీ వంటి పెద్దల మాటలకు నేటి పాలకులు విలువ ఇచ్చినట్లయి తే సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్నార్సీ వివాదాలు చెలరేగి దేశం విచ్ఛిత్తి మార్గంలోకి వెళ్లేది కాదు. ఈ దేశంలో 1872లోనే, ఆంగ్లేయపాలన రోజుల్లోనే, జనాభా వివరాల సేకరణ (సెన్సస్) మొదలైంది. 2011లో జరిగింది 15వ సేకరణ. రేపు 2021లో జరుగనున్నది 16వ సేకరణ. పదేండ్లకోసారి జనాభా వివరాల సేకరణ జరుగుతున్నది అతి ప్రశాంతంగా. ప్రభుత్వాలు, పాలకులు ఎప్పటికప్పుడు, కాలానుగుణంగా అవసరమని భావించిన వివరాలన్నిటిని, సమాచారం అంతటిని ఈ సేకరణతో క్రోడీకరించడం జరుగుతున్నది. జనాభా వివరాల సేకరణపై ఇప్పుడు చెలరేగుతున్న వివాదాలు, తగాదాలు, తన్నులాటలు, వాదనలు ఇంతకు ముందెన్నడూ చెలరేగలేదు. అప్పటి పాలకులకు రహస్య ఎజెండాలేవీ లేవు గనుక వివాదాలు చెలరేగలేదు-నిరసన, ప్రతిఘటన ఉద్యమాలకు నాడు ఆస్కారం ఏర్పడలేదు. ఇప్పుడు రహస్య ఎజెండా ఉంది గనుక, చెప్పేదొకటి చేసేది మరొకటి గనుక వివాదాలు చెలరేగాయి; నిరసన, ప్రతిఘటన ఉద్యమాలు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వాలు, పాలకులు సకారాత్మక (పాజిటివ్) విధానాలు అనుసరించినప్పుడు సమస్యలుండవు, సత్ఫలితాలుంటాయి, ప్రభుత్వాలు, పాలకులు నకారాత్మక (నెగెటివ్) విధానాలు అనుసరించినప్పుడు అన్నీ సమస్యలే-నిరసనలు, ప్రతిఘటనలు అనివార్యమవుతాయి. 2016 నవంబర్‌లో నోట్లరద్దు ప్రకట న జరిగేవరకు రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌కు కూడా ఆ సంగతి తెలియదంటే అదెంత నకారాత్మక చర్యో ఊహించడం కష్టం కాదు. 

2019 ఆగస్టు 5న, జమ్ముకశ్మీర్‌కు 70 ఏండ్ల నుంచి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370వ ఆర్టికల్‌ను రద్దుచేశారు లేక నిర్వీర్యపరిచారు. ఆగస్టు 4న జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు రాష్ట్ర గవర్నర్‌ను కలి సి ఏమవుతున్నది అని ఆందోళనతో అడిగితే ఏమీ కావడం లేదు. ఆం దోళన వద్దు అని మెల్లగా చెప్పాడు. ఎందుకంత రహస్యం? ఇప్పటి జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం. ఈ ప్రాంతం లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మూడు, నాలుగురోజుల కిందట ఒక ప్రకటన జారీచేసి ఇప్పుడు జమ్ముకశ్మీర్‌లో అంతటా ప్రశాంతంగా ఉన్నదన్నాడు, శాంతిభద్రతల సమస్యలు లేవన్నాడు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మాజీ ముఖ్యమంత్రులను నిర్బంధం నుంచి ఎందుకు విడుదల చేయడం లేదో చెప్పలేదు; ఇటీవల భారత ప్రభుత్వ అతిథులుగా వచ్చి జమ్ముకశ్మీర్‌లో పర్యటించిన 15 దేశాల రాయబారులు ఏమన్నారో కూడా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ చెప్పలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకోవడానికి కుతూహలపడుతున్నప్పుడు జమ్ముకశ్మీర్ అంతర్గత సమస్య ఏ విధంగా అవుతుందో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ చెప్పలేదు! ఎందుకంత కుట్ర? సీఏఏ, ఎన్‌పీఆర్ వెనుక ఏదో బూచీ ఉన్నదన్న అనుమానంతోనే దేశమంతటా లక్షలాది విద్యార్థు లు, యువతీయువకులు, అధ్యాపకులు, ఆచార్యులు, విద్యావేత్తలు, మేధావులు, వివిధవర్గాల వారు స్వచ్ఛందంగా ప్రతిఘటన ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. స్వతంత్ర భారతంలో ఇది ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాజ్యాంగరక్షణకు అపూర్వ పరిణామం. ఈ ఉద్యమాల్లో యువశక్తి అగ్రగామిగా నిలువడం, అహింసా విధానాల పట్ల యువశక్తి విశ్వాసం ప్రకటించడం విశేషం.

70 ఏండ్ల కిందట 1950లో భారత రిపబ్లిక్ యువశక్తి చొరవ, పట్టుదల వల్ల అవతరించింది. ఇది జగమెరిగిన సత్యం. 1950లో భారత రిపబ్లిక్ అవతరణకు 1929 డిసెంబర్ 31న లాహోర్‌లో రావీ నదీతీరా న జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలో అంకురార్పణ జరిగింది. డొమినియన్ స్థాయికి భిన్నంగా సంపూర్ణ స్వాతంత్య్ర సాధన లక్ష్యానికి అనుగుణంగా ఈ మహాసభలో చరిత్రాత్మక తీర్మానం జరిగింది. భారత దేశానికి బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా డొమినియన్ స్థాయిని కోరుతూ మోతీలాల్ నెహ్రూ కమిటీ చేసిన ప్రతిపాదనను 1929లో కలకత్తా కాంగ్రెస్ మహాసభ ఆమోదించింది. అయినప్పటికీ, యువనేతలు జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ పట్టువదలక లాహోర్ కాంగ్రెస్ మహాసభలో సంపూర్ణ స్వాతంత్య్ర సాధ న లక్ష్యానికి అనుకూలంగా తీర్మానం చేయించారు. తత్ఫలితంగా డొమినియన్ స్థాయి ప్రతిపాదన, ఆలోచన శాశ్వతంగా మూలనపడ్డాయి. 1930 జనవరి 26న దేశమంతటా స్వాతంత్య్రదినం జరుపాలని లాహో ర్ మహాసభ పిలుపునిచ్చింది. అది నాటి యువశక్తి విజయం. ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ఈరోజు భారత రిపబ్లిక్ ఠావుల్ తప్పెను...కావవే వరద అంటూ భారత యువశక్తి సహా యం అర్థిస్తున్నది.


logo