గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Jan 23, 2020 ,

ఫిరాయింపు సమస్య

ఫిరాయింపు సమస్య

ఫిరాయింపులను అరికట్టడానికి, రాజకీయాల్లో ధన ప్రభావాన్ని, అవినీతిని రూపుమాపడానికి 1985లో ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని తెచ్చారు. ఆనాడు రాజీవ్‌గాంధీ ప్రభుత్వానికి భారీ మెజారిటీ ఉన్నప్పటికీ, ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం గమనార్హం. అయితే ఈ చట్టం ఆచరణలో విఫలమైంది. మూడోవంతు సభ్యులు విడిపోతే చీలికగా గుర్తించాలనే నిబంధన కూడా ఫిరాయింపులకు ఉపయోగపడ్డది. దీంతో మూడింట రెండు వంతులు విడిపోతేనే చీలికగా గుర్తించాలని చట్టాన్ని మార్చారు. అయితే స్పీకర్‌ బలహీనత అధికార పార్టీలకు బలంగా మారింది.

ప్రజా తీర్పును అపహాస్యం చేసే ఫిరాయింపుల పట్ల స్పీకర్‌లు చర్యలు తీసుకోలేకపోతున్న నేపథ్యంలో ఈ బాధ్యతల నిర్వహణకు ప్రత్యేక ట్రిబ్యునల్‌ ఉండాలంటూ సుప్రీంకోర్టు చేసిన సూచన పరిశీలనార్హమైనది. ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలని పరమోన్నత న్యాయస్థానం పార్లమెంట్‌ను కోరింది. ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించిన రాజ్యాంగంలోని పదవ షెడ్యూ లు ప్రకారం-ఫిరాయింపులకు సంబంధించి అంతిమ నిర్ణయం స్పీకర్‌దే. దీనిపై సమీక్షకు, అప్పీ లుకు ఆస్కారం లేదు. ఈ నేపథ్యంలో ఫిరాయింపు వ్యతిరేక చట్టం ప్రకారం- శాసనసభ్యుడిని అనర్హుడిగా ప్రకటించాలా వద్దా అనే నిర్ణయాధికారాన్ని స్పీకర్ల పరిధి నుంచి తొలిగించాలని సుప్రీం కోర్టు మంగళవారం స్పష్టంచేసింది. అధికారం లేదా ధనం కోసం పార్టీలు మార్చే ఎంపీ లేదా ఎమ్మెల్యే భవితవ్యాన్ని నిర్ణయించడానికి స్వతంత్ర ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేయాలని సూచించిం ది. ఫిరాయింపు వ్యవహారంపై సభలోనే నిర్ణయం జరుగకుండా, బయటివారికి అప్పగించాలనే అభిప్రాయాన్ని కూడా ధర్మాసనం వ్యక్తంచేసింది. న్యాయమూర్తులపై నిర్ణయం కూడా బయటి వారితోనే జరుగుతాయనే హేతుబద్ధతను ఇందుకు ప్రాతిపదికగా చూపింది. పదవీ విరమణ పొం దిన న్యాయమూర్తి నేతృత్వంలో ట్రిబ్యునల్‌ ఉండాలని సూచించింది. స్పీకర్‌ పదవి చేపట్టిన తర్వా త కూడా రాజకీయ వాసనలు వదలడం లేదనేది వాస్తవం. అందుకనే ఒక రాజకీయపార్టీ సభ్యుడైన స్పీకర్‌ ఫిరాయింపుదారుపై ఏకైక న్యాయనిర్ణేత కావడమేమిటనేది ముగ్గురు సభ్యులతో కూడి న ధర్మాసనం ప్రశ్నించింది. ఫిరాయింపుదారుపై సత్వర, నిష్పక్షపాత చర్య తీసుకోగలిగినప్పుడే చట్టానికి పదును ఉంటుందని న్యాయమూర్తి నారిమన్‌ తన తీర్పులో అభిప్రాయపడ్డారు. అనర్హుడైన వ్యక్తి ఒకరోజు కూడా అదనంగా ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా కొనసాగడానికి అర్హుడు కాదని అన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో స్పీకర్‌ ఎంతకాలంలో నిర్ణయం తీసుకోవాలనేది కూడా ధర్మాసనం సూచించింది. సాధారణంగా స్పీకర్‌ మూడునెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డది.

చట్టసభ స్పీకర్‌ పదవి అత్యంత గౌరవనీయమైనది. స్వతంత్ర భారత చరిత్రలో ఎంతో మం ది రాజకీయవేత్తలు స్పీకర్‌ పదవికి వన్నె తెచ్చా రు. కానీ ఫిరాయింపు చట్టాన్ని అమలుచేసే దశ లో మాత్రం స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. స్పీకర్‌ ఎటువైపు నిర్ణ యం తీసుకున్నా, అవతలి పక్షం విమర్శించడం వేరు. కానీ స్పీకర్‌ అధికారపక్షానికి అనుగుణం గా వ్యవహరించడమే గర్హనీయమైనది. అధికార పక్షానికి వ్యతిరేకంగా వ్యవహరించలేకపోతున్న నిస్సహాయత వారిని కూడా బాధపెట్టడం సహ జం. దీనివల్ల స్పీకర్‌ పదవికున్న ప్రతిష్ఠకు భం గం వాటిల్లుతున్నదనే ఆందోళన కూడా వారిలో ఉన్నది. నెలరోజుల కిందట సభాధ్యక్షుల సమావేశంలో వెల్లడైన అభిప్రాయాలు ఇందుకు ఉదాహరణ. పద్దెనిమిది మంది శాసనసభల స్పీకర్లు హాజరైన ఈ సభలో లోక్‌సభ స్పీకర్‌ ఓమ్‌ బిర్లా వెలిబుచ్చిన అభిప్రాయాలు గమనించదగినవి. ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రజల నమ్మకాన్ని కోల్పోవడం, శాసనసభాధ్యక్షులు విమర్శలకు గురికావడం ఆందోళనకర విషయమని ఆయన అన్నారు. ఈ విషయమై చర్చించి ఒక నివేదికను రూపొందించాలని ఆయన కోరారు. చట్టంలో స్పష్టత అవసరమనే అభిప్రాయం కూడా వ్యక్తమైం ది. సభను నిర్వహించడం తమ బాధ్యత అంతే కానీ, ఫిరాయింపుదారుల అనర్హత అధికారం ఆయా పార్టీల అధ్యక్షులకు ఉండాలని కూడా స్పీకర్‌ అభిప్రాయపడ్డారు. స్పీకర్లు కూడా ఈ చట్టం వల్ల, తాము ఎదుర్కొంటున్న పరిస్థితుల వల్ల ఇబ్బంది పడుతున్నారని దీనివల్ల అర్థమవుతున్నది. ఏదోవిధంగా పరిస్థితి నుంచి గట్టెక్కాలని కొందరు స్పీకర్లు కూడా భావిస్తున్నారు.

ఫిరాయింపులను అరికట్టడానికి, రాజకీయాల్లో ధన ప్రభావాన్ని, అవినీతిని రూపుమాపడానికి 1985లో ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని తెచ్చారు. ఆనాడు రాజీవ్‌గాంధీ ప్రభుత్వానికి భారీ మెజారిటీ ఉన్నప్పటికీ, ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం గమనార్హం. అయితే ఈ చట్టం ఆచరణలో విఫలమైంది. మూడోవంతు సభ్యులు విడిపోతే చీలికగా గుర్తించాలనే నిబంధన కూడా ఫిరాయింపులకు ఉపయోగపడ్డది. దీంతో మూడింట రెండు వంతులు విడిపోతేనే చీలికగా గుర్తించాలని చట్టాన్ని మార్చారు. అయితే స్పీకర్‌ బలహీనత అధికార పార్టీలకు బలంగా మారింది. ఫిరాయింపులకు సంబంధించి అధికార పార్టీలకు అనుగుణంగా వ్యవహరించడం సాధారణమైపోయింది. స్పీకర్‌ నిర్ణయానికి కాలపరిమితి లేకపోవడంతో అనర్హులు కావలసిన సభ్యులు కూడా చివరివరకు కొనసాగుతున్నారు. రాజకీయపార్టీలు తాము అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పు పడుతున్నాయి. రాజకీయ విలువలు పతనమైనందున, చట్టాలు నిర్వీర్యమవుతున్నాయనడానికి ఈ ఫిరాయింపు వ్యతిరేక చట్టం ఒక ఉదాహరణ. రాజకీయపార్టీల నాయకులే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే, సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని స్పీకర్ల అధికారానికి కత్తెర వేసే పరిస్థితి రాకపోయేది. ఏ విషయంలోనైనా బాధ్యతలను గుర్తించకపోతే తమ అధికారాలను, విశిష్టతను కోల్పోతామని రాజకీయపక్షాలు, చట్టసభలు గుర్తించాలె.


logo