గురువారం 09 ఏప్రిల్ 2020
Editorial - Jan 23, 2020 ,

మిరాండా, కమలా, డీ స్కూల్‌

మిరాండా, కమలా, డీ స్కూల్‌

పాలకులు, ప్రజాస్వామ్య వ్యతిరేకులు, రాజ్యాంగ వ్యతిరేకులు చట్టసభల్లో తాము వివిధ పద్ధతుల్లో సంపాదించిన సంఖ్యాధిక్యతలను చూసి ధీమాగా ఉండవచ్చు గాక. తగినంత మంది సామాన్య ప్రజలను తప్పు దారి పట్టించి రెచ్చగొట్టగలమని నమ్ముతుండవచ్చు గాక. కానీ ఇంతవరకు చర్చించిన చైతన్యాలను, అవి సరికొత్త వర్గాల్లోకివ్యాపిస్తున్న క్రమాన్ని చూసి తప్పక కలవరపడాలి. దేశంలో మొదటినుంచి పరిపాలించిన వారి వైఫల్యాల వల్ల ఒక శూన్యం ఏర్పడింది.

దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల గురించి తెలిసినవారికి ఢిల్లీలోని మిరాండా హౌజ్‌, కమలా నెహ్రూ, ఢిల్లీ స్కూల్‌ అఫ్‌ ఎకనమిక్స్‌, సెయింట్‌ స్టీఫెన్స్‌ గురించి ఎవరూ చెప్పనక్కరలేదు. ఆ కాలేజీలలో చదివే విద్యార్థులు అత్యంత ప్రతిభావంతులు. అధిక సంఖ్యాకులు గొప్ప కుటుంబాలకు చెందినవారు. వాటిలో మొదటి రెండు మహిళా కళాశాలలు. వారు సామాజిక అంశాలపై స్పందించటం ఎన్నడూ జరుగలేదు. ఎవరైనా వ్యక్తిగత స్థాయిలో ఆ పనిచేసి ఉండవచ్చు. కానీ సామూహికంగా కాదు. అటువంటిది వారు పౌరసత్వ చట్టం పట్ల నిరసనలతో రోడ్లపైకి వచ్చి అందరినీ విస్మయపరిచారు.

ఆయా సంస్థల విద్యార్థులు నిర్వహించిన నిరసన కార్యక్రమా లు తెలుగు ఛానళ్లలో వచ్చినట్లు లేవు. కానీ ఇంగ్లీష్‌ ఛానళ్ల లో ప్రసారమయ్యాయి. ఒకసారి కాదు, పదే పదే. అటువంటి విశిష్ట సంస్థల విద్యార్థినులు, విద్యార్థులు తరగతులను బహిష్కరించటం, ఒక సామాజిక అంశంపై నిరసనలు తెలుపటం ఢిల్లీ ఛానళ్ల ఎడిటర్లకు అబ్బురంగా తోచి ఉండాలి. పదేపదే ప్రసారాలు అందుకే అనటంలో సందేహం లేదు. తమ నిరసనల సందర్భంగా ఆ విద్యార్థులు చేసిందేమిటి? రాజకీయ నినాదాలు కాదు గదా అసలు ఏ నినాదాలు ఇవ్వలేదు. మన దేశ రాజ్యాంగంలోని ‘భారత ప్రజలమైన మేము (we, the people of india....) అనే పీఠికను మళ్లీమళ్లీ చదువుతూ పోయా రు. దాదాపు అందరి చేతులలో ప్లా కార్డులున్నాయి. వాటిపైన గల నినాదాల్లో ‘రాజ్యాంగాన్ని పరిరక్షించండి’ అనేది ఒకటి. మతపరమైన వివక్షలు చూపరాదన్నది మరొకటి. సమాజాన్ని విభజించవద్దన్నది ఇంకొక టి. మీడియా వారు తమతో మాట్లాడినప్పుడు కూడా ఇవే అంశాలను నొక్కిచెప్పటంతో పాటు, మన రాజ్యాంగపు ఆత్మ, అందులోని ప్రజాస్వామికత, వివక్ష లేనితనం, సర్వమత సమానత్వం, గత 70 ఏండ్ల ప్రజాస్వామిక సంప్రదాయాలు, భారతీయ సమాజపు విలువల గురించి ప్రస్తావించారు. అంతేగాక అలీగఢ్‌, జామియా, జేఎన్‌యూ విశ్వవిద్యాలయాల విద్యార్థులపై పోలీసులు, దుండగులు జరిపిన దాడులను ఖం డించారు. అటువంటిదే ఏదో ఒకరోజు తమపై జరుగదన్న హామీ ఏమిటని ప్రశ్నించారు. ఇదంతా వారు ఎవరి ప్రోద్బలాలు లేకుండా స్వచ్ఛందంగా చేశారు. ఇటువంటి శిష్ట సామాజిక వర్గానికి చెందినవారు, అందులోనూ విద్యార్థినులు ఇట్లా చేయటమన్నది సంఘ్‌ పరివార్‌ భావజాలానికి, వారి ప్రభుత్వ చర్యలకు సామాజిక ప్రమాద సూచిక అవుతున్నది.

దేశంలోని విశిష్టమైన సంస్థల విద్యార్థులు ఈ విధంగా నిరసన తెలుపటం పైన పేర్కొన్న సంస్థలకు పరిమితం కాలేదు. ముఖ్యంగా ఆ నాలు గు అసూర్యంపశ్యల వంటివి గనుక ప్రత్యేకంగా పేర్కొనవలసి వచ్చింది గాని, అదే శ్రేణిలోకి వచ్చే బెంగుళూరు ఐఐఎస్‌సీతో పాటు ఐఐటీలు, ఐఐఎంల విద్యార్థులు, అధ్యాపకులు సైతం ఇదే పనిచేశారు. నిరసన ప్రదర్శనలు జరుపటమే గాక సంతకాలతో ఉమ్మడి ప్రకటనలు జారీ చేశా రు. తరచూ ఆయా పరిణామాల పట్ల ఢిల్లీలోని ఆ నాలుగు కాలేజీలు మినహా ఇటువంటి విశిష్ట విద్యాసంస్థలు, పరిశోధన సంస్థల నుంచి నిరసనలు అప్పుడప్పుడు కన్పించేవే. కానీ అది దేశవ్యాప్తంగా ఇన్నిన్ని అగ్రశ్రేణి సంస్థల నుంచి కొద్దివారాల వ్యవధిలో ఇంత విస్తృతంగా, ఇంత తీవ్రంగా వ్యక్తం కావటం మాత్రం గతంలో ఎప్పుడూ లేదు. చివరకు ఎమర్జెన్సీ సమయంలో కూడా. అపుడు అసలు భావవ్యక్తీకరణకే అవకాశం లేదన్నది నిజమే. పైగా అప్పటిది రాజకీయాంశం. పౌరహక్కుల అంశం. 45 ఏండ్ల కిందటి నాటి అప్పటి పరిస్థితుల్లో రాజకీయ, పౌర నిరసనలు ప్రధానమయ్యాయి. దానిని పరిగణనలోకి తీసుకుంటే, ఒక సామాజిక అంశంపై సాధారణ విద్యాసంస్థల నుంచి గాని, విశిష్ట స్థాయి విద్యా-పరిశోధనా సంస్థల నుంచి గాని దేశవ్యాప్త నిరసనలు ఇంతగా వ్యక్తం కావటం స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఇది మొదటిసారి అని గుర్తించాలి. ఆ విధంగా ఇదొక కొత్త తరహా కల్లోల కాలమవుతున్నది.

సరిగ్గా ఇదే స్థితి విద్యాసంస్థలకు బయటి సమాజంలోనూ కన్పించ టం అందరూ గుర్తించవలసిన మరొక విషయం. మేధావులు, రచయితలు, కళాకారుల నుంచి హేతుబద్ధంగా, ప్రజాస్వామికంగా ఆలోచించే సాధారణ పౌరుల వరకు, విస్తృతస్థాయిలో మహిళల వరకు అనేకానేకు లు మొదట పేర్కొన్న నాలుగు ఢిల్లీ విద్యాసంస్థల విద్యార్థుల వలెనే స్పం దిస్తున్నారు. రాజ్యాంగ సూత్రాలు, స్ఫూర్తి, ప్రజాస్వామ్యం, శాంతియు త సహజీవనం, డబ్భు ఏండ్ల స్వతంత్ర భారత సంప్రదాయాలు, విలువల విషయమై వారంతా ఆందోళన చెందుతున్నారు. ఆసక్తికరం ఏమం టే, ఇంచుమించు ప్రతిచోటా నిరసనకారులు రాజ్యాంగ పీఠికను చదువుతున్నారు, తమ ప్రకటనల్లో, చర్చల్లో ప్రస్తావిస్తున్నారు. ఈ పని ఒకరిని చూసి మరొకరు ప్రేరణ పొంది చేస్తున్నదే కావచ్చు. అది కొంతవర కు సహజం. అయితే ఆ అంశంపై అందరి మధ్య సమానమైన ఆలోచన లు కలుగుతున్నాయన్నది, ఒకరితో ఒకరు ఏకీభవిస్తున్నారన్నది ముఖ్యం.

గత కొన్ని వారాలుగా జరుగుతున్న ఈ కల్లోలాన్ని అంతా జాగ్రత్తగా గమనించినపుడు కొట్టవచ్చినట్లు కనిపిస్తున్న విశేషం ఒకటున్నది. నిరసనల్లో భాగంగా రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ నినాదాలు ఇస్తున్నాయి. వాటికి పౌరచట్టం పట్ల నిరసనతో పాటు రాజకీయ లక్ష్యాలున్నాయి. కానీ విద్యార్థులు, యువకులు, మహిళలు, మేధావులు, రచయితలు, కళాకారులు, ప్రజాస్వామిక స్ఫూర్తిగల పౌరులు, రాజ్యాంగవాదులు ఆ విధంగా కాదు. వీరెవరూ రాజకీయ నినాదాలు ఇవ్వటం లేదు. వారందరి ఆందోళన సమాజం గురించి, రాజ్యాంగం గురించి, దేశం గురించే. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప సామాజికమైన, ప్రజాస్వామికమైన, రాజ్యాంగ స్ఫూర్తిపరమైన చైతన్య వెల్లువ ఇది. దీనిని పాలక పక్షం, ప్రతిపక్షాలు కూడా అర్థం చేసుకోవాలి. తమ వ్యవహరణను అందుకు తగినట్లు మార్చుకోవాలి. ప్రపంచంలో అనేక సామాజిక, రాజకీయ తిరుగుబాట్లు ఈ విధమైన పౌర చైతన్యాల వల్ల జరిగినవే. అటువంటి తిరుగుబాట్లు అప్పటికప్పుడు జరుగకపోవ చ్చు. కానీ అందుకు రంగాన్ని క్రమంగా సిద్ధపరుస్తాయి. సమాజపు పొరలలో సంభవించే ఇటువంటి అంతర్గత పరిణామాలు గాని, బహిరంగ వ్యక్తీకరణలు గాని విస్మరించేందుకు వీల్లేనివి. ముఖ్యంగా ఆధునిక ప్రజాస్వామిక, సామాజిక చైతన్యం గల వర్గాలలోకి, పైన పేర్కొన్న ఢిల్లీ విద్యాసంస్థల వంటి అసూర్యంపశ్య యువతరంలోకి  సైతం ఇది పాకిపోతున్నప్పుడు. తన చర్యల అవాంఛనీయ ప్రభావం ఎంతగా ఉంటున్నదో ప్రభుత్వం దీన్నిబట్టి గ్రహించి మేల్కొనాలి. ఇందుకు అదనంగా జేఎన్‌ యూ వంటి విద్యార్థి లోకం ఉండనే ఉన్నది. జేఎన్‌యూ గతం నుంచి గల ఒక ప్రతీక కాగా, డీ స్కూల్‌, మిరాండా, కమలా నెహ్రూ, సెయింట్‌ స్టీఫెన్స్‌ వంటివి సరికొత్త ప్రతీకలవుతున్నాయి. చివరకు భీమ్‌ ఆర్మీ నాయకుడు చంద్రశేఖర ఆజాద్‌కు బెయిల్‌ ఇచ్చిన మహిళా న్యాయమూ ర్తి సైతం, ఆజాద్‌ తమ నిరసన కార్యక్రమంలో రాజ్యాంగ పీఠికను చదువటంలో తప్పేమిటని ప్రాసిక్యూషన్‌ను ప్రశ్నిస్తూ, స్వేచ్ఛా స్వాతంత్య్రాలపై రవీంద్రనాథ్‌ టాగూర్‌ రాసిన కవితను తన తీర్పులో ప్రస్తావించారంటే, ఈ రోజున రాజ్యాంగస్ఫూర్తి భావనలు, ప్రజాస్వామిక స్ఫూర్తి భావనలు దేశంలోని వివిధ వర్గాల్లోకి ఏ విధంగా చొచ్చుకొని పోతున్నా యో అర్థం చేసుకోవచ్చు. దేశంలో ఒక ప్రజాస్వామిక నవతరం, నవచైతన్యం ఆవిర్భవిస్తున్నాయని దీన్నిబట్టి గ్రహించాలి.

పాలకులు, ప్రజాస్వామ్య వ్యతిరేకులు, రాజ్యాంగ వ్యతిరేకులు చట్టసభల్లో తాము వివిధ పద్ధతుల్లో సంపాదించిన సంఖ్యాధిక్యతలను చూసి ధీమాగా ఉండవచ్చు గాక. తగినంత మంది సామాన్య ప్రజలను తప్పు దారి పట్టించి రెచ్చగొట్టగలమని నమ్ముతుండవచ్చు గాక. కానీ ఇంతవరకు చర్చించిన చైతన్యాలను, అవి సరికొత్త వర్గాల్లోకి వ్యాపిస్తున్న క్రమా న్ని చూసి తప్పక కలవరపడాలి. దేశంలో మొదటినుంచి పరిపాలించిన వారి వైఫల్యాల వల్ల ఒక శూన్యం ఏర్పడింది. తాము ప్రత్యామ్నాయాలమంటూ ఆ శూన్యంలోకి ప్రవేశించిన వారి వైఫల్యాలతో రెండవ శూన్యం ఏర్పడింది. ఆ రెండవ శూన్యంలోకి ప్రవేశించిన  ప్రస్తుత పాలకుల వైఫల్యాలు మూడవ శూన్యాన్ని సృష్టించటం మొదలైపోయింది. చట్టసభల సంఖ్యాధిక్యతలు అటువంటి శూన్యాలు సృష్టించగల సామాజిక కల్లోలం ముందు మిథ్యలుగా, భ్రమలుగా తేలగలవు. చరిత్ర ఈ పాఠాలను చాలాసార్లు తెలియజెప్పింది.కాబట్టి, ఇప్పటికే సీఏఏను నోటిఫై చేసిన నరేంద్ర మోదీ ప్రభుత్వం నేర్చుకోవలసిన పాఠాలను నేర్చుకొని, సమాజ పరిణామగతులను గమనిస్తూ, ఇందుకు సంబంధించిన తదుపరి చర్యలు, చట్టాల విషయమై తగు సవరణలు చేసుకోవటం తనకు, దేశానికి కూడా మంచిదవుతుంది. 


logo