బుధవారం 01 ఏప్రిల్ 2020
Editorial - Jan 23, 2020 ,

అంతుచిక్కని వైరస్‌లతో అప్రమత్తం

అంతుచిక్కని వైరస్‌లతో అప్రమత్తం

చైనా వుహాన్‌ నగరంలో ఈ మధ్యనే గుర్తించిన ఓ అంతుచిక్కని వైరస్‌ ప్రపంచాన్ని కుదిపేస్తున్నది. అతిస్వల్ప కాలంలోనే దేశదేశాలకు విస్తరించి ప్రాణాలను తోడేస్తున్న తీరు తో ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి. చైనాలోని ఓ సముద్ర తీరప్రాంత నగరంలో ఉద్భవించిందంటున్న ఈ వైరస్‌ అతి ప్రమాదకరమైనదిగా చెబుతున్నారు. కరోనావైరస్‌ అని పిలుస్తున్న ఈ వైరస్‌ నాలుగు వారాల్లోనే నాలుగు దేశాలకు విస్తరించింది. జనవరి 21 వరకు వివిధ ప్రాంతాల్లో 217 కేసులు గుర్తించారు. చైనా, జపా న్‌, థాయిలాండ్‌, దక్షిణకొరియా దేశాల్లో ఇప్పటికే నలుగురు చనిపోయా రు. ఆధునిక రవాణా, వాణిజ్య సంబంధాలున్న ప్రస్తుత పరిస్థితుల్లో దీని బారి నుంచి తప్పించుకునేందుకు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించే దిశగా భారత్‌ కూడా ఆలోచిస్తున్నది.

ఆధునిక ప్రపంచలో అత్యంత వేగవంతమైన రవాణా సౌకర్యాలున్న పరిస్థితుల్లో ఈ వైరస్‌ ప్రపంచవ్యాప్తమయ్యే అవకాశాలున్నాయి. దీంతో అంతర్జాతీయ వాణిజ్యం, టూరిజం, ఇతర ఆర్థిక లావాదేవీలపై తీవ్రప్రభావం చూపే అవకాశమున్నది. సాధారణంగా ఒకరి నుంచి మరొకరికి సోకే అంటువ్యాధులు ఈ మధ్యకాలంలో ప్రపంచంలో సరిహద్దులను దాటి విస్తరిస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా స్వైన్‌ఫ్లూ, ఎబోలా, సార్స్‌, నిపా లాంటి వైరస్‌ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని బలితీసుకున్నాయి. మెక్సికోలో 2009లో ఉద్భవించిన స్వైన్‌ఫ్లూ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ప్రజల ప్రాణాలను తోడేస్తున్నది. ఇది దేశదేశాల్లో 11-21 శాతం జనాభాను పీడిస్తున్నది. పశ్చిమాఫ్రికా గ్యూనియా ప్రాంతంలో ఉనికిలోకి వచ్చిన ఎబోలా రెండేండ్లు ప్రపంచాన్ని వణికించింది. లైబీరి యా, సియెర్రా లియోన్‌ ఇతర దేశాల్లో విస్తరించి పది వేల మంది ప్రాణాలను బలిగొన్నది. ఈ దేశాల్లో ఎబోలా కారణంగా ఆ దేశాల జీడీపీలో 2.8 బిలియన్‌ డాలర్లను వెచ్చించాల్సి వచ్చింది. అలాగే ప్రపంచ వ్యాప్తం గా వివిధ దేశాలు ఎబోలా నియంత్రణ కోసం వేల కోట్ల డాలర్లు ఖర్చు చేశాయి.

ఇవ్వాళ్టి ఆధునిక ప్రపంచంలో ఏదో ఒక దేశం తనదైన ముందుజాగ్రత్త చర్యలు, పరిరక్షణ విధానాలతో ఇలాంటి అంటురోగాల బారినుంచి తప్పించుకునే పరిస్థితులు లేవు. అందుకోసమని ప్రజారోగ్యం కోసం చేపడుతున్న చర్యలు దేశ సరిహద్దుల లోపల చేపట్టడంతోనే సరిపోదు. అంతర్జాతీయంగా ఆరోగ్య పరిరక్షణ విషయంలో సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఇలాంటి వైరస్‌ ప్రమాదాలు చాటిచెబుతున్నాయి.


గ్లోబల్‌ హెల్త్‌ సెక్యూరిటీ ఇండెక్స్‌ రిపోర్ట్‌ 2019 ప్రకారం.. 195 దేశాలు ఇలాంటి అంటురోగాలు, వైరస్‌ కారక వ్యాధుల నిరోధానికి సత్వర చర్య లు చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. అంతేకాకుండా చాలాదేశాల్లో అంటువ్యాధుల నియంత్రణకు కావాల్సిన సన్నద్ధత కూడా కనిష్ఠ స్థాయి లో ఉంటున్నదని తెలిపింది. గ్లోబల్‌ హెల్త్‌ సెక్యూరిటీ (జీహెచ్‌ఎస్‌) సామాజిక ఆరోగ్యానికి 140 ప్రమాణాలు ప్రాతిపదికగా వివిధ దేశాలను అధ్యయనం చేసింది. ఇందులో వంద ప్రమాణాల్లో 40.2 మాత్రమే పాటిస్తు న్న స్థితి ఉన్నది. ఇంకా ముఖ్య విషయమేమంటే.. 116 అభివృద్ధి చెందుతున్న మధ్యతరహా ఆదాయ దేశాల్లో 50 శాతం కన్నా తక్కువ ఆరోగ్య ప్రమాణాలున్నాయి. ఇందులో భారత్‌ 46.5 ప్రమాణాలతో 57వ స్థానం లో నిలిచింది. దక్షిణాసియా దేశాల్లో థాయిలాండ్‌, ఇండోనేషియా దేశాలు భారత్‌కన్నా మెరుగైనస్థితిలో ఉన్నాయి.

గ్లోబల్‌ హెల్త్‌ సెక్యూరిటీ ఎజెండాలో భారత్‌ కీలక భూమికపోషిస్తున్నది. అలాగే ఇంటర్నేషనల్‌ హెల్త్‌ రెగ్యులేషన్స్‌ 2005పై కూడా భారత్‌ సంతకం చేసి ప్రపంచ ఆరోగ్య పరిరక్షణలో భాగస్వామ్యదేశంగా ఉంటున్నది. ఈ క్రమంలో 196 దేశాలు సంతకాలు చేసిన సమూహంలో భారత్‌ కూడా ఒకటి కావటం గమనించదగినది. మరో ముఖ్య విషయమేమం టే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్య దేశాలైన 11 దేశాల్లో భారత్‌ ఒకటిగా దక్షిణాసియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నది. కాబట్టి ఈ దేశాల్లో ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి  సభ్యదేశాలన్నీ ఉమ్మడిగా, సమన్వయంతో కృషి చేసినప్పుడే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యాలు నెరవేరుతాయి.


ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. భారత్‌ ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచనలకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచించాలి. ప్రజారోగ్య వ్యవస్థలో ఎక్కడ లోపాలున్నాయో గుర్తించి తగువిధంగా స్పందించాల్సిన ఆవశ్యకత ఉన్నది. 2009లో భారత్‌లో స్వైన్‌ఫ్లూ వచ్చినప్పటి నుంచి దాన్ని ఎదుర్కోవటంలో అనేక సమస్యలు తలెత్తాయి. సరై న ల్యాబ్‌ సౌకర్యాలు, రోగులను ఉంచేందుకు ప్రత్యేక వార్డులు సైతం సమకూర్చటంలో సమస్యలు ఎదురయ్యాయి. అలాగే స్వైన్‌ఫ్లూ నుంచి తప్పించుకునేందుకు స్వీయరక్షణ చర్యలు కూడా లేని స్థితి ఉన్నది. ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ విస్తరణ, దానికి సంబంధించిన సమాచారం పంచుకోవటంలో కూడా ఇబ్బంది ఏర్పడింది. అలాగే వ్యాధి విజృంభణను నియంత్రించే చర్యల్లో కూడా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది.


ఏదేమైనా మిగతా దేశాలతో పోలిస్తే ప్రజారోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల్లో భారత్‌ మెరుగైన స్థితిలోనే ఉన్నదని చెప్పవచ్చు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య సంస్థల పాత్రకూడా ఆశించిన మేర ఉండటంతో మెరుగైన ఫలితాలే వచ్చాయి. కేరళలో 2018 లో వచ్చిన నిపాను ఈ విధంగానే నియంత్రించగలిగాం. అయితే జనాభాకు అనుగుణంగా అవసరమైన సంఖ్యలో వైద్యులు, నర్సులు, దవా ఖాన పడకలు అందుబాటులో లేవు. ఈ కారణంగానే ఆశించిన స్థాయిలో ప్రజారోగ్యంలో ఫలితాలుండటం లేదంటున్నారు. కాబట్టి అవసరానికి అనుగుణంగా ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరమున్నది. ఇలా చేసినప్పుడే ప్రజారోగ్యం భద్రత నెలకొంటుంది.

మరోవైపు అవసరానికి అనుగుణంగా మందులు, వాక్సిన్లు, ల్యాబ్‌ కిట్లు అందుబాటులో ఉంచటంలో వైఫల్యం కనిపిస్తున్నది. అత్యవసర సేవలకు అనుగుణంగా అవసరమైన మందులు, కిట్లు అందుబాటులో ఉంచటం ప్రాథమిక కర్తవ్యం. కోట్లాది జనాభా ఉన్న భారత్‌లో ఈ విషయంలో ఎంతో ముందుచూపుతో వ్యవహరించాలి. ఈ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అవసరమైన ఔషధాలను, పరీక్షా పరికరాలను, కిట్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. అలాగే మహమ్మారిలా విస్తరించే రకరకాల వైరస్‌ వ్యాధుల నిరోధానికి తగు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివన్నీ ఒంటరిగా చేసి విజయం సాధించేవి కాదు, సామూహికంగా సమన్వయంతో చేపట్టాల్సిన చర్యలు.ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అధ్నం గెబ్రేయేసస్‌ ప్రకారం.. రాబోయేకాలంలో ఇలాంటి వైరస్‌ మహమ్మారులు మరిం త ఉధృతంగా ప్రపంచంపై దాడిచేసే అవకాశాలున్నాయి. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ సమన్వయంతో నిబద్ధతతో కృషిచేయాలి. అలా చేసినప్పుడే రోగరహిత ఆరోగ్య ప్రపంచాన్ని నిర్మించుకోగలం.


(వ్యాసకర్త: పీజీఐఎంఈఆర్‌, చండీగఢ్‌లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌) 

‘ది వైర్‌' సౌజన్యంతో....


logo
>>>>>>