గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Jan 22, 2020 , 00:25:21

జాగ్రత్తకు సమయమిది

జాగ్రత్తకు సమయమిది

దేశ పరిస్థితి ఎలా ఉన్నా, ఈ దిశగా తెలంగాణ రాష్ట్రం గణనీయంగా కృషిచేస్తున్నది. గ్రామం పునాదిగా అన్ని సామాజిక వృత్తులు మొదలుకొని మౌలిక మార్పులకు కేంద్రంగా ఉన్న వ్యవసాయరంగాభివృద్ధి కోసం సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్రం ప్రథమ ప్రాధాన్యమిస్తున్నది. తద్వారా ప్రజల జీవనప్రమాణాల పెరుగుదలకు కృషిచేస్తున్నది. ఆధునిక టెక్నాలజీ, సాంకేతిక రంగాలకు ప్రాధాన్యమిచ్చి సమగ్ర సుస్థిరాభివృద్ధి దిశగా రాష్ట్రం అడుగులు వేస్తున్నది.

ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సమావేశం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 250 మంది రాజకీయవేత్తలు, వెయ్యిమందికిపైగా వివిధ భాగస్వామ్య వ్యాపార, పారిశ్రామికసంస్థలు, ప్రముఖ వ్యక్తులు, విద్యావేత్తలు హాజరవుతున్నారు. 1971లో ప్రారంభమైన ఈ వేదికకు ఇప్పుడు 50వ వార్షిక సమావే శం కావటం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. ఆధునిక ప్రపంచం ముందు సవాళ్లుగా మారిన సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం పాటుపడాలని సూచించింది. ఇందులోభాగంగా నాలుగు ప్రధానాంశాలను గుర్తించి ప్రపంచం ముందుంచింది. ఇందులో మొదటిది-ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో ఆర్థిక, పర్యావరణ సమస్యలకు కారణమవుతున్న వాతావరణ మార్పులను ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలి. 


రెండవది-పరిశ్రమలను మరింత ప్రాయోజితంగా మారుస్తూ సామాజిక అవసరాలను తీర్చేవిధంగా తీర్చిదిద్దాలి. సమాజ సుస్థిరాభివృద్ధిలో భాగస్వామ్యం ఎలాగో ఆలోచించాలి. మూడు-నాలుగవ పారిశ్రామిక విప్లవంలో ఆధునిక టెక్నాలజీ మూలంగా ఎదురవుతున్న సవాళ్లు, ప్రమాదాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నాలుగు- సామాజిక, సాంకేతికాంశాలను సమకాలీన టెక్నాలజీకి అనుగుణంగా తీర్చిదిద్దాలి. దానికిగాను విద్యలో రావాల్సిన మార్పులు, పరిశ్రమల స్థాపనలో అవరోధాలు, అవకాశాలు.. అనే అంశాల ను ప్రధానంగా పేర్కొన్నది. ఈ క్రమంలోనే ప్రపంచం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థికసమస్య లు, సామాజిక హింసా ఆందోళనలు, ఆధునిక టెక్నాలజీ, ఎదురవుతున్న సవాళ్లపై చర్చించి శాంతికాముక ప్రపంచం కోసం దిశానిర్దేశం చేయనున్నది.


ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం సందర్భంగా అంతర్జాతీయ అధ్యయన సంస్థ ‘ఆక్స్‌ఫామ్‌'నివేదిక ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఆర్థిక అంతరాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నివేదిక ప్రకారం అంతర్జాతీయ అసమానతలు దిగ్భ్రాంతికరస్థాయిలో ఉన్నాయి. గత దశాబ్దకాలంలో బిలియనీర్ల సంఖ్య రెట్టింపయ్యింది. ప్రపంచంలోని 2,153మంది కుబేరుల వద్దను న్న ధనం ప్రపంచజనాభాలో 60 శాతం మంది సంపదకన్నా ఎక్కువగా ఉన్నది. ప్రపంచంలోని అతిపెద్ద కుబేరుల సంపద ఆఫ్రికాలోని మహిళలందరి దగ్గర ఉన్న సంపదకన్నా ఎక్కువ. ప్రపంచ పరిస్థితి ఇలా ఉంటే భారత్‌ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. దేశంలో ఒకశాతం ఉన్న ధనికుల సంపద 95.3 కోట్ల మంది దగ్గర ఉన్న సంపదకన్నా నాలుగు రెట్లు ఎక్కువ. 


మొత్తం భారత కుబేరుల సంపద దేశ బడ్జెట్‌ కన్నా ఎక్కువ ఉన్నదని ఈ నివేదిక తెలిపింది. దీనికంతటికీ ప్రజల జీవన పరిస్థితులు, అవకాశాలే మూలం. అతికొద్దిమందికి అంతులేని అవకాశాలు, వనరులను వినియోగించుకునే పరిస్థితులు అనుకూలంగా ఉంటే, ఎక్కువమందికి అవకాశాలు ఆమడదూరంలో ఉంటున్నాయి. ఒక ఐటీ కంపెనీ సీఈవో పది నిమిషాల్లో పొందే వేతనాన్ని పొందాలంటే ఒక సాధారణ కార్మికురాలి కి ఏడాదికాలం పడుతుంది. ఎందుకంటే ఐటీ కంపెనీ సీఈవో సెకనుకు రూ. 106 పొందుతున్న స్థితి ఉన్నది. దీనిని ప్రాతిపదికగా తీసుకుంటే ఒక అగ్రగామి కంపెనీ సీఈవో పొందే వేతనాన్ని పొందాలంటే సాధారణ కార్మికురాలు 22,277 ఏండ్లు కష్టపడాలన్నమాట! ఈ పరిస్థితులన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అంతరాలకు హేతువులుగా ఉండటం గమనార్హం.


‘జాగ్రత్తకు సమయమిది’ (టైమ్‌ టు కేర్‌) పేరిట ఆక్స్‌ ఫామ్‌ విడుదల చేసిన నివేదిక చూసిన తర్వాతనైనా కనువిప్పు కలుగాలి. అవకాశాల అంతరాలే ఆర్థిక అసమానతలకు కారణం. ఉన్నవాళ్లకే అన్నీ సమకూరుతున్నాయి. లేని వాళ్లకు ఏదీ అందుబాటులోకి రాకపోగా కనీస అవసరా లు తీరని గడ్డు స్థితిని అనుభవిస్తున్నారు. ఈ సామాజిక పరిస్థితులే సామాజిక హింసకు, ఆందో ళనకు కారణమవుతున్నాయి. ఐక్యరాజ్యసమితి గుర్తించిన 195 దేశాల్లోని 75 దేశాల్లో ఈ సంవత్సరం అలజడి, అశాంతి పరిస్థితులు నెలకొంటాయని ‘వెరిక్స్‌ మ్యాపిల్‌ క్రాఫ్ట్‌'అనే సంస్థ తెలిపిం ది. ఈ దేశాల్లో భారత్‌ కూడా ఉన్నదని మరువరాదు. 2019లో 47 దేశాల్లో అశాంతి, అలజడి పరిస్థితులున్నాయి. ఈ ఏడాది ఆ దేశాల సంఖ్య 75కు చేరుకోవటం ఆందోళనకరం. 


ఈ సందర్భంగానే సామాజిక సమూహాల ఆర్థిక ఎదుగుదల విషయంలో అన్నిదేశాలూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న హెచ్చరిక కూడా ఉన్నది. ముఖ్యంగా అభివృద్ధి ఫలాలకు, అవకాశాలకు దూరంగా ఉన్న సామాజిక సమూహాలను గుర్తించాలి. వారి జీవనపరిస్థితుల మెరుగుకోసం అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలి. దేశ పరిస్థితి ఎలా ఉన్నా, ఈ దిశగా తెలంగాణ రాష్ట్రం గణనీయంగా కృషిచేస్తున్నది. గ్రామం పునాదిగా అన్ని సామాజిక వృత్తులు మొదలుకొని మౌలిక మార్పులకు కేంద్రంగా ఉన్న వ్యవసాయరంగాభివృద్ధి కోసం సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్రం ప్రథమ ప్రాధాన్యమిస్తున్నది. తద్వారా ప్రజల జీవనప్రమాణాల పెరుగుదలకు కృషిచేస్తున్నది. ఆధునిక టెక్నాలజీ, సాంకేతిక రంగాలకు ప్రాధాన్యమిచ్చి సమగ్ర సుస్థిరాభివృద్ధి దిశగా రాష్ట్రం అడుగులు వేస్తున్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్‌కు దావోస్‌ సభలో ‘నాలుగవ పారిశ్రామిక విప్లవంలో సాంకేతిక ప్రయోజనాలు-సవాళ్లు నివారించటం’ అంశంపై ప్రసంగించే అవకాశం రావటం ముదావహం. 


logo
>>>>>>