బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Jan 22, 2020 , 00:21:32

దక్షిణాది సంఘటన అవసరం

దక్షిణాది సంఘటన అవసరం

కేసీఆర్‌... దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నవాడు. రాష్ట్ర మంత్రివర్గంలోనూ, కేంద్ర మంత్రివర్గంలోనూ విశేష అనుభవం ఉన్నవాడు. ఒంటిచేత్తో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినవాడు. మొక్కవోని ధైర్యసాహసాలతో సవాళ్లను ఎదుర్కొన్నవాడు. పదమూడేండ్లు మడమతిప్పని పోరాటంతో తెలంగాణను సాధించిన నాయకుడు. రెండుసార్లు టీఆర్‌ఎస్‌ను గెలిపించి ముఖ్యమంత్రిగా రాష్ర్టాన్ని పాలిస్తున్నవాడు.

ఆర్యమూలాలున్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యకులాలు ఉత్తరభారతంలో దేశ సగటు కంటే కొంచెం ఎక్కువగా ఉంటే, దక్షిణాదిలో శూద్రకులాల సగటు ఎక్కువగా ఉన్నది. దేశంలో బౌద్ధం బాగా వికసిస్తున్న కాలంలో దేశాన్ని పాలించిన శూద్ర రాజులైన మౌర్యులు భారతభూభాగాన్ని అఖండంగా ఉంచగలిగారు. ఆ తర్వాత ఉత్తరాది రాష్ర్టాల్లో బ్రాహ్మణ రాజ్యా లు, క్షత్రియుల పాలన, గుప్తులలాంటి వైశ్య రాజుల పాలన ఎక్కువగా ఉన్నది. అదే సమయంలో దక్షిణాదిలో శూద్ర రాజులైన పాండ్యులు, చోళులు, కాకతీయులు, పద్మనాయకులు, రెడ్డి రాజుల పాలన ఉన్నది. అందుక్కారణం దక్షిణాదిలో క్షత్రియులు ఎక్కువగా లేకపోవడం. దీంతో దేశంలోని రెండు ప్రాంతాల మధ్య స్పష్టమైన విభజన రేఖ ఏర్పడింది. ఉత్తరాది ప్రాంతం ఆర్యావర్త భూమిగా దక్షిణాది ద్రవిడ భూమిగా పిలువబడ్డాయి. రామాయణ, మహాభారతాది సంస్కృతుల నేపథ్యం కావ చ్చు, ఆర్యుల మత నేపథ్యం కావచ్చు ఉత్తరాదిలో వైష్ణవం, దక్షిణాదిలో శైవం వ్యాపించాయి. దేశాన్ని 8 వందల ఏండ్లకు పైగా పాలించిన ముస్లిం లు, రెండు వందల ఏండ్లకు పైగా పాలించిన ఆంగ్లేయులు తమ రాజ్యాలను, రాజధానులను ఉత్తరాది, తూర్పు ప్రాంతాల్లోనే ఉంచడం వల్ల ఉత్తరాది రాజకీయ ప్రాబల్యమే దేశమంతటా ఉన్నది.


దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా రాజకీయాల్లో, మిగతా అన్ని విషయాల్లోనూ ఉత్తరాది ఆధిపత్యమే నడుస్తున్నది. జాతీయ పార్టీలుగా చెప్పుకోబడే కాంగ్రెస్‌, బీజేపీ, కమ్యూనిస్టు, బీఎస్పీ పార్టీలన్నీ ఉత్తరాది నాయకులతో స్థాపించబడినవే. ఉత్తరాదికి ప్రాధాన్యం ఇచ్చేవే. స్వాతంత్య్రానంతరం దేశ ప్రధానిగా పరిపాలన చేసింది, చేస్తున్నది ఉత్తరాది పార్టీలు, ఉత్తరాది నాయకులే. పీవీ నర్సింహారావు ఐదేండ్లు, దేవ గౌడ కొన్ని నెలలు ప్రధానిగా ఉన్నా పరిపాలన చేసింది ఉత్తరాది నాయకుల కనుసన్నల్లోనే నడిచింది. ప్రధాని, రాష్ట్రపతుల్లో ఏదో ఒకరు దక్షిణాది వారుండాలన్న నియమం ఉన్నా అది చాలా సమయాల్లో అమలు కాలేదు. స్వాతంత్య్రానంతరం డబ్భు ఏండ్లకు పైగా కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ కూటమి యూపీఏ, బీజేపీ, బీజేపీ కూటమి ఎన్డీయే, స్వల్పకాలం జనతా పార్టీ అన్నీ ఉత్తరాది నాయకుల నాయకత్వంలో, కనుసన్నల్లోనే పాలింపబడ్డాయి. వీళ్లందరికీ దక్షిణాది అంటే చిన్నచూపే. 


దక్షిణాది వాళ్ళంతా మొన్నమొన్నటి వరకు మదరాసీలుగానే పిలువబడేవారు. ఉత్తరాది పార్టీలు, నాయకులు దక్షిణాదిపై చూపుతున్న, చూపి న వివక్ష వల్లే డీఎంకే, ఏఐడీఎంకే, టీడీపీ, టీఆర్‌ఎస్‌, కేరళ కాంగ్రెస్‌, వైఎస్సార్సీపీ, జేడీ పార్టీలు పుట్టుకొచ్చాయి. జాతీయపార్టీలకు చిరునా మా లేకుండా చేశాయి. అయినా సరే జాతీయపార్టీలు దక్షిణాది ప్రాంతీ య పార్టీలను ఏదో ఓ రాజకీయ సంఘటనలో కలుపుకొని పబ్బం గడుపుకుంటున్నాయి. అప్పుడు కాంగ్రెస్‌, ఇప్పుడు బీజేపీ అనేక విషయాల్లో దక్షిణాదికి మొండిచేయి చూపుతున్నాయి. భాష, నదీజలాల పంపకం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఇవ్వడం, గవర్నర్ల నియామకం, అభివృద్ధి అంతరాలు, ప్రత్యేక హోదాలివ్వడం, జాతీయ హోదాలివ్వడం లాంటి అనేక విషయాల్లో దక్షిణాదిపై చిన్నచూపే ఉన్నది.


తెలంగాణ విషయంలోనే కాదు, దేశరాజకీయాల విషయంలోనూ ఓ స్పష్టత ఉన్నవాడు. తెలంగాణకేం కావాలో, తన దక్షిణాదికేం కావాలో స్పష్టంగా తెలిసినవాడు. దక్షిణాది నాయకులనే కాదు ఉత్తరాది వారినీ ఒప్పించి మెప్పించగల చతురుడు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు అనర్ఘళంగా మాట్లాడగల వక్త. బీజేపీ, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులనెదిరించి నిలువగల, గెలువగల సామర్థ్యం ఉన్న నాయకుడు. దక్షిణాది పార్టీల ఫ్రంట్‌కు నాయకత్యం వహించగల రాజకీయ సామర్థ్యం ఉన్న ఏకైక నేత కేసీఆర్‌. దక్షిణాది ఆత్మగౌరవం కోసం కేసీఆర్‌ కేంద్రంలో చక్రం తిప్పాల్సిన అవసరం ఉన్నది.


హిందీ, ఉత్తరాది భాషలు సంస్కృత జన్యభాషలు. దక్షిణాది భాషలు ద్రవిడ భాషలు. దక్షిణాది రాష్ర్టాల్లో హిందీని తప్పనిసరి చేయాలన్న నియమం వల్ల తమిళనాడు, ఆంధ్ర రాష్ర్టాల్లో హిందీ వ్యతిరేక ఉద్యమం వచ్చింది. హిందీ రాష్ర్టాల్లోనూ త్రిభాషా సూత్రాన్ని కచ్చితంగా అమలు జరిపి ఉంటే ఇలాంటి ఉద్యమాలు వచ్చి ఉండేవి కావు. పాఠశాలల్లో ఉత్తరాది హిందీని, ఇంగ్లీషును తప్ప ప్రాంతీయ భాషలను ఐచ్ఛికంగా 3వ భాషగా పెట్టి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. 

దేశంలోని ధనవంతులైన ఇరువై మంది లిస్టు ప్రకటిస్తే అందులో దక్షిణాదికి చెందినవానే ఒక్కరైనా కనబడరు. ఉత్తరాది రాజకీయాల పాలన వల్ల దక్షిణాది నుంచి పెట్టుబడిదారులు ఎదుగడం జరుగలేదు. దక్షిణాది నుంచి జాతీయపార్టీల నాయకులుగా ప్రధానమంత్రి స్థాయికి ఎదుగడం అతికష్టమైన పని. ఉత్తరాది వాళ్లు అంగీకరించరు. నోబెల్‌ బహుమతి విజేతల్లోనూ ఒకరిద్దరు తప్ప మిగతావాళ్లంతా బెంగాల్‌కు, ఉత్తరాదికి చెందినవాళ్లే. 


దక్షిణాది రాష్ర్టాల్లో తమ పార్టీ అధికారంలో లేకుంటే బడ్జె ట్లు కేటాయించడంలోనూ వివక్షే ఎదురవుతుంది. ఆయా రాష్ర్టాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులను సంప్రదించకుండానే గవర్నర్లను నియమిస్తా రు.ఆ గవర్నర్లు కేంద్రంలో ఉన్న పార్టీవారే అయ్యుంటారు. వారు ముఖ్యమంత్రులను ముప్పుతిప్పలు పెడుతారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన వారూ ఉన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడూ ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చడం జరిగింది. అదే విధానం మరింత నగ్నంగా, భయోద్విగ్నంగా బీజేపీ పాలనలోనూ జరుగుతున్నది. దశాబ్దాల పాటు కేంద్రంలో అధికారం చెలాయించిన ఈ రెండు పార్టీలు దొందూ దొందే అన్నట్టు ప్రవర్తిస్తున్నాయి. ఇందిరాగాంధీ రెండేండ్లు ఎమర్జెన్సీ ప్రకటించి దేశాన్ని అంధకారంలో ముంచితే మోదీ ప్రభుత్వం తన పాలనాకాలం మొత్తాన్ని అప్రకటిత ఎమర్జెన్సీ లాగే పాలిస్తున్నది.


దక్షిణాది రాష్ర్టాలమధ్య నదీజలాల పంపకం విషయంలోనూ కేంద్రం దక్షిణాది సమస్యలను పట్టించుకోవట్లేదు. దక్షిణాది రాష్ర్టాలకు రావాల్సిన బడ్జెట్‌ను కేటాయించడంలోనూ వివక్షే. రాష్ట్ర విభజన జరిగిన సమయం లో ఒప్పుకున్న ప్రత్యేక హోదాలను అమలుచేయడంలోనూ, పోలవరం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు జాతీయహోదా ఇవ్వడంలోనూ వివక్షే కొనసాగుతున్నది. రాష్ర్టాల విభజన జరిగినప్పుడు ఉత్తరాది రాష్ర్టాలైతే ఒక పద్ధతి, దక్షిణాది రాష్ర్టాలకు మరో రీతి. తమ పార్టీ పాలనలో ఉన్న రాష్ర్టాలైతే ఇంకో నీతి కొనసాగుతున్నది. ఉత్తరాది నాయకత్వం దక్షిణాదిపై రాజకీయాధిపత్యం చెలాయిస్తూ ఎవరి వాటా వారికి ఇవ్వకుండా వేధిస్తున్నది.


ఈ అంతరాలు, ఆధిపత్యభావనలు తొలుగాలంటే దక్షిణాది రాజకీ య నాయకత్యం కేంద్రాన్ని శాసించే విధంగా బలోపేతం కావాలి. దక్షిణాది ప్రాంతీయ పార్టీల ఐక్యత కొనసాగాలి. ఇప్పటికే అనేక ముక్కలైన భారత దేశం మరిన్ని ముక్కలు కాకూడదు. ఆసేతు హిమాచలం, బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రం మధ్యనున్న భరతభూమిలో ప్రాంతాల మధ్య తేడాలు, వివక్షలుండకూడదు. ద్రవిడ భూమికి న్యాయం జరుగాలి. దక్షిణాది నాయకులు కేంద్రంలో పాలకులుగా ఉం డాలి. అందుకోసం చేయాల్సిన ఒకే ఒక బృహత్కార్యం దక్షిణాది పార్టీల మధ్య సయోధ్య, పరస్పర సహకారాన్ని సాధించడం. ఇదంతా దేశాన్ని ఐక్యం గా ఉంచడానికి మాత్రమే. కానీ పిల్లిమెడలో గంట కట్టేదెవరు?


ప్రస్తుత క్రియాశీల రాజకీయాల్లో దక్షిణాదిలో ఉన్న నాయకుల్లో చెప్పుకోదగినవారు స్టాలిన్‌, కేసీఆర్‌, జగన్మోహన్‌రెడ్డి, విజయన్‌, కుమారస్వామి, సిద్ధరామయ్యలను చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ చిక్కి శల్యమైంది. ఎన్టీఆర్‌ కాలం నాటి ఆదర్శాలు, తెలుగు ఆత్మ గౌరవం ఆ పార్టీలో లేవు. తమిళ రాజకీయాలు దేశ విభజనను ప్రమోట్‌ చేసేవిగా ఉండటం వల్ల అవీ అనుసరణీయం కాదు. విజయన్‌ వ్యక్తిగతం గా మంచి నాయకుడే అయినా కమ్యునిస్టు రాజకీయాలు ఇంకా కుల సమాజాన్ని గుర్తించకపోయేవిగా మాత్రమే ఉండటం వల్ల అవీ ఈ ఐక్యతకు దోహదం చేయవు. సిద్ధరామయ్య సమర్థుడైన నాయకుడే అయినా ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఉత్తరాది కాంగ్రెస్‌ రాజకీయాలు అతన్ని ముందుకు పోనీయవు. కుమారస్వామికి కర్ణాటక కుల రాజకీయాలకు మించి దక్షిణాది రాజకీయాలను గురించి ఆలోచించి ముందుకుపోయే సామర్థ్యం, ముందుచూపు లేవు. 


జగన్మోహన్‌రెడ్డి రాజకీయానుభావం, వయసు వీళ్లందరినీ కలుపడానికి సరిపోయేంతగా లేదు. బీఎస్పీకి దక్షిణాది నుం చి రాజకీయ ముఖచిత్రాన్ని ప్రభావితం చేయగల నాయకుడు కనుచూపు మేరలో కనబడటం లేదు.ఇక మిగిలింది స్టాలిన్‌, కేసీఆర్‌. కరుణానిధి నుంచి ద్రవిడ రాజకీయాలను జీర్ణించుకొన్న నాయకుడు స్టాలిన్‌ దక్షిణాది రాజకీయాల పట్ల స్పష్ట త ఉన్నా అతని వయస్సు, ప్రస్తుత పరిస్థితులు అతడు నాయకత్యం వహించడానికి సరిపోవు. కేసీఆర్‌... దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నవాడు. రాష్ట్ర మంత్రివర్గంలోనూ, కేంద్ర మంత్రివర్గంలోనూ విశేష అనుభవం ఉన్నవాడు. ఒంటిచేత్తో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినవాడు. మొక్కవోని ధైర్యసాహసాలతో సవాళ్లను ఎదుర్కొన్నవాడు. పద మూడేండ్లు మడమతిప్పని పోరాటంతో తెలంగాణను సాధించిన నాయకుడు. రెండుసార్లు టీఆర్‌ఎస్‌ను గెలిపించి ముఖ్యమంత్రిగా రాష్ర్టాన్ని పాలిస్తున్నవాడు. 


రాజకీయ వ్యూహాలను పన్నడంలో కేసీఆర్‌ను మించిన వారు లేరు. ప్రస్తుతానికి తెలంగాణలో కేసీఆర్‌ను ఢీకొనే పార్టీ, నాయకుడూ లేడు. తెలంగాణ విషయంలోనే కాదు, దేశరాజకీయాల విషయంలోనూ ఓ స్పష్టత ఉన్నవాడు. తెలంగాణకేం కావాలో, తన దక్షిణాదికేం కావాలో స్పష్టంగా తెలిసినవాడు. దక్షిణాది నాయకులనే కాదు ఉత్తరాది వారినీ ఒప్పించి మెప్పించగల చతురుడు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు అనర్ఘళంగా మాట్లాడగల వక్త. బీజేపీ, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులనెదిరించి నిలువగల, గెలువగల సామర్థ్యం ఉన్న నాయకుడు. దక్షిణాది పార్టీల ఫ్రంట్‌ కు నాయకత్యం వహించగల రాజకీయ సామర్థ్యం ఉన్న ఏకైక నేత కేసీ ఆర్‌. దక్షిణాది ఆత్మగౌరవం కోసం కేసీఆర్‌ కేంద్రంలో చక్రం తిప్పాల్సిన అవసరం ఉన్నది.


logo