గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Jan 21, 2020 , 00:37:09

రాజధాని ప్రశ్న

రాజధాని ప్రశ్న

శివరామకృష్ణన్ కమిటీ నివేదిక చెత్తబుట్ట పాలైంది. సింగపూర్ నమూనా అన్నాడు. జపాన్‌తో ఎంఓయూలన్నాడు. స్విస్ చాలెంజ్ మెథడ్ అన్నాడు. వీటి సంగతేమో కానీ ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది అతిపెద్ద ఆరోపణ. చంద్రబాబు సృష్టించిన పంచరంగుల కలల నుంచి జనం బయటపడ్డారు కనుకనే జగన్ అధికారంలోకి వచ్చారు. అయితే చంద్రబాబు చేసిన తప్పిదాలను జగన్ ఏ విధంగా చక్కదిద్దుతారనేదే ఇప్పుడు ఆంధ్ర ప్రజల ముందున్న ప్రశ్న. మూడు రాజధానుల విషయమై విస్తృత చర్చ జరుగలేదనేది వాస్తవం. విశాఖపట్నంను రాజధానిగా ప్రకటించిన తర్వాత వెనుకడుగు వేస్తే ఉత్తరాంధ్ర ప్రజలు ఊరుకోరు.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ, ఇప్పుడున్న రాజధాని అమరావతి స్వరూప స్వభావాలను మారుస్తూ శాసనసభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టడంతో జగన్ ప్రభు త్వం ఇంతకాలం చెబుతున్న వికేంద్రీకరణపై ముందుకు సాగుతున్నదని స్పష్టమైపోయింది. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలపై లోకాయుక్త చేత విచారణ జరిపించాలని కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం చెబుతున్న కొత్త అమరిక ప్రకారం- శాసన విభాగం అమరావతిలోనే కొనసాగుతుంది. కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో సచివాలయం ఏర్పాటవుతుంది. వివిధ శాఖాధిపతులు కూడా విశాఖపట్నంలోనే ఉంటారు. ఉన్న త న్యాయస్థానం కర్నూలులో ఏర్పాటవుతుంది. సూటిగా చెప్పాలంటే- జగన్ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నం తరలిస్తున్నది. అమరావతిని అప్రధానంగా మార్చివేస్తున్నది. రెండు లేదా మూడు జిల్లాలకు ఒక జోన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి జోన్‌కు ఒక ప్రణాళికా, అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేస్తారు. పరిపాలనను వికేంద్రీకరించడం, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమనేది మంచి ఆలోచనే. కానీ రాజధానిని తరలించడమే అసాధారణ నిర్ణయం. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పటికీ అంతా అస్తవ్యస్తంగా తయారుచేసి పెట్టింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం రాజధానిని తరలించడమే కాదు, మొత్తం మూడు రాజధానులు అంటున్నది. మద్రాసు నుంచి విడిపోయిన నాటినుంచి రాజకీయ నాయకుల మూలంగా ఆంధ్ర రాష్ర్టానికి రాజధానే లేకపోవడం విషాదకరం.

మద్రాసు రాష్ట్రంలో ఇమడలేక ఆంధ్ర ప్రజ లు ప్రత్యేక రాష్ట్రం కోసం సుదీర్ఘ ఉద్యమం సాగించారు. మద్రాసు నగరాన్ని ఇవ్వడానికి తమిళులు ఎట్లాగూ అంగీకరించరు. మద్రాసు నగరం కోసం పట్టుపట్టకపోతే రాష్ర్టావతరణ ఇం కా ముందే జరిగేది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు నాయకులంతా కలిమిడిగా ఉం డి జాతి భవిష్యత్తు దృష్ట్యా సరైనా రాజధానిని ఎంపిక చేయాల్సింది. కానీ ప్రాంతీయ దురభిమానాలు, ముఠా కలహాలు, పదవీకాంక్ష ప్రధా న పాత్ర వహించాయి. రాయలసీమ నాయకు లు మద్రాసు రాష్ట్రంతోనే ఉంటామనడంతో వారిని ఒప్పించవలసివచ్చింది. చివరికి కొత్త రాష్ర్టానికి కర్నూలు రాజధానిగా నిర్ణయించారు. అక్కడ కనీస వసతులు కూడా లేకపోవడంతో గుడారాలు వేసుకోవలిసిన దుస్థితి. రాష్ట్ర సాధ న ఉద్యమం మూలంగా ఆంధ్ర ప్రజల్లో స్వాభిమానం వెల్లివిరిసిన కాలమది. విజయవాడ వం టి అనువైన నగరాన్ని రాజధానిగా చేసుకొని, జాతిభావనను స్థిరపరుచుకొని, తమకున్న వనరులతో అభివృద్ధిపథంలో సాగితే ఇవాళ ఇంత విషాదం ఉండేది కాదు. కానీ ఒక నాయకుడు ముఖ్యమంత్రి దక్కితే చాలనుకున్నాడు. మరొకరు రాజధాని మాకు దక్కకపోయినా సరే, విజయవాడ కాకూడదనుకున్నారు. ఇన్ని కుమ్ములాటలు ఉన్నప్పటికీ  హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ వనరులను సొంతం చేసుకోవాలనుకునే విషయంలో మాత్రం ఏకాభిప్రాయం ప్రదర్శించారు. అదే ఆంధ్ర రాష్ర్టానికి విషాదకరమైన మలుపు. ఎంతకాలం ఉన్నా హైదరాబాద్ పరాయి నగరమనే సోయి ఆంధ్ర నాయకులకు లోపించింది. 

రాష్ట్ర విభజన దశలో కూడా సొంత రాజధానిపై చర్చ కన్నా హైదరాబాద్‌ను వదులుకోకూడదనే భావించిన ఘనత ఆంధ్రా నాయకులది.2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సొంత రాజధాని విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరి స్తే 1950 దశకంలో జరిగిన చారిత్రక తప్పిదాలను చక్కదిద్దుకున్నట్టయ్యేది. కానీ పదేండ్ల వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పెట్టించుకోవడాన్ని బట్టి వారు చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదని తెలుస్తున్నది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనా సరళి తెలిసిందే. ఆయన నిఘంటువులో హైదరాబాద్ అభివృద్ధి అంటే అస్మదీయులకు భూములు కట్టబెట్టడం. అదే అభివృద్ధి విధానాన్ని అమరావతిలో విస్తృతస్థాయిలో అమలుచేశాడు. రెండు వేల ఎకరాలలో, రెండు వేల కోట్లతో, రెండేండ్లలో చక్కటి రాజధానిని నిర్మించుకోవచ్చన్న విజ్ఞుల సలహాలు వినిపించుకో లేదు. పంట పొలాలను నాశనం చేసి హరిత నగరం నిర్మిస్తామనడం ఏమిటనే నిపుణుల ప్రశ్నల ను పట్టించుకోలేదు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక చెత్తబుట్ట పాలైంది. సింగపూర్ నమూనా అన్నాడు. జపాన్‌తో ఎంఓయూలన్నాడు. స్విస్ చాలెంజ్ మెథడ్ అన్నాడు. వీటి సంగతేమో కానీ ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది అతిపెద్ద ఆరోపణ. చంద్రబాబు సృష్టించిన పంచరంగుల కలల నుంచి జనం బయటపడ్డారు కనుకనే జగన్ అధికారంలోకి వచ్చారు. అయితే చంద్రబాబు చేసిన తప్పిదాలను జగన్ ఏ విధంగా చక్కదిద్దుతారనేదే ఇప్పుడు ఆంధ్ర ప్రజల ముందున్న ప్రశ్న. మూడు రాజధానుల విషయమై విస్తృత చర్చ జరుగలేదనేది వాస్తవం. విశాఖపట్నంను రాజధానిగా ప్రకటించిన తర్వాత వెనుకడుగు వేస్తే ఉత్తరాంధ్ర ప్రజలు ఊరుకోరు. విశాఖపట్నం వెళ్ళే పనిలేకుండా తమ దగ్గరే ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటుచేస్తారనే అభిప్రాయం రాయలసీమలో ఏర్పడ్డది. జగన్ తాను నిర్ణయించుకున్న ప్రకారం ముందుకుపోతారు. కానీ ఆంధ్రుల రాజధాని ఏదనేది ఇంకా జవాబు లేని ప్రశ్నగానే మిగిలి ఉన్నది. 


logo