గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Jan 20, 2020 , 23:53:51

విలువలు పెంచేలా విద్యాబోధన

విలువలు పెంచేలా విద్యాబోధన

వేలిముద్రలు వేయడం నుంచి సంతకం చేసే స్థాయి వరకు తీసుకెళ్లింది మన విద్య. కానీ సాంకేతిక పరిజ్ఞానం సంతకం చేసే స్థాయి నుంచి మళ్లీ వేలిముద్రల స్థాయికి తెచ్చింది. కాలానుగుణంగా మార్పులు చేర్పులతో మన విధానాలను సంస్కరించుకోవలసిన అవసరం ఉన్నది. విద్యార్థులు పాఠ్యాంశాలను కంఠస్థం చేసి పరీక్ష పత్రాలు నింపే విధానం మారాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని సానుకూలంగా ఉపయోగించుకుంటూ ఆచరణాత్మక పద్ధతుల్లో శిక్షణ పొందుతూ వినూత్నమైన ఆలోచనలతో నైపుణ్యాలకు పదునుపెట్టాలి.

విద్యతో కూడిన మేధస్సు ఉన్నా మనస్సులో నిరక్షరాస్యత నిండి ఉంటే ఆచదువుకు అర్థం లేదంటారు అరిస్టాటిల్. విద్యా చరమగమ్యం శీలం. మంచి సంపాదన కోసం మాత్రమే విద్యను అభ్యసించాలన్న భ్రమ నుంచి బయటికిరాని కొన్నివర్గాలు  ఇప్పుడైనా మేలుకోవలసిన సమయం ఆసన్నమైంది.రాబోయే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల్లో నైతిక విలువలు పెం చేలా బోధనలు కొనసాగే విధంగా చర్యలు చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం ప్రశంసనీయం. మాజీ డీజీపీలతో కమిటీ వేసి వారి సూచనల మేరకు పాఠ్యాంశాల రూపకల్పన చేస్తామని, ఈ ప్రక్రియలో చిన్నజీయర్ స్వామి వంటి ఆధ్యాత్మిక, ధార్మికవేత్తల సలహాలు తీసుకుం టూ తెలంగాణను ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామని సీఎం కేసీఆర్ సుస్పష్టమైన ప్రకటన చేశారు.మన పూర్వీకులు పిల్లలకు విద్యను నేర్పించమని కాకుండా, విద్యాబుద్ధులు నేర్పించమని చెప్పేవారు. సనాతన ధర్మంలోని సత్సంప్రదాయాలను, సంస్కారాన్ని మేళవించి నైతిక విలువలను కాపాడే విద్యను బోధించడానికి నాటి గురువులు మొగ్గు చూపేవారు. నేడు భారతదేశంలో అభివృద్ధికి పెద్ద అడ్డుగోడలా తయారైన నిరక్షరాస్యతను రూపుమాపవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అదే సమయంలో పౌరులను గుణవంతులు, శీలవంతులుగా మార్చలేని విద్యావిధానం వృథా ప్రయత్నం. మనదేశంలో విద్య కొన్ని వేల ఏండ్ల పూర్వం నుంచి తన వైభవాన్ని కలిగి ఉన్నది. ప్రాచీనకాలంలో నలంద,  తక్షశిల మొదలగు విశ్వవిద్యాలయాల్లో సనాతన వైదిక సంస్కృతి, విలువలతో కూడిన సంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యాబోధన జరిగేది. అందుకే మనదేశం వేద భూమిగా కర్మభూమిగా వర్ధిల్లింది.

ప్రస్తుతం చదువు(కొన్న) యువత గాడితప్పి నేరాలు, ఘోరాలు, దారుణాలకు పాల్పడుతూ అల్లకల్లోలం సృష్టించడం ప్రతి దినం వింటున్నాం, చూస్తున్నాం. మానవత్వం మరిచిన మానవుడు మృగంలా ఎందుకు మారిపోతున్నాడు? కష్టపడి పనిచేయకుండా అడ్డదారుల్లో అక్రమ సంపాదనకు పాల్పడి తమ విలువైన జీవితాన్ని పాడుచేసుకుంటున్నవారు కొందరైతే, మద్యపానం మాదకద్రవ్యాలకు అలవాటుపడి అమానుషంగా ప్రవర్తిస్తున్నవారు మరికొందరు. ఇదంతా ఆగాలంటే ఎలా? జరిమానాలు, శిక్షలు, చట్టాలు, పోలీసులు, కోర్టులు ప్రజల్లో నేర ప్రవృత్తిని ఏ మేరకు నియంత్రించగలవు? అన్న ప్రశ్నలు ఉదయించక మానవు.మంచి నడవడికను అలవాటు చేసుకున్న విద్యార్థులు, యువత మాత్ర మే పౌర ధర్మాన్ని పాటిస్తూ నిబద్ధతతో రేపటి మెరుగైన సమాజాన్ని తీర్చిదిద్దడానికి నడుం కట్టగలరు. నానాటికీ దిగజారుతున్న నైతిక విలువలను కాపాడుకోవడానికి మన ముందున్న మార్గం ప్రస్తుత విద్యావిధానంలో  చేపట్టవలసిన సమూలమైన సంస్కరణలు అన్న సత్యాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వ అధినేతకు అభినందనలు. సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా కూడా ప్రయత్నాలు మొదలైనవి అనడానికి నిదర్శనం ముఖ్యమంత్రి మదిలో మెదిలే ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమం. స్వచ్ఛంద సంస్థలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఉపాధ్యాయులు, సాఫ్ట్‌వేర్ సంస్థల ప్రతినిధులు మరెందరో ఈ కార్యక్రమానికి తమవంతు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.సమాజంలో మార్పు రావాలంటే ముందుగా కావలసింది సత్సంక ల్పం. సంకల్పం బలంగా ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు, మహనీయుడు కాగలడు. అలాంటి ఉదంతాలు ఈ భారతావనిలో కోకొల్లలు. వాల్మీకి మహర్షిగా మారాడంటే అది దైవసంకల్పం. మరి 2020 దశకం నుంచి మహర్షిలా కాకున్నా మంచి పౌరులుగా మన విద్యార్థులు రూపుదిద్దుకోవాలంటే  విద్యాబోధనలో మార్పు తేవాలన్న ప్రభుత్వ సంకల్పం హర్షణీయం.

సమాజంలోని మంచిచెడుల పట్ల అవగాహన కల్పించే విధంగా, మనిషికి మనిషి సాయపడే విధంగా, చెడుని ప్రశ్నిస్తూ సేవా దృక్పథంతో ముం దుకు సాగేవిధంగా విద్యార్థులను, యువతను తీర్చిదిద్దే ప్రయత్నం జరుగాలి. ఎంతటి మహనీయులకైనా దిశానిర్దేశం చేసేది గురువులు నేర్పిన విద్యా వినయాలు. మహాత్ములు నడయాడిన భారతావనిలో నేటి యువ త కూడా ధర్మబద్ధులై జీవిస్తూ మన కీర్తిని దశదిశలా వ్యాప్తి చేయాలంటే విద్యాబోధనలో, పాఠ్యాంశాల రూపకల్పనలో సమూలమైన మార్పులు జరిగి తీరాలి.మానవ వనరుల అభివృద్ధిపై దృష్టిసారించే నూతన విద్యావిధానం  విద్యార్థుల మానసిక, శారీరక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక మెరుగుదలకు తోడ్పడేవిధంగా ఉండాలి. ఆ విధంగా సమతూకం పాటించగలిగినప్పుడే విద్యార్థులు తార్కికంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల స్థాయికి ఎదుగుతారు. శ్రీ అరబిందో విద్యా విధానం జాతీయస్థాయిలో ఉత్తమమైనదిగా కొనియాడబడుతున్నది. ఈ విధానంలో విద్యార్థుల మదిలో మేధస్సు నింపే ప్రయ త్నం జరుగదు. వారిలో దాగి ఉన్న ఆసక్తిని జిజ్ఞాసను వెలికితీసే ప్రయ త్నం జరుగుతుంది.మత సామరస్యాన్ని పాటిస్తూ మానవత్వమే తన మతంగా భావిస్తూ శాంతియుత జీవనం అలవరిచే విద్యావిధానం కావాలి. విద్యార్థులు చేసే సామాజిక సేవలకు గుర్తింపుగా వారికి స్వల్ప మొత్తంలో చేతి ఖర్చులు అందజేస్తూ అభినందన పత్రాలతో సన్మానించడం వల్ల సేవా కార్యక్రమాలపై ఆకర్షితులు కావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా వారిని సమాజసేవలో భాగస్వాములను చేస్తూ క్రమంగా జాతి పునర్నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించేవిధంగా మలుచవచ్చు.వేలిముద్రలు వేయడం నుంచి సంతకం చేసే స్థాయి వరకు తీసుకెళ్లింది మన విద్య. కానీ సాంకేతిక పరిజ్ఞానం సంతకం చేసే స్థాయి నుంచి మళ్లీ వేలిముద్రల స్థాయికి తెచ్చింది. కాలానుగుణంగా మార్పులు చేర్పులతో మన విధానాలను సంస్కరించుకోవలసిన అవసరం ఉన్నది. విద్యార్థులు పాఠ్యాంశాలను కంఠస్థం చేసి పరీక్ష పత్రాలు నింపే విధానం మారాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని సానుకూలంగా ఉపయోగించుకుంటూ ఆచరణాత్మక పద్ధతుల్లో శిక్షణ పొందుతూ వినూత్నమైన ఆలోచనలతో నైపుణ్యాలకు పదునుపెట్టాలి. అప్పుడే పరిశోధన, అభివృద్ధి రంగాల్లో ముందంజ వేసే స్థాయికి చేరుకోవచ్చు.


logo