సోమవారం 30 మార్చి 2020
Editorial - Jan 20, 2020 , 16:50:21

ఆకాశంలో ముషాయిరా

ఆకాశంలో ముషాయిరా

‘పుట్టినరోజు’ కథ కల్పితమైన ఆదర్శవంతమైతే పర్యావరణంలోంచి జనించిన కథనే. ఇది వృక్షోత్సవ కథ. వృక్ష ప్రాణి పుట్టినరోజు ఇతివృత్తం చేసి రాసిన కథ. చిన్ని పుట్టినరోజుకు రమ్మని మిత్రుల ఇంటికి వెళ్లి మరీ మరి చెప్పి వస్తాడు. చిన్ని అంటే స్నేహితుడి పుట్టినరోజు,వాళ్ల చెల్లెలు పుట్టినరోజో అని మిత్రులంతా అనుకుంటారు. నిజానికి చిన్ని అంటే ఓ సంవత్సరం క్రితం నాటిని మొక్కపేరు. దాన్ని తాను పెంచినట్లే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి, వాటి పుట్టినరోజును ఒక వేడుకగా వృక్షోత్సవంగా ఓ పండుగలా చేసుకోమని ఈ కథ చెబుతుంది.

కవి సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘మ్రోయు తుమ్మెద’ నవలలోని కథానాయకుడు పి.నారాయణరావు వకీలు. ఆయన కుమారుడు పి.రాంనారాయణ్‌. వృత్తిరీత్యా పోలీసు అధికారి ప్రవృత్తి రీత్యా కవి. ‘ఆకాశంలో ముషాయిరా’, ‘తీర్థం’, ‘నాదాలు-నా పదాలు’ ఆయన రాసిన కవితా సంపుటాలు.
నేను ఇంటర్మీడియట్‌ చదువుతున్న రోజుల్లో రాంనారాయణ్‌ జగిత్యాలలో కామర్స్‌ లెక్చరర్‌గా పనిచేసేవాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సలహాదారుగా పనిచేస్తున్న రాజిరెడ్డి, రామానంద తీర్థ రూరల్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ప్రొఫెసర్‌ రాంచందర్‌ ఆయనతో పాటు జగిత్యాల కాలేజీలో సహా ఉపన్యాసకులుగా పనిచేశారు. నేను చదివింది సైన్స్‌. వీరు ముగ్గురూ సైన్సేతర విభాగాలకు చెందిన వ్యక్తులు. మా అన్నయ్య డాక్టర్‌ రఘుపతిరావు దగ్గరకు తరచూ వీరంతా రావడం వల్ల నాకు రాంనారాయణ్‌తో పరిచయం. ఆ తర్వాత నేను హైదరాబాద్‌లో మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నప్పుడు రాంనారాయణ్‌ తిరిగి నాకు టచ్‌లోకి వచ్చాడు. దానికి కారణం మా ఇద్దరి మధ్యనున్న సాహితీ బంధమే. కవిత్వం గురించి తరచూ మాట్లాడుకునే వాళ్లం. సాహితీ చర్చలు జరిగేవి. తరచుగా కలిసేవాళ్లం. మా అన్నయ్యతో స్నేహబంధం కన్నా నాతో ఆయన బంధం కొనసాగింది. దానికి కారణం రాంనారాయణ్‌ కవిగా రూపాంతరం చెందడం.
మా ఇద్దరి ఉద్యోగ బదిలీల మధ్యన మా కవితా స్నేహానికి అంతరాయం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతున్నప్పుడు ఉద్య మం గురించి తరచూ నాతో కూడా విషయ సేకర ణ చేసేవాడు. తెలంగాణ ఏర్పాటు బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గట్టిగా విశ్వసించిన వ్యక్తి రాంనారాయణ్‌.
పోలీసు అధికారిగా వివిధ హోదాల్లో పనిచేసిన రాంనారాయణ్‌, కఠినంగా ఉన్నాడో, సున్నితంగా వ్యవహరించాడో తెలియదు కానీ, ఆయన కవి త్వం మాత్రం బహు సున్నితం. అందుకే ఆయన ఒక కవితలో..
‘లాఠీ లేచింది రాక్షసంగా
నిర్దోషి కళ్ళనిండా నీరు..’ అంటారు.
మట్టి ప్రమిదలోని వెలుగుకు ఆయన ఇలా ప్రణమిల్లారు.
‘నిన్న చూచినప్పుడు నీవు
వట్టి మట్టి ప్రమిదవు
పట్టించుకోలేదు
నేడు..
వెలిగే అఖండజ్యోతివి
ప్రణమిల్లి మరి కదలలేదు..’
గత మూడు మాసాలుగా ఆయన ఫోను మూగబోయింది ఎన్నిసార్లు చేసినా ఆయన ఫోను స్విచ్ఛాఫ్‌ అనే ధ్వనించింది. అమెరికా వెళ్లారేమో అనుకున్నాను. కానీ ఆయన ఆరోగ్యం బాగా లేద న్న విషయం కొంతకానికి తెలిసింది.
చివరికి చూడటం కుదరనే లేదు. ఈ సంక్రాంతి రోజు రాంనారాయణ్‌ చనిపోయారన్న విషయం తెలిసింది. నా కంటికి జరిగిన శస్త్రచికిత్స వల్ల ఆయ నను కడసారిగా చూడలేకపోయాను. జీవితం అర్థమవుతున్న దశలోనే మృత్యువు ఎదురుపడుతుం ది. రాంనారాయణ్‌ కూడా మరణం గురించి ఓ కవితలో..
‘జీవితం అంటే ఏమిటో
స్ఫురిస్తున్న వేళలో
మృత్యువు యెదురుపడింది!
ఈ మేళాలో
చివరకు
పశ్చాత్తాపానికి కూడా
నోచుకోని క్షణాలు
అంతలోనే అనంత వాయువుల్లో
ఈ ప్రాణాలు..’ అంటారు.
మా అన్నయ్య, స్నేహితుడు నా స్నేహితుడు కావడం రాంనారాయణ్‌ సహృదయత అని అనుకుంటాన్నేను. సంగీతం, సాహిత్యం పట్ల ఇష్టంతో వున్న రాంనారాయణ్‌ తెలుగు ప్రజలకు ‘ముషాయిరా’లనే కాదు, ‘తీర్థాన్ని’ ప్రసాదించాడు. ఎక్క డ ఏ మంచి కవిత కనిపించినా చదివారా అని అడిగి మరీ చదివించేవాడు.
ఈ అనంతకాల పరిభ్రమణంలో ఆయనకొక లిప్త
కునుకు లేదు-ఎప్పుడూ దేవుని ధ్యాసే.
ఆయన ఊసే-అందుకే భగవంతుడిని ఓ కవితలో ఇలా అంటాడు..
‘నీవేమో అనంత శయనమూర్తివి..’అని ‘నీడలో వేలాడే ఊడలకు
ఆకులా రాలిపోయే అనుభవం లేదు -నిజమే-
వల్మీకాన్ని చుట్టుకున్న మహర్షులకు
మహాభినిష్క్రమణం అవగతం కాదు..’
రాంనారాయణ్‌ నిష్క్రమణం ఇంత త్వరగా ఎందుకో నాకు అర్థం కాలేదు.
బహుశా ఆకాశంలో ముషాయిరాలు వినిపించడానికేనేమో...!
- రాజేందర్‌ జింబో 94404 83001


logo