బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Jan 20, 2020 , 16:42:53

మేన తోవ

మేన తోవ

నేను పోలే
వాళ్లు రాలే
వాళ్లు లేరు
వాళ్ల సప్పుడు లేదు
కన్నీళ్లు వంగినప్పుడు
కలుస్తుంటారు అంతే
పచ్చి ముట్టి కాలం జరిగితే
నిశ్శబ్దం పగిలి
జ్ఞాపకం రాజుకుంది
అమ్మ చెయ్యి పట్టుకొని
కట్ట దిగుతుంటే
పిల్ల బాట అల్లుకునేది
తంగెడి, ఎంపలి పూతలు
మురకజూసి ముచ్చట పడేయి
ఎదురొచ్చి పచ్చులు ఎదమీన వాలేయి
ఉడుతలు ఉరుకుల పెడుతుంటే
ఎనుగులో తొండలు ఎగుర్లపెట్టేయి
అడుగు అడుగుకు
అమ్మ అంతరమంతా
కలల కల్లమే
అప్పుడు తోవలుండేవి
గుండె నుంచి గుండెకి
కండ్ల నుంచి కండ్లకి
పానాలున్న సన్నని కాలువ పాకుతుండేది
ఆడ పిల్లలన్నా
ఆడపిల్లల పిల్లలన్నా
ఆర్ణమై హారతిచ్చి
పుట్టినిల్లు పుత్తడయ్యేది
ఆడ పిల్లలే కాదు
పొట్టకొచ్చిన చేను కూడా
ఆ సల్లని సూపులకు
సీమంత మయ్యేది
బొడ్డు గురిగి నుంచి
ఆరబెట్టిన పటవ దాకా
ఎన్ని మలకలు మల్లినమో
మరెసరుముంతకెరుక
ఎవరు లేరిప్పుడక్కడ
దారులుడిగి పోయి
పడవబడి బాయిగడ్డ
పాటి గడ్డయింది
పచ్చిలెగిరే పల్లెమీన
ఇమానంలేని ఇమానం ఎగిరిపోయింది
అమ్మమ్మ/ మామ/ ఊరు
అప్పుడప్పుడు
తలపైకెత్తి చూస్తే
చందమామలో కనిపిస్తారు.
- మునాసు వెంకట్‌, 99481 58163


logo