ఆదివారం 29 మార్చి 2020
Editorial - Jan 18, 2020 , 23:34:56

పంచవర్ష ప్రణాళిక

పంచవర్ష ప్రణాళిక

కృష్ణా, గోదావరి ప్రాణహిత, మానేరు తదితర నదుల మీద ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రికగా శరవేగంగా పూర్తిచేసుకుంటున్న నీటిపారుదల ప్రాజెక్టులు, వాటికి అనుబంధంగా నిర్మాణంలో ఉన్న జలాశయాలు, చెరువులు, కాలువ లు, బ్యాక్‌వాటర్స్‌, తదితర భారీ, మధ్యతరహా, చిన్న నీటి వనరున్నీ కలిపి 2024-25 సంవత్సరానికి మన రాష్ట్రంలోని ఇన్‌ల్యాండ్‌ ఫిషరీస్‌ నిర్వహణకు సుమారు 7,14,500 హెక్టార్లు అందుబాటులోకి రానున్నది.

ప్రాణహిత, గోదావరి నదుల నీటి వినియోగానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక తుదిరూపానికి చేరుకుంటున్న కీలక సన్నివేశా న్ని ఆవిష్కరించుకుంటున్న వర్తమాన సందర్భంలో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నీటివనరుల నుంచి సాధ్యమయ్యే ఉపాంత ప్రయోజనాలపై తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో తన దృష్టిని కేంద్రీకరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణ మత్స్యరంగాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశలో పురోగమింపజేసేందుకు అందుబాటులోకి రానున్న అవకాశాలను అన్వేషించి, అందుకనుగుణంగా ఒక దీర్ఘకాలిక ఆచరణాత్మక కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది.

ముంబైకి చెందిన ‘అగ్రికల్చరల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌' అనే సంస్థ గతేడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన బేస్‌లైన్‌ సర్వే ఆధారంగా తెలంగాణ రాష్ట్రం మత్స్య పారిశ్రామికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ‘సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌'వారు రానున్న ఐదేండ్ల కాలంలో అమలుచేయాల్సిన సంపూర్ణ కార్యాచరణ ప్రణాళికను గత జూన్‌ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. సదరు కార్యాచరణ ప్రణాళికను అమలుపరుచడానికి అనుగుణంగా రాష్ట్ర మత్స్యరంగంలో సంస్థాగతంగా తీసుకురావాల్సిన మార్పులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ఒక సమగ్రమైన అవగాహనతో ఉన్నట్లు తెలుస్తున్నది. 2020-21 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో ఐదేండ్ల పాటు అమలుపరుచడం కోసం రూపొందించిన ఈ కార్యాచరణ ప్రణాళిక ఫలితంగా తెలంగాణ మత్స్యరంగాన్ని గరిష్ఠ స్థాయి లో అభివృద్ధి చేయాలనే లక్ష్యాలను నిర్దేశించుకున్నారు.

రాష్ట్రంలో చేపల ఉత్పత్తికి అనువుగా అందుబాటులో ఉన్న నీటి వనరులను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడం, మత్స్యరంగంలోని ఉత్పత్తి, ఉత్పాదకతలను జాతీయ సగటు స్థాయికి పెంచుకోవడం, సంప్రదాయ చేపల పెంపకానికి సమాంతరంగా అధునాతన పద్ధతుల్లో నిర్వహించే ఆక్వాకల్చర్‌ రంగాన్ని కూడా అభివృద్ధి పరుచడం, పరిశుభ్రమైన పరిస్థితుల్లో తాజా చేపల ఆహారాన్ని ప్రజలకు మరింత చేరువగా అందుబాటులోకి తీసుకరావడం ద్వారా రాష్ట్రంలో చేపల ఆహార వినియోగంలో వృద్ధిని సాధించడం, సంప్రదాయ మత్స్యకారుల వార్షిక సగటు ఆదాయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పెంచడం లాంటి ప్రాథమిక లక్ష్యాలను ఈ ప్రణాళికలో పొందుపరిచా రు.

అంతేకాకుండా చేపల ఉత్పత్తి, ఉత్పాదకతలో కీలకపాత్రను నిర్వహించే చేప విత్తనాలు, చేపల దాణా, ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌, రవాణా, చేపల పెంపకానికి సంబంధించిన ఆధునిక విధానాలపై మత్స్యకారులకు నిరంతర శిక్షణ, అక్వాకల్చర్‌లో ఉన్నత విద్యా సదుపాయాలు, పరిశోధన, చేపల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన మౌళికమైన అంశాలపై కూడా అనేక చర్యలను ఈ ప్రతిపాదనల్లో పొందుపరిచారు. తెలంగాణలో ఉత్పత్తి జరిగే చేపలకు గల్ప్‌దేశాల్లో ఉండే ఆసక్తి, గిరాకీలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడి నుంచి విదేశాలకు చేపలను ఎగుమతి చేసేందుకు వీలున్న మార్గాలను, అవకాశాలను కూలంకషంగా అన్వేషించాలని ఈ ప్రతిపాదిత నివేదికలో ప్రత్యేకంగా సూచించారు.

చేపలను కొంతకాలంపాటు నిల్వ చేసుకోవడానికి వీలుగా ‘కోల్డ్‌ చైన్‌' వ్యవస్థను నెలకొల్పడంతో పాటు, ఒక పటిష్ఠమైన మార్కెటింగ్‌ నెట్‌వర్క్‌ను రూపొందించాలని కూడా సూచించారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఆధునిక ఆహారపుటలవాట్లకు తగినట్లుగా చేపల ఆహారాన్ని వివిధ రూపాల్లో తయారు చేయడానికి, నిలువ చేయడానికి ‘ఫిష్‌ ప్రాసెసింగ్‌'ను ప్రోత్సహించాలని ప్రతిపాదించారు. ‘రెడీ టు కుక్‌', ‘రెడీ టు ఈట్‌' పద్ధతులను కూడా అనుసరించాలన్నారు. ముఖ్యంగా చేపల ఆహార వినియోగం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించి, ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు సంబంధించిన విద్యార్థులు హాస్టళ్లలో చేపల ఆహారాన్ని మెనూలో చేర్చాలని సూచించారు.

రానున్న ఐదేండ్లలో ఈ లక్ష్యాలను సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా, చేపట్టవలసిన కార్యక్రమాలపై కూడా ఈ కార్యాచరణ ప్రణాళికలో అనేక అంశాలను పొందుపరిచారు. ఉపరితల జలవనరు ల చేపల పెంపకానికి అనువైన నీటి విస్తీర్ణం విషయంలో దేశంలోనే 3వ స్థానంలో నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో సుమారు 6.14 లక్షల హెక్టార్లు జలసేద్యానికి ప్రస్తుతం అందుబాటులో ఉంది. అయితే కృష్ణా, గోదావరి ప్రాణహిత, మానేరు తదితర నదుల మీద ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రికగా శరవేగంగా పూర్తిచేసుకుంటున్న నీటిపారుదల ప్రాజెక్టులు, వాటికి అనుబంధంగా నిర్మాణంలో ఉన్న జలాశయాలు, చెరువులు, కాలువ లు, బ్యాక్‌వాటర్స్‌, తదితర భారీ, మధ్యతరహా, చిన్న నీటి వనరున్నీ కలిపి 2024-25 సంవత్సరానికి మన రాష్ట్రంలో ని ఇన్‌ల్యాండ్‌ ఫిషరీస్‌ నిర్వహణకు సుమారు 7,14,500 హెక్టార్లు అందుబాటులోకి రానున్నది.

ఈ నీటి వనరుల సామర్థ్యాన్ని చేపల ఉత్పత్తి కోసం గరిష్ఠంగా వినియోగించుకోగలిగితే, ఇప్పుడున్న వార్షిక చేపల ఉత్పత్తిని రానున్న ఐదేండ్లలో కనిష్ఠం గా ఏడు లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తికి పెరుగుతుందని అంచనా వేశారు. ఈ చేపల ఉత్పత్తికి సం బంధించిన వృద్ధిరేటు దానికి అనుబంధంగా చేపల విత్తనాలు, చేపల దాణా ఉత్పత్తికి దోహదం చేస్తా యి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో అవసరమైన చేప విత్తనాలు సుమారు 95 కోట్లుగా అంచనా వేశారు. రానున్న ఐదేండ్లలో మన రాష్ట్ర అవసరాలకు కనీసం 150 కోట్ల చేప విత్తనాల ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకూ చేప విత్తనాల అవసరాల కోసం మన రాష్ట్రం పూర్తిగా ఏపీ మీదనే ఆధారపడుతున్న ది. అందువల్ల మన రాష్ర్టానికి సంబంధించిన చేప విత్తనాలను స్థానికంగానే ఉత్పత్తి చేసుకోవడానికి అవసరమైన హాచరీస్‌, నర్సరీలు, రేరింగ్‌ కేంద్రాలను నెలకొల్పుకోవాల్సి ఉంటుంది.

అదేవిధంగా ఆక్వాకల్చర్‌ ఆధునిక పద్ధతుల్లో చేపలను పెంచడంలో ప్రధానంగా అవసరమయ్యే చేపల దాణా ఉత్పత్తి కేంద్రాలను సైతం స్థానికంగానే నెలకొల్పేందుకు కొత్తగా అవకాశాలు కలుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో చేపల విత్తనాలు, చేపల దాణా ఉత్పత్తికి సంబంధించి కొత్తగా అనేక అవకాశాలు కలుగనున్నాయి. చేపల దాణా విషయంలో కూడా మనం ఇంతవరకూ ఇతర రాష్ర్టాల మీదనే ఆధారపడుతున్నాం. అందువల్ల స్థానికంగానే ఈ ఉత్పత్తులను సాధించుకోవడానికి ప్రభుత్వం రాష్ట్ర మత్స్యశాఖ, జాతీ య మత్స్య అభివృద్ధి సంస్థల ద్వారా రాయితీలతో కూడిన పథకాలను అమలుచేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రగతి కనిపించడంలేదు. అందువల్ల 2024-25 ఆర్థిక సంవత్సరాంతానికి పెరుగనున్న డిమాండుకు అనుగుణంగా ఈ రెండు అంశాల్లో అవకాశాలు మెరుగుపడనున్నాయి. తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన 150 కోట్ల చేప విత్తనాలు, ఏటా అవసరమయ్యే నాలుగు లక్షల టన్నుల చేపల దాణా ఉత్పత్తిని తయారుచేయడానికి అవసరమైన కేంద్రాలను అభిదృద్ధి చేయాల్సి ఉంటుంది.
Ravinder-Pittala
వేగవంతంగా పెరుగుతున్న ఆధునిక ఆహారపుటలవాట్లకు తగినట్లుగా మత్స్య పారిశ్రామిక రంగాన్ని తీర్చిదిద్దేందుకు ఈ ఐదేండ్ల కార్యాచరణ ప్రణాళికలో తగిన ప్రాముఖ్యాన్ని కల్పించాలని కూడా సూచించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కనీస ఉనికి కూడా సాధించని తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఐదేండ్లలో సుమారు లక్ష టన్నుల చేపలను ప్రాసెసింగ్‌ చేయడానికి అనువైన ఏర్పాట్లను సాధించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించారు. రాష్ట్రంలో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల్లో చేపల పెంపకానికి అనువైన ‘కేజ్‌ కల్చర్‌' విధానాన్ని పెద్ద ఎత్తున అమలుపరుచడం ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి కనీసం 50 వేల టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇప్పుడున్న 9 కిలోల సగటు వార్షిక చేపల ఆహార వినియోగాన్ని రానున్న ఐదేండ్లలో కనీసం 15 కిలోల వార్షిక సగటు వినియోగానికి పెంచాలని సూచించారు.

మత్స్యసహకార సంఘాల్లో ప్రస్తుతం ఉన్న 3,30,643 మంది సభ్యుల సంఖ్యను రానున్న ఐదేండ్ల కాలానికి 3,60,000లకు పెంచాలని, అట్లాగే ప్రతి మత్స్యకారుని ప్రస్తుత సగటు వార్షిక సంపాదనను కనీసం రూ. 2 లక్షలకు వృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మత్స్యరంగం ద్వారా లభిస్తున్న వార్షి క ఆదాయాన్ని రూ.2346 కోట్ల నుంచి రూ.10,500కోట్లకు పెంచుతూ, ఈ రంగం ద్వారా రాష్ట్రంలో మరో లక్ష మందికి అదనంగా ఉద్యోగ, ఉపా ధి అవకాశాలను కల్పించేందుకు అవకాశాలు కలుగుతాయని ఆశిస్తున్నా రు. ఈ లక్ష్యాలను సాధించేందుకు తెంగాణ మత్స్యరంగానికి రానున్న ఐదేండ్లలో ప్రభుత్వ పరంగా కనీసం రూ.3500 కోట్ల మేరకు వివిధ రకాలైన రాయితీలను భరించాల్సిఉంటుందని ఈ నివేదికలో పేర్కొన్నారు. రానున్న ఐదేండ్లలో అమలుపరిచే లక్ష్యంతో రూపొందించిన ఈ కార్యాచరణ ప్రణాళికను ఆచరణసాధ్యం చేయడానికి మత్స్యశాఖలో అవసరమైన మార్పులు, చేర్పులతో పాటుగా సంస్థాగత నిర్మాణాన్ని కూడా పునర్‌వ్యవస్థీకరించేందుకు అవసరమైన నిర్ణయాలను తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు.
(వ్యాసకర్త: తెలంగాణ ఫిషరీస్‌ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు)


logo