ఆదివారం 29 మార్చి 2020
Editorial - Jan 14, 2020 ,

ఉద్రిక్తతలు ప్రమాదకరం

ఉద్రిక్తతలు ప్రమాదకరం

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులకు ఇరాన్‌లో విమాన దుర్ఘటన అద్దం పడుతున్నది. తాజా వార్తల ప్రకారం ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్‌ ప్రతీకార దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తమ సైనికాధికారిని హతమార్చిన తరువాత ఇరాన్‌ ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించినప్పటికీ, పశ్చిమాసియా అంతటా అమెరికాపై దాడులకు దిగడం లేదు. ఇరాన్‌ దాడుల తరువాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కొంత తగ్గినట్టే మాట్లాడారు. రెండుపక్షాలు దూకుడుగా కనిపించినప్పటికీ, సంయమనం కూడా పాటిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. కానీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారి అతివాదులు రెండు దేశాలలో బలంగా ఉన్నప్పుడు పరిస్థితులను ఊహించడం కష్టం.

ఇరాన్‌ ‘పొరపాటు’గా జరిపిన దాడిలో పౌరులు ప్రయాణిస్తున్న విమానం కూలి 176 మంది ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికరం. విమానం తమ సైనిక కేంద్రంవైపు రావడంతో శత్రువులకు చెందినదిగా భావించి కూల్చివేసినట్టు ఇరాన్‌ సైన్యం ప్రకటించింది. ఉక్రెయికు చెందిన ఈ విమానం బుధవారం ఇమామ్‌ ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పైకి ఎగిరి తెహరాన్‌ శివారులోకి చేరుకున్న కొద్దిక్షణాల్లోనే ఇరాన్‌ సైనిక దాడి జరిగి కూలిపోయింది. ఈ విమానంలోని ప్రయాణికులలో ఎక్కువ మంది ఇరానియన్లు, ఇరానియన్‌- కెనెడియన్లు. ఈ విమానం సాంకేతిక కారణాల వల్ల కూలిపోయిందని, దీనిపై దర్యాప్తు జరుపుదామని ఇరాన్‌ మొదట ప్రకటించింది. కానీ ఇరానే కూల్చివేసిందని, తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని కెనెడా తదితర దేశాలు స్పష్టంగా వెల్లడించాయి. 


శనివారం నాటికల్లా ఇరాన్‌ తామే కూల్చివేసినట్టు అంగీకరించక తప్పలేదు. విమానం తాము కూల్చివేసినట్టు ఇరాన్‌ ముందుగానే నిజాయితీని ప్రదర్శించి అంగీకరించినట్టయితే హుందాగా ఉండేది. తమ పౌరులు ప్రయాణిస్తున్న విమానాన్నే ఇరాన్‌ కూల్చివేయడం పొరపాటుగానే జరిగి ఉంటుంది. విమానాన్ని కూల్చివేసింది ఇరానే అని ఆరోపిస్తున్న కెనడా కూడా ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి కాదనే అన్నది. బద్ధ శత్రువు అమెరికా కూడా పొరపాటుగా జరిగి ఉంటుందనే పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించడం వల్ల ఒక బాధిత దేశంగా ఉన్న సానుభూతిని కొంత కోల్పోవలసి వచ్చింది. ఇప్పటికైనా ఇరాన్‌ పొరపాటును అంగీకరించిం ది కనుక, అంతర్జాతీయ నిబంధనలు, సంప్రదాయాలకు అనుగుణంగా దోషులను శిక్షించడంతో పాటు, బాధితులకు నష్టపరిహారం చెల్లించవలసి ఉంటుంది. 


అమెరికా ఇటీవల ఇరాన్‌ అగ్రశ్రేణి సైన్యాధికారిని హతమార్చడంతో రెండుదేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌ ప్రతీకారం తీర్చుకుంటే మరింత విధ్వంసం తప్పదనే రీతిలో అమెరికా హెచ్చరికలు చేసింది. ఇరాన్‌ దేశమంతటా అనేక క్షిపణి దాడులు సాగిస్తామని కూడా ప్రకటించింది. ఈ హెచ్చరికల మధ్య ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్‌ క్షిపణి దాడులు సాగించింది. ఈ దాడులకు ప్రతీకారంగా అమెరికా ప్రతిదాడులు సాగిస్తుందనే ఒత్తిడిలో ఇరాన్‌ ఉన్న మాట వాస్తవం. అనుమానం వచ్చినప్పుడు దాడి చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోవడానికి కొన్ని సెకన్ల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఇంతగా యుద్ధ మేఘాలు ఆవరించుకొని ఉన్నప్పుడు పౌర విమానాల రాకపోకలను అనుమతించరు. 


కానీ అమెరికా- ఇరాన్‌ ఘర్షణ ఇప్పట్లో తెగేది కాదు, పెరిగేది కాదు అన్నట్టుగా ఉన్నది. ఏదిఏమైనా ఇరాన్‌ క్షిపణి దాడి జరిపేముందు కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తే, అమాయకులు బలికాకపోయేవారు. యుద్ధ పరిస్థితుల్లో పౌరులు ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చివేయడం ఇరాన్‌లో ఇది రెండవసారి. 1988లో పౌరులు ప్రయాణిస్తున్న ఇరాన్‌ విమానాన్ని అమెరికా నావికాదళం కూల్చివేసింది. దీంతో ఈ విమానంలో ప్రయాణిస్తున్న 290 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తమ యుద్ధ నావపై దాడికి వస్తున్న యుద్ధ విమానంగా భావించి కూల్చివేశామని ఆనాడు అమెరికా చెప్పుకున్నది. 2014 జూలై 17న మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన పౌర విమానం రష్యా అనుకూల తిరుగుబాటుదారుల ప్రాబల్యం గల తూర్పు ఉక్రేన్‌ ప్రాంతంలో కూలిపోయింది. దీంతో రష్యామీద ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పటికీ రష్యా ఈ ఆరోపణలను కొట్టివేస్తున్నది. యుద్ధాలు సాగుతున్నప్పుడు పౌరుల రక్షణ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలె. సంబంధిత దేశాలు కూడా నియమాలను కచ్చితంగా పాటించాలె. 


పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులకు ఇరాన్‌లో విమాన దుర్ఘటన అద్దం పడుతున్నది. తాజా వార్తల ప్రకారం ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్‌ ప్రతీకార దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తమ సైనికాధికారిని హతమార్చిన తరువాత ఇరాన్‌ ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించినప్పటికీ, పశ్చిమాసియా అంతటా అమెరికాపై దాడులకు దిగడం లేదు. ఇరాన్‌ దాడుల తరువాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కొంత తగ్గినట్టే మాట్లాడారు. రెండుపక్షాలు దూకుడుగా కనిపించినప్పటికీ, సంయమనం కూడా పాటిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. కానీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారి అతివాదులు రెండు దేశాలలో బలంగా ఉన్నప్పుడు పరిస్థితులను ఊహించడం కష్టం. 


ఏ చిన్న పొరపాటు జరిగినా పరిస్థితులు చేజారిపోవచ్చు. యుద్ధం కనుక మొదలైతే పరిస్థితులు ఎవరి చేతిలో ఉండవు. చమురు సరఫరాలు దెబ్బతినడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమయ్యే ప్రమాదం కూడా ఉన్నది. ఇప్పటికే పలు శాలు ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం లేదు. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు ఇప్పుడు యుద్ధం కనుక తలెత్తితే పలు దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవచ్చు. అమెరికా ఇప్పటికైనా పశ్చిమాసియాలో దుందుడుకు విధానాలను మానుకోవడం మంచిది. ఇరాన్‌ కూడా పరిస్థితి దిగజారకుండా తనవంతు కృషి సాగించాలె. 


logo