బుధవారం 01 ఏప్రిల్ 2020
Editorial - Jan 13, 2020 , 01:10:44

అస్తిత్వ నిర్మాణంలోకి అడుగు

అస్తిత్వ నిర్మాణంలోకి అడుగు

అలాగే ఒక మనిషి పూర్తిగా మనకు ఎప్పటికైనా తెలుస్తాడా! అసలు మనిషి లోపలి తత్త్వానికి మనకు అర్థమయ్యే స్థితికి మధ్య ఎన్ని అడ్డుగోడలుంటాయో అంటున్న వంశీధర్‌రెడ్డి లాంటి వాళ్ల నుంచి రాబోయేరోజుల్లో తెలంగాణ సమాజం మంచి కథకుల్ని ఆశించవచ్చు. ఇక తెలంగాణ చరిత్రను, వర్తమానాన్ని రామచంద్రమౌళి గారి ఒకనది- రెండు తీరాలు కథ ద్వారా చెబుతారు.

అస్తిత్వాన్ని నిలుపుకోవడం సులభమైన విషయం కాదు. అణిచివేతకు గురై అస్తిత్వాన్ని కోల్పోయి అంతరించిపోయిన జాతులెన్నింటినో మనం చరిత్ర నిండా చూస్తున్నాం. కానీ ఆ అణిచివేతలకు ఎదురునిలిచి తమ అస్తిత్వాన్ని నిలుపుకున్న జాతులు మాత్రం మనకు కొన్నే కనిపిస్తాయి. అలాంటి జాతుల్లో తెలంగాణ కూడా ఒకటి.తెలంగాణ తన అస్తిత్వానికి చిహ్నమైన స్వరాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత, ఇప్పుడు తనను తాను నిర్మించుకోవడానికి తపనపడుతున్నది. అందులో భాగంగానే ఒక్కొక్క అడుగూ బలంగా వేస్తూ వస్తున్నది. కథా సాహిత్యానికి సంబంధించి అలా వేస్తున్న మరో అడుగే రివాజు తెలంగాణ కథ 2018. సంపాదకులుగా సంగిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ వెల్దండి శ్రీధర్ వ్యవహరించారు.విస్మృతికి గురైన తెలంగాణ కథను విస్తృతిలోకి తేవడం పరంపరలో ఇది ఆరవది. తెలంగాణ కథకులెప్పుడూ నేల విడిచి సాము చేసింది తక్కువ. వారి కథలకు సామాజిక వాస్తవికతే పునాది. ఆ వారసత్వమే నేటికి కొనసాగుతూ వస్తున్నది అది రివాజు కథల లో కూడా స్పష్టంగా కనిపిస్తున్నది.ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యల నుంచి తెలంగాణ ఇంతకాలంగా అనుభవిస్తూ వస్తున్న దీర్ఘకాలిక సమస్య ల వరకూ, ఉద్యమాలు-తదనంతర పరిణామాల నుం చి ఉపాధి అవకాశాల వరకూ ముఖ్యమైన అంశాలన్నీ ఇందులో కథా వస్తువులుగా ఉన్నాయి. గతమైనా, వర్తమానమైనా తెలంగాణ దుఃఖానికి తెరపి ఉండటం లేదు.అధికారుల అండతో విపరీతమైన జలుం ప్రదర్శించి న దొర బామ్మర్ది నరసింహారెడ్డి (ఒక నది..) కానీ, వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి బదులు వ్యక్తుల నిర్మూలనకు దిగిన ప్రతాపన్నలు చేసిన హత్య కానీ వారి కుటుంబా ల్లో రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు. దాని దుష్పరిణామాలను ఆ కుటుంబాలు నేటికీ అనుభవిస్తూనే ఉన్నాయి. ఇంతటి హింసను అంతకుమించిన పీడనను తెలంగాణ ఇంకెంతకాలం అనుభవించాలని రాచపుం డు కథ ద్వారా రచయిత పసునూరి రవీందర్ ప్రశ్నిస్తున్నారు. దక్కాల్సిన ఏ ఒక్కటి న్యాయంగా దక్కకపోవ డం వల్లనే బాలరాజు లాంటివాళ్లు అన్యాయమైపోతున్నారు. బలవన్మరణాలకు గురవుతున్నారు.

నీళ్లు, నిధులు, నియామకాల్లో యువతకు తక్షణ అవసరమైన నియామకాలు వాస్తవ అనుభవంలోకి రాకపోవటం విషాదం. ఇలాంటి దుఃఖాలు శాశ్వతంగా దూరమైతే తప్ప శాంతమ్మ లాంటి తల్లులు ప్రశాంతంగా ఉండే అవకాశం లేదని రచయిత ప్రతీకాత్మకంగా చెబుతున్నారు. భారతదేశంలో కులం వేర్లు ఎంత బలంగా పాతుకుపోయి ఉన్నాయో, వేల ఏండ్లుగా అదిక్కడ నిర్వహిస్తున్న పాత్ర ఏమిటో చర్చించిన కథ పెద్దింటి అశోక్‌కుమార్ రాసిన స్కావెంజర్. సగటు దృష్టికి ఎలా కనిపించినా ఈ దేశపు దళితు లు సామాజిక హోదా కోసమే సచ్చి బతుకుతున్న తీరు ఈ కథలో ని ఒక్క రవి అనే యువకుడిదే కాదు, అతనిలాంటి అనేక మంది యువకులది. నేను ఎంత పెద్ద ఉద్యోగం చేసినా మన ఊర్లో మాదిగోళ్ల రవిగాడినే-నువ్వు అయ్యోరోళ్ల ప్రదీప్ గారివే! కులం హద్దులను దాటి మీరూ మేము వియ్యం అందుకున్ననాడు మాకు-మీకు సమానంగా గౌరవం దక్కిననాడు మా సర్టిఫికెట్లను మేమే తగులబెట్టుకుంటమన్నది ఆ దళిత యువకుడిదే కాదు, అతనిలాం టి దళిత యువకులందరి ఆవేదన. నిమ్నవర్గాలకు కల్పించబడిన రిజర్వేషన్ల అంశాన్ని లోతుల్లోకి వెళ్లకుండా పైపైన పరిశీలించే వాళ్ల ను పునరాలోచనలో పడవేసే కథ ఇది.తెలంగాణ గడ్డపై నక్సలైట్ ఉద్యమం వేసిన ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆ ఉద్యమానికి ఉన్న రెండో పార్శాన్ని గురించి చర్చించిన కథలు ముదిగంటి సుజాతారెడ్డి రాసిన నాటుపడ్డ వరిమొక్కలు పూడూరు రాజిరెడ్డి రెండో భాగం. నక్సలైట్ నాయకుడిగా సారా కాంట్రాక్టర్‌ను చంపిన వ్యక్తే ఆ తదనంతర పరిణామాల్లో రాజకీయ నాయకుడి అవతారమెత్తి వైన్‌షాపు ప్రారంభించడానికి వస్తే- ఆ కాంట్రాక్టర్ చావును, ఈ ప్రారంభోత్సవాన్ని కండ్లారా చూసిన అప్పటి కాంట్రాక్టర్ భార్య ఇప్పుడు ఆ వూరి సర్పంచి అయిన మహిళ అంతరంగం ఎలా ఉం టుంది?కలిచివేస్తున్న ఆ సంఘటనకు ఆమెకు అక్కడ కాలు నిలబడక నేరుగా తన ఇంటికి చేరుకొని భర్త ఫొటో ఎదుట కూర్చుండిపో తుంది. అప్పుడామెకు భూమ్మీద ఎవరికి అర్థం చేయించలేని రహస్యమేదో భర్త కళ్లలో మెరిసినట్టనిపించింది అంటాడు రచయిత. 

ఉద్యమ నేపథ్యమున్న కథలే కాకుండా సమకాలీన సంఘర్షణలను చిత్రించిన కథలు ఈ సంకలనంలో చాలానే ఉన్నాయి. డబ్బు, సదా అవి తెచ్చే దర్పాన్ని శ్వాసగా పీలుస్తూ బతికే మనుషులు లోకంలో చాలామందే ఉంటారు. కటుకోజ్వల మనోహరాచారి రాసిన దూరతీరాలు కథలో మాధవరావు ఆ కోవకు చెందిన వ్యక్తే! తాను జబ్బుపడి కోలుకుంటున్న సమయంలో తనకు సపర్యలు చేయడం కోసమే కొడుకును పిలిపించుకోలేకపోయరా అన్న డాక్ట ర్‌తో ఆయన కొడుకులు ఇక్కడెందుకుంటారు డాక్టర్ సాబ్? ఒక రు అమెరికాలో, ఒకరు లండన్‌లో ఉంటున్నారు అంటాడు చాలా గర్వంగా! మరి మీ కూతురో అని అడిగితే కూతురు-అల్లుడు కూడా అమెరికాలోనే ఉంటున్నారంటూ అతని భార్య బదులిస్తుం ది. అంతేకాదు మాధవరావు ఆ విషయాన్ని అక్కడితో వదిలేయకుండా అయినా ఇండియాలో ఏముందని ఎదురు ప్రశ్నిస్తాడు. దానికి డాక్టర్ మీరున్నారు కదా అని ఒక నవ్వునవ్వినా కూడా ఆయనకు ఆ నవ్వులోని అంతరార్థం అప్పుడర్థం కాదు. తన జబ్బు కు చేయించుకుంటున్న చికిత్సలో భాగంగా ఆ డాక్టర్ కుటుంబాన్ని వాళ్ల మధ్య కొనసాగుతున్న అనుబంధాలను దగ్గరుండి చూశాక కానీ మాధవరావుకు తానేం కోల్పోయాడో అర్థం కాదు. ఇంతకా లం తనకే లోటూ లేదనుకున్నాను. లోటంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు తెలుస్తున్నదనుకుంటాడు. అప్పుడు కానీ అతని మనో మందారంతో జ్ఞానగంట మోగడం ప్రారంభం కాదు.

సగటు మనుషులు ఎదుర్కొంటున్న సమస్యల్లో తాగునీటికి మించిన తక్షణ సమస్య ఏముంటుంది? నీళ్ల సముపార్జన ఇక్కడి మహిళలకు నేటికి నిత్య సంఘర్షణే. దానిఫలితం అనూహ్యం! నీళ్ల వేటలో స్త్రీలు-వీళ్ల వేటలో మృగాళ్లు! ఈ వెతుకు(లా)టలో తమపై జరిగే దాడులపై ఎవరికి చెప్పుకొని ఏడువాలి? అనుకుంటుంది సైది అనే లంబాడి యువతి. చందుతులసి రాసిన నీళ్ల బిందె అనే కథలో నీళ్లంటే పేద మహిళలకు ఎప్పటికీ కన్నీళ్లే.ఆ కన్నీళ్లను తుడిచే చేతులు మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదు. అయినా తప్పుదు. ఎలాగైనా రెండు బిందెల నీళ్లు సంపాదించాలనుకుని బిందెలతో బయల్దేరుతుంది.. మళ్లీ యుద్ధానికి అన్న వాక్యంతో రచయిత కథ ముగిస్తాడు. దీనిని సంపాదకు డు పానిపట్టు యుద్ధానికి అని అభివర్ణించారు. ఒక్క నీళ్లే కాదు, తిండికి దొరుకని పరిస్థితుల్లో కన్నపిల్లల్ని కూడా అమ్ముకోవడం (కొమ్ము రజిత- ఫర్టిలిటీ) అనే కొత్త ధోరణి ప్రబలడం తెలంగాణ సమాజానికి శుభసూచకం కాదు.అఫ్సర్, కొట్టం రామకృష్ణారెడ్డి లాంటి సీనియర్లతో పాటు ఈ సంకలనంలో యువకుల కథలకు కూడా సముచిత స్థానమే దక్కింది. వి.మల్లికార్జున్ (అర్బనూరు) వంశీధర్‌రెడ్డి (ఔటర్ రింగ్ రోడ్డు) మేడి చైతన్య (సాయిబోళ్ల పిల్ల) లాంటి వాళ్ల కథలకు కూడా ఇందులో చోటు కల్పించారు. వీళ్లు వయసురీత్యా యువకులైతే కావచ్చు కానీ రాతలో మాత్రం అనుభవజ్ఞులను తలపిస్తున్నారు.

మేడి చైతన్య సాయిబోళ్ల పిల్ల కథను అతని అభివ్యక్తి కోసమై నా చదివి తీరాల్సిందే. కట్నమేమి తీసుకురాలేదనే అత్త సూటిపోటి మాటలను ఆమె తన నవ్వుతోనే కలిపేసుకుందిట! వయసు పెరిగే కొద్దీ చనువు తక్కుయిదో- బంధాలు బలహీనపడుతాయో తెలియదు కానీ పిన్ని గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు నేను ఒక దోషిలా కనపడే వాడిని లాంటి వాక్యాలు అతని రచనా పటిమకు మచ్చుతునకలు.అలాగే ఒక మనిషి పూర్తిగా మనకు ఎప్పటికైనా తెలుస్తాడా! అసలు మనిషి లోపలి తత్త్వానికి మనకు అర్థమయ్యే స్థితికి మధ్య ఎన్ని అడ్డుగోడలుంటాయో అంటున్న వంశీధర్‌రెడ్డి లాంటి వాళ్ల నుంచి రాబోయేరోజుల్లో తెలంగాణ సమాజం మంచి కథకుల్ని ఆశించవచ్చు. ఇక తెలంగాణ చరిత్రను, వర్తమానాన్ని రామాచంద్రమౌళి గారి ఒకనది- రెండు తీరాలు కథద్వారా చెబుతారు. ఈ నేల గతంలో ఎంతటి హింసను అనుభవించిందో ఇప్పుడు ఆ మిగతా సమాజంతో పోటీపడి ఎదుగాలని ఎలా తపన పడుతున్న దో తెలిపే కథ ఇది.తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే ఆ ఆకాంక్ష నెరవేరుతుంది. సాహిత్యం ముఖ్యంగా కథా సాహిత్యం అందుకు మినహాయింపేమీ కాదు. తెలంగాణ కథకులు ఆ వైపుగా తమదైన కృషిని కొనసాగిస్తారని, తెలంగాణ కథా వార్షిక సంకలనాలను తీసుకువచ్చే రివాజును సంపాదకులు నిరంతరాయంగా కొనసాగించాలని ఆశించడం అత్యాశ కాకూడదు.

- గుండెబోయిన శ్రీనివాస్, 99851 94697


logo
>>>>>>