శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Jan 13, 2020 , 01:03:45

సామాన్యుని అశ్రుకణం అలిశెట్టి

సామాన్యుని అశ్రుకణం అలిశెట్టి

పదాలు ఎనిమిదే. కానీ నాడు వామనుడు 3 పాదాల భూమిని అడిగి మొత్తం భూగోళాన్నే కాకుండా, మొత్తం విశ్వాన్నే ఆక్రమించుకున్నాడనే విషయాన్ని విన్నాం, చదివాం. కానీ ప్రభాకర్, తన రచనలో అంతకన్నా గొప్పగా ఎనిమిది మాటల్లో వేల పేజీల సిద్ధాంతాల-రాద్ధాంతాల స్వరాన్నంతటిని, సామాన్యులకు అర్థమయ్యేట్లు చెప్పగలిగిన అసామాన్యుడు అలిశెట్టి ప్రభాకర్.

వామపక్ష ఉద్యమాల కాలంలో, జగిత్యాల జైత్రయాత్రగా చరిత్రలో లిఖించబడిన రైతాంగ పోరాట ఉద్యమానికి ప్రత్యక్ష సాక్షి అయిన ప్రభాకర్, ఆ తర్వాతి కాలంలో ఉద్యమాలు, సిద్ధాంతాలు కూడా తమ అస్తిత్వ రక్షణ కోసం, తాము విమర్శించే ఈ దోపిడీదారుల ప్రభుత్వాల,  కుహనా మేధావుల ప్రశంసల కోసం, సన్మానాలకు  తాము నమ్మిన, దశాబ్దాల పాటు శ్రమించిన శ్రమను, తమ కృషిని, ఇతరుల పాదాల వద్ద తనఖా పెట్టే నీచ సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకించాడు. 

తెలుగు భాషాజ్ఞానం ఉన్న ప్రతి తెలుగు వాడి నోట్లో నానిన చిరు కవితలను రాసిన అసమాన ప్రతిభావంతుడు అలిశెట్టి ప్రభాకర్. తెలుగు సాహిత్యంలో మినీ కవితకు గౌరవ స్థానం కల్పించాడు అలిశెట్టి. ఆయన భౌతికంగా దూరమై దాదాపు ముప్ఫై ఏండ్లు కావస్తున్నా, అతని కవితలు, జ్ఞాపకాలు, నిజాయితీ, సిద్ధాంతాల పట్ల అతనికున్న నిబద్ధత మనల్ని తట్టిలేపుతున్నట్టుగా ఉంటాయి.

వ్యాపార దృక్పథం పెరిగిపోయిన ఈరోజుల్లో సాహిత్యానికి, మాతృభాషకు ఆదరణ తగ్గిపోతున్నది. అయినా అలిశెట్టి కవితా సంపుటాలు మలి ముద్రణకు నోచుకొంటున్నాయంటే అతని కవితల్లో ఉన్న ఘాటైన, సున్నితమైన, చిన్న మాటలతో స్పష్టంగా చెప్పదలుచుకొన్నది చెప్పగలుగడమే. అలాగే పాఠకుల మెదళ్లను ఆలోచింపజేసే ప్రశ్నలను రేకెత్తించే సత్తా ఉందనే విషయం స్పష్టం.

సిద్ధాంతాల రాద్ధాంతాలు లేని నేటి వ్యాపార రాజకీయాల నేతల మెదళ్లను నాడే పసిగట్టి, రాజకీయ నాయకులంటే తోడేళ్ల కంటే మరీ ఘోరమైన మనస్తత్వం కలవారని చెప్పాడు. ఎప్పుడో 1961లో వచ్చిన ఒక సినిమాకు శ్రీశ్రీ రాసిన పాడవోయీ భారతీయుడా పాటలో వివరించిన నాటి భారతదేశంలో ఉన్న పరిస్థితులను నేడు మన ఈ 21వ శతాబ్దిలో కూడా అన్వయించుకుంటున్నాం. అలాగే అలిశెట్టి రాసిన చిన్న కవిత కూడా అంటే గొప్పగా నాలుగు దశాబ్దా ల తర్వాత కూడా మారని వారి లక్షణాలకు అద్దం పడుతున్నది.

ఒక నక్క

ప్రమాణ స్వీకారం చేసిందట

ఇంకెవర్ని వంచించనని

ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట

తోటి జంతువులను సంహరించినందుకు

ఈ కట్టు కథ విని

గొర్రెలింకా

పుర్రెలూపుతూనే ఉన్నాయి

అలిశెట్టి స్పృశించని అంశమంటూ లేదు. సమాజంలోని అభాగ్యుల జీవితాలను చూడటమే కాకుండా, ఎంతో భాగ్యవంతుడైన ప్రభాకర్, తాను ఈ సమాజంలోని ఒక భాగమేనని, ఎదుటివారి కి లేని సంతోషం తనకెందుకని భావించి, అనుభవించి మరీ తన కవితల్లో వారి అశ్రువులను తన మాటలుగా చేసుకొని, పాలకుల గుండెల్లో గునపాలు దించిన విప్లవకారుడు. తాను తీసుకొన్న అం శాలూ వస్తువు ఏదైనా, మ్యూజియంలోని అందమైన బొమ్మలా చెక్కగల సమర్థుడు, ఘనుడు.

సమాజంలోని కుళ్ళును కడిగివేయడానికి తుపాకీ ఒక్కటే సరిపోదని, అంతకంటే బలమైన ఆయుధం కలమేనని, ఆ కలంతో పాటు కుంచెను కూడా ఆసరాగా చేసుకొని, పదాలకు తగిన చిత్రా రూపం ఇవ్వగలిగిన కవి, చిత్రాకారుడు ఈ తరంలో ప్రభాకర్ ఒక్కడేనే మో?  మాటల్లో చెప్పలేని భావాలను తన చిత్రంలో ప్రతిబింబించే ట్లు రేఖా చిత్రాలు గీసి, పక్కనే కవితాక్షరాలను లిఖించి, స్వయంగా చిత్రా కవితా ప్రదర్శనలు ఏర్పాటుచేసి తన రచనలను ప్రజల వద్దకు తీసుకెళ్లిన సగటు మనిషి ప్రభాకర్.

వామపక్ష ఉద్యమాల కాలంలో, జగిత్యాల జైత్రయాత్రగా చరిత్ర లో లిఖించబడిన రైతాంగ పోరాట ఉద్యమానికి ప్రత్యక్ష సాక్షి ప్రభాకర్. ఆ తర్వాతి కాలంలో ఉద్యమాలు, సిద్ధాంతాలు కూడా తమ అస్తిత్వ రక్షణ కోసం, తాము విమర్శించే ఈ దోపిడీదారుల ప్రభుత్వాల,  కుహనా మేధావుల ప్రశంసల కోసం, సన్మానాలకు  తాము నమ్మిన, దశాబ్దాల పాటు శ్రమించిన శ్రమను, తమ కృషిని, ఇతరుల పాదాల వద్ద తనఖా పెట్టే నీచ సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకించాడు. అతని కోపాన్ని, నిరసనను ఇలా తెలిపాడు.

అర్భకుడైన కవి ఒకడు 

అవార్డులూ సన్మానాల కోసం

దేబిరించడం తప్ప

నగరంలో నేడు

ఆవాంఛనీయ

సంఘటనలేవీ జరుగలేదు అని సూటిగా, సున్నితంగా వ్యంగ్యోక్తులను విసురుతాడు.

ప్రభాకర్ కవితల్లో సమాజంలోని అట్టడుగువర్గాల మనసులోని ఆర్ద్రతను ఎంత గొప్పగా చెప్పగలడో అంతే గొప్పగా వ్యంగ్యోక్తులను, చలోక్తులను విసరగల మేధావి. తరతరాలుగా స్త్రీని ఎలా ఆటబొమ్మలా చేసుకొని ఈ సమాజంలోని దోపిడీ వర్గం తమ పబ్బం గడుపుకొంటున్నదో ఎన్నో కవితల్లో సూటిగా చెప్పాడు. పురుషుని దోపిడీలో స్త్రీ తన శరీరాన్నే కాకుండా మనసును చంపుకొని బతుకుతుంటుందని చెప్పాడు. వేశ్య కవితలో ప్రభాకర్ పండించిన భావుకతేకాకుండా అందులోని ప్రతీ అక్షరం ఒలికించే కన్నీరే కనబడుతుంది.

ప్రపంచ వాణిజ్య సంస్థ, ఆర్థిక సరళీకరణ ఇంకా  ఉన్నప్పుడే, ఇంకా వామపక్ష నాయకులు తమ గొంతులు సవరించుకొని, కాలాలను చేతబూనక ముందే ఈ పనులన్నీ పెత్తందార్లకు, సామ్రాజ్యవాదుల మేలు కోసమే అని స్పష్టం చేసిన ప్రాప్తకాలజ్ఞుడు.

ఏ దేశం శిరసు మీద

మోపిన

పాదాలైనా

హోదాలైనా

సామ్రాజ్యవాదులే

పదాలు ఎనిమిదే. కానీ నాడు వామనుడు 3 పాదాల భూమిని అడిగి మొత్తం భూగోళాన్నే కాకుండా, మొత్తం విశ్వాన్నే ఆక్రమించుకున్నాడనే విషయాన్ని విన్నాం, చదివాం. కానీ ప్రభాకర్, తన రచనలో అంతకన్నా గొప్పగా ఎనిమిది మాటల్లో వేల పేజీల సిద్ధాంతాల-రాద్ధాంతాల స్వరాన్నంతటిని, సామాన్యులకు అర్థమయ్యేట్లు చెప్పగలిగిన అసామాన్యుడు అలిశెట్టి ప్రభాకర్.

కవిగా సాహిత్యకారుల సభల్లో, సమావేశాల్లో ఉండటం పట్ల ప్రభాకర్ ఎన్నడూ ఆసక్తి చూపలేదు. కానీ సామాన్య ప్రజలు, యువత ఉండే సమావేశాలు, కళాశాల్లో తన కవితా ప్రదర్శనలు ఏర్పాటు చేయడమే అతనికి ఇష్టమైన కార్యక్రమాలు. ఎప్పుడు పది మందితో ఉండే ప్రభాకర్, తనకంటూ ఒక కొత్త ప్రపంచాన్నే ఏర్పా టుచేసుకొన్నాడు. నాటి గొప్ప కవులతో పరిచయాలు, స్నేహాలున్నా వారిలోని నిజాయితీని మాత్రమే ప్రేమించి, ఆహ్వానించాడు. ధనవంతులైన స్నేహితుల నుంచి కూడా ఏమి ఆశించని ప్రభాకర్ తన ఆస్తిని అమ్ముకొని జీవించాడు. కానీ, ఏనాడూ తాను పేదవాడిననే భావం కలిగేలా ప్రవర్తించలేదు. అందుకే ధనవంతులే నిజమైన పేదవారని తన కవితలో చెపుతాడు.

నా దృష్టిలో ధనమదాంధుడే

అడుక్కతినేవాడు

ఇది ప్రభాకర్ అంతరంగంలో నుంచి వచ్చిన మాటలు. ప్రభాక ర్ పుస్తకానికి ముందుమాట రాసిన ఆర్టిస్టు చంద్ర ..మరెవరికి లేని కన్నొకటి ఉంది. మనుషుల్లో అంతర్గతంగా ఉన్న కల్మషాన్ని, దుర్మార్గాన్ని, కుత్సితాలను తీక్షణంగా చూసే కన్ను ప్రభాకర్‌కు ఉందని రాశారు.

ప్రభాకర్ రాసిన దాదాపు వెయ్యి, పదిహేను వందల సిటీ లైఫ్ పొట్టి కవితలైనా, ఇతర మినీ కవితలైనా, దీర్ఘ కవితలైనా, రాసిందే దైనా, గీసిందేదైనా, ఎదుటివారికి స్పష్టంగా భావం ఆకట్టుకొనేలా, పదాల వెనుక ఉన్న ఆర్ద్రతతో పాఠకుల కళ్లను చెమ్మగిళ్లేలా చేయగల అణుబాంబుల్లా ఉంటాయి.

సామాన్య ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోయే కవిత లు రాసిన ప్రభాకర్ రచనల పట్ల నేటికీ కొన్నివర్గాల సాహితీకారుల్లో తెలియని, తెలుపలేని ద్వేశాభావం ఉన్నది. వారెవరూ రాయలేని భావాన్ని అతి సున్నితంగా, స్పష్టంగా రెండు, మూడు పంక్తుల్లో చెప్పగలిగాడనే ఈర్ష్య కావచ్చు. లేక తమలో లేని నిజాయితీ, నిబద్ధత, భావుకత, స్పష్టత ప్రభాకర్ కవితల్లో ఉండటమే కావచ్చు. అందుకేనేమో, అలిశెట్టి మరణించి మూడు దశాబ్దాలైనా అతని పేరు ఉచ్చరించడానికి గాని, అతని పేరుతో సభలు, సమావేశాలు నిర్వహించడానికి గాని లబ్ధప్రతిశ్టులైన మహాకవులు సాహసించడం లేదు.

మనిషి లేకున్నా మనిషి చేసిన పనులు, రచనలు తరతరాలు, యుగయుగాలుగా నిలిచి ఉంటాయి. కనీసం అలిశెట్టి ప్రభాకర్ కవిత్వాన్ని విశ్లేషించే సాహసం కూడా ఇప్పటిదాకా జరుగకపోవడం విషాదమే. వందేండ్ల కిందట మరణించిన కవుల రచనల్లో గొప్ప రచనలు ఉండవచ్చు. కానీ ఇంకా అవే రచనలను నేటితరానికి పరిచయం చేస్తూ, వారు తప్ప మరో గొప్ప రచయిత, కవి లేదన్నట్లు ప్రవర్తించే మేధావులకు అలిశెట్టి ప్రభాకర్ లాంటి నేటితరం కవులు కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అలిశెట్టి సాహితీకారులు ఇచ్చే గౌరవ, మర్యాదలకు కవి కాలేదు. సామాన్య ప్రజల ఆర్ద్రమైన జీవిత చిత్రాన్ని ఆవిష్కరించడానికి, అల్ప పదాలతో అనల్ప సాహిత్యాన్ని సృష్టించవచ్చనే సత్యాన్ని ప్రపంచానికి తెలుపడమే లక్ష్యంగా కవిత్వా న్ని సాధనంగా చేసుకొని, దానికోసమే చివరివరకు జీవించిన మెన్నత వ్యక్తి అలిశెట్టి. అతని కవిత్వం ఇంకా ప్రజల నోళ్లలో నానడమే అతనికి లభించే నిజమైన గౌరవం.

- సీహెచ్‌వీ ప్రభాకర్‌రావు, 93915 33339


logo