గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Jan 13, 2020 , 01:00:01

భూమి కథ

భూమి కథ

నువ్వు ప్రక్కనున్నప్పుడు

నువ్వు తప్ప

నాకేదీ గుర్తురాదు మిత్రమా

అందుకే నీక్కూడా చెప్పకుండా 

వచ్చేసాను

భూగోళాన్ని చేతులతో

స్పృశించాలని

ఆకాశానికి ఎదురెళ్లి

గుండెలకు హత్తుకోవాలని

కవిత్వ శంఖం నిండా 

అరణ్యాల నిశ్శబ్దాన్ని

నింపుకోవాలని

చిన్నప్పుడెప్పుడో

ఎగరేసిన సీతాకోకల జాడల్ని

వెతుక్కుంటూ వెళ్తున్నాను

మనమిన్నాళ్లూ పోగొట్టుకున్నదేదో

నగరానికావల 

ఆ గడ్డిపూల మైదానాల్లో

ఆ కడలి కెరటాల హోరులో

తలెత్తి చూస్తే అంతెత్తున

నిష్కల్మషంగా నవ్వుతున్న

పర్వతం పాదాల చెంతా

పచ్చపూల తోటల్లో

ఆకుపచ్చ రాగాల్లో 

దొరుకుతుందంటే

నీక్కూడా చెప్పకుండా వచ్చేసాను

ఇక ఆ నల్లని నీడల నగరమంతా నీదే!

నేనా ఛాయాలక్కూడా రాను

నీవెప్పుడైనా రావాలనుకుంటే

నీతో పాటు ఆ నల్లని నీడల్నీ

ఆ  నిశ్శబ్దాన్నీ అక్కడే వదిలేసి

ఒక్కడివే రా!

ఉదయాన్నే భక్తిశ్రద్ధలతో

గర్భగుడిలోకి ప్రవేశిస్తున్న

వెలుగు కిరణాల్ని చూపిస్తాను

వరి కంకుల్ని కోస్తున్న 

కొడవళ్ళ పవిత్ర శబ్దాన్ని వినిపిస్తాను

వరద జోరుకు నిండు చూలాలైన

చెరువమ్మ సీమంతపు విందుకు తీసుకెళ్తాను

పొలం గట్ల మీద నడిచిపోతున్న అవ్వ నడిగి

భూమి కథ మొత్తం అక్షరం పొల్లుపోకుండా

నీకు చెప్పిస్తాను!

- సాంబమూర్తి లండ, 9642732008


logo
>>>>>>