బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Jan 10, 2020 , 13:50:41

విలువల తెలంగాణ దిశగా..

విలువల తెలంగాణ దిశగా..

ఏది ధర్మం, ఏది అధర్మమనే మీమాంస అందుకు సంబంధిచిన ప్రశ్న. దానికి సమాధానం పురాతనమైనదీ, సనాతన తాత్త్విక ధోరణితో కూడుకున్నది. నేటి ఆధునికయుగంలో ఈ ధర్మ పరిరక్షణను ఎట్లా చేపట్టాలనేది క్లిష్టమైన అంశమే అయినా సమాజంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రజలందరినీ సమానత్వంతో చూడగలిగే సామాజిక విలువలు తక్షణావసరం. ఆధునికయుగంలో శాంతిభద్రతలను కాపాడేందుకు, అసమానతల్లేని సమాజాన్ని నిర్మించాలనే స్ఫూర్తిని పుస్తకావిష్కరణ సభ ప్రకటించింది.

శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసుల దండన కన్నా, ధర్మం నిర్వర్తించే పాత్ర గొప్పది. ధర్మం ఎంత బలంగా కాపాడబడుతుందో సమాజంలో శాంతిభద్రతలు అంత గొప్పగా కాపాడబడుతాయి... ఇటీవల సీఎం కేసీఆర్‌ హాజరైన భాగవత సప్తాహం కార్యక్రమంలో వేద పండితులు చాగంటి కోటేశ్వరరావు మాట.‘మనం దేశంలో ఏ గ్రామానికి పోయి ఈ ఊరిలో బీదవారు ఎవరని అడిగితే దళితవాడ పేరు చెప్తరు. ఇది నేటికీ వాస్తవం..’ ఇటీవల ప్రగతి భవన్‌లో ఉమ్మడి రాష్ట్ర మాజీ డీజీపీ హెచ్‌.దొర ఆత్మకథ ఆవిష్కరణ సభ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రసంగంలోని వ్యాఖ్యలు.

చాగంటి కోటేశ్వరరావు చెప్పే ధర్మానికి, సీఎం కేసీఆర్‌ చెప్పినట్టు మనుషుల నడుమ ఉన్న సామాజిక, ఆర్థిక వివక్షకు ఉన్న వైరుధ్యం ఏమిటి? వీటి నడుమ సమన్వయం ఎట్లా సాధించగలం? ఎట్లా అధిగమించగ లం? తద్వారా సమసమాజ ధర్మాన్ని ఎట్లా నిలబెట్టగలం.. నైతిక విలువలను ఎట్లా పెంచగలం? శాంతిభద్రతలను కాపాడటంలో నైతిక విలువ ల పాత్ర ఏమిటనే అంశాలను, మాజీ డీజీపీ హెచ్‌.జె.దొర పుస్తకావిష్కర ణ సందర్భాన్ని పురస్కరించుకొని అవగాహన పెంచుకోవడమే ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం.

ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన ఒక మాజీ డీజీపీ ఆత్మకథ పుస్తకాన్ని ముఖ్యమంత్రి విడుదల చేయడం, ఆ కార్యక్రమానికి మాజీ డీజీపీలు, పోలీసు ఉన్నతాధికారులు, ఐఏఎస్‌లు పాల్గొనడం అరుదైన విషయం. ఇదొక పుస్తకావిష్కరణ సభే కావచ్చు కానీ, వక్తలు వారివారి అనుభవాల ను పంచుకుంటుంటే విన్న తర్వాత ఈ సభ ఒక చారిత్రకమైనదనీ, సీఎం కేసీఆర్‌ దార్శనికతకు అద్దం పట్టిందని చెప్పవచ్చు.లాఠీలు పట్టుకొని తిరిగే పోలీసులు నైతిక విలువలు, సామాజిక, ఆర్థిక అంశాలు, మానవీయ కోణాలు, ప్రేమానురాగాలు, మానవ సంబంధా లు, సాంస్కృతిక విషయాలు మాట్లాడటం చాలా అరుదు. పోలీస్‌ డ్రెస్‌ వేసుకొని, తుపాకీ చేతిలోపట్టుకొని డ్యూటీ చేస్తున్నప్పుడు వారిలో కఠినత్వమే తప్ప మానవత్వం తాలూకు జాడలుంటాయని ఊహించం. కానీ పోలీసులకు, ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులకు కూడా మనసుంటుందని, సామాజిక స్పృహ ఉంటుందనీ, వారుకూడా ఆయా కీలక సం దర్భాల్లో సామాన్య మానువుల్లాగే చలించిపోతారనీ అర్థమైంది.

ఎన్టీఆర్‌ కాలంలో తాను వరంగల్‌ ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు నక్సలి జం, దాన్ని అర్థం చేసుకున్న తీరు ఏమిటి? అనే విషయాలను పుస్తకకర్త హెచ్‌.జె.దొర, తాను ఒక తూటాకు పని చెప్పే పోలీసుగానే కాకుండా ఓ సోషియాలజీ ప్రొఫెసర్‌గా ఒక సాంస్కృతిక పండితునిగా చేసిన ప్రసంగం సభికులను ఆలోచింపజేసింది. శాంతిభద్రతల సమస్యను వ్యక్తుల నేర ప్రవృత్తి కోణంతో పాటు, ఆర్థిక, సామాజిక అసమానతలు, వివక్షలతో కూడిన ఆధిపత్యవిలువలు, అట్టడుగువర్గాల మీద ఎట్లా ప్రభావితం చేస్త యో, సదరు విలువలు నేర ప్రవృత్తి పెరుగడానికి ఎట్లా దోహదం చేస్తా యో ఆయన వివరించారు. ఈ సందర్భంగా ‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా’ అనే పాటను మాజీ పోలీసు ఉన్నతాధికారి హెచ్‌.జె.దొర పాడ టం గమనార్హం. తెలంగాణలో నెలకొన్న నాటి పరిస్థితులకు అనుకూలం గా ఆ పాట లేపిన చైతన్యాన్ని, ప్రజల్లో కలిగించిన విప్లవ దృక్పథాన్ని, దాన్ని తాను అర్థం చేసుకున్న విధానాన్ని దొర సోదాహరణంగా విశ్లేషించిండు. అంతటితో ఆగలేదు.. ‘నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్లకు పన్నీరాయె..’ అనే మరో పాటనూ పాడిండు.

తను పనిచేసే ఎన్టీఆర్‌ కాలం నాటికి తెలంగాణలో సామాజిక, ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉండే, దానికి ప్రజలు ఎటువంటి మార్గం ఎంచుకున్నారని విశ్లేషిస్తూ ఆ పాటలు పాడిండు. అదే సందర్భంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడా పరిస్థితి లేదు. అందుక్కారణం తెలంగాణ అన్ని రంగా ల్లో అభివృద్ధి చెందుతుండటమే అని చెబుతూ అందుకు కారణమైన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో ప్రజలు కల్చర్‌ ద్వారా ప్రభావితమైతే దానికి విరుగుడు కూడా కల్చరే అని స్పష్టం చేసిండు. శాంతిభద్రతలను కాపాడాలంటే కఠిన చట్టాలు అమలుపరుచడమే కాకుండా, పోలీసుగా ముందుగా సమాజంలో నెలకొన్న అసమానతలను అర్థం చేసుకోవడం అవసరమనీ, బాధిత వర్గాల పట్ల సానుభూతిని ప్రదర్శిస్తూనే పోలీసుగా డ్యూటీ చేస్తూ, ఎట్లా ప్రజలతో నాయకులతో సమన్వయం చేసుకుంటూ పోవాలనే విషయాలను తన అనుభవాలను, తనదైనశైలిలో విడమర్చి చెప్పారు.

గొప్ప విషయమేమంటే ఏ పాటలైతే పోలీసులకు నాడు శాంతిభధ్రతల సమస్యను సృష్టించినవో.. ఆ పాటలను విశ్లేషిస్తూ పాడటం, అందులో రచయిత చెప్పదలుచుకున్న అసమానతల గురించి మాట్లాడటం. వాటిని వింటూ పోలీసు ఉన్నతాధికారులు చప్పట్లు కొట్టడం ద్వారా పోలీసులంటే కఠినాత్ములు కారు, లోతైన సామాజిక అవగాహన ఉన్నవాళ్లు, ప్రజా సమస్యల పట్ల నెనరుగల వాళ్లనే విషయాన్ని సభ చెప్పింది.తెలంగాణ సామాజిక వ్యవస్థను అర్థం చేసుకోవడానికి, ఈ గడ్డమీది సామాజిక సాంస్కృతిక మూలాలను పట్టాలనే అవగాహన పోలీసు అధికారులకు ఉండాలని, శాంతిభద్రతలు పరిరక్షించే పోలీసుకు వాటి మూలాలను అర్థం చేసుకోవడం అవసరమని సభ అభిప్రాయపడింది. వ్యక్తులను నేరప్రవృత్తిలోకి మలిపే సామాజిక, ఆర్థిక, రాజకీయ సాంస్కృతి క అసమానతల పట్ల అవగాహన కలిగి ఉండటం, శాంతిభద్రతలను కాపాడే వృత్తిలో ఉన్న ప్రతి పోలీసుకు అవసరం. తూటాతో కాకుం డా.. పాటను పాటతోనే తిప్పికొట్టాలనడం గొప్ప ప్రజాస్వామిక విధానం.

ప్రజాపాలనలో ప్రభుత్వాలకు అతి ముఖ్యమైనది శాంతిభద్రతలను కాపాడటం. ముఖ్యమంత్రి చెప్పినట్టు మానవజాతిని కులాలు, మతాలతో విభజన చేసి ప్రజల నడుమ సామాజిక, ఆర్థిక సాంస్కృతిక వివక్షకు దారి తీసిన అనైతిక విలువలను కూకటివేళ్లతో పెకిలించాలి. అయితే.. వ్యక్తులు గా తాత్కాలిక ఆవేశాలకు గురై పాల్పడే నేర ప్రవృత్తి కన్నా, వ్యవస్థాగతం గా సామాజిక నేరప్రవృత్తిని ప్రేరేపించే సామాజిక అనైతిక విలువలకు.. ఉండే తేడాను అర్థం చేసుకోవాల్సి ఉన్నది. ఏది ధర్మం, ఏది అధర్మమనే మీమాంస అందుకు సంబంధిచిన ప్రశ్న. దానికి సమాధానం పురాతనమైనదీ, సనాతన తాత్త్విక ధోరణితో కూడుకున్నది.

నేటి ఆధునికయుగంలో ఈ ధర్మ పరిరక్షణను ఎట్లా చేపట్టాలనే ది క్లిష్టమైన అంశమే అయినా సమాజంలో శాంతిభద్రతలను కాపాడేం దుకు ప్రజలందరినీ సమానత్వంతో చూడగలిగే సామాజిక విలువలు తక్షణావసరం. ఆధునికయుగంలో శాంతి భద్రతలను కాపాడేందుకు, అసమానతల్లేని సమాజాన్ని నిర్మించాలనే స్ఫూర్తిని పుస్తకావిష్కరణ సభ ప్రకటించింది. అందరూ సమానమనే నైతికవిలువలను విద్యార్థులకు చిన్ననా టి నుంచే నేర్పించే ప్రభుత్వ నిర్ణయాన్ని, గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అమల్లో పెడుతున్న తీరును ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెచ్చుకోవడం ముదావహం. తెలంగాణలో విద్య, సంక్షేమం, అభివృద్ధి ద్వారా భవిష్యత్తు తరాలు ఎటువంటి వివక్షలకు చోటులేని సమాజ నిర్మాణం దిశగా, నైతిక తెలంగాణ దిశగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంగారుబాట వేస్తున్నారని పోలీసు ఉన్నతాధికారుల సమావేశం అభిప్రాయపడటం బంగారు తెలంగాణకు మరింత భరోసాను ఇస్తున్నది.


logo