బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Jan 10, 2020 , 13:44:24

ఢిల్లీ నగారా

ఢిల్లీ నగారా

ఒక పంజాబ్‌ మినహా మిగతా రాష్ర్టాల్లో నోటా కన్నా ఆప్‌కు తక్కువ ఓట్లు లభించాయి. అయితే మిగతా రాష్ర్టాల సంగతెట్లా ఉన్నా ఢిల్లీ రాష్ట్రంలో కేజ్రీవాల్‌ అధికారం కాపాడుకోగలరా అనేదే ఆసక్తిదాయకమైన అంశం. లోక్‌సభ ఎన్నికలలో విజయదుందుభి మోగించిన రాష్ర్టాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు మాత్రం బీజేపీ చతికిలపడుతున్న సందర్భమిది. ఇటీవల కొన్ని రాష్ర్టాలలో పుంజుకున్నప్పటికీ కాంగ్రెస్‌ అధికారానికి రావడం అంత సులభం కాదు.

ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల ఎనిమిదిన జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో అందరి దృష్టి ఈ రణరంగం వైపు మళ్ళింది. రెండు కోట్ల జనాభా కలిగిన ఢిల్లీలో కోటి 47 లక్షలకు పైగా ఓటర్లున్నారు. డబ్భు అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. కొంతకాలంగా వివిధ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటిదాకా ఢిల్లీలో ఆరు సార్లు ఎన్నికలు జరిగితే 2013లో కేజ్రీవాల్‌ నేతృత్వంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ తెరమీదికి వచ్చే దాకా కాంగ్రెస్‌, బీజేపీలే ముఖాముఖి పోటీలో తలపడుతూ వచ్చాయి. రాష్ట్రంగా ఏర్పడిన ఢిల్లీలో మొదటిసారి బీజేపీయే బోణీ కొట్టింది. ఆ తర్వాత కాలంలో షీలాదీక్షిత్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ వరుసగా మూడుమార్లు అధికారాన్ని కైవసం చేసుకొని ప్రత్యేకతను చాటుకున్న ది. ఈ నేపథ్యంలో ఎవరూ ఊహించనిరీతిలో అవినీతి వ్యతిరేక ఉద్యమంతో పురుడు పోసుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చేసింది. కేజ్రీవాల్‌ నేతృత్వంలో ఆప్‌ బలమైన రాజకీయపక్షంగా అవతరించి, కాంగ్రెస్‌ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అతి ఆదర్శంతోనో, పాలనానుభవం లేకనో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. జన్‌ లోక్‌పాల్‌ బిల్లు విషయంలో కాంగ్రెస్‌తో తలెత్తిన విభేదాలతో కేజ్రీవాల్‌ ఏడు వారాల్లోనే రాజీనా మా చేయాల్సి వచ్చింది. అది మొదలు ఢిల్లీ రాజకీయాలు ఎన్నికలు జరిగిన ప్రతిసారి ప్రత్యేకత ను చాటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ ప్రధాన స్రవంతి రాజకీయాలు, వాటి ప్రభావాలు ఎలా ఉన్నా ఢిల్లీ ఎన్నికల పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొనటం గమనార్హం.

అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఢిల్లీ తన ప్రత్యేకతను, విశిష్టతనే చాటుతున్నది. గ్రామీణ ఓటర్లు, నిరక్షరాస్యుల సంఖ్య తక్కువ ఉండటం కారణం కావచ్చు జాతీయ రాజకీయాల ప్రభా వం ఏ మాత్రం పొడసూపని రీతిలో ఓటరు తీర్పు ఉండటం ఢిల్లీ ఎన్నికల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. కేంద్రంలో తిరుగులేని మెజారిటీతో అధికారం చేజిక్కించుకుంటున్న బీజేపీ లోక్‌స భ ఎన్నికల్లో పొందిన ప్రజాదరణను, అసెంబ్లీ ఎన్నికల్లో చూపలేక చతికిలపడుతున్నది. 2014 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలోని ఏడు లోక్‌ సభస్థానాలనూ కైవసం చేసుకొని సత్తా చాటింది. 60కి పైగా అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ ఓట్లను సాధించి ఆధిపత్యాన్ని చూపింది. కానీ ఆ తర్వాత 2015లో ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మూడు సీట్ల కే పరిమితమై కుదేలు కావటం రాజకీయ విశ్లేషణలకు అందని విషయంగా మారింది. కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ మాత్రం 2015 లో 54.3 శాతం ఓట్లతో ఏకంగా 67 స్థానాలు సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తర్వాత రెండేండ్లకే జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో 20 శాతం ఓట్లనే సాధించింది. నిరుటి లోక్‌సభ ఎన్నికల్లో 18 శాతం ఓట్లు మాత్రమే పొందటం గమనించదగినది. మరోవైపు షీలాదీక్షిత్‌ హయాంలో ఢిల్లీలో తిరుగులేనిశక్తిగా ఉన్న కాంగ్రెస్‌ ఆ తర్వాత తన ప్రాభవాన్ని కనబరుచలేకపోతున్నది. షీలాదీక్షిత్‌ మరణం కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒకరున్నారని చూపే స్థితి లేకపోవటం, కేజ్రీవాల్‌కు కలిసివచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ పుట్టుక, ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్న తీరు విలక్షణమైనది. అన్నా హజారే నేతృత్వంలో పురుడు పోసుకొని అంచెలంచెలుగా విస్తరించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. సహజంగానే మధ్యతరగతి ప్రజలు, బుద్ధిజీవుల ఆదరణను పొందింది. ఆ నేపథ్యంలోంచే కేజ్రీవాల్‌ తెరమీదికి వచ్చారు. హజారే అనుచరుడిగా ఉంటూనే అవినీతి అంతానికి రాజకీయపార్టీ ఏర్పాటు ఆవసరాన్ని గుర్తించి, ఆప్‌ను స్థాపించారు. అవినీతి రాజకీయాలతో విసిగిపోయిన ప్రజలకు ఆప్‌ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి గా, కారుచీకటిలో కాంతిరేఖగా కనిపించింది. ఢిల్లీ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత వివిధ రాష్ర్టాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఆహ్వానాలు అందాయి. కానీ కేజ్రీవాల్‌ కొద్దికాలంలోనే ప్రధాన అనుచరులైన ప్రశాంత్‌ భూషణ్‌, యోగేంద్రయాదవ్‌ లాంటి బుద్ధిజీవులు దూరం చేసుకోవటం, విధాన నిర్ణయాల్లో వ్యక్తికేంద్ర పోకడల మూలంగా ఆయన ప్రభ మసకబారింది. ఒక పంజాబ్‌ మినహా మిగతా రాష్ర్టాల్లో నోటా కన్నా ఆప్‌కు తక్కువ ఓట్లు లభించాయి. అయితే మిగతా రాష్ర్టాల సంగతెట్లా ఉన్నా ఢిల్లీ రాష్ట్రంలో కేజ్రీవాల్‌ అధికారం కాపాడుకోగలరా అనేదే ఆసక్తిదాయకమైన అం శం. లోక్‌సభ ఎన్నికలలో విజయదుందుభి మోగించిన రాష్ర్టాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పు డు మాత్రం బీజేపీ చతికిలపడుతున్న సందర్భమిది. ఇటీవల కొన్ని రాష్ర్టాలలో పుంజుకున్నప్పటి కీ కాంగ్రెస్‌ అధికారానికి రావడం అంత సులభం కాదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం భవిష్య త్‌ రాజకీయాలపై తప్పకుండా ఉంటుంది. ఎన్నార్సీ, సీఏఏ వివాదాస్పద విధానాలు, జేఎన్‌యూ విద్యార్థులపై ఆర్‌ఎస్సెస్‌ శక్తుల దాడి నేపథ్యంలో ఈ ఎన్నికల్లో లౌకికశక్తులు ఐక్యంగా వ్యవహరించాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


logo