బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Jan 10, 2020 , 13:23:05

మరో ఫెడరల్‌ ప్రయోగం కావాలి

మరో ఫెడరల్‌ ప్రయోగం కావాలి

మన వైవిధ్య దేశంలో బలమైన కేంద్రం, బలమైన రాష్ర్టాలు, వాటి పరస్పర సహకారంతో సర్వతోముఖాభివృద్ధి అనే సహకార ఫెడరలిజపు రాజ్యాంగ లక్ష్యాన్ని చిత్తశుద్ధితో తీసుకొని పాలించిన ప్రభుత్వం ఏదీ ఇప్పటివరకు ఏర్పడలేదు. కాంగ్రెస్‌ స్వయంగా లేదా యూపీఏ రూపంలో, బీజేపీ స్వయంగా లేదా ఎన్డీయే రూపంలో పాలించినా ఇది జరుగలేదు. ఇవిగాక జనతా, ఎన్‌ఎఫ్‌, యుఎఫ్‌ ఫెడరల్‌ ప్రయోగాలు అప్పటి అసాధారణ పరిస్థితులకు స్పందనగా వచ్చినవే అయినందున సరైన పునాదుల్లేక విఫలమయ్యాయి. ఈ అనుభవాలతో, ప్రస్తుత కల్లోల స్థితిలో నికరమైన ఫెడరల్‌ ప్రయోగం ఒకటి ఈ రోజున అవసరం.

భారత్‌ వైవిధ్య దేశం అన్నప్పుడు మనం ప్రధానంగా మాట్లాడుతున్నది ప్రజలు, ప్రాంతాలు, వారి ఆర్థిక-సామాజిక-సాంస్కృతిక స్థితిగతులు, సమస్యలు, ఆకాంక్షలు, పురోగతుల గురించి. మన రాజ్యాంగం భారత ప్రజలమైన మేము అని అన్నా, సహకార ఫెడరలిజం గురించి మాట్లాడినా, రాజ్యాంగ నిబంధనలతో పాటు ఆదేశిక సూత్రాల గురించి చెప్పినా అందులో ఇమిడి ఉన్నది ఒక వైపు సాధారణ ప్రజలు, వారి ప్రాంతాలు, పరిస్థితులు, ఆకాంక్షలు, పురోగతులకూ మరొకవైపు శిష్టవర్గాలకు, వారి ప్రయోజనాలకు, పరిపాలన ల తీరుకూ మధ్య సమతులనం, సామరస్యం ఉండటమే. ఇదే సహకార ఫెడరలిజపు సారాంశం, రహస్యం.

రాజ్యాంగ నిర్వహణ ప్రత్యక్ష బాధ్యత శిష్ట వర్గాలది. వారిపై నిఘా ఉంచటం ద్వారా ఆ నిర్వహణ సక్రమంగా సాగేట్లు చూసే పరోక్ష బాధ్యత ప్రజలది, ప్రాంతాలది. పైన చెప్పిన ఫెడరలిజపు సారాంశాన్ని, రహస్యా న్ని శిష్ట వర్గాలు గుర్తెరిగి వ్యవహరించినంత కాలం ఇటు ప్రజలకు, అటు శిష్ట వర్గాలకు గాని, కేంద్రానికి, ప్రాంతాలకు మధ్య గాని సామరస్యత లు, సహకారాలు మినహా సంఘర్షణలుండవు. ఆ విధంగా సహకార ఫెడరలిజం మార్గంలో ప్రజలు, శిష్ట వర్గాలూ, ప్రాంతాలు, కేంద్రమూ అందరికీ వాంఛనీయమైన విధంగా పురోగమిస్తాయి. శతాబ్దాల కాలపు ఫ్యూడల్‌ దోపిడీకి, వలస పాలన దోపిడీకి వ్యతిరేకంగా ఈ దేశ ప్రజలు పోరాడి విజయం సాధించిన తర్వాత ఐక్య ఆధునిక భారత రాజ్యాంగా న్ని రచించుకున్నపుడు ఆశించింది, లక్షించింది దీనినే. కానీ శిష్ట వర్గాలు తమ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ సహకార ఫెడరలిజాన్ని భంగపరచటం వల్లనే వారికీ, ప్రజలకు, కేంద్రానికి, ప్రాంతాలకు మధ్య ఘర్షణ స్థితులు తలెత్తుతూ వచ్చాయి. గొప్ప ప్రజాస్వామికవాదిగా పేరు బడిన మొదటి ప్రధానమంత్రి నెహ్రూ కాలం నుంచే మొదలైన ఈ ధోరణి, ఏడు సుదీర్ఘ దశాబ్దాల పాటు సాగి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనూ కొనసాగుతుండటం గమనించవలసిన విషయం. మధ్యలో కొద్దికాలం జనతా, నేషనల్‌ ఫ్రంట్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాలు ఏర్పడినపుడే ఇందుకు కొంత భిన్నత్వం కన్పించింది.

ఈ పరిణామాలకు స్పందనగా ప్రజలు, ప్రాంతాలు, ప్రాంతీయ శక్తు లు, వివిధ సామాజికవర్గాలు, వారి పార్టీలు ఉమ్మడిగా తమ సొంత వేదికలను ఏర్పాటుచేసుకోవటం 1967లో సంయుక్త విధాయక్‌దళ్‌తోనే మొదలైంది. అది రాష్ర్టాల స్థాయిలో జరుగగా మరొక పదేండ్లకు 1977 లో జాతీయస్థాయిలో జనతా పార్టీ ఏర్పడింది. స్వాతంత్య్రం వచ్చిన 30 ఏండ్లకు, అంతవరకూ ఏకచ్ఛత్రాధిపత్యంగా, సహకార ఫెడరలిజం సూత్రాలను భంగపరుస్తూ సాగిన కాంగ్రెస్‌ పరిపాలనకు జనతా పార్టీ మొట్టమొదటి జాతీయస్థాయి ఫెడరలిస్టు సవాలు అయింది. అప్పుడు మొదలైన ఆ సవాలు, ఇప్పటికి 42 ఏండ్లు గడిచిన తర్వాత కూడా కొనసాగుతున్నది.

ఆ విధంగా అది జాతీయపార్టీల రూపంలో గల ఫెడరల్‌ వ్యతిరేకశక్తులపై అవిశ్వాస ప్రకటన అయింది. ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఒకసారి ఉచ్చస్థాయికి చేరి మరొక్కసారి ఎదురుదెబ్బలను తింటున్నప్పటికీ రాష్ర్టాలలోను, కేంద్రస్థాయిలోను ఈ ఫెడరల్‌ ధోరణి మాత్రం అంతరించలేదు. అనగా ఈ దేశ ప్రజలు, ప్రాంతాలు, సమా జం, వారి నెరవేరని ఆకాంక్షలు, తీరని సమస్యలూ మన రాజకీయ వ్యవస్థను తిరుగులేనివిధంగా ఫెడరల్‌ దశలోకి ముందుకు నెట్టాయన్న మాట. సహకార ఫెడరలిస్టు రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చని శిష్ట వర్గాలతో ఫెడరల్‌ ఘర్షణను ఒక దీర్ఘకాలికదశగా మార్చారన్న మాట.కొన్ని అంకెలను చూస్తే చాలు ఈ విషయం అర్థమవుతుంది. రాష్ర్టాలను కాస్త పక్కన ఉంచితే, కేంద్రంలో 1947 నుంచి 1977 వరకు 30 ఏండ్ల పాటు కాంగ్రెస్‌ ఏకధాటిన పరిపాలించిన తర్వాత, 1977 నుంచి ఇప్పటివరకు గల 42 ఏండ్లలో తిరిగి ఏ జాతీయ పార్టీ (కాంగ్రెస్‌, బీజే పీ) కూడా వరుసగా పదేండ్లకు మించి పరిపాలించలేదు.

అందులోనూ కాంగ్రెస్‌ స్వయంగా పదేండ్లు పాలించింది ఒక్కసారే (1980-89). ఆ వెనుక పదేండ్ల (2004-14) పాలన యూపీఏ రూపంలో ప్రాంతీయ పార్టీల తోడ్పాటుతో మాత్రమే. బీజేపీ అయితే సొంత బలంతో అసలెప్పుడూ పాలించలేదు. వాజపేయి ప్రభుత్వం (1999-2004) ఎన్డీయే పైన ఆధారపడగా, మోదీ ప్రభుత్వం కూడా (2014 నుంచి) అదే ఎన్డీ యే బలంతో సాగుతున్నది. 2019లో లోక్‌సభలో సొంత ఆధిక్యత వచ్చి నా రాష్ర్టాల్లో, రాజ్యసభలో అవసరాల కోసం ప్రాంతీయ పార్టీలను కాదనగల స్థితి లేదు. ఇదంతా గత 42 ఏండ్లుగా క్షేత్రస్థాయిలో ఫెడరల్‌శక్తుల నిరంతర బలానికి నిదర్శనమవుతున్నది.ఇందుకు సంబంధించి మరికొన్ని వివరాలను పేర్కొనాలంటే, కేంద్ర స్థాయిలో ఫెడరల్‌శక్తుల ఆవిష్కరణ మొదట జనతాపార్టీ (1977-80) రూపంలో జరిగిన తర్వాత, జనతాదళ్‌/నేషనల్‌ ఫ్రంట్‌ (1989-91) రూపంలో రెండవ అవతారమెత్తింది. యునైటెడ్‌ ఫ్రంట్‌ (1996-98) గా మూడవ అవతారం వెనుక, 1999 నుంచి ఇప్పటివరకు వరుసగా 20 ఏండ్లుగా యూపీఏ, ఎన్డీయే రూపాల్లో తమ తోడ్పాటులేనిదే కాం గ్రెస్‌, బీజేపీలు అధికారంలో ఉండలేనివిధంగా తమ అనివార్య పాత్రను ఫెడరల్‌శక్తులు నిరూపించుకోవటం గమనించదగిన విశేషం.

సహకార ఫెడరలిస్టు వ్యవస్థ ఈ శక్తులకు సరిపడదు గాని ప్రజలకు, ప్రాంతాలకు, అంతిమార్థంలో ఈ వైవిధ్య దేశానికి ఒక తప్పనిసరి అవసరం. ఆ విషయాన్ని ఫెడరల్‌శక్తులు గత యాభై ఏండ్ల సంఘర్షణా చరిత్ర ద్వారా చాటిచెప్పాయి. అందువల్ల స్వరూపంలో, స్వభావం లో కూడా ఈ వాస్తవాలను, రాజ్యాంగ లక్ష్యాన్ని ప్రతిఫలించే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఒకటి ఏర్పడాలి. స్వాతంత్య్రం లభించిన 72 ఏండ్లలో సుమారు 50 ఏండ్ల పాటు వివిధ ప్రాంతీయ, సామాజికవర్గాల పార్టీలు ఏదో ఒక రూపంలో కీలక రాజకీయపాత్రలు వహిస్తూ వస్తున్న రికార్డులు ఇప్పటికే ఉండటం సాధారణ విషయం కాదు.

ఇదంతా జాతీయస్థాయి పరిస్థితి కాగా, రాష్ర్టాల వైపు చూసినప్పుడు ఫెడరల్‌శక్తుల ఏర్పాటు, అవి బలపడటం ఒక తిరుగులేని ధోరణిగా యాభై ఏండ్ల కిందటి నుంచే మారింది. 1967 నాటి సంయుక్త విధాయక్‌దళ్‌ గురించి పైన చెప్పుకున్నాం. నిజానికి అంతకన్న కూడా పదేండ్ల ముందే 1957 నాటి రెండవ సార్వత్రిక ఎన్నికల్లో ఫెడరల్‌ శక్తులు కాం గ్రెస్‌ ఓట్లు, సీట్లను యూపీ, బీహార్‌, బెంగాల్‌, ఒడిశా వంటి ప్రధాన రాష్ర్టాల్లో దెబ్బతీసి (కేరళలోనైతే అధికారమే పోయింది) సాక్షాత్తూ నెహ్రూను భయపెట్టాయి. ఈ పరిణామక్రమం తర్వాతి దశాబ్దాల్లో ఏ విధంగా సాగి ఈ రోజున ఎట్లున్నదో తెలిసిందే. మొత్తం మీద ఈ దేశ ప్రజలకు అవసరమైన, వారు కోరుకున్న, రాజ్యాంగం అక్షరబద్ధం చేసిన సహకార ఫెడరలిజాన్ని కేంద్రీకృత శక్తులు, శిష్టవర్గాలు తమ స్వప్రయోజనాల కోసం భంగపరచటం, ఆ ధోరణిని ఫెడరల్‌శక్తులు ప్రతిఘటించటమన్నది దశాబ్దాల చరిత్ర.

ఈ విధంగా కేంద్రీకరణ శక్తులు రాజ్యాంగ సూత్రాన్ని ఉల్లంఘిస్తూ ప్రజల, ప్రాంతాల విశ్వాసాన్ని కోల్పోయిన స్థితిలో జరుగవలసిందేమిటన్నది ప్రశ్న. సహకార ఫెడరలిస్టు వ్యవస్థ ఈ శక్తులకు సరిపడదు గాని ప్రజలకు, ప్రాంతాలకు, అంతిమార్థంలో ఈ వైవిధ్య దేశానికి ఒక తప్పనిసరి అవసరం. ఆ విషయాన్ని ఫెడరల్‌శక్తులు గత యాభై ఏండ్ల సంఘర్షణా చరిత్ర ద్వారా చాటిచెప్పాయి. అందువల్ల స్వరూపంలో, స్వభావం లో కూడా ఈ వాస్తవాలను, రాజ్యాంగ లక్ష్యాన్ని ప్రతిఫలించే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఒకటి ఏర్పడాలి. స్వాతంత్య్రం లభించిన 72 ఏండ్లలో సుమారు 50 ఏండ్ల పాటు వివిధ ప్రాంతీయ, సామాజికవర్గాల పార్టీలు ఏదో ఒక రూపంలో కీలక రాజకీయపాత్రలు వహిస్తూ వస్తున్న రికార్డులు ఇప్పటి కే ఉండటం సాధారణ విషయం కాదు. దేశంలో ఫెడరల్‌ పార్టీల దశ తిరుగులేనివిధంగా మొదలై, సోకాల్డ్‌ జాతీయపార్టీలు ఊత కర్రలపై నడుస్తున్నాయి. నేర్వవలసిన పాఠాలను కాంగ్రెస్‌, బీజేపీలలో ఎవరూ నేర్వలేదు, నేర్వటం లేదు.

అది వాటి వైఫల్యం, స్వయంకృత దోషం. ఇంతవరకు జాతీయస్థాయిలో జరిగిన ఫెడరల్‌ ప్రయోగాల్లో స్వరూపం తప్ప స్వభావం లోపించటమన్నదొక్కటే మనకు కన్పిస్తున్న లోపం. ఆ ఫ్రంట్‌లలోని పార్టీల మధ్య తాత్కాలిక అధికార బంధాలు మినహా ఉమ్మ డి లక్ష్యాలు, అంగీకారాలు, ఆచరణలు, కెమిస్ట్రీ లోపించి, ఐక్యత లేక అవి దీర్ఘకాలం నిలువలేకపోయాయి. బీజేపీ అనే ఒక జాతీయ పార్టీ అధ్వాన్నంగా పాలిస్తూ, అధ్వాన్నంగా పాలించి మూలనపడిన మరొక జాతీయపార్టీ కాంగ్రెస్‌ గత వైఫల్యాల నుంచి పాఠాలు నేర్వగలదని గాని, పూర్వస్థితి పొందగలదనిగాని ఆశలు లేనందున, ఈ ప్రజల కోసం దేశం కోసం జాతీయ వేదికను ఆక్రమించగల, ఇన్ని దశాబ్దాల ఫెడరలిస్టు అనుభవాలతో పరిణతి చెందిన ఫెడరల్‌ ఫ్రంట్‌ ఒకటి ఏర్పడవలసి ఉన్నది.


logo