బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Jan 09, 2020 , 11:56:25

జేఎన్‌యూ రక్తసిక్తం

జేఎన్‌యూ రక్తసిక్తం

ఓ వర్గం విద్యార్థులే లక్ష్యంగా జరిగిన ఈ దాడితో దేశం యావ త్తూ విస్తుపోయింది. ముసుగులు ధరించిన దుండగులు రాడ్లు, కట్టెలు, హాకీ స్టిక్‌లు పట్టుకొని చీకటిమాటున యూనివర్సిటీ హాస్టళ్లలోకి చొరబడి దొరికినవారిని దొరికినట్లు చితకబాదారు.

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) రక్తసిక్తమయ్యింది. ఓ వర్గం విద్యార్థులే లక్ష్యంగా జరిగిన ఈ దాడితో దేశం యావ త్తూ విస్తుపోయింది. ముసుగులు ధరించిన దుండగులు రాడ్లు, కట్టెలు, హాకీ స్టిక్‌లు పట్టుకొని చీకటిమాటున యూనివర్సిటీ హాస్టళ్లలోకి చొరబడి దొరికినవారిని దొరికినట్లు చితకబాదారు. పథ కం ప్రకారం కొందరు విద్యార్థులే లక్ష్యంగా రూముల తలుపులు బద్దలుకొట్టి విచక్షణారహితంగా గాయపర్చారు. దుండగులు విద్యార్థినుల హాస్టల్‌ను కూడా వదలకుండా వారిపైన దాడిచేసి గాయపర్చడం దారుణం. ఈ దాడిలో పదుల సంఖ్యలో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. జేఎన్‌ యూ విద్యార్థి సంఘం నేత ఐషీ ఘోష్‌ కూడా తీవ్రంగా గాయపడింది. ఆమె తల పగిలింది. ఓ చేయి విరిగింది. ఆ క్రమంలో విద్యార్థులతో మాట్లాడుతున్న యూనివర్సిటీ ప్రొఫెసర్లపైనా రౌడీ మూకలు దాడిచేశాయి. రెండున్నర గంటల పాటు యూనివర్సిటీ క్యాంపస్‌, విద్యార్థుల హాస్టళ్లలో రౌడీలు స్వైరవిహారం చేశారు. ఈ దాడి క్రమంలో ఎంతోమంది విద్యార్థులు తమను రక్షించమం టూ పోలీసులకు ఫోన్ల ద్వారా విన్నవించుకున్నారు. మరికొంత మంది విద్యార్థులు దాడిచేస్తున్న ఘటనలను వీడియో తీసి తమ మనో నిబ్బరాన్ని, ధైర్య సాహసాలను ప్రదర్శించారు. ఓ అధ్యాపకుడైతే తనవద్ద చదువుకున్న పోలీస్‌ అధికారికి ఫోన్‌చేసి దాడి విషయాన్ని చెప్పి రక్షించాలంటూ వేడుకున్నా పోలీసులు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకోలేకపోయారు. ఇంత జరుగుతు న్నా యూనివర్సిటీ అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారన్నది అంతుపట్టని విషయం. విద్యాబోధనలో, పరిశోధనలో ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు కలిగిన జేఎన్‌యూలో ఇలాం టి దాడి జరుగటం దేశ ప్రతిష్టకే మాయని మచ్చ. దశాబ్దాల చరిత్ర కలిగిన యూనివర్సిటీలో ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడూ చోటుచేసుకోలేదు. నిజానికి ఈ దాడి జరుగటానికి తక్షణ కారణమంటూ ఏమీ కనిపించకపో వటం గమనార్హం.

జేఎన్‌యూ విద్యార్థులపై జరిగిన దాడి తీరు ఆందోళన కలిగిస్తున్నది. ఎల్లప్పుడు పోలీసు, ఇంటెలిజెన్స్‌ నిఘా నీడలో ఉండే జేఎన్‌యూ క్యాంపస్‌లోకి ఇరువై, ముప్ఫై మంది దాకా దుం డగులు కర్రలు, రాడ్లతో చొరబడటం ఎలా సాధ్యమైంది. ఆదివారం క్యాంపస్‌ పరిసరాల్లో సీఏఏకు నిరసనగా ఓ సభ నిర్వహిస్తున్నందున ఆ ప్రాంతమంతా పోలీసు నిఘా పెంచారు. 144 సెక్షన్‌ కూడా విధించారు. దాడి జరుగుతున్న సమయంలో యూనివర్సిటీ క్యాంపస్‌కు ఆనుకుని ఉన్న బాబారంగనాథ్‌ మార్గ్‌లో వీధిలైట్లు వెలుగటం లేదు. ఈ చీకటి సాయంతోనే రౌడీమూకలు క్యాంపస్‌ ప్రధాన గేట్లగుండా చొరబడ్డారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దృశ్యాల్లోనైతే పోలీసులు, దుండగులు కలిసే ఉన్నారు. ముసుగులు ధరించిన వారిలో ఏబీవీపీ నేతలు ఉన్నట్లు కొన్ని దృశ్యాలు చాటుతున్నాయి. నిరంతరం నిఘా ఉండే క్యాంపస్‌లోకి దుండగులు ఎలా ప్రవేశించారు? యూనివర్సిటీ ప్రధాన ప్రవేశద్వారాలు ఉన్నచోట్లలో వీధిలైట్లు ఎవరు ఆర్పేశారు? వంటి కీలక విషయాలను నిగ్గుతేల్చాలి. యూనివర్సిటీ అధికారుల అనుమతి లేకపోవటం కారణంగానే తాము క్యాంపస్‌లోకి వెళ్లి దాడిని నియంత్రించలేకపోయామని పోలీసులు చెబుతున్నదాంట్లో నిబద్ధత ఎంతన్నది తేల్చాలి.

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో రూపంలో జేఎన్‌యూ వార్తల్లో ఉంటున్నది. వామపక్ష విద్యార్థి వర్గాలకూ, బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీకి మధ్య వివాదాలు, భావజాల సంఘర్షణలు కొనసాగుతున్నాయి. అయినా భౌతిక ఘర్షణల దాకా ఎప్పుడూ పోలేదు. ముసుగులు ధరించిన ఏబీవీపీ గూండాలే దాడిచేశారని దాడిలో గాయపడిన విద్యార్థులు, విద్యార్థి సంఘం నేత ఐషీ ఘోష్‌ ఆరోపించారు. కొంతకాలంగా యూనివర్సిటీలో ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌, సీఏఏలకు వ్యతిరేకంగా జేఎన్‌యూ విద్యార్థులు పెద్దఎత్తున నిరసనోద్యమాలు చేపట్టడం అధికార వర్గాలకు గిట్టలేదు. ఈక్రమంలో విద్యార్థులపై విష ప్రచారానికి దిగారు. జేఎన్‌యూలో దేశ విచ్ఛిన్నకరశక్తులు తిష్టవేశాయని నిందారోపణలు చేశారు. అలాంటి శక్తులను యూనివర్సిటీల్లోంచి గెంటివేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే జేఎన్‌యూ విద్యార్థులపై దాడి జరిగిందనేది తేటతెల్లమైంది. దాడికి పాల్పడింది తామేనని హిందూ రక్షాదళ్‌ అనే సంస్థ ప్రకటించటం, రాడ్లతో యూనివర్సిటీలో చొరబడి దాడిచేసిన వారిలో ఆరెస్సెస్‌కు చెందిన ఇద్దరు విద్యార్థి నేతలున్నారని ఢిల్లీ ఏబీవీపీ నేతలు అంగీకరించటం దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. జంకూబొంకు లేకుండా ఓ హత్యాకాండను తమ గొప్పపనిగా చాటుకోవటం మతోన్మాద చర్యలకు పరాకాష్ట. జేఎన్‌యూలో జరిగిన దాడి ఓ వర్గం విద్యార్థులే లక్ష్యంగా సాగినట్లు స్పష్టమవుతున్నది. ఈ దాడిపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలి. దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర యూనివర్సిటీల్లోనూ పటిష్ట భద్రతాచర్యలు చేపట్టాలి. విశ్వవిద్యాలయాలు కూడా విభజన రాజకీయాలకు, మూకదాడులకు నిలయాలుగా మారకుండా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.


logo