శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Jan 09, 2020 , 11:47:45

సమిష్టికృషితో సంపూర్ణ అక్షరాస్యత

సమిష్టికృషితో సంపూర్ణ అక్షరాస్యత

గ్రామీణ ప్రాంతాల్లో వయోజన కార్యక్రమాల్లో పాల్గొనే విద్యా వలంటీర్లు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా తాత్కాలిక,స్వల్పకాలిక వయోజన శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చురుకుగా పనిచేసి సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమాన్ని సక్రమంగా అమలుచేయాలి.

రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రారంభించి దేశానికి ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. రాష్ర్టాభివృద్ధికి నిర్విరామంగా కృషిచేస్తూ ఇప్పుడు నిరక్షరాస్యతపై సమరభేరి మోగించటం ప్రశంసనీయం. రాష్ట్రంలో వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, విద్యుత్‌, సాగునీరు, తాగునీరు ప్రాజెక్టులను ప్రారంభించారు. గురుకుల విద్యతో పాటు ఆరోగ్య పరిరక్షణలో వైద్యరంగాభివృద్ధిలో సైతం అన్నిరాష్ర్టాల కన్నా తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉం డటం గర్వకారణం. అయితే అక్షరాస్యతలో మాత్రం చాలా వెనుకబడి ఉండటం జీర్ణించుకోలేని విషయం. ఈ దశలో కొత్త సంవత్సరం సందర్భంగా ‘సంపూర్ణ అక్షరాస్యతే’ ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రజలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. దేశంలో 2021 జనాభా లెక్కలు పూర్తయ్యేలోపు అక్షరాస్యతా శాతాన్ని వంద శాతానికి పెంచాలని, తరా అక్షరాస్యతలోనూ దేశంలో ముందుండాలని కాంక్షించారు. ఇందులో భాగంగానే నిరక్షరాస్యతపై యుద్ధభేరి మోగించారు. విద్యావంతులంద రూ భాగస్వాములు కావాలని, ‘అందరికీ విద్య మనందరి బాధ్యత’గా గుర్తెరిగి అక్షరాస్యుడిగా చేయాల్సిందిగా అభ్యర్థించారు. ‘Each one, Teach one’ కార్యక్రమాన్ని రూపొందించి పల్లెల ప్రగతి కార్యక్రమాల్లో ప్రధానాంశంగా పరిగణించి సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర యంత్రాంగాన్ని ఆదేశించటం హర్షణీయం.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామాల్లోని గ్రామ పరిపాలకుడి స్థాయి వరకు రోజువారీ కార్యాచరణ రూపొందించి అమలుపరుచాలి. జనవరి 10 లోపు గ్రామ, పట్టణ ప్రాంతాల్లోని 18 సంవత్సరాల పైబడిన నిరక్షరాస్యుడిని గుర్తించి అతని పూర్తి వివరాలు సేకరించాలి. అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవాసంస్థల ప్రతినిధులు, విద్యావంతు లు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, ఆరోగ్య కార్యకర్తలు, సహకార సంఘ ప్రతినిధులు, అంబేద్కర్‌ యువజన సంఘాలు నిరక్షరాస్యుడి గృహ సముదాయంలోని యువతీ యువకులను సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమ అమలుసేవా కార్యకర్తలుగా గుర్తించాలి. ఆయా క్లస్టర్ల, ఆవాస ప్రాంతాల నిరక్షరాస్యులను గుర్తించి స్వచ్ఛంద-సేవా కార్యకర్తలకు, మహిళా సభ్యులకు జతకలిసి నిరక్షరాస్యులైన యువతీయువకుల అక్షరాస్యతా కార్యక్రమాలు నిర్వహించాలి. దీనికోసం గ్రామంలోని వార్డుస్థాయి వరకూ కార్యక్రమాలు రోజువారీగా పకడ్బందీగా నిర్వహించేలా యంత్రాంగాన్ని కార్యోన్ముఖులుగా చేయాల్సిన అవసరం ఉన్నది. సం పూర్ణ అక్షరాస్యతా కార్యక్రమాన్ని కనీసం 100 రోజుల కార్యక్రమాన్ని రూపొందించి అమలుపరిచేలా కృషిచేయాలి. దీనికోసం రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లందరూ జిల్లా అభివృద్ధి కార్యక్రమాల అమలుకు చేస్తున్న కృషితోపాటు తమ జిల్లాల్లో నిరక్షరాస్య నిర్మూలనా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలి. 2011 దేశ జనాభా లెక్కల ప్రకారం జాతీయ సగటు అక్షరాస్యత దాదాపు 74 శాతం కాగా మన తెలంగాణ రాష్ట్రంలో 66.54 శాతంగా ఉన్నది.కేంద్రం అక్షరాస్యతా కార్యక్రమంలో ప్రముఖ పాత్ర పోషించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సహాయ, సహకారాలు అందించాలి. నూతన, శాస్త్ర, సాంకేతిక రంగాభివృద్ధిలో భాగంగా నిరక్షరాస్యులను, అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానా న్ని ఉపయోగించాలి. అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదాల బారిన పడకుండా ప్రభుత్వం కల్పించిన టోల్‌ ఫ్రీ నెంబర్లు 100, 108, వినియోగదారుల చట్టం-2019, మహిళా శిశు చట్టాలు, ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, బ్యాంకు లావాదేవీల నిర్వహణా-ప్రమాదాలు మొదలైనవి ప్రజలకు ఉపకరించే సమాచారంలో చైతన్యవంతులను చేయటం ద్వారా నిరక్షరాస్యుల్లో అవగాహన పెంపొందే ఆస్కారం ఉంటుంది. జార్ఖండ్‌, రాజస్థాన్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, బీహార్‌ రాష్ర్టాలు మాత్ర మే తెలంగాణ కంటే వెనుకబడి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో ముందున్నది. అక్షరాస్యతలో వెనుక ఉన్నది. కాబట్టి తెలంగాణలో నివసిస్తున్న ప్రతి పౌరుడు తమ ఇరుగుపొరుగున ఉన్న నిరక్షరాస్యుడిని అక్షరాస్యుడిగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకోవాలి. దీనికోసం రాష్ట్రంలోని పలు ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ, కార్మిక, మహిళా సంఘాలు తమ శక్తిమేరకు గ్రామాలను, మండలాలను సంపూర్ణంగా దత్తత తీసుకోవాలి. ప్రభుత్వం రూపొందించి అందించే సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమ కార్యనిర్వహణా సామాగ్రి, సాంస్కృతిక కార్యక్రమాలను, స్థానిక వనరులను గ్రామంలోని వార్డు స్థాయి వరకు చేర్చాలి. యువతీయువకులను సమీకరించి యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలను అమలుపరుచాలి. స్వచ్ఛందంగా తెలంగాణ రాష్ట్రం నిరక్షరాస్యతా నిర్మూలనా కార్యక్రమాలను విజయవంతం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలోని పత్రికా యాజమాన్యాలు, టీవీ ఛానళ్లు, పౌర సంబంధాల శాఖ సమన్వయంతో గ్రామ, పట్టణ ప్రాంతాల్లోని యువతీయువకులను చైతన్యం చేసేందుకు, నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా రూపొందించేందుకు కార్యోన్ముఖులను చేయాలి. ఈ కార్యక్రమంలో యువతీయువకులు స్వచ్ఛందంగా పాల్గొనేలా చైతన్యపర్చాల్సిన బాధ్యత ప్రచార, ప్రసార మాధ్యమాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. 2011 రాష్ట్ర జనాభా లెక్కల ప్రకారం పురుషుల అక్షరాస్యతా శాతం 75.04. మహిళా అక్షరాస్యతా శాతం 57.99 రాష్ట్రంలోని ఎస్సీల్లో 58. 90, ఎస్టీల్లో 49.51 శాతం ఉన్నందున ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో, ఆవాసాల్లో అదే కమ్యూనిటీకి చెందిన విద్యావంతులైన యువతీయువకులు, ఉన్నత విద్యావంతులు విద్యార్థులను ప్రధానంగా పాల్గొనేలా కార్యాచరణ రూపొందించి అమలుచేయాలి.కేంద్ర ప్రభుత్వం అక్షరాస్యతా కార్యక్రమంలో ప్రముఖ పాత్ర పోషించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సహాయ, సహకారాలు అందించాలి. నూతన, శాస్త్ర, సాంకేతిక రంగాభివృద్ధిలో భాగంగా నిరక్షరాస్యులను, అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానా న్ని ఉపయోగించాలి. అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదాల బారిన పడకుండా ప్రభుత్వం కల్పించిన టోల్‌ ఫ్రీ నెంబర్లు 100, 108, వినియోగదారుల చట్టం-2019, మహిళా శిశు చట్టాలు, ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, బ్యాంకు లావాదేవీల నిర్వహణా-ప్రమాదాలు మొదలైనవి ప్రజలకు ఉపకరించే సమాచారంలో చైతన్యవంతులను చేయటం ద్వారా నిరక్షరాస్యుల్లో అవగాహన పెంపొందే ఆస్కారం ఉంటుంది. వయోజన విద్యా కార్యక్రమాలన్నీ పాఠశాల విద్యా కార్యక్రమాల వలె కాకుండా వయోజనులకు ఉపకరించేరీతిలో నిరక్షరాస్యలు జీవన ప్రమాణాలు మెరుగుపరిచేవిధంగా రూపొందించాలి. నిరక్షరాస్యుల విద్యా ప్రచురణలు, పాఠ్యాంశాలు నిత్యజీవితంలో ఉపకరించేవిధంగా ప్రభుత్వ పథకాలపై అవగాహన, వ్యవసాయం, పాడి, ఆరోగ్య పరిరక్షణ, వాతావరణ సమతుల్యత, అటవీ, మత్స్య సంపద, వ్యవసాయోత్పత్తులు-మార్కెటింగ్‌, నైతికవిలువలు, శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ నిబంధనలు, బాలికా విద్య ప్రాధాన్యం, మహిళా చట్టాలు, పౌరచట్టాలు,మానవహ క్కులు, మహిళ సంఘాల బాధ్యతలు, నిర్వహణ, మాతా శిశు ఆరోగ్య సంరక్షణ గ్రామాల్లోని పల్లెల ప్రగతి, నిర్వహణ ప్రజాప్రతినిధుల బాధ్యతలు, గ్రామీణ ప్రాంతాలకు ఉపకరించే పారిశ్రామిక రంగాభివృద్ధి, గ్రామీణ వృత్తి నైపుణ్యాల అభివృద్ధి మొదలైన శిక్షణా కార్యక్రమాలు సరళ పద్ధతిలో వయోజన నిరక్షరాస్యలకు ఉపకరించేరీతిలో బోధనా సామాగ్రిని ఉపయోగించటం, రూపొందించటం, ఆసక్తికరంగా బోధించటం నిర్విరామంగా జరుగాలి.గ్రామీణ ప్రాంతాల్లో వయోజన కార్యక్రమాల్లో పాల్గొనే విద్యా వలంటీర్లు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా తాత్కాలికంగా, స్వల్పకాలిక వయోజన శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చురుకుగా పనిచేసి సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమాన్ని సక్రమంగా అమలుచేయాలి.కనీసం 100 రోజుల సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమాన్ని అమలుచేసిన తదనంతరం మూల్యాంకనా కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలి. జాతీయస్థాయిలో గుర్తింపు గల సంస్థలతో అక్షరాస్యతా పెంపు శాతాన్ని ధృవీకరించేలా రాష్ట్ర ప్రభుత్వ, వయోజన విద్యా శాఖలు నిర్విరామంగా కృషిచేయాలి. మన రాష్ట్రం అన్నింటిలో అగ్రగామిగా నిలిచేలా యువతీయువకులు తమ సేవల్ని రాత్రింబవళ్లు యుద్ధప్రాతిపదికన అందించాల్సిన అవసరం ఉన్నది.(వ్యాసకర్త: డిప్యూటీ డైరెక్టర్‌, పాఠశాల విద్య, తెలంగాణ)


logo