e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home సంపాదకీయం విపత్తులోనూ వివక్షా?

విపత్తులోనూ వివక్షా?

విపత్తులోనూ వివక్షా?

మానవాళిని మహమ్మారులు కబళిస్తున్న నేపథ్యంలో ప్రపంచమంతా ఏకతాటిపై నిలువాల్సిన సందర్భమిది. స్వపర భేదం లేకుండా దేశాలు, ప్రాంతాలకతీతంగా ఉమ్మడిగా ఉపద్రవాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. సర్వశక్తులు ఒడ్డి సకల శాస్త్ర సాంకేతికతల సాయంతో ప్రతి ఒక్కరిని రక్షించుకోవాల్సిన బాధ్యత. కానీ కరోనా విపత్తు సమయంలోనూ పాశ్చాత్య దేశాలు పక్షపాతాన్ని వీడకపోవటం తీవ్ర అభ్యంతరకరం. ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్‌ కట్టడికి ఏడాదికాలంగా శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలించింది. వైరస్‌ను అడ్డుకోవడానికి తగిన వ్యాక్సిన్లను రూపొందించుకోగలిగాము. కానీ వైరస్‌ కరాళ నత్యం చేస్తుంటే, మేధో హక్కులంటూ అభ్యంతరాలు చెప్పడం సబబుకాదు. ప్రపంచంలో ముఖ్యంగా భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో కరోనాను కట్టడి చేయవలసిన బాధ్యత అందరిది. అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లను సమస్త మానవులు వినియోగించుకోవటమే నాగరిక సమాజపు అంతిమ లక్ష్యం కావాలి.

ఆపత్కాలంలో మానవీయతకు పట్టం కట్టి సమైక్యంగా ముందుకు నడవాల్సిన సమయంలో పాశ్చాత్య దేశాలు ధనార్జనకే పెద్దపీట వేయటం గర్హనీయం. పేటెంట్‌ హక్కులు, నాణ్యతలంటూ వ్యాక్సిన్ల ఉత్పత్తి, పంపిణీలో వివక్ష చూపుతున్నాయి. భారత్‌లో తయారైన కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌లను గుర్తించటానికి ఐరోపా దేశాలు నిరాకరిస్తున్నాయి. యూరోపియన్‌ యూనియన్‌ దేశాలే కాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వివక్ష చూపటం విషాదం. కొవాగ్జిన్‌కు సంబంధించిన పూర్తి డేటా తమకు అందలేదనే కారణం చూపి దాన్ని గుర్తించటానికి డబ్ల్యూహెచ్‌ఓ తాత్సారం చేస్తున్నది. కొవిషీల్డ్‌ విషయం మరింత విడ్డూరంగా ఉన్నది. ఇది పూర్తిగా ఆస్ట్రాజెనెకా పరిజ్ఞానంతోనే మన దేశంలో తయారైంది. స్థానికంగా ఇక్కడి కంపెనీల్లో తయారైంది కాబట్టి దాని లేబుల్‌ మారి కొవిషీల్డ్‌ అయింది. ఆస్ట్రాజెనెకాను 101 దేశాలు గుర్తించాయి. కానీ లేబుల్‌ మారిన కొవిషీల్డ్‌ను మాత్రం నలభై దేశాలే వినియోగానికి అనుమతించటం పక్షపాతానికి పరాకాష్ఠ.

సంవత్సర కాలంగా శాస్త్ర విజ్ఞానం, ముఖ్యంగా వైద్యశాస్త్రం కొవిడ్‌-19 విసిరిన సవాలును ఎదుర్కొని నిలిచింది. పురిటినొప్పులు పడి కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్లను ఆవిష్కరించింది. తత్ఫలితంగా వివిధ దేశాల్లో వివిధ పేర్లతో పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అమెరికాలో ఫైజర్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌; రష్యాలో స్పుత్నిక్‌-వి, భారత్‌లో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌- ఇలా ఆయా ప్రాంతీయ వనరుల దన్నుతో టీకాలు రూపుదిద్దుకున్నాయి. ఇవన్నీ మనిషి ప్రాణం నిలపటం కోసం అందరికీ అందుబాటులోకి రావాలి. వ్యాక్సిన్‌లే కాదు, పలు పరిశోధనలను ప్రైవేటు కంపెనీలు చేస్తున్నా ప్రజాధనం వినియోగించే విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు వాటికి చేయూత ఇవ్వడం పరిపాటి. నేటి ఆధునిక శాస్త్ర పురోగతి, అభివృద్ధి ఆసాంతం ఏ ఒక్కరి సొత్తు కాదు. అదంతా సమాజ వికాస ఫలితం, విశ్వమానవాళి సొత్తు. సంకుచిత వ్యాపార ప్రయోజనాల కోసం మనుషులను బలి చేయటం భావ్యం కాదు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విపత్తులోనూ వివక్షా?

ట్రెండింగ్‌

Advertisement