మరుగునపడిన మాణిక్యం

Mon,August 21, 2017 01:06 AM

తెలంగాణ ఉద్యమం మరుగున పడిన మాణిక్యాలను వెలుగులోకి తెచ్చింది. చరిత్రకెక్కని వారి ని చరిత్రార్థులను చేసింది. సాహిత్య, సాం స్కృతిక, చారిత్రక వైభవాన్ని చాటిచెప్పింది. ఆత్మగౌరవ నినాదంతో వెలుగెత్తిన తెలంగాణ ఉద్యమం ఎందరినో వెలుగులోకి తెస్తున్నది. తనదైన వారసత్వ సజీవ స్రవంతికి బాటలు వేస్తున్నది.
ఇన్నాళ్ళు మూస ధోరణిలో సాగిన సాహిత్య ప్రచారం వల్ల మన సాహిత్యం కాలగర్భంలో కలిసిపోయింది. మన ఆణిముత్యాలు మరుగునపడిపోయారు. తెలంగాణ ఉద్యమ పుణ్యం తో అసలైన సాహిత్యం ఇప్పుడు వెలుగులోకి వస్తున్నది. సిసలైన కవులు, రచయితలు, జర్నలిస్టులు, సాహితీవేత్తలు వెలుగులోకి వస్తున్నారు. అలాంటి వారిలో రచయిత, కవి, జర్నలిస్ట్, సాహితీవేత్త ఎదిరె చెన్నకేశవులు ఒకరు. తొలితరం కథా రచయితగా సుప్రసిద్ధులు. జర్నలిస్టుగా గోలకొండ పత్రికకు వెన్నుదన్నుగా ఉన్నవాడు. నేత వారపత్రికకు సంపాదకుడిగా జగమెరిగినవాడు. చేనే త ఉద్యమ నాయకుడిగా పేరుగాంచినవాడు. ఆయన శతజయంతి ఆగస్టు 15న ప్రారంభ మైంది.
Srikanth
ఎదిరె చెన్నకేశవులు మహబూబ్‌నగర్ పట్టణంలో 15 ఆగస్టు 1918లో బాలకృష్ణమ్మ, నారాయణ దంపతులకు జన్మించాడు. ప్రాథమి క విద్యాభ్యాసం మహబూబ్‌నగర్ పట్టణంలోనే పూర్తిచేశాడు. విద్యార్థి దశలోనే ఆంధ్ర బాలసంఘం సంస్థను స్థాపించి విద్యార్థులను ప్రోత్సహించాడు. తెలుగు, ఆంగ్ల, ఉర్దూ భాషలను నేర్చుకున్నాడు. ఈ మూడు భాషల్లో వెలువడే దినపత్రికలకు చాలాకాలం పాటు విలేకరిగా పనిచేశాడు. సురవరం ప్రతాపరెడ్డి స్థాపించిన గోలకొండ ద్వైవారపత్రికకు సహాయ సంపాదకుడిగా పనిచేసి అనేక సంపాదకీయాలను రాశాడు. ప్రసిద్ధిగాంచిన హిందీపత్రిక మిలాప్‌కు కూడా ప్రతినిధిగా ఉన్నాడు. నాడు పద్మశాలి సంఘం ప్రచురించిన నేత వారపత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. చేనేత ఉద్యమ నాయకుడిగా చేనేత సహకార సంఘం నిర్వహణలో ముఖ్యభూమికను పోషించాడు. చేనేత సహకార సంఘం వారి సహకార సమాచారం పత్రికకు సహాయ సంపాదకుడిగా వ్యవహరించాడు. అంతేకాకుండా సహకార ఉద్యమ వ్యాసాలతో సహకార సహజీవనం అనే వ్యాస సంపుటిని వెలువరించాడు.

తెలంగాణ తొలితరం కథకుల్లో ఒకడైన ఎదిరె చెన్నకేశవులు కథలు అనేక పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఇతని అభ్యుద య రచయిత అన్న కథ సుజాత పత్రికలో 1950లో అచ్చయింది. ఆ తర్వాత తొమ్మిది కథలు రాశాడు. ఈ తొమ్మిది కథలతో పొట్టకోసం కథా సంపుటిని 1968లో వెలువరించాడు.
ఎదిరె చెన్నకేశవులు నవలా రచయితగా కూడా పేరుపొందా డు. తొలి తెలంగాణ డిటెక్టివ్ నవలా రచయితగా ప్రఖ్యాతిగాంచాడు. ఇతని అదృశ్యహస్తం నవల తొలి తెలంగాణ అపరాధ పరిశోధక నవలగా కీర్తి గడించింది. ఈ నవలలో తెలంగాణ అరణ్యంలోని రహస్య గుహలు, పాతాళ గుహలు, ముసుగు మనుషులు మొదలైనవాటిని రచయిత కళ్ళకు కట్టినట్లుగా ఆవిష్కరించాడు. ఇతని మరో నవలలు పొట్టకోసం, పతిత. ఈ రెండూ కూడా సాంఘిక నవలలు. మూడవ నవల పతి త. ఒక సినిమా నటి జీవితాన్ని ప్రతిబింబించే విధంగా ఈ నవల రాయబడింది. ఈ నవల అముద్రితం.

గోలకొండ పత్రికలో చెన్నకేశవులు పనిచేస్తున్నప్పుడు నాటి ప్రజల పరిస్థితుల గురించి, గ్రంథాలయోద్యమం గురించి గోలకొండ, నేత వంటి పత్రికల్లో పలు వ్యాసాలు రాశాడు. మహబూబ్‌నగర్ జిల్లా ఆంధ్ర సారస్వత పరిషత్ కార్యదర్శి గా, ఆంధ్రమహాసభ జిల్లా సంయుక్త కార్యదర్శిగా పనిచేశాడు. రాష్ట్ర గ్రంథాలయ సంఘ వ్యవస్థాపక కార్యదర్శిగా, హైద్రాబాద్ కేంద్ర చేనేత సహకార సంఘానికి ప్రధాన వ్యవస్థాపకుడిగా సేవలను అందించాడు. తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చిన కవు లు, రచయితలను గౌరవించే సంప్రదాయంలో భాగంగా ఎదిరే చెన్నకేశవులు లాంటి మాణిక్యాలను స్మరించుకోవడం మన అస్తిత్వాన్ని చాటడమే. ఇలాంటి ఎందరో విస్మృత కవులు, రచయితలను స్మరించుకొని తెలంగాణ సాహిత్యాన్ని సంపూర్ణంగా సుసంపన్నం చేయాల్సిన అవసరం ఉన్నది.
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, 9032844017
(ఎదిరె చెన్నకేశవులు శతజయంతి ఉత్సవాల సందర్భంగా)

584
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles